మే, 2012ను భద్రపఱచు

నా దేశం

ఎనిమిది నెలల ప్రశాంత జీవనానంతరం బ్లాగేందుకు అవసరమైన ఆవేశం తన్నుకొచ్చింది.

కారణం జన్మభూమి. నారావారిది కాదు. నాదే.

పద్నాలుగేళ్ల ప్రవాసంలో అడపాదడపా హమారా భారత్‌ని సందర్శించిన సందర్భాలున్నా, అవన్నీ చుట్టపుచూపు యాత్రలే కాబట్టి దేశం ఎంత డెవలప్పయిందో తెలుసుకునే అవకాశం అప్పుడెప్పుడూ రానేలేదు. ఇప్పుడొచ్చింది. ఈ మధ్యకాలంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నా, అదేంటో కళ్లారా కాంచితే కలిగే అనుభూతే వేరు.

వృత్తిగత కారణాలతో కొన్నాళ్లు హైదరాబాదులో ఉండాల్సి రావటంతో సిపాయి చిన్నయ్య పాట పాడుకుంటూ రాష్ట్రరాజధానిలో అడుగు పెట్టి నెల కావస్తుంది. విమానం దిగాక నాలుగ్గంటలన్నా విశ్రాంతి తీసుకోకుండా ఆఫీసుకి పరిగెత్తాల్సినంత పని వత్తిడి. టాక్సీ పిలవబడింది. టెన్ మినిట్స్‌లో వస్తానన్నాడు టాక్సీవాలా. అన్నమాట తప్పకుండా అరగంట తర్వాత వచ్చి వాలాడు.

హైటెక్కు సిటీలో కొలువయ్యుంది మా కార్యాలయం. మార్గమధ్యంలో పెద్ద సీసాగొంతు. రైల్వేవారికీ, రహదార్ల శాఖకీ మధ్య పుట్టిన రగడ పుణ్యాన మూడొంతులు పూర్తై ఆగిపోయిన భారీ వంతెన కిందుగా నేల ఈనినట్లున్న వాహనసంద్రం గుండా మూడొందల గజాలు ఈది అద్దరి చేరాక నాక్కలిగిన గర్వం అలనాడు ఎర్రసముద్రాన్ని దాటిన పూట మోజెస్ మహానుభావుడికీ కలిగుండదు. స్వతంత్ర భారతపౌరులు విజయగర్వంతో ఉప్పొంగిపోయే అవకాశాలు అడుగడుగునా కల్పిస్తున్న ప్రభుత్వశాఖలకిదే నా సలామ్. సెబాసో.

దారెంట కనిపిస్తున్న పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి, శివారెడ్డి, రామిరెడ్డి, కేశవరెడ్డి తదితర తీపి తినుబండారాంగళ్ల పేర్లు చదూకుంటూ ‘ఓ సామాజికవర్గం వాళ్లంతా మూకుమ్మడిగా స్వీట్ల వ్యాపారంలోకెప్పుడు దిగిపోయారా’ అనుకుంటుండగానే వాసిరెడ్డి వారి స్వీట్ షాపు నా కళ్లబడింది. ‘ఫర్లేదు. స్వీట్లవ్యాపారం ఫలానా సామాజికవర్గానికి మాత్రమే పరిమితం కాలేదు’ అని అని స్థిమిత పడ్డాను. దేశంలో సామాజికన్యాయం పరిఢవిల్లుతుందని సంతృప్తిపడ్డాను.

మళ్లీ ట్రాఫిక్ జామ్. డ్రైవరుడు కాలక్షేపానికి స్టీరియోలో పాటలు పెట్టాడు. ‘కెవ్వ్… కేక .. నా సామిరంగా .. కెవ్వ్ .. కేక .. నీ తస్సదియ్య’ …. స్పీకర్లనుండి సాహితీ సౌరభాలు గుబాళించే సంగీతం గుప్పుగుప్పున కొడుతుండగా డాష్‌బోర్డు మీదున్న తెలుగు వార్తాపత్రికందుకున్నాను. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాల్లో ఉందా వార్త: ‘మాజీ బీజేపీ అధ్యక్షుడికి జైలు శిక్ష’. లక్షల కోట్లు భోంచేసి ప్రాంతీయ పార్టీలు పెట్టే దొరలున్న కాలంలో ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యుండీ ఆఫ్టరాల్ లక్ష రూపాయలు గుట్టుగా పుచ్చుకోలేని అసమర్ధుడికి ఇదే తగిన శాస్తి. మొత్తానికి దేశంలో చట్టం తనపని తాను సమర్ధంగా చేసుకుపోతుందన్న మాట.

తృప్తిగా పేజీ తిప్పాను. కంపూచియా, కాంబోడియా, దక్షిణమెరికా, వియత్నాం తదితర విదేశాల్లో పీడిత తాడిత ప్రజల్ని ఉత్తేజ పరుస్తూ తెలుగులో గేయాలల్లిన విప్లవ సూర్యుడెవరో అస్తమించాడట. ఆయనకి నివాళిగా సరసం (సత్తుపల్లి రచైతల సంఘం), నీరసం (నీరుకొండ రచైతల సంఘం) ఇత్యాది రసాల్లో ఇంకా మిగిలున్న సూరీళ్లు అర్పించిన కవితాభివందనాలతో ఆ పేజీ ఎర్రెర్రగా మండిపోతుంది. నేను సైతం ఓ క్షణం మౌనంగా అంజలి ఘటించి మరుసటి పేజీలోకి సాగిపోయాను.

లోపల టెస్సీ థామస్ అనబడే ఆవిడ ఇంటర్వ్యూ. అగ్ని ప్రయోగంలో పాలుపంచుకున్న బృందంలో ఆవిడో సభ్యురాలట. విలేకరి ఎంతో ఉపయుక్తమైన ప్రశ్నలు సంధించాడు. ఓ శాస్త్రవేత్తగా ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు, వాటిని అధిగమించిన వైనాలు వగైరా చచ్చు పుచ్చు సంగతుల జోలికెళ్లకుండా,  ఆవిడకి ఇష్టమైన వంటకాలు, కాలక్షేపానికి ఏం చేస్తుంటారు, సినిమాలు ఎంత తరచుగా చూస్తుంటారు, మొదలైన ఆసక్తికరమైన విషయాలకి విజ్ఞానదాయకమైన సమాధానాలు రాబట్టి పాఠకుల మేధస్సుకి పదును పెట్టాడు.

ఎడిటోరియల్ పేజీలో ఎద్దు మాంసం తినాలా వద్దా అనే అంశమ్మీద భీకర వాదోపవాదాలు సాగుతున్నాయి. తిండిగింజల కోసం తిప్పలుపడే దశనుండి ఎద్దుల్ని తినాలా వద్దా అని తగవులాడుకునే దాకా వచ్చారంటే భారద్దేశంలో పేదలు చాలా ఎదిగిపోయారన్న మాట. నాకు పట్టరాని సంతోషమేసింది. అంతకంటే సంతోషం తట్టుకోలేనేమోనని భయమేసింది. అంతటితో పత్రిక పక్కన పడేసి కిటికీలోంచి బయటికి చూడసాగాను. పక్కనే ఆంప్రరారోరసం వారి సిటీబస్సు. దాన్నిండా ప్రభుత్వ ప్రకటన పెద్ద పెద్దక్షరాల్లో: ‘రాష్ట్రంలో ఏడున్నర కోట్ల ప్రజలకి రూపాయికే కిలో బియ్యం’.

పోయినేడాది జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా ఎనిమిది కోట్ల నలభయ్యారు లక్షల చిల్లర. వీళ్లలో తొంభయ్యారు లక్షల చిల్లర మాత్రమే రూపాయిక్కిలో బియ్యం పొందే అర్హత లేనోళ్లన్న మాట. ఫర్లేదు. వచ్చే ఏడాదికల్లా వీళ్లు కూడా ఆ ఆ జాబితాలో చేరిపోతారు. కనుచూపు మేరలో – బీదాగొప్పా తేడాల్లేకుండా అందరూ పేదలతోనే నిండిన సమసమాజం. ఆహా.

అంతలో ఆఫీస్ వచ్చింది.

మా కార్యాలయం ఉన్న భవనం బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా, కింది అంతస్తులో ఉన్న లాబీ, కెఫటేరియా, దానికెదురుగా ఆకుపచ్చ ఆరుబయలు, అందులో కృత్రిమ జలపాతాలు. సిలికాన్ వ్యాలీలో సైతం ఈ స్థాయి హంగామా కనబడదని ఒప్పుకోవాలి.

ఆ మధ్యాహ్నం కాఫీ కోసం కెఫటేరియాకెళ్లాను. మండుటెండలో వేడివేడి కాఫీ కోసమొచ్చిన వెంగళప్పని నేనొక్కడినేనని అర్ధమయ్యేసరికి ఆలస్యమయింది. అక్కడ కోల్డ్ కాఫీ మాత్రమే ఉంటుందట. కావాలంటే చల్లని బీరు కూడా లభిస్తుంది. అంత మంచి అలవాట్లు నాకు లేవు కాబట్టి వద్దని చెప్పి వెనుదిరగబోతుండగా పక్కనుండి కిలకిలలు వినబడ్డాయి.

అక్కడో నలుగురమ్మాయిలు. మెళ్లలో వేలాడుతున్న కుక్కలబిళ్లలు (అనగా డాగ్ ట్యాగ్స్ అనబడే గుర్తింపు కార్డులు) వాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగినులని చెప్పేస్తున్నాయి. సీదా సాదా సల్వార్ కమీజులు ధరించి అతి సాధారణంగా, అత్యంత సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నారు. వాళ్ల చేతలు మాత్రం అద్భుతమైన ప్రగతికి ప్రతీకల్లాగున్నాయి. నలుగురూ ఓ చేతిలో బీరు గ్లాసు, రెండో చేతిలో సిగరెట్టు పట్టుకుని నవ్వాపుకుంటూ నన్నే చూస్తున్నారు. నేనెరిగిన భారతదేశం పద్నాలుగేళ్ల పాతది. ఒక్కసారిగా ఇంత అభివృద్ధి కంట్లోపడేసరికి పొలమారింది. పదండి ముందుకు, పదండి తోసుకు అంటూ దేశం దూసుకుపోతుంటే నేనొక్కడినే ఈసురోమంటూ కూచుండిపోయిన భావన. అంతలోనే – మగాళ్లకి దీటుగా చెడిపోవటమే కదా మహిళాభ్యుదయానికి పరమార్ధం అని గుర్తొచ్చి నా గుండె ఉప్పొంగింది. కళ్లు చెమర్చాయి.

అవి ఆనందబాష్పాలా?


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.