మే, 2008ను భద్రపఱచు

ఈసీ కోపం ఎవరికి చేటు?

రెండు వారాలుగా ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ పార్టీల నాయకులు యధేచ్చగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లూ, వారందరిపైనా ఎలక్షన్ కమిషన్ కన్నెర్ర చేసినట్లూ వార్తలు రాని రోజు లేదు. సహజంగానే నిర్వాచన్ సదన్ కోపానికి ఎక్కువగా గురయింది అధికార పక్షం వాళ్లే. రోజూ కన్నెర్ర చేసీ చేసీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కళ్లెలా వాచిపోయాయో తెలీదుగానీ ఉప ఎన్నికల వేడిలో నోటికొచ్చిన వాగ్దానమల్లా చేసిపారేస్తున్న అధికార పక్షీయులు మాత్రం ఆయన గోల అసలు పట్టించుకోనట్లే ఉన్నారు. ఎవడిగోల వాడిదే అంటే ఇదే కాబోలు.

ఈ గోలంతా పత్రికల్లో చదువుతున్న, టివిల్లో చూస్తున్న సాధారణ పౌరులకు మాత్రం అంతుపట్టని విషయమొకటుంది. ముఖ్యమంత్రిగారి ఉత్తుత్తి వాగ్దానాలు, ఉత్తుత్తి జివోల్లాగా ఎన్నికల కమిషన్ కోపం కూడా అంతా ఉత్తుత్తిదేనా? అవన్నీ తాటాకు చప్పుళ్లేనా? లేకపోతే ఇసి ఎంత గొడవచేసినా ముఖ్యమంత్రి, తతిమ్మా మంత్రిగణం తమ మానాన తాము ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ పోవటమేంటి?

దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఒక సారి పాత ఎన్నికలని గుర్తు తెచ్చుకుంటే చాలు. గత పదిహేనేళ్లుగా – అంటే టి.ఎన్.శేషన్ జమానాలో  జాగృతమైననాటినుండీ – ఎన్నికల కమిషన్ ఎన్ని సార్లు నిజంగా కొరడా ఝళిపించింది? ఎప్పుడూ హద్దు మీరిన వాళ్లపై కన్నెర్రచేసి ఊరుకోవటమే కానీ శిక్షలు పడిందెవరికి? తాటాకు మంటలాంటి ఇసి కోపాన్ని ఇప్పుడెవరూ లెక్కచేయకపోవటంలో వింతేముంది?

అసలు, కోడ్ ఉల్లంఘించినవారికి శిక్షలు వేసే లేదా వేయించే అధికారం ఎన్నికల కమిషన్ చేతిలో ఉందా? ముఖ్యమంత్రిపై వచ్చిన కొన్ని ఫిర్యాదులు నిరూపించబడితే ఆయనకి భారీ జరిమానా, రెండేళ్లకి తక్కువకాకుండా జైలు శిక్ష తప్పవని ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సెలవిచ్చారు. అలాంటి చర్యలు తీసుకునే అధికారం ఇసికి లేదని హైకోర్టు న్యాయమూర్తొకరు వెంటనే స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ కేవలం కాగితం పులేనా? ఒక వేళ ఇసి పట్టుదలగా ముఖ్యమంత్రిమీద చర్యకుపక్రమించినా, మహాపరాధాలు చేసీ దర్జాగా తిరుగుతున్న చట్ట సభల సభ్యులు వందలకొద్దీ ఉన్న మన దేశంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడన్న కారణంతో ఒక ముఖ్యమంత్రి జైలుపాలవటం జరిగే పనేనా?

‘ఆ దేశంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది, దొంగలు వాళ్ల పని వాళ్లు చేసుకుపోతారు. ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోరు’ అనేది మన వ్యవస్థకున్న ఒకానొక వ్యంగ్య నిర్వచనం. ఎన్నికల కమిషన్ హెచ్చరికలనూ, వాటిని లెక్కచేయని రాజకీయ నాయకుల ధైర్యాన్నీ కూడా ఈ కోణంలోనుంచే అర్ధం చేసుకోవాలేమో.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.