ఫిబ్రవరి, 2009ను భద్రపఱచు

మారుతీయం

అమెరికా వచ్చినవారు తప్పనిసరిగా చూడాలనుకునే ప్రదేశాలు కొన్నున్నాయి. నయాగరా, డిస్నీల్యాండ్, గ్రాండ్ కానియన్స్, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ వగైరా. నాకు మాత్రం హాలీవుడ్ లోని యూనివర్సల్ స్టుడియోస్ చూడాలని చిన్ననాటి నుండీ పెద్ద కోరిక. కేవలం యూనివర్సల్ స్టుడియోస్ చూడటానికే ఓ సారి అమెరికా వెళ్లాలని అప్పట్లోనే కఠోరంగా నిర్ణయించేసుకున్నా నేను. అయ్యదు నిర్ణయానికి కారకులు గొల్లపూడి మారుతీరావు గారు.

నా చిన్నప్పుడు ‘విజయచిత్ర’ అని ఒక సినిమా మాస పత్రిక వస్తుండేది – ‘చందమామ’ ప్రచురించే డాల్టన్ పబ్లికేషన్స్ వాళ్లది. 1950ల నుండి సుమారో నలభయ్యేళ్ల పాటు వెలువడి, 1996లోనో ఎప్పుడో మూత పడింది. ఇది తెలుగులో వచ్చే మిగతా సినీ వార, పక్ష, మాస పత్రికలకి భిన్నంగా ఉండేది. సినిమా ప్రారంభోత్సవాలు, షూటింగ్ విశేషాల వంటి సాధారణ విషయాలతో పాటు ప్రముఖ దర్శకుల, సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సినిమాల వివరాలు, సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు మొదలైన వాటిని గురించి విజ్ఞానభరిత సమాచారం అందిస్తుండేదీ పత్రిక. విజయచిత్రలో రాండర్ గై వంటి రచయితలు హాలీవుడ్ క్లాసిక్స్ మీద ప్రచురించే వ్యాసాలు నాకు పదేళ్ల వయసులోనే హాలీవుడ్ సినిమాలపై ఆసక్తి కలిగించాయి (ఐతే, ఆయా క్లాసిక్స్ గురించి ఈ పుస్తకంలో చదవటమే కానీ, చూసే అవకాశాలు ఆ రోజుల్లో లేవు).

1984-87 మధ్య కాలంలో అనుకుంటా – సంవత్సరం సరిగా గుర్తు లేదు – గొల్లపూడి మారుతీరావు గారు అమెరికా పర్యటించి వచ్చారు. వచ్చాక, తన యాత్రా విశేషాలని ట్రావెలాగ్ రూపంలో ధారావాహికలా రెండు మూడు నెలలపాటు విజయచిత్రలో ప్రచురించారు. అందులో భాగంగా ఆయన రాసిన యూనివర్సల్ స్టుడియోస్ సందర్శనానుభావాలు నన్ను భలేగా ఆకర్షించాయి. థీమ్ పార్క్ అంటే ఏమిటో నాకు తెలీదప్పట్లో (నాకు తెలిసిందల్లా మా ఊరి నడిబొడ్డునున్న మునిసిపాలిటీ వారి పబ్లిక్ పార్కు మాత్రమే. పందిరాజములు తెగ హడావిడిగా తిరుగుతుండేవందులో). యూనివర్సల్ స్టుడియోస్ లో ప్రముఖ ఆకర్షణల గురించి ఆయన వర్ణిస్తూ రాసింది చదివితుంటే నాకు ఎప్పటికైనా అమెరికా వెళ్లి ఆ వింతలేవో చూసి తీరాలనిపించింది. తర్వాత కాలంలో ఆ ట్రావెలాగ్ ఎన్ని సార్లు చదివుంటానో. చదివిన ప్రతిసారీ నా నిర్ణయం మరింత బల పడేది.

ఆ కోరిక తీరటానికి పదిహేనేళ్లు పట్టింది. ఉద్యోగ రీత్యా అమెరికా వచ్చాక ఈ దేశంలో నేను చూసిన మొట్టమొదటి పర్యాటక స్థలం యూనివర్శల్ స్టుడియోస్. డ్రైవింగ్ సరిగా వచ్చీ రాక ముందే బే ఏరియా నుండి హాలీవుడ్ వరకూ – రమారమి ఆరొందల యాభై కిలో మీటర్లు – కారేసుకెళ్లి మరీ చూసొచ్చాను. మారుతీరావు గారు వర్ణించిన కొన్ని ఆకర్షణలు నేను చూసేనాటికి ఎత్తివేయబడి, వాటి స్థానంలో కొత్తవి చోటు చేసుకున్నాయి. స్టుడియో టూర్, స్పెషల్ ఎఫెక్ట్స్ స్టేజెస్ వంటి కొన్ని ‘నిత్యాకుపచ్చ’ ఆకర్షణలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. మొదటిసారిగా అవి చూస్తుంటే ఆయన వర్ణనే నా కళ్ల ముందు మెదిలింది. ఆ తర్వాత, గత పదేళ్లలో, మరో ఆరు సార్లు యూనివర్సల్ స్టుడియోస్ సందర్శించాను నేను (మారుతీరావు గారు నా పేరు చెప్పి యూనివర్సల్ వాళ్ల దగ్గర రిఫరల్ ఫీజు వసూలు చెయ్యొచ్చు). వెళ్లిన ప్రతిసారీ నాకు మొదటిసారి చూసినప్పటి అనుభూతే కలుగుతుంది.

మారుతీరావు గారి ‘ట్రావెలాగ్’ నన్ను మరో విధంగా కూడా ప్రభావితం చేసింది. అదే పర్యటనలో తను చూసిన న్యూయార్క్ బ్రాడ్‌వే నాటకాల గురించి ఆయన వివరంగా రాశారు. స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త కావటంతో, మన నాటకాలను బ్రాడ్వే ప్రదర్శనలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యానాలు నన్ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘క్యాట్స్’ (Cats), ‘ఫాంటమ్ ఆఫ్ ది ఆప్రా’ (Phantom of the Opera) ప్రదర్శనల గురించీ, బ్రాడ్వే నాటకాల వైభవం గురించీ, సినిమాలకి తీసిపోని స్థాయిలో వాటిలో వాడే స్పెషల్ ఎఫెక్ట్స్ గురించీ ఆయన రాసింది చదివాక బ్రాడ్వే నాటకాలపై నాకూ అభిరుచి ఏర్పడింది. కాలక్రమంలో అది క్లాసిక్ ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి కలిగేందుకు దారితీసింది; పలు ఆంగ్ల నాటకాలకు, హాలీవుడ్ సినిమాలకు మూలాధారమైన కధలు, నవలలు చదివేలా ప్రోత్సహించింది. ఓ రకంగా, నేను నవతరంగంలో హాలీవుడ్ క్లాసిక్స్‌పై వ్యాసాలు రాయటం వెనుక రాండర్ గై, గొల్లపూడి వంటి వారి రచనల పరోక్ష ప్రభావం ఉంది.

* * * * * * * *

ఇదంతా ఇప్పుడు రాయటానికి నేపధ్యం – స్లమ్‌డాగ్ మిలియనైర్ సినిమాపై గొల్లపూడి మారుతీరావు గారు చేసిన వ్యాఖ్యలపై బ్లాగ్లోకంలో విమర్శలు చెలరేగటం. విమర్శించిన వాళ్లలో నేనూ ఉన్నాను. ఐతే, కొందరి విమర్శలు ఆయన సినీ పరిజ్ఞానాన్నే ప్రశ్నించే విధంగా ఉండటం ఆశ్చర్యకరం. కొన్నిసార్లు జగమెరిగిన బ్రాహ్మడికీ జంధ్యం తప్పదేమో! అందుకే – దశాబ్దాలుగా పలు దేశాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో సినిమాలు, నాటకాల గురించి ఆయన చాలా అధ్యయనం చేశారనేదానికి నేనెరిగిన ఉదాహరణలు, పనిలో పనిగా పాతికేళ్ల నాటి ఆయన యాత్రానుభవాలు నాపై వేసిన చెరగని ముద్రలూ అందరితోనూ పంచుకునే ప్రయత్నం ఇది.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.