అక్టోబర్, 2012ను భద్రపఱచు

త్వరలో విడుదల

వచ్చే ఏడాది విడుదలవటానికి వరుసలో నిలబడున్న తెలుగు చిత్ర రాజములు:

సెంటిమెంట్ చిత్రాల దర్శకుడు పగడాల అబ్బయ్య రూపొందిస్తున్న దగాస్టార్ పునరాగమన చిత్రం ‘పుట్టింటికిరా తమ్ముడూ’.

లేపాక్షి నంది దర్శకత్వంలో దగా జూనియర్ నటిస్తున్న మాక్సిమమ్ మడ్ క్రియేషన్స్ వారి ‘రొచ్చు’.

మందనూరి సబ్‌జూనియర్, కోయపాటి కలయికలో రాబోతున్న భీభత్సకరమైన సినిమా ‘దుమ్ము’.

ద్వివిక్రమ్ దర్శకత్వంలో గిల్లు గర్జన్ నటిస్తున్న రెండవ సినిమా ‘ఆగస్టాయి (అనబడే ఆకతాయి)’.

తెలుగు సంస్కృతికి అద్దం పడుతూ కిషోర్ తుమ్ముల రూపుదిద్దిన అచ్చ తెలుగు చిత్రం ‘దిసీజ్ టెల్గూ లైఫ్’.

మంట లక్ష్మీ ప్రసూన అన్నీ తానై నటిస్తూ నిర్మిస్తున్న ‘కొంపంతా కొల్లేరు’.

సంకటేష్, హిమేష్  క్రేజీ  కాంబినేషన్లో రోమ్ నేపాల్ శర్మ నిర్మిస్తున్న భయానక చిత్రం ‘దెయ్యాలదిబ్బలో మఱ్ఱిచెట్టు’.

బాతు రామశ్యామ నిర్దేశకత్వంలో అనూహ్య ప్రధాన పాత్రధారిణిగా మల్లెపూల కృష్ణప్రసాదరెడ్డి ఆరేళ్లుగా సాగదీస్తున్న దెయ్యాల సినిమా ‘అమావాస్య’.

ఫీవర్ స్టార్ వాయు వివాహ్, తినమ్మా జంటగా కథ, కాకరకాయ లాంటి పట్టింపులేమీ పెట్టుకోకుండా ఇడ్లీ విశ్వనాధ్ చుట్టేస్తున్న ‘దొంగకోళ్ల రంగడితో రత్తాలు’.

గానార్జున, దర్శకచంద్రుల హిట్ కాంబినేషన్లో మరో భక్తిరస పౌరాణికం ‘ప్రవక్త మహమ్మద్’.

గోలయ్యబాబు, మంట జెనోమ్ క్రేజీ కలయికలో ఇంకో పిచ్చెక్కించే సినిమా ‘ఛీ కొడతారా? చిరాకు పడతారా??’.

చిల్లర సురేష్, బీమాలేని కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘బుడబుక్కలోడు’.

ప్రతీకారం ప్రధానాంశంగా పందిమాత పతాకమ్మీద ఎన్.ఎన్.రామజౌళి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సీజీఐ ఎక్స్‌ట్రావగాంజా  ‘దోమ’.

మూసమహారాజా కవితేజ సరసన అందాల నాయిక పెప్సీ విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ‘మదం’.

డాన్స్‌మాస్టర్ ఫ్లోరెన్స్ దర్శకత్వంలో ప్రభాత్ భీకరంగా నటించేస్తున్న ‘గుభేల్’.

ఉద్యమ నేపధ్యంలో యమ్.కింకర్ రూపొందిస్తున ఇంకో సినిమా ‘జజ్జనకరిజనారే’.

నైజాం నిష్కృతి పతాకంపై కచరా సమర్పణలో శ్రీమతి తవిక ప్రధమ ప్రయత్నంగా ప్రయత్నిస్తున్న ‘బొంద పెడతా’.

పై సినిమాకి పోటీగా జగడపాటి రామగోపాల్ తీస్తున్న మొదటి సినిమా ‘ఉస్కో అంటే ఉస్కో అంటా’.

ఎవరికీ పోటీ రాకుండా, ఫలితంతో సంబంధం లేకుండా మిత్రచిత్ర పతాకంపై ఆరు పారాయణమూర్తి తన దోవన తాను తీసుకుపోతున్న ‘జాలిమ్ కౌన్ రే’.

కొండ సంకట్ సమకూర్చిన కథాంశంతో వేణు దాట్ల నేతృత్వంలో మిక్సర్ & గ్రైండర్ బ్యానర్ మీద  ఊరూపేరూ లేని నిర్మాతెవరో వండుతున్న ‘కిచిడీ’.

ఆంగ్ల చిత్రం ‘ఎక్స్‌పెండబుల్స్’ ఆధారంగా శ్రీమతి జీవిక దర్శకత్వంలో డా.రామశేఖర్, గజపతి బాబు, శ్రీశాంత్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘మేమింకా మిగిలున్నాం’.

ఇవి కాక ఇంకా హిందీ అనువాదాలు – వైద్యా బాలికన్ ‘అగ్లీ పిచ్చర్’, రేణు బెనర్జీ ‘కుయ్యా’, సన్నీ సిలోన్  ‘భస్మ్ – 3’; తమిళ అనువాదాలు – జి.వి.సంతోష్ ‘భంగం’, బి.ఆర్.మురికిదాస్ ‘నాన్ సెన్స్’, డూపర్‌స్టార్ గజనీశాంత్ ‘పచ్చడయ్యాన్’ వగైరా కళాఖండాలు తెలుగు దేశమ్మీద మూకుమ్మడి దాడి చెయ్యబోతున్నాయి.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.