మే, 2011ను భద్రపఱచు

మూడేళ్లు

మూడేళ్లంటే ఇరవయ్యొకటి కాదు. త్రీ ఫింగర్స్ కూడా కాదు. త్రీ ఇయర్స్. మూడు చెవులు కాదు భాయియోఁ అవుర్ బెహెనోఁ. మూడు ఏడాదులన్న మాట. ఎప్పటికి? నిన్నటికి. దేనికి? ఈ బ్లాగులు గిలకటమూ అదీ నేను మొదలెట్టి. ఐతే ఏంటిష? టిష లేదూ, త్రిష లేదూ. ఊకినే. సింహావలోకనంమరో వసంతం అంటూ సంవత్సరం నిండినప్పుడల్లా ఆ ఏడాదిలో ఏం పొడిచేసిందీ రాసేసి మీ అసుంటోళ్ల మొహానేసే అలవాటొహటి జేసుకున్నాం గదా. మీరూ ఏఁవనుకోకండా చదివేసి పెద్దరికంగా ప్రోత్సహించేస్తన్నారు గదా.  మరి, మీరు మళ్లీ పెద్దరికం జూయించే అవకాశమియ్యాలా వద్దా? అంచాత కొంత సొంత డబ్బా నింపిన సోదన్న మాట.

మొదటేడాది నూట నాలుగు టపాకాయలు పేల్చాం. రెండో ఏడాదవి అరవైకి తగ్గాయి. మూడో ఏడాది పన్నెండుకి పడిపోయాయి . అంటే నెలకో పోటు పొడిచామన్నమాట. మొదట్లో సూపర్ స్టార్ కృష్ణలా శివాలెత్తిపోయి మూడ్రోజులకోటి విడుదల చేసేశాం. అక్కడ్నుండి రాజేంద్రప్రసాద్ రోజులకొచ్చాం. ప్రస్తుతం మహేష్ బాబు తరం కాబట్టి కాలానికి తగ్గట్లు పోతున్నామన్నమాట. టపాల తరచుదనం తగ్గింది. చురుకుదనం, కరకుదనం మాత్రం తగ్గలేదనే అనుకుంటున్నా. నిజమో కాదో చెప్పాల్సింది మీరు. ఆ పన్నెండు పోట్లలో కొన్ని: అరాచకం, పుచ్చకాయ – ఓ సచ్చినోడి లవ్ స్టోరీ, ప్రవాసం – 1, పేడ బిరియానీ, ఉత్తుత్తమ కథలు, స్పందన.

ఈ ఏడాదిలో ఓ శుభోదయాన పొలోమని  ‘ప్రవాసం’ పేరుతో టపాల పరంపర మొదలెట్టాను కానీ దానికి ఆదిలోనే హంసపాదడింది. రాసుకుంటూ పోతే ఎన్ని భాగాలవుతుందో నాకే ఓ అంచనా లేకపోవటం ప్రధాన కారణం. సీరియల్ తరహాలో రాసే ఓపిక లేకపోవటం మరో కారణం. మొత్తానికది మొదటి భాగంతోనే మూలన పడింది. మళ్లీ ఎప్పుడన్నా మూడొస్తే రాస్తానేమో చూడాలి.

రెండేళ్ల కిందట కథలొండే పనిలోకి దిగాను. ఇందాకా నే రాసిన వాటిలో నాగరికథ జగమెరిగిన బ్రామ్మడు. అది ‘కథ-2009’, ‘వర్తమాన కథ’ అనబడే రెండు సంకలనాలకు ఎంపికయింది. ఆయా సంకలనకర్తలకు ధన్యవాదాలు. పోయినేడాది రాసిన రెండు కథల్లో మరో ప్రపంచం అమెరికానుండి వెలువడే ఒకానొక సంకలనంలోకి ఎంపిక్కాగా, ‘కల్కి’ పేరుగల పెద్ద కథ సాక్షి ఫన్‌డేలో రెండు భాగాలుగా ప్రచురితమయింది (మొదటి భాగం, రెండవ భాగం). నాలుగైదు కథలతో నేనో పాపులర్ రచయితనైపోయాయన్న అపోహ లేదు. కథకుడిగా నావింకా తప్పటడుగులేనన్న స్పృహే ఉంది. ఆవగింజంత గుర్తింపైతే వచ్చింది. అందుకో ఏమో, తమ కథల పోటీలకీ, ప్రత్యేక సంచికలకీ వాటికీ ఏదన్నా రాసి పంపమని ఇద్దరు ముగ్గురడిగారు. ఎంపిక చేసిన కథాంశాలకి ఫలానా తేదీలోపు రాయటం నాకు చేతనయ్యే పని కాదు కాబట్టి ఆ విజ్ఞప్తుల్ని సున్నితంగా తిరస్కరించాను. ప్రస్తుతానికైతే నా ధోరణిలో ఓ కథ రాస్తున్నాను. ఎప్పటికయ్యేనో ఎవరికెరుక? ఈ సారి సైన్స్ ఫిక్షన్ కాదు. నా మూస నేనే ఛేదించుకునే ప్రయత్నమిది.

మూసంటే గుర్తుకొచ్చింది. నా కథలన్నీ ఓ రకం మూసలోకి జారుకుంటుండటం ఈ ఏడాదిలో నేను గమనించిన విషయం. కథలన్నీ ఉత్తమ పురుషంలో నడవటం, ఏ పాత్రకీ పేరుండకపోవటం, స్త్రీ పాత్రలు లేనే లేకపోవటం, కథ ఇతివృత్తానికి కాలంతో ఏదో ఓ రకంగా సంబంధముండటం, కథలో ఓ మరణం ఉండి తీరటం, చివర్లో ఓ ట్విస్టుండటం, కథానాయకుడే అనుమానితుడిగా తేలటం … ఇత్యాదివన్న మాట. వీటి మూలాన, నా మిగతా కథలు చదివిన పాఠకులు/రాళ్లు తాజా కథ చివర్లో ఏమవబోతుందీ ముందే చూచాయగా ఓ అంచనాకొచ్చేయటం గమనించాను. (ఇంతకీ – చివర్లో ఏమవబోయేదీ కథ నిండా క్లూస్ ఉన్నా, వాటినిబట్టి కాకుండా కేవలం రచయిత పేరుని బట్టి ముగింపు ఊహించటం అంటే రచయిత విఫలమయినట్లా, చదువర్లు విఫలమైనట్లా?)

ఆరున్నొక్క సూత్రాలు ఈ ఏడాదీ పాటించాను. ఒకరిద్దరు బ్లాగర్లతో మాత్రం కొంచెం పరిచయం కలిగింది. ఇరుగు పొరుగు బ్లాగిళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆసక్తి పోయింది. కూడల్లోకి తొంగి చూట్టమూ కరువైపోయింది. ఇతర బ్లాగుల్లో కామెంట్లు రాయటం అత్యంత అరుదైపోయింది. నా బ్లాగులో వ్యాఖ్యానించిన వారికి బదులివ్వటమూ ఆగిపోయింది. అది తలపొగరుతో కాదు. పేరుపేరునా థాంకులు, థాంకులు అంటూ ఏం చెబ్తాంలే అన్న బద్ధకంతో. అప్పటికీ పొడుగాటి సమాధానాలివ్వాల్సిన సందర్భాల్లో ఇస్తూనే ఉన్నా. మీ మీ కామెంట్లకి తరచూ బదులీయటం లేదని అలగమాకండి. మీ సమయం వెచ్చించి నా రాతలు చదువుతున్నందుకు, వ్యాఖ్యానిస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు, విమర్శిస్తున్నందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.

బ్లాగుల్లో రెండు మూడేళ్ల కిందున్నంత ఆరోగ్యకరమైన వాతావరణం (ఇదో సాపేక్ష పదం) ఇప్పుడు లేదు. అంత ఆసక్తికరమైన టపాలూ ప్రస్తుతం రావటం లేదు. వచ్చినా నా కళ్లబడటం లేదు. మొత్తానికి తెలుగు బ్లాగుల పరిస్థితేం బాగులేదు. బ్లాగులు సాహితీ సేవా కేంద్రాలు కానక్కర్లేదు. బజారు భాషా పరిజ్ఞాన  ప్రదర్శనాంగణాలు కాకుంటే చాలు. అవనే అయ్యాయి. ఇక చేసేదేం లేదు.

ఈ ఏడాదిలో కొన్ని సరదా కామెంట్లొచ్చి పడ్డాయి నా బ్లాగులో. వాటిలో ఒకటి, నన్ను తెగ నవ్వించింది: శ్రీ ఏసుక్రీస్తుడు చదివి ‘మా మతాన్ని కించపరుస్తున్నావు. నువ్వు పురుగులు పడిపోతావు’ అన్న వ్యాఖ్య (అసలు దీవెనలు ఇంతకన్నా నాగరికమైన భాషలో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రచురించకుండా దాచుకున్నాను). అదే టపా గురించి, ‘రాఘవేంద్రరావు గారు హిందూ మతాన్ని కించపరుస్తూ సినిమాలు తీస్తే మీరు ఆయన మీద కోపంతో క్రిస్టియన్లని కించపరుస్తూ టపా రాయటం అస్సలు బాలేదు’ అన్న అమాయకురాలొకావిడ! ఆ హాస్య టపాని ఈ రకంగా కూడా అర్ధం చేసుకునేవాళ్లుంటారని తెలిసొచ్చిన సందర్భాలవి. భారతీయం వంటి టపాలు చదివి నన్ను దీవించిన హిందూ మతోద్ధారకులు ఓ రకమైతే, ‘శ్రీ ఏసుక్రీస్తుడు’ చదివి అక్షింతలేసిన క్రైస్తవ సోదర సోదరీమణులు ఇంకో రకం. అందరికీ నచ్చేలా ఉండటం నా తరమా? తరమయ్యెనుబో, అది నాకవసరమా?

అందుకే, అహం బ్రహ్మాస్మి అనుకుంటూ అలాగే బండి లాగించుకెళుతున్నా.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.