జెండాపై కపిరాజు

ప్రజారాజ్యం పార్టీ ప్రస్తుత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా-సోవియెట్ అభిజాత్యాల మధ్య నలిగి నాశనమైపోయిన ఆఫ్ఘనిస్తాన్‌ని తలపిస్తుంది. రెండు అగ్ర రాజ్యాల బల ప్రదర్శనకు, రాజకీయపుటెత్తుగడలకు చిన్నాభిన్నమైపోయిందా చిరు దేశం. చిరు పార్టీ పరిస్థితి దానికి భిన్నంగా లేదిప్పుడు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెదేపాల మధ్యలో చిక్కుకుని చిగురుటాకులా వణికిపోతుందా పార్టీ. వచ్చే ఎన్నికలనాటికి ఏదోలా ప్రరాపా ఉసురు తీసేస్తే తప్ప మరో ఓటమి తప్పదన్న ఆదుర్దా తెదేపాది. గత ఎన్నికల్లో శక్తిమేరా ఓట్లు చీల్చి తమ గెలుపుకు సైంధవ సాయం చేసిన ప్రరాపా ఐదేళ్ల తర్వాతా అదే మోస్తరు ఉపకారం చేస్తుందన్న పేరాశ కాంగ్రెసుది. రాజశేఖరరెడ్డికి కావలసింది – రాబోయే కాలంలో తెదేపా బలహీనపడటం, ప్రరాపా ఎదుగూబొదుగూ లేకుండా యధాతధంగా ఉండటం. చంద్రబాబు కోరుకునేది – సొంత పార్టీ బలపడటం, ప్రరాపా కొట్టు కట్టేయటం. ప్రరాపా నాయకులు వెదుక్కునేది – పార్టీ ఏదన్నదానితో సంబంధం లేకుండా, తమ సొంత భవిష్యత్తు. వీళ్లందరి భావాలూ, వ్యూహాలూ స్పష్టంగానే ఉన్నాయి. ప్రరాపా కథానాయకుడి మదిలో ఏముందనేది మాత్రం అస్పష్టం.

చిరంజీవి బుర్రలో అసలు ఆలోచనలంటూ ఉన్నాయా అన్నదే అప్పటికీ ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్న. గ్లామర్‌ని నమ్ముకుని పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి ఎన్నికల్లో ఉపయోగించాల్సిన ట్రంప్‌కార్డ్: సర్ప్రైజ్ ఎలిమెంట్. తన బలాలూ, బలహీనతలూ ప్రత్యర్ధులకి తెలీకముందే దాడికి దిగటం ముఖ్యం. వేగంగా ఎత్తులేసి ప్రత్యర్ధుల్ని చిత్తు చేయటం నేటి రాజకీయాలకి అత్యవసరం. ఆ విషయంలో చిరంజీవి ఘోరంగా విఫలమయ్యాడనేది కాదనలేని నిజం. ఆర్చుకునీ తీర్చుకునీ ఇదిగో అదిగో అంటూ ఊరించి రైలు బండిని పట్టాలెక్కించేసరికే ఓటరు జనాల్లో ఆసక్తి సగం ఆవిరైపోయింది. పక్క పార్టీల్లోంచి ఊసరవెల్లుల్ని పిలిచి పీటలేసిన సంబడం చూసి మిగిలిన జనాల్లో సగం మందికి చిర్రెత్తింది. ఎన్నికలకి ముందు జరిగిన తంతుకి రోతపుట్టి ఇంకొందరు ఓటర్లెగిరిపోయారు. ఎప్పుడైతే పార్టీలో చిరంజీవి ఉత్సవ విగ్రహమేనన్న అనుమానాలు మొదలయ్యాయో అప్పుడే ఆయన వీరాభిమానుల్లో సైతం ప్రరాపాపై నమ్మకం కొండెక్కింది. అయ్యవారిని చెయ్యబోతే కోతైన చందం ఆ పార్టీది.

లంకలోకి లంఘించి దూకిన హనుమంతుడిలా చిరంజీవి సినిమాల్లోంచి రాజకీయాల్లోకి అవలీలగా దూకేశాడు కానీ ముందున్న ముసళ్ల పండగ మొదట్లోనే అంచనా వేయలేకపోయినట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పార్టీ పెట్టిన మొదటి రోజునుండీ చిరంజీవి తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలాగానే కనిపించాడు. పార్టీ ప్రధమ వార్షికోత్సవం దగ్గరకొస్తుండగా, ఇప్పటికీ ఆయనది అదే పరిస్థితి. తన ప్రత్యర్ధి తెదేపానో, కాంగ్రెసో కూడా తేల్చుకోలేని అయోమయం. తమది ప్రతిపక్షమో, మజ్లిస్‌లా ప్రభుత్వానికి మిత్రపక్షమో తెలీని గందరగోళం. అసెంబ్లీలో మాట్లాడటంలో అపరిపక్వత. విలేకర్ల సమావేశాల్లోనూ అదే అసందిగ్ధత. మునిపుంగవుల బాణీలో ‘వెళ్లేవారు వద్దంటే వింటారా, ఉంటారా’ అంటూ నిర్వేదం ఒకసారి, ముఖ్యమంత్రి ఫక్కీలో ‘ఆ రెండు పత్రికల’ పైన అక్కసు వ్యక్తం చెయ్యటం మరోసారి. ఈ మాత్రం ఆవేశం ఇంతకు ముందే ప్రదర్శించుంటే కొందరన్నా మనసు మార్చుకునేవాళ్లేమో. అందరూ వెళ్లిపోయాక ఎవరినేమన్నా ఒరిగేది సున్నా.

ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయబట్టే ‘వాళ్లెటూ రాసేశారుగా’ అనుకుంటూ తన పార్టీ నాయకులు గోడ దూకేస్తున్నారని చిరంజీవి ఆవేదన. మరి వాళ్లంతా వచ్చేటప్పుడు ఏ పత్రిక చెప్పిందని వచ్చారో ఆయన వివరించలేదు. ఆ రెండు తెదేపా అనుకూల పత్రికల వల్లే ప్రరాపా అధికారంలోకి రాలేకపోయిందని ఆయన అభియోగం. ఆ రెంటికీ అంత సత్తానే ఉంటే తెదేపానే అధికారంలో కూర్చోబెట్టుండాలి కదా! ఆడలేక మద్దెల ఓడనే తీరిది. పత్రికల పని పత్రికలు చేస్తాయి, చేస్తున్నాయి – ఆయా రాతల వెనక ఉద్దేశాలేమిటనేది వేరే సంగతి. తన పని తను సరిగా చేసుంటే పత్రికలపై పడి ఏడవాల్సిన అవసరం వచ్చుండేది కాదు చిరంజీవికి. అనుకూల వాతావరణంలో మాత్రమే నెగ్గుకొచ్చేవాడు అలెగ్జాండర్ కాలేడు. వందలాది సినిమాల్లో అలాంటి పాత్రలెన్నిట్లోనో అలవోకగా నటించేసిన చిరంజీవికి ఒకరు చెప్పాల్సిన విషయం కాదిది. అయితే ఆ పాత్రల సారాన్ని ఆయనెంతవరకూ జీర్ణించుకున్నాడనేదే అనుమానం. పార్టీలో జరుగుతున్న పరిణామాలకి చిరంజీవికి కాళ్లూ చేతులూ ఆడటం లేదని ఆయన ముఖంలో దైన్యాన్ని చూస్తే తెలిసిపోతుంది. రాజకీయాల్లో నెట్టుకురావటమంటే సినిమాల్లో వందమంది రౌడీలని ఒంటిచేత్తో రఫ్ఫాడించటమంత తేలిక్కాదని ఆయంకింకా అర్ధమయిందో లేదో కానీ, తట్టాబుట్టా సర్దుకుని తలోదారీ చూసుకుంటున్న నేతలకి మాత్రం బహు భేషుగ్గా అర్ధమయింది. ‘కొద్ది రోజుల్లోనే పార్టీని ఈ స్థాయికి తెచ్చా’ అని ఆయనన్న మాటలు ప్రరాపాలో మిగిలిన కొద్దిమందికీ మరో అర్ధంలో వినిపిస్తే – ఆ రెండు పత్రికలూ రాసినా రాయకున్నా పొలోమంటూ వాళ్లదారిన వాళ్లూ పోతారు.

రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయనేదానికి చిరంజీవి నిలువెత్తు నిదర్శనం. నేటి దుస్థితి ఆయన స్వయంకృతం. జెండాపై కపిరాజుంటే చాలు ఆడుతూ పాడుతూ అధికారానికి నిచ్చెనేసుకుని ఎక్కేయొచ్చనుకుంటూ ఆశతో వచ్చినోళ్లు ఆ కలలు కల్లలయ్యే పరిస్థితొస్తే జెండా పీకటానికీ ముందుంటారని ఊహించలేకపోవటం ఆయన మొదటి తప్పు. అరవింద్ ప్రభృతుల చేతిలో కీలుబొమ్మగా మిగలటం రెండో తప్పు. పార్టీ పుట్టకముందునుండీ తనవెంట ఉన్నవాళ్లు ఒక్కొక్కరే దూరమవుతున్నా మిన్నకుండటం మూడో తప్పు. తప్పుల మీద తప్పులు చేసి చేతులు పూర్తిగా కాల్చేసుకున్నాక – ఇక ఏం పట్టుకున్నా పెద్దగా లాభం ఉండకపోవచ్చు. మహా అయితే, ప్రరాపా పడుతూ లేస్తూ మరికొన్నాళ్లు ప్రస్థానం సాగించొచ్చు. వచ్చే ఎన్నికలనాటికి పుంజుకుంటుందనేది మాత్రం అనుమానమే. ప్రరాపా ఉండీ ఉపయోగం లేదన్న అభిప్రాయం ముఖ్యమంత్రికి రానన్నాళ్లే ఆ నామమాత్రపు మనుగడైనా సాధ్యం. ఆయనకా అభిప్రాయం ఏర్పడ్డాక ప్రరాపా గతేమౌతుందో ఊహించుకోవాలంటే ఓ సారి ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్‌ని గుర్తుచేసుకోండి.

21 స్పందనలు to “జెండాపై కపిరాజు”


  1. 1 చిలమకూరు విజయమోహన్ 5:46 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    ‘లంకలోకి లంఘించి దూకిన హనుమంతుడిలా చిరంజీవి సినిమాల్లోంచి రాజకీయాల్లోకి అవలీలగా దూకేశాడు’ అవలీలగా ఎక్కడ దూకాడండి.దూకడంలో ఎంత అసంగ్దితత,ఊగిసలాట బావగారిలాంటివారు నువ్వు ఇంద్రునివి, చంద్రునివి,నువ్వు మరో ఎన్టీవోడివి అని పంపుగొడితే హనుమంతుడిలా ఉబ్బిపోయి దూకాల్సి వచ్చింది.సరే లంఘించి ఎగిరి ముఖ్యమంత్రి పదవనే సీతమ్మ జాడను కనుక్కున్నాడా లేదే వస్తూవస్తూ విభీషణుల్లాంటి తెలుగుదేశం ఫిరాయింపుదార్లను పార్టీలోకి పట్టుకొచ్చి తనకొంపకు తనే నిప్పుపెట్టుకున్నాడు.ఇప్పుడున్నదంతా అవకాశవాద రాజకీయమే కదా అయ్యగారి దగ్గర పస లేదని తెలుసుకున్న విభీషణులంతా జారుకోవడం మొదలుపెట్టారు.రామ రావణ యుద్ధమనే అధికార వేటలో రామరావణుల మధ్య మన హీరో నలిగిపోక తప్పుతుందా !(ఎవరు రాముడో ఎవరు రావణుడో మాత్రం నన్నడగద్దొండండీ).ఎవరు చేసిన కర్మ వాడనుభవించక తప్పుతుందా!చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా!

  2. 2 a2zdreams 6:43 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    పత్రికల పవర్ ఏమిటో చిరంజీవికి బాగా తెలిసుండాలి ఈ దెబ్బతో. ప్రజారాజ్యం(చిరంజీవి) అనే బంతి సాక్షి(కాంగ్రెస్) చేతిలో పడింది. ఇప్పుడు వారు ఏ రకంగా ఆడుకుంటారో చూడాలి.

  3. 3 kcubevarma 6:48 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    రాజ క్రీయ దుష్ట క్రీడకు కొత్తవాడైన చిరంజీవిని మరికొన్నాళ్ళు వేచి చూద్దాం. ఒక ఫ్యాక్షం లీడర్ చేస్తున్న రాజకీయ హత్య ఇది. దానికి మరో రాజకీయ బడా వ్యాపారి సపోర్ట్. వీళ్ళిద్దరే ఏలాల ఏ.పీ.ని. అసలు ఈ రెండు కులపోళ్ళు తప్ప మరెవ్వరూ పాలకులుగా ఎదగనివ్వరు వీళ్ళూ. వీరి రాజకీయ చదరంగంలో పావులుగా మారుతున్నాం. దీనికి చిరుయే కాదు ఎవరో ఒకరు బ్రేక్ వేయాల్సిన అవసరం వుంది. మీడియా ను కూడా ఈ రాజకీయ మాఫియా డాణ్ లే యేలుతున్నారు. ఆలోచించండి.

  4. 5 జీడిపప్పు 7:14 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    చాలా బాగా చెప్పారు. చేతకాని అసమర్థ నాయకుడికి చిరంజీవే చక్కని ఉదాహరణ. చెత్తనంతా పార్టీలోకి తెచ్చుకొని, డబ్బులకు కక్కుర్తిపడి టికెట్లు అమ్ముకుని ఇప్పుడు “ఆ పత్రికలు” అంటూ ఏడవడం చూస్తే నవ్వొస్తున్నది. btw, చివరిపేరాలో చెప్పినట్టు కాంగ్రెస్ నుండి కమీషన్లు తీసుకుంటూ నాలుగేళ్ళు పబ్బం గడుపుతాడనుకుంటా, ఎలాగూ సినీ కెరీర్ ముగిసిపోయింది కదా!

  5. 6 చిలమకూరు విజయమోహన్ 7:45 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    ‘ఈ రెండు కులపోళ్ళు తప్ప మరెవ్వరూ పాలకులుగా ఎదగనివ్వరు వీళ్ళూ’.
    మన దగ్గర సత్తా,ప్రజాభిమానం ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు.రావడమే నానుస్తూ వచ్చాడు,వచ్చాడా వచ్చి ఫిరాయింపులను ప్రోత్సహించడంమొదలుపెట్టాడు,మొదట చేర్చుకోవడమే ఫ్యాక్షనిస్టును చేర్చుకుని రాయలసీమలో ప్యాక్షన్ ను రూపుమాపుతానన్నాడు.ఇది ప్రజలకే రకమైన సందేశానిస్తుంది.కొత్తలో ఉత్సాహంగా పనికిరానివారినందరినీ చేర్చుకుని రోజుకొక పత్రికా సమావేశం పెట్టి వాపును చూసి బలుపనుకున్నాడు.రానురానూ మంచివాళ్ళను దూరంచేసుకున్నాడు.తనలో సత్తాలేదని తెలిసి దూరమవుతున్నవారందరినీ చూసి బెంబేలెత్తిపోయి పత్రికల మీదబడి ఏడిస్తే ఏం లాభం

  6. 7 bhavani 9:21 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    ఇదంతా చిరంజీవి స్వయంకృతాపరాధమే. ఎన్నికల ఫలితాల భూతద్దం మరింత పెద్దగా చూపిస్తుంది. ఎవరి పరిస్థితైనా ఇంతే అలా చతికిలబడితే. టీ.ఆర్.ఎస్‌ని చూస్తున్నాం కదా.
    ఇదిలా ఉంటే పత్రికలపై ఏడవాల్సిన అవసరం ఉండేది కాదు అన్నారు. అస్సలు లోపాలు లేని పార్టీలైనా అలాంటి దాడిని సహించలేవు…కూడదు కూడా. ఆ రెండు పత్రికలు వాళ్ళ ఇష్టానుసారంగా వ్రాయటం ముమ్మాటికీ తప్పు. వాళ్ళు వ్రాయటానికీ చిరంజీవి అసమర్ధతకీ ఏంటి సంబంధం?
    నాకు చాలాసార్లు అనుమానమొస్తుంది. టికెట్లు అమ్ముకోవటాన్ని దాచలేకపోవటం, అసెంబ్లీలో రన్నింగ్ కామెంట్రీ చెప్పకపోవటం, ప్రతిదానికీ పిచ్చిగా గొడవ చేయటం, అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేయటం, వేరే పార్టీల నుండి జనాలను ఆకర్షించేందుకు అత్యంత కుత్సితబుద్ధి చూపించటం…ఇవన్నీ లేక అతన్ని అసమర్ధుడంటున్నారేమోనని. కాంగ్రెస్‌లో కానీ, టీడీపీలో కానీ పైన చెప్పిన పనులు చేసినవాళ్ళే నాయకులు మరి. వాళ్ళకంటే చిరంజీవే నయ్యం అనిపిస్తుంది. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి ఒక్కరు కూడా ఒక గ్రాము తర్కం కూడా వాదనల్లో వాడరు. ఏ స్కిజోఫ్రీనియా వచ్చినవాళ్ళో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు.

  7. 8 రవి 9:34 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    చిరంజీవి ఏదైనా చేయాల్సింటే అది, మొట్టమొదట, ఆయన గారి బావమరిదిని తప్పించి ఉండటం. కాస్త స్పష్టమైన విధానాలు రూపొందించుకుని ఉండటం …. ఇప్పుడు చేతులు కాలటం కాదు, మండిపోతున్నాయి. ఈ పార్టీ, కాంగ్రె, తెలుగుదేశంల రాజకీయ చదరంగంలో పావు కాక తప్పదు.

  8. 9 Praveen 9:35 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    నిజమే, కొవ్వూ, కండకావరం పెరిగిన ఇద్దరు కుస్తీ ఆడుకుంటోంటే మధ్యలో ఒక బలహీనుడు నలిగిపోయాడు. ప్రజారాజ్యం పార్టీకి MLAలు ఉన్నారు కనుక ఆ పార్టీని వెంటనే మూసి వెయ్యడం సాధ్యం కాదు. మరో పదేళ్ళైనా ప్రజారాజ్యం పార్టీ అస్తిత్వంలో ఉంటుంది.

  9. 10 phani 10:27 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    గత సంవత్సరం వార్త అయినా కాకపొయినా ప్రతీ రోజు మెయిన్ పేజీలో ఆయన గురించి తెగ పొగుడుతూ రాసింది ఈ రెండు పత్రికలే కదా !!!

    అయినా ఇంకా ఎందుకండి చిరంజీవి గొడవ చేస్తున్నాడు ?

    పార్టీ పెట్టిన 9 నెలలకే 1000 కోట్లు సంపాదించాడు కదా ఇంక చల్లగా కూర్చోక ఎందుకీ ఆవేశం అతనికి .

  10. 11 Ramesh 10:32 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    cheppedi okati chesedi okati ayite janalu nammaru, maarpu annadu migata party la loni chetta nayakulani tana partilo cherchu kunnadu, mari prajalu chiru ni ela nammutaru? nirdhistamayina pranalika avagahana leka povadam kevalam tana image meeda party nadavalante kastam.

  11. 12 వెంకటరమణ 10:45 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    //వేగంగా ఎత్తులేసి ప్రత్యర్ధుల్ని చిత్తు చేయటం నేటి రాజకీయాలకి అత్యవసరం. ఆ విషయంలో చిరంజీవి ఘోరంగా విఫలమయ్యాడనేది కాదనలేని నిజం.

    ప్రతి ఒక్కరితోనూ మంచిగా ఉండి సాధించాలంటే అది వీలయ్యే పని కాదు. ప్రత్యర్ధులను విమర్శించేటప్పుడు ఆచి తూచి అలోచించి మాట్లాడుతుంటే సొంత పార్టీ లో వాళ్లకు కూడా నమ్మకం పోయినట్లుంది.
    చిరంజీవి మంచి నాయకుడు కాదు. మంచి చేయాలనే తపన ఉండవచ్చు.
    కానీ ప్రజలు అంతత్వరగా నమ్ముతారా అన్నది సందేహం.

  12. 13 కె.మహేష్ కుమార్ 11:09 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    కర్ణుని చావుకు కారణాలెన్నైనా చిరంజీవి పరిస్థితికి మాత్రం చిరంజీవే కారణం.

  13. 14 vinay chakravarthi 11:10 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    hahahahhaahahah…………………..analysis mottam one side nadichinatlu anipinchindi………..

  14. 16 Saikiran Kumar 11:27 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    Last Paragraph says it all. I wish Chiranjeevi reads this article.

  15. 17 pullayana 12:35 ఉద. వద్ద ఆగస్ట్ 21, 2009

    మీరి ఈనాడు ని గనక ఒక సంవత్సరంగా క్రమం తప్పకుండా చదువుతూ వస్తే అర్థం అయ్యే విషయం ఏంటంటే, పార్టీ పెట్టినప్పుడు విపరీతంగా ఎత్తేసి చిన్నగా ఎన్నికలు వచ్చేసరికి అది ఒక పనికి మాలిన పార్టీ లాగా రాయటం మొదలు పెట్టాడు. ఇదంతా వాళ్ల వ్యూహం లో భాగం అనుకుంటా.
    నేను ఈ విషయం లో భవాని తో ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వం చేసిన ప్రతి దాన్నీ విమర్శించకుండా తన విజ్ఞత ని బట్టి విమర్శ, మద్దతు ఇస్తున్నాడు. దాన్ని తెదేపా వాళ్లు కాంగ్రెస్ కి అనుకూలం అంటూ ప్రచారం చేస్తున్నారు. మీలాంటి చాలా మంది అయోమయం లో ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదు చిరు కి అనుకుంటున్నారు.
    ఎమైన చిరు నేర్చుకోవలసినవి చాలానే ఉన్నాయి. అవి నేర్చుకుంటాడని ఆశిస్తున్నాను.

  16. 18 vasu 3:01 సా. వద్ద ఆగస్ట్ 21, 2009

    చాలా బావుంది అనాలిసిస్. నేను చిరంజీవి సినిమా ఫంక్షన్లలో మాట్లాడడం చూసి, మిగతావన్నీ పక్కనపెట్టిన కనీసం ఉపన్యాసాలతోనైనా జనాలని పదేస్తాడనుకున్నా. కానీ ఈయనకి రాజకీయాలకి సంబంధించి బొత్తిగా అవగాహన లేదనిపిస్తుంది ఏ విషయం గురించి మాట్లాడినా. శాసన సభ లో అయితే నవ్వుకుంటున్నారు చిరంజీవిని చూసి. ఎవరన్నా ఏదన్నా అంటే అసల కౌంటర్ చెయ్యలేడు. ఇక ప్రతీ పనికి జాప్యం ప్రజా రాజ్యానికి పుట్టకతో (నిజానికి పుటక మునుపే) వచ్చిన విద్య.
    ఇదే ధోరణి అవలంబిస్తే, వచ్చే ఎన్నికలలో సీట్లు దేవుడెరుగు, మనుగడే గగనమనిపిస్తోంది

  17. 19 Rakesh 11:58 సా. వద్ద ఆగస్ట్ 21, 2009

    It seems to be the entire analysis is one sided….I agree that there were some wrong decistions taken by Chiranjeevi.

    Chiranjeevi ki oka strategy undi..denni kuda guddiga vyatirekhinchadam enta avivekamo murkhatwamo ataniki telusu.

    Ika aa rendu patrikalu..rashtramlo oka visha samskruti ni penchi poshinchayi…poshistunnayi..thats proven..aa rendu patrikalaku
    CBN tappa vere person adhikaram lo undakudadu ..chivaraku NTR ni atyanta darunanga champesayi.

    aa rendu patrikala dhyeyam CBN ni adhikaram loki teesukuravadam..tama akrama vyaparalanu konasaginchadam..anduku chiranjeevi addugodaga undadam..anduke ee kutralu kutantralu..

    Chiranjeevi rajakeeya jeevitham gurinchi matladutunnappudu tappanisariga ee bogus media gurinchi kuda matladavalsi vastundi..ee vishayaani avoid chesi chiranjeevi tappoppula gurinche matladutunnanu ante ardham ledu..chiranjeevi oka adugu munduku veddham anukunte..ee rendu patrikalu reasonless ga venikki lagutunnayi.

    prastutammuna patrikalanni bogus..patrikalu vati pani avi cheyakunda rajakeeya nayakula kutralu kutatralani avi execute chestunnayi..so vatiki ematram respect ivvalsina avasaram ledu..

    so deenni batti..aa rendu patrikalu chiranjeevi ni kuda oka patrika and channel establish chesukune vidhanga paristhitulanu create chestunnayi..

    no offence ps..its all my opinions

  18. 20 kcubevarma 9:25 ఉద. వద్ద ఆగస్ట్ 23, 2009

    వెంకట్ గారు నాకు కులపిచ్చిలేదు. నా గురించి ఇక్కడ చెప్పుకో దల్చుకోలేదు. కాని మన రాష్ట్రం ఏర్పడిన దగ్గరనుంచి కమ్మ, రెడ్డి కులస్తులే ఎక్కువ కాలం ఏలిక సాగించారు. వారి వద్దనున్న అర్ధ అంగ బలం అటువంటిది. సినిమా రంగంలో కూడా ఒకే కులం ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా వారి గుప్పెట్లోనే వున్నాయి. అధికారం పొందిన నాలుగేళ్ళకే సొంత దబ్బా పత్రిక పెట్టుకొన్న సి.ఎం.ఎవడూ ఇంతకుముందు లేడు. తన దగ్గరవున్న వందలాది బంజరు భూములు పంచకుండా రాష్ట్రమంతటా భూసంస్కరణలు తెస్తాడంట. వారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా వీళ్ళు తెగిస్తున్నారు. జనంతో సంబంధాలు ఏర్పరచుకోకుండా, సమస్యల పట్ల సరైన అవగాహన లేకుండా, లండం నుండి దిగిన డాక్టర్ పై అధారపడి డబ్బుందికదా రాజకీయం చేద్దామనుకుని బొక్కబోర్లాపడ్డాడు చిరంజీవి. నిజానికి ఈ పర్లమెంటరీ రాజకీయాల వలన ప్రజలకు మేలు జరగదు అని నా అభిప్రాయం. అయినా ఎవడైనా ప్రపంచ బ్యాంకుకు లోబడి వుండాల్సిందే. ఫేంటు, పొత్తు షర్ట్ వాడు పోయి పంచె కట్టువాడు రూపంలోనే తేడా. వాడు నీళ్ళమ్ముతానంటె గొడవచేసిన వాళ్ళు నేడు నోర్మూసుకొని సొంత నీళ్ళ వ్యాపారానికి దారులు చూసుకుంటున్నారు. ఎప్పుడైనా మోసపోయేది బడుగు జనమే.

  19. 21 Vasuki 5:35 ఉద. వద్ద జనవరి 17, 2010

    Hello sir

    Nenu pampina abhiprayalu telugu lo print avutaya. telugu lo veetini vrayadam ela kastha cheppandi.


వ్యాఖ్యానించండి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 304,024

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.