ఏప్రిల్, 2011ను భద్రపఱచు

ఉత్తుత్తమ కథలు

నేను తెలుగు కథలు చదవటం మానేసి పదిహేనేళ్లు దాటిపోయింది. దాని వల్ల అవి రాసేవాళ్లకి పోయేదేమీ లేదనుకోండి. ఐతే, మానేసింది నేనొక్కడినేనైతే సమస్య లేదు. నాలాంటోళ్లు మరెందరో. దశాబ్దంగా పాఠకుల్లో పఠనాసక్తి తగ్గటానిక్కారణం?  ఇతర మాధ్యమాలకి ఆదరణ పెరగటం, లెక్కలేనన్ని టీవీ ఛానళ్లు పుట్టుకురావటం, గట్రా, గట్రా అనేవి చచ్చు సమాధానాలు. మన సాహిత్యంలో సరుకు తగ్గటం అసలు కారణం. కథలు ఆసక్తిగా చదివేవాళ్లకి కరువొచ్చినా ఇప్పటికీ ఏటేటా కుప్పలు తెప్పలుగా కథలు రాలిపడుతుండటం విశేషం. అంటే, కరువు పఠితలకే – రచయితలక్కాదు. మంది ఎక్కువై మజ్జిగ పలచనైపోయిందన్నమాట. ఎవరుబడితే వాళ్లు కథలు రాసేయటం, పత్రికలు మొహమాటాలకో మెహర్బానీలకో వాటిని అచ్చేయటం మూలాన మన కథల స్థాయి తగ్గిపోయింది. తమ జీవితాల్లో ఎదురైన సంఘటనలకీ సన్నివేశాలకీ మసాలా సెంటిమెంట్లు, మూస నీతులు జోడించి కథగా మలిచి నాలుగైదు పేజీలు గిలికేసి పత్రికలకి పంపే ధోరణి పెరిగిపోయింది. అస్తిత్వవాదాలు, ఆ వాదాలు, ఈ వాదాలు అంటూ బుద్ధున్నవాడెవడికీ అర్ధమవని భాషా పటాటోపంతో కథలొండేవాళ్లు పెట్రేగిపోయారు. ఈ బాపతు సాహిత్యాన్ని – రాజుగారి దేవతావస్త్రాలు కనబడలేదంటే ఎక్కడ లోకువైపోతామోననుకుంటూ – కథ రాసినోడికే  తెలీనన్ని అర్ధాలు లాగీ పీకీ ఆహా ఓహో అంటూ బాకాలూదే విమర్శనాగ్రేసరులు వీధికొకరు పుట్టుకొచ్చారు. ఈ ఒరవడి తెచ్చిన వరదలో పడి కథల్లో వైవిధ్యం, విభిన్నత అనేవి కొట్టుకుపోయాయి. కథకి సామాజిక ప్రయోజనం, సాంఘిక స్పృహ, సాంస్కృతిక పరమార్ధం వగైరా గుణాలేవేవో ఉండాలనే గిరి గీయబడింది. మొత్తమ్మీద, తెలుగు కథ రవీంద్రభారతిలోనూ, తెలుగు విశ్వవిద్యాలయంలోనూ శాలువా సభలకీ పిచ్చాపాటీ సమావేశాలకీ మాత్రమే పరిమితమైపోయింది. సామాన్య ప్రజానీకానికి సుదూరమైపోయింది.

సమకాలీన తెలుగు కథల గురించి నేను మొత్తుకోవటం ఇదే మొదటిసారి కాదు. వాటిలో కరవైన వైవిధ్యాన్ని గురించి విమర్శించీ, చించీ విసుగెత్తి చివరాఖరికి ‘సరే, ఆ డిఫరెంటు కతలేవో నేనే రాసిపారేస్తే పోలా’ అనుకుని కథోద్దరణకి పాటు పడాలని డిసైడ్ చేసి ఆ విధంగా ముందుకు పోవటం మొదలెట్టి రమారమి రెండేళ్లయింది. అప్పట్నుండీ నా పాట్లేవో నేను పడుతూ ఓ పక్కన పడున్నోడిని చాన్నాళ్ల విరామం తర్వాత ఉన్నట్టుండి ఉరమటానికో తీరైన కారణముంది.

‘ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప కథలేవీ చదవనేకుండా, ఎప్పుడో రాతి యుగంలో నీకెదురైన చేదనుభవాల్ని ఇప్పటికీ గుర్తుంచుకుని తెలుగు కథల్లో సరుకే లేదని తీర్మానించేయటం అన్యాయం’ అని వాపోయే స్నేహితుడొకడి పుణ్యాన ‘సరే. నా అభిప్రాయం తప్పేమో. మార్చుకోటానికి ప్రయత్నిద్దాం ఛల్’ అనుకుంటూ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను. అదేమంటే, గత రెండు దశాబ్దాలుగా వచ్చిన ఉత్తమ కథల్ని చదివి తరించాలని. ఆ క్రమంలో చేతనైనన్ని కథా సంకలనాలు సంపాదించి తెలుగు కథపై నాకున్న దురభిప్రాయాన్ని సమూలంగా తొలగించే సదాశయంతో ఈ ఉగాదినాడు ఆ మహాకార్యానికి శ్రీకారం చుట్టాను. మహాకార్యం ముగిసేటప్పటికి వర్తమాన తెలుగు కథల స్థితికి – అదేదో సినిమా డైలాగులా చెప్పాలంటే – ముందు బాధేసింది, తర్వాత భయమేసింది, ఆ తర్వాత అసయ్యమేసింది. ఒట్టు తీసి గట్టు మీద పెట్టించిన స్నేహితుడి మీద పట్టరాని కోపం పుట్టుకొచ్చింది. దాన్ని వెళ్లగక్కటానికే ఈ టపా. చదివితే చదవండి.

అన్ని పుస్తకాల్లోనూ కలిపి రెండొందల యాభై దాకా కథలున్నాయి. ఇవన్నీ ఉత్తమ కథలుగా హేమాహేమీలు మెచ్చినవే. ఏ సంకలనంలోనైనా అందరికీ నచ్చే కథలే అన్నీ ఉండవు. ఆబోటి అమాంబాపతువి సగమున్నాయనుకున్నా తతిమ్మా నూట పాతికా మనల్ని మెప్పించాలి కదా. ఊఁహు. వీటిలో  నిఖార్సుగా గొప్పవనుకునేవి ఓ పాతికుంటాయేమో. మిగతా వందా ఏ కారణంతో ఉత్తమ కథలయ్యాయో నాకైతే అంతుబట్టలేదు. అన్నీ మూసకథలే. ఎంత మూస కథలంటే, గత ఇరవై ఏళ్లలో వచ్చిన ముప్పై మంచి కథల సంకలనం ఒకటి  – ఈ మధ్యనే విడుదలైంది. దాని ముందుమాటలో సంకలనకర్తల్లో ఒకరు ఇంచుమించు ఇలా వాపోయారు: ‘గడచిన ఐదేళ్లలో చెప్పుకోదగ్గ కథ ఒక్కటీ ఈ సంకలనానికి అర్హమైనది దొరకలేదు. మిగిలినవాటిలోనూ ఉన్నవి అధిక శాతం మూసకథలే. వాటిలోంచే మంచివి ఏరుకొని వేయాల్సొచ్చింది’. తప్పనిసరి తద్దినం నెత్తినేసుకున్న ఓ పెద్దాయన మొత్తుకోలది. ఉత్తమ కథలుగా చెలామణిలో ఉన్నవే ఇంత చెత్తగా ఉంటే, తతిమ్మావి ఇంకెంత దరిద్రంగా ఉంటాయో ఆలోచించండి. ప్రతి ఏటా వెయ్యికి పైగా తెలుగు కథలు చదివి వాటిలోంచి పదో పదిహేనో మంచివి ఎంపిక చేసే పని పెట్టుకున్న మహానుభావులు కొందరున్నారు. వాళ్ల ఓపిక్కి జోహార్లు చెప్పకుండా ఈ టపా రాయటం భావ్యం కాదు కాబట్టి, వాళ్ల ఓపిక్కి వేనవేల వందనాలు.

మహాకార్యంలో భాగంగా నే చదివిన కథలన్నిట్నీ దాదాపు నాలుగు చట్రాల్లో ఇరికించేయొచ్చు: రైతుల వెతలు, ఆడాళ్ల గోళ్లు (వేళ్లవి కాదు, వేరేవి), దళిత జనోద్ధరణ, జ్ఞాపకాల పునఃశ్చరణ. అటూ ఇటూ తిప్పి అన్నిట్లో ఉండేదీ ఆక్రోశం. అది ఆడ లేడీస్ గురించి కానీండి, రైతన్నల గురించి కానీండి, మరి దేని గురించి కానీండి …. అన్నింటా ఉండేది ఓ వర్గం మరో వర్గమ్మీద పడి ఏడవటం. ఇక్కడో విశేషం ఉంది. అదేంటో కానీ బడుగు రైతు గురించి కథ రాస్తే, దాన్సిగదరగ, అది ఏదో ఓ మాండలికంలో ఉండి తీరాల్సిందే (బైదవే, బడుగు రైతు బాధల మీద రాసేదే ఉత్తమ కథ. మోతుబర్ల మీదది కాదు. వాళ్లెప్పుడూ దోపిడీదార్లే. అలాగే అగ్రకులస్తులూను. ఈ రొటీన్‌కి భిన్నంగా రాస్తే అది కథ కాదు – ఆయా వర్గాల ఆధిపత్య ధోరణులకి నిలువుటద్దం). ‘రామయ్య పొలానికి వెళ్లాడు’ అంటే అది ఉత్తి కథే. ‘రామప్ప పొలానికి పూడ్సినాడు’ అంటేనే ఉత్తమ కథ! పోనీ ఆ మాండలికాలన్నా శుద్ధంగా ఉంటాయా అంటే అదీ లేదు. కడప యాసలో సంభాషణలు రాస్తూ ‘బతిమిలాడాడు’ అనేసే ఉత్తమ రచయితలు కూడా తగిలారు! ఉంటే కథంతా మాండలికంలో ఉండాలి, లేకుంటే సంభాషణలు మాండలికంలోనూ నెరేషన్ వ్యవహారికంలోనూ ఉండాలి. కొందరు రచయితలు ఈ రెంటినీ కలగాపులగం చేసి రాసిపారేయటం, అవి ఉత్తమ కథలుగా చెలామణవటం చూసి విస్తుపోవటం నా వంతయింది. ఉన్న చచ్చూ పుచ్చూ కథల్లోంచే మంచివి ఎంచుకోవాల్సిన దౌర్భాగ్యమన్న మాట.

మాండలికాలకి మరో వెసులుబాటూ ఉంది. యాసలో రాస్తే ఎంత కంపయినా ఇంపుగా, సొంపుగా ఉంటుందనేది నేటి తెలుగు సాహితీ విమర్శకుల నిశ్చితాభిప్రాయం కాబోలు. దీనికి నిదర్శనం – తన కథల్లో తల్లినీ చెల్లినీ సైతం లబక పదాలతో బూతులు తిట్టే ఒకానొక కథకుడి పైత్యంలో సదరు రచయితకి తన తల్లి/చెల్లిపై ఉన్న అవ్యాజానురాగాన్నే దర్శించగలిగే వీరి హృదయ వైశాల్యం. ‘సిత్తూరోడి కతలు’, ‘సంకనాకు సత్తిగా’ (పుస్తకం పేరు రోతగా ఉందా? ఆయన రచనలకన్నా కాదులెండి) వంటి ఆణిముత్యాలతో తెలుగు సాహితీవనంలో తిష్టవేసుక్కూర్చున్న మహారచయత ఆయన. ఆయన రాశాడు కాబట్టి చెల్లిపోయింది కానీ, మరే పిల్ల రచయితో పేజికో బూతు కూత రాస్తే అశ్లీలత పేరుతో బహిష్కరించేవాళ్లు. ఇక్కడ నీతి ఏమిటయ్యా అంటే, ఒకట్రెండు మంచి రచనల్తో గుర్తింపు తెచ్చుకున్నాక మాండలికాలనడ్డుపెట్టుకుని పాఠకుల నెత్తిన ఎంత గబ్బు కుమ్మరించినా చెల్లిపోతుంది.

చెత్త రాసినా చెల్లుబాటయ్యే గుణమున్న కేటగిరీ ఇంకోటీ ఉంది: ఆడాళ్ల వేళ్లవి కాక వేరే గోళ్లు. ఈ మధ్య కాలంలో స్త్రీ  స్వేఛ్చ పేరుతో ఏం రాసినా చప్పట్లు రాలుతున్నాయి. ఆ స్వేఛ్చ లైంగికతకి సంబంధించిందైతే నా సామిరంగా, ఇక తిరుగేలేదు. ఓ కథలో ప్రధాన పురుష పాత్ర వివాహేతర సంబంధం కలిగుంటే అతనో దుష్టుడు, దుర్మార్గుడు. అర్ధం చేసుకోదగ్గదే. ఐతే, అలాంటిదే మరో కథలో నాయిక అటువంటి సంబంధమే నెరిపితే అది మాత్రం యుగ యుగాలుగా స్త్రీ జాతికి వేయబడ్డ సంకెళ్లు, తరాలుగా విధించబడ్డ బంధనాలు, ఎట్‌సెట్‌రా, ఎట్‌సెట్‌రా తెంచుకుని, మదమెక్కిన మగజాతికి చెంపపెట్టుగా నిలిచి ఆకాశంలో సగమున్న ఆడజాతి శిరోభూషణమై వెలిగిన  వీరనారీమణి ధీర గాధ. ఉత్తమోత్తమ రచన! ‘కొవ్వెక్కిన కన్నెపిల్ల తొలగించిన పైట కాదది, పురుషాధిక్య ప్రపంచమ్మీద ఎగరేసిన తిరుగుబాటు బావుటా’ లాంటి విశేషణాలతో నాసిరకం రచనల్ని సైతం మోసిపారేసే విశ్లేషకుల పుణ్యాన స్త్రీవాదం అంటే విచ్చలవిడితనం అన్న అర్ధం సాధారణ పాఠకుల్లో జీర్ణించుకుపోయింది. అమ్మాయి తాగి తందనాలాడినా, తగువులు పెట్టుకున్నా, ఎన్ని వెధవ్వేషాలేసినా దానికేదో ఓ దిక్కుమాలిన సమర్ధన చూపి సమాజ రీతుల్ని ప్రశ్నిస్తూ కథ ముగిస్తే చాలు – అది కథ కాదన్నోడు వెధవ, ఉత్తమ కథ కాదన్నోడు కత్తితో నరకబడుదుడు. ఆమెన్.

ఇక, ఈ ఉత్తమ కథల్లో ఎన్నారై కథకులవి కూడా చాలా ఉన్నాయి. వీటిలోనూ ఓ విశేషం ఉంది. (ఏదో మాట వరసకన్నా కానీ, నిజానికి విశేషమేమీ లేదక్కడ). ఎన్నారై కథకులంటే అవి అమెరికాలో – కాకపోతే ఆస్ట్రేలియాలో, లేకపోతే ఆఫ్రికాలో … ఏదో ఓ పరదేశంలో – ఉండే ఎన్నారై జీవిత గాధే అయ్యుండాలనే నియమం ఏదన్నా ఉండి తగలడిందో ఏం పాడో కానీ, వీళ్ల కథల్లో నూటికి తొంభై అలాంటివే. విదేశాల్లో జీవితాలకీ, ఇండియాలో జీవితాలకీ ఉండే తేడాలు ఎత్తి చూపి చివర్లో హమారా భారత్ అదుర్స్ , బయటి దేశాల్లో బతుకులు ఏడ్సినట్టుండున్ అని ముక్తాయిస్తే పొగడ్తలు ఖాయం.

ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతౌతుంది. ఎటు తిప్పి ఏం చెప్పినా నా గోలొక్కటే. కథలకి సాంఘిక ప్రయోజనం ఉండటం మంచిదే. ఐతే ఆ వంకతో అన్నీ నీతి కథలే రాసిపారేస్తే తెలుగు కథల పరిధి పెరిగేదెలా? ఆంగ్ల సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మహారచయితల రచనలు చూడండి. మామ్, లండన్, డాయల్, పో, స్టెయిన్‌బెక్, ఫిట్జ్‌జెరాల్డ్ …. ఎవర్ని తీసుకున్నా వారి కథల్లో లోతెక్కువ, నీతులు తక్కువ. అక్కడా యాసలున్నాయి. బూతులే లేవు. ఆయా కథల్లో వస్తు వైవిధ్యమూ ఎక్కువే. విడివిడిగా చూస్తే  వీళ్లలో ఒక్కో రచయితా ఒక్కో మూసలో కథలు రాసినట్లున్నా, ఎవరి మూస వారికుంది. మనకి లేనిదదే. ఇక్కడ సోది జాస్తి, సృజన నాస్తి. అందరూ కలిసి రాసేది నాలుగైదు మూసల్లోనేనా? కనీసం కొత్త మూసలన్నా తయారు చేయొచ్చు కదా.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.