కాంగ్రెస్ పార్టీ సంస్కృతి గురించి ఆ మధ్యనో ప్రముఖ పాత్రికేయుడు మూడు ముక్కల్లో తేల్చేశాడు: ‘నెహ్రూ తరంలో జన రాజకీయాలు, ఇందిర హయాంలో భజన రాజకీయాలు, రాజీవ్ కాలం నుండి విభజన రాజకీయాలు’. మన ముఖ్యమంత్రికి తెలిసిందల్లా రెండవ, మూడవ తరహా రాజకీయాలే. పాతికేళ్ల పైబడ్డ రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన జన రాజకీయాలేవన్నా ఉన్నాయంటే అవి కేవలం స్వజనం కోసమే. భజన రాజకీయాల్లో మాత్రం ఆయనది దేశంలోని కాంగ్రెస్ నేతలందర్నీ మించిన నైపుణ్యం. పదవిని పదిలపరచుకోవాలంటే ప్రజల సొమ్ముతో అధిష్టానాన్ని నెలనెలా ఎలా సంతోషపెట్టాలో ఆయనకన్నా బాగా తెలిసినవాళ్లు లేరు. ఇక – విభజన రాజకీయాల్లో వైఎస్ సత్తా ఏమిటో తెలంగాణలో పోలింగ్ ముగిసిన మరుక్షణమే రాష్ట్ర ప్రజలకి అర్ధమైపోయింది. అర్ధమవనిదల్లా – ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయి నుండి ఓ ప్రాంతీయ నేత స్థాయికి దిగజారి కోస్తా, సీమ వాసులందర్నీ సెంటిమెంటల్ ఫూల్స్‌గా జమకట్టి వోట్లు దండేసుకుందామనుకునే దురాలోచన గ్రహించలేని పిచ్చివాళ్లెక్కువమంది లేరనేది ఆయనకర్ధమయిందా లేదా అన్న విషయం.
అధికార పీఠమెక్కిన ఐదేళ్లలో అవకాశమొచ్చినప్పుడల్లా ‘మామను వెన్ను పోటు పొడిచావ్’ అంటూ ప్రతిపక్ష నాయకుడిని ఎద్దేవా చెయ్యటం వైఎస్‌కి అలవాటుగా మారిపోయింది. ‘అసమ్మతివాది’గా తన పార్టీ ముఖ్యమంత్రులని, ఇతర నేతలనీ తానెన్ని అవమానాలకి గురి చేశాడో మర్చిపోయి – రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదురులేని పాలనకి చరమగీతం పాడిన ప్రత్యర్ధి పార్టీ వ్యవస్థాపకుడికి జరిగిన అవమానం గురించి ముఖ్యమంత్రి మొసలి కన్నీళ్లు కార్చితే నిజమనుకునేదెవరు? 1995 ఆగస్టు నాటి తెదెపా సంక్షోభంలో బాబు నిర్దోషి అని 1999లోనే వోటర్లు తీర్పిచ్చేశారు. ఇంకా ఆ పాటే పాడుతున్నాడంటే -చెప్పుకోటానికి ఈ ఐదేళ్లలోనూ ముఖ్యమంత్రిగా తాను ఊడబొడిచిందేమీ లేకనే.
చంద్రబాబునాయుడు ఎన్టీయార్‌ని ఎటు నుండి పొడిచినా ప్రజలకి పోయిందేమీ లేదు. వెన్నుపోట్ల చర్చంటూ వస్తే ముందుగా మనం మాట్లాడుకోవలసింది – ఐదేళ్లుగా వైఎస్సార్ రాష్ట్ర ప్రజలందర్నీ టోకున పొడుస్తున్న పోట్లు, వేస్తున్న వేట్ల గురించి. నిత్య అసమ్మతివాదిగానే రాజకీయ జీవితం కడతేరిపోయే దశలో ఐదేళ్ల క్రితం తామిచ్చిన అవకాశంతో రాష్ట్రానికి మరో విజనరీ ముఖ్యమంత్రిలా మారతాడేమోననుకున్న వోటర్ల ఆశల్ని ఆదిలోనే తుంచేసిన హీన చరిత్ర వైఎస్‌ది. అధికారం కోసం ఉచితానుచితాల్లేని ఉచిత వరాలివ్వటం, అధికారమొచ్చాక వాటన్నిట్నీ తుంగలో తొక్కటం, ఐదేళ్లైనా పాలనపై పట్టు సాధించలేకపోవటం, ప్రతి వైఫల్యాన్నీ పాత ప్రభుత్వం పైకి నెట్టటం, చేతగానితనంతో రాష్ట్రానికి రావలసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని పక్క రాష్ట్రాలకి వదులుకోవటం, అస్మదీయులకి మేలు చెయ్యటానికి ఎంతకైనా తెగించటం, తస్మదీయులని నిర్దాక్షిణ్యంగా అణిచెయ్యటం, అడ్డూ ఆపూ లేని అవినీతి, అడ్డగోలు భూసంతర్పణలు, ప్రజల జ్ఞాపకశక్తికి పరీక్ష పెడుతూ రోజుకో స్కాము, జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం, అధిష్టానం మెప్పుకోసం అవధులెరుగని రాజీవ భజన పరాయణత్వం .. ముఖ్యమంత్రిగా వైఎస్ అసమర్ధతకి, అవినీతికి తార్కాణాల చిట్టా కొండవీటి చాంతాడుని సైతం చిన్నబుచ్చేంత!
వైఎస్‌కి ముందు దేశంలో అవినీతిపరులైన రాజకీయ నాయకులు లేకపోలేదు, ఆయన తర్వాతా రాకపోరు. అయితే అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ కొత్త నడకలు నేర్పిన ఘనత మాత్రం అయ్యవారిదే. గడచిన ఐదేళ్లలో అయ్యవారు ఆర్భాటంగా మొదలెట్టిన వందలాది పధకాల్లో పూర్తయినవేవయ్యా అంటే వేళ్ల మీద లెక్కించే పరిస్థితి. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైపోయినా పూర్తయిన పనులేమో ఒకట్రెండే – వాటిలోనూ నాణ్యమైనవి నాస్తి. ఐతే – పదే పదే ‘చెప్పినవే కావు, చెప్పనివీ చేసి చూపించాం’ అనే వైఎస్ మాటలో మాత్రం నిఖార్సైన నిజమొకటుంది. అనుకున్నదే తడవుగా ఆరు నెలలు తిరిగేలోపు వందల కోట్ల పెట్టుబడితో పుట్టుకొచ్చిన తనయుడి మానస పుత్రిక, అస్మదీయులకి అడగందే తప్పుగా దోచి పెట్టిన సెజ్‌లు, ప్రాజెక్టులు – ఇవీ ‘చెప్పకున్నా చేసి చూపించిన పనులు’. 2004లో ఎవరో తెలియని జగన్మోహనుడు 2009 నాటికి వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంతో రాష్ట్రంలోనే అతి పెద్ద వాణిజ్యవేత్తగా అవతరించటం వెనక ఏ హస్తముందో తెలియనిదెవరికి?
ఇప్పటిదాకా దొంగచాటుగా అవినీతికి పాల్పడేవాళ్లనే చూశాం. బందిపోట్లలా బాహాటంగా దోచుకునే బరితెగింపు తొట్టతొలిగా వైఎస్‌లో చూసి విస్తుపోతున్నాం. ఇదేమిటన్న వాళ్ల అంతు చూసే ఫ్యాక్షనిస్టు పంధా, ‘వాడు చెయ్యగా లేనిది నేను చేస్తే తప్పా’ అంటూ సిగ్గులేకుండా దబాయించే తెగువ మరెవరికన్నా ఉన్నాయా? దేశంలోనే అత్యంత అవినీతిపరుడి ఏలుబడిలో ఉన్నందుకు ఏడవాలా, నిలువుదోపిడీకి నూతన మార్గాలు కనిపెట్టిన సృజనశీలి మన తెలుగువాడైనందుకు గర్వపడాలా? మరో సారీ పట్టం కడితే ఇళ్లలో చొరబడి దర్జాగా ఉన్నదంతా ఊడ్చుకుపోరన్న నమ్మకముందా? సమాధానమున్న ప్రశ్నలే ఇవన్నీ. అయితే ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న మాత్రం మరొకటి.
అదృష్టవశాత్తూ – పోలింగ్ మరో దశ మిగిలుండగానే – ఇన్నేళ్లలో ముఖ్యమంత్రి నిజ స్వరూపమేంటో గ్రహించనివారి కోసం ముసుగు తొలగించుకుని బయటికొచ్చాడాయనలోని అసలు మనిషి. ఈ ఆషాఢభూతిని మరోమారు అందలమెక్కించే అమాయకత్వం తెలుగువారికుందా?
Hear! hear!! తెలుగు‘వాడి’మదిలో ఏముందో త్వరలో తెలుస్తుందిగా!
చాలా నిజాలు చెప్పారు.
మే 16 లోపు IPL చూద్దాం ఎంచక్కా!
దుమ్ము దులిపేశారు. దొందూ దొందే అయినా వైస్సార్ లాగా బరి తెగించి ఎవరూ దోచుకోలేరేమో. Very Soon he will have his page in Guinness. Excellent Analysis. Don’t know when people will realize. Choose a rat (Chandra Babu) or bandicoot (YSR)
చాకిరేవులో “అడ్డంగా తిట్టే ఈయన అవస్థ చూస్తే ఇన్నాళ్ళూ బాధేసేది” అంటూ బాబు ఆనందిస్తున్నాడు
http://chaakirevu.wordpress.com/2009/04/21/
వుంది. గురజాడ వారి గిరీశం అన్నట్లు “మనవాళ్ళు వట్టి వెధవలోయి”. 5 సంత్సరాల క్రింద ఓక మోడల్ గా అవతరించబోతున్న మన రాస్ట్రాన్ని అవినీతిలో మెదటి స్థానానికి తీసుకువాచ్చారు.
తెలుగువాడా! బహుపరాక్! బహుపరాక్!!
మీ విశ్లేషణ చాలా బాగుంది. ఇలాంటి టపాలే తెలుగు బ్లాగులకు వన్నె తెచ్చేవి.
అభినందనలు.
– కె.వి.జి.
చాలా బావుంది మీ విశ్లేషణ.
ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కిస్తే జగన్ అన్నయ్య కోసం కొత్త కొంగొత్త పధకాలు అద్భుత స్రుజనాత్మకతతో వస్తాయి.
WELL SAID.. BOSS.
అవినీతి అని ఆ రెండు పత్రికలు ఊదరగొట్టినా ప్రజలు అభివ్రుద్దికి పట్టం కట్టారు.