ఉరేసుకునో, పురుగు మందు తాగో ప్రాణం తీసుకునే పాత తరం విఫల ప్రేమికుడి గురించి చిన్నప్పుడు వార్తాపత్రికల్లో చదివున్నాను. ఇప్పుడా బాపతు పిచ్చిమారాజులు దాదాపు మాయమైపోయారు. ప్రస్తుతం ప్రియురాళ్లకి శిక్షలేసే అబ్బాయిలదే హవా. సినిమాల్లో సీజనుకోరకం ట్రెండ్ మారినట్లే ఈ శిక్షల్లో కూడా ఏడాదికో కొత్త రకం అమల్లో ఉంటుంది.
ఆ మధ్య వాటర్ ట్యాంకులూ, టెలిఫోన్ టవర్లూ ఎక్కి దూకుతామని బెదిరించేవాళ్ల ట్రెండ్ నడిచింది. అవతలి వాళ్ల ప్రాణం తీసేదాకా పోలేదు కాబట్టి ఇది చాలావరకూ నయం. వీళ్లలో నిజంగా దూకిన కేసులెన్ననేది వేరే ప్రశ్న. దీన్తర్వాత, ప్రేమనంగీకరించని అమ్మాయి గొంతు కోసి హత్య చేసే ఫ్యాషన్ నడిచింది. అదీ పోయి యాసిడ్ దాడుల రోజులు మొదలయ్యాయి. ఇప్పుడు హెచ్ఐవి రక్తంతో కూడిన ఇంజెక్షన్లు చేసే పద్ధతొచ్చింది. ఇదెన్ని రోజులుంటుందో, దీని తర్వాత మరే విధానమొస్తుందో! చూడబోతే, భారతీయుల సృజనాత్మకత మిగతా రంగాల్లో చంకనాకిపోతున్నా కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు చేయటంలో మాత్రం ముందున్నట్లుంది.
సరే, ఇలాంటివి మరో రెండో మూడో జరిగితే వాటిలో ఏదో ఒకటి – ముఖ్యంగా అమ్మాయి కాస్త చూడ చక్కగా ఉందనుకున్న కేసు, అదీ అధమం వాళ్లది అప్పర్ మిడిల్ క్లాసైతేనే – మన మీడియా పతాక శీర్షికలకెక్కుతుంది. అప్పుడు ఆంధ్రదేశమంతా కొన్నాళ్లు గగ్గోలు పెడుతుంది. ఇటువంటి కేసుల్లో పోలీసులు కొత్తగా ఆటవిక న్యాయం అమలు చేయటం మొదలు పెట్టారు కాబట్టి ఆ కేసు వెంఠనే పరిష్కారమైపోవచ్చు. ఈలోగా దేశీయంగా అత్యంత ముఖ్యమైన మరో పరిణామమేదో సంభవిస్తుంది – అంటే ఐశ్వర్యారాయ్ నెల తప్పటం లాంటిదన్నమాట. దాంతో అందరి దృష్టీ అటు మళ్లుతుంది. అసలు సమస్య మాత్రం అక్కడే ఉంటుంది.
కొన్నేళ్లుగా ఇలాంటివి ఎందుకింత ఎక్కువగా జరుగుతున్నాయంటే ఎవరికి తోచిన సమాధానాలు వారు చెబుతారు. వయసు ఆకర్షణ గురించి పిల్లల్లో సరైన అవగాహన కల్పించని తల్లిదండ్రులదే తప్పనేవాళ్లు కొందరు. నాకర్ధం కానిది – ఈ ఆకర్షణ పూర్వమూ ఉన్నదే. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే తల్లిదండ్రులు ఇటువంటి విషయాల్లో పిల్లలతో ఎక్కువగా చర్చిస్తున్నారు. అయినా ఈ దారుణాలు మాత్రం పూర్వం కన్నా ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి. దానర్ధమేమిటి?
సినిమాలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో పెట్రేగిన విచ్చలవిడి ధోరణులు దీనికో కారణం అనేది మరికొందరి సమాధానం. తల్లిదండ్రుల పెంపకం లోపం కన్నా ఇది అర్ధవంతమైన సమాధానం కావచ్చు. నా వరకూ మరో కారణం కూడా కనిపిస్తుంది.
ఎనభయ్యో దశకం దాకా మనవాళ్లది పొదుపు చేసే నైజం. అప్పో సొప్పో చేసి వస్తువులు కొనటం కన్నా ఉన్నదానితో సర్దుకోవటానికే మొగ్గు చూపే వారు. మిక్సీలు, ఫ్రిజ్‌లు, ఆఖరికి ఇళ్లైనా అదే ధోరణి. అందుకే అప్పట్లో ఎక్కువశాతం మధ్యతరగతి సుబ్బారావులు ఉద్యోగం నుండి రిటైరయ్యేనాటిగ్గానీ ఓ గూడు సమకూర్చుకోలేకపోయేవారు. మరి ఇప్పుడో? అంతా పోటీ. పక్కవాడికి ఉన్నదాన్ని అప్పు చేసయినా తానూ సొంతం చేసుకోవాలన్న ఆరాటం. కోరుకున్నది సొంతం కాకపోతే తట్టుకోలేని అసహనం.
దీనికి తోడు, పిల్లలకు చిన్నప్పట్నుండీ ప్రతివిషయంలోనూ పోటీ తత్వాన్ని నూరిపోసే గుణం కూడా ఎక్కువైపోయింది. జీవితంలో ప్రతి విషయాన్నీ గెలుపోటముల కోణంలోనుండే చూసే లక్షణం నేటి తరానికి నేర్పబడింది. పోటీ మంచిదే. అయితే, పోటీ పడ్డ ప్రతివాళ్లూ గెలవలేరనే తెలివిని కూడా నేర్పాలి కదా. తల్లిదండ్రుల పెంపకంలో తేడా రావల్సిందేమన్నా ఉందంటే అది ఈ విషయంలో; వయసు ఆకర్షణ గురించి బోధించటంలో కాదు. తల్లిదండ్రులు పిల్లలకి – ఓటమి ఉసూరుమనిపించొచ్చు, కానీ ఉసురు తీసేదవకూడదని నేర్పాలి. ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలోకి భారతీయులు జారిపోతున్నారనేదానికి ఉదాహరణలు రోజూ టీవీల్లో రకరకాల పోటీ కార్యక్రమాల రూపంలో మనకి కనిపిస్తూనే ఉన్నాయి. పాటల పోటీలు, నృత్యాల పోటీలు, క్విజ్ ప్రోగ్రామ్స్ .. ఏది తీసుకున్నా, చిన్నా పెద్దా తేడాలేకుండా ఓడిపోతే ఏడవకుండా వెనుదిరిగేవాళ్లు ఒక్కరున్నారా? ఓటమిలో హుందాతనమేది? పబ్లిక్‌గా ఏడవటంలో ఏం డిగ్నిటీ ఉంది? పదేళ్ల క్రితమూ ఇలాంటి పోటీలు జరిగేవి – ఇంత విరివిగా కాకున్నా. అప్పుడూ ఓడిపోయిన వాళ్ల బాధ వాళ్ల మొహాల్లో కనపడేది. తేడా అల్లా – అప్పట్లో ఇలా ఏడుపులూ పెడబొబ్బలూ ఉండేవి కావు.
వినిమయ మనస్తత్వం, పోటీ తత్వం .. ఈ రెంటికీ ప్రేమతో ముడిపెట్టి చూడండి. అంతర్జాతీయీకరణలో భాగంగా దేశంలో పెచ్చరిల్లిపోతున్న కన్సూమరిజానికీ, ప్రేమల పేరుతో జరుగుతున్న దాడులకీ ప్రత్యక్ష సంబంధమే ఉంది. వస్తువుల దగ్గర మొదలైన ఈ రెండు గుణాలు ప్రేమల దాకా పాకాయి. టీనేజ్ పిల్లల నుండి పాతికేళ్ల యువత దాకా ప్రేమ తిరస్కరించబడ్డవాళ్లు, విఫలమైన వాళ్లు ఘోరాలకొడిగట్టటానికి నాక్కనిపించిన కారణం మాత్రం ఇదే.
మీ మాట