సెప్టెంబర్, 2009ను భద్రపఱచు

జజ్జనకరి జనారే

రాష్ట్ర కాంగిరేసు శాఖలో రాజకీయ కాక రాజుకుంది. వినాయక నిమజ్జనం ముందరేసిన ముసురు విజయదశమికి ముసలం రూపుదాల్చింది. దీపావళి నాటికిది దిక్కులు పిక్కటిల్లేలా పేలుతుందో లేక తుస్సుమంటుందో వేచి చూడాల్సిన విషయం. ఈ పరిణామాలెటు దారితీసినా, ప్రజానీకానికి మాత్రం పండగల సందర్భంగా కావలసినంత కాలక్షేపం. కాంగిరేసులో ఈ స్థాయి సందడి చూసి ఎన్నేళ్లయిందో. ప్రజలేనాడో మర్చిపోయిన ముఖాలెన్నో ఇన్నేళ్లకి మళ్లీ గజ్జె కట్టి జనాభీష్టం పేరుతో జజ్జనకరి జనారే అంటూ రెచ్చిపోయి చిందులేస్తుంటే చూట్టానికి రెండు కళ్లూ చాలటం లేదు. జగనన్నకి పట్టాభిషేకం చెయ్యాల్సిందేనంటూ బల ప్రదర్శనలు, బస్సు దహనాలు, బ్యానర్ల చింపుళ్లు, బెదిరింపులు, బుజ్జగింపులు, భజనలు .. అబ్బో ఒకటా రెండా. దిష్టిబొమ్మల దహనాలు, రాస్తారోకోలు సైతం జరుగుతున్నాయి. మొత్తమ్మీద – అటూఇటూగా మనవాళ్లకి తెలిసిన నిరసన ప్రక్రియలన్నీ రంగంలోకి దిగిపోయాయి. మిగిలింది బందులొక్కటే. రేపోమాపో అవీ మొదలవచ్చు. కొందరు భజంత్రీగాళ్లు అధినేత్రి ఫోటోకి అవమానం జరిగిన ప్రదేశాల్లో గోపంచకంతో శుద్ధి చేయటం, శాంతులు జరిపించటం వంటి చిత్ర విచిత్రమైన ఆలోచనల్ని అమల్లో పెడుతున్నట్లు ఇప్పుడిప్పుడే వచ్చిన వార్త. మత పార్టీగా ముద్రపడ్డ ఒకానొక జాతీయ పార్టీ కూడా ఇంత శాస్త్రోక్తంగా నడపబడదేమో!

జగనన్నని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలన్నది ఎనిమిది కోట్ల ఆంధ్రుల ఏకైక ఆకాంక్ష. వాళ్లకి ఏ ఇతర ఆశలూ, ఆశయాలూ, సమస్యలూ లేనే లేవు. జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రవుతాడోనని ఎదురు చూడటం తప్ప వాళ్లకి వేరే పనీ పాటా కూడా లేదు. ఇది ‘సాక్షి’ సర్వేలు నిగ్గు తేల్చిన నిజం – జనం సొమ్ముతో పెట్టిన పత్రిక జనాభిప్రాయం విషయంలో నిక్కచ్చిగానే వ్యవహరిస్తుందనుకోవాలి. అన్ని కోట్లమంది కోరిక ఉన్నపళాన తీర్చటం కాంగిరేసు అధిష్టానం కర్తవ్యం. ఆ బాధ్యత మరచినందునే రాష్ట్రంలో ఈ అలజడి. దానివల్ల అక్కడక్కడా ప్రజలక్కలిగే ఇబ్బందుల గురించి మనం మాట్లాడరాదు. జగనన్నని ముఖ్యమంత్రిగా చూడాలంటే ఆ మాత్రం త్యాగాలకి రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉండాలి. అసలు, పక్షం రోజులుగా లక్షలాది మందికి లభిస్తున్న వినోదాన్ని గమనిస్తే కొన్ని వందల మందికే పరిమితమైన ఇబ్బందుల ప్రస్తావన ఎంత అనుచితమో అర్ధమవుతుంది. దశాబ్దమున్నరగా పండగ పూట టీవీల్లో ఎడతెరిపిలేని సినిమాలు, మధ్య మధ్యలో తారామణుల శుభాకాంక్షల రొటీన్ రొడ్డకొట్టుడు భాగవతాలకి మొహమ్మొత్తి విభిన్న కార్యక్రమాల కోసం మొహం వాచిపోయిన ప్రేక్షక సమూహానికి ఇన్ని హాస్య ప్రహసనాలు ఉచితంగా అందిస్తున్నందుకు కాంగీ కేతిగాళ్లకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.

జగనన్నని పీఠమెక్కించే మహాయజ్ఞానికి రాజమండ్రిలో రెండు బస్సమిధలు ఆహుతయ్యాయి. మరీ రెండు బస్సులేనా! ఎంత అవమానకరమైన విషయం? తెలుగువాడి పరువేం కావాలి? సెగ ఢిల్లీదాకా తగలాలంటే అధమం రెండొందల బశ్శకటాలన్నా తగలబడాల్సిందే. ఆర్టీసీకి అన్ని బస్సులు దానం చేసే సత్తా లేకుంటే జేసీ దివాకరుని బస్సుల్నైనా వాడాల్సిందే. తగ్గనే కూడదు. అవసరమైతే, భవిష్యత్తులో కాంగిరేసు కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం తగలబెట్టటానికి వీలుగా రాష్ట్రంలోని ప్రతి బస్సు డిపోలోనూ కనీసం నాలుగు బస్సుల్ని సదా సన్నద్ధంగా ఉంచేలా ఆర్టీసీ చట్టాన్ని సవరించాలి. ఈ మహోన్నత చర్యల్ని అడ్డుకునే పోలీసు భటుల్ని ఉద్యోగాల నుండి ఊడబెరకాలి. పనిలో పనిగా నిరసన మంత్రిత్వ శాఖనొకదాన్నేర్పాటు చెయ్యాలి. పిడకలు, దిష్టిబొమ్మలు, కిరోసిన్ డబ్బాలు వగైరా సామాగ్రికి అవసరమైన నిధులు దండిగా కేటాయించాలి. నిరసనల కోసం ప్రభుత్వ సొమ్ముతో కాంగిరేసు కార్యకర్తలకి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలి. ఇందిరమ్మ పధకంలో భాగంగా నిర్మాణమైన ఇళ్లలో కొన్నిట్ని నిరసనల్లో నిప్పెట్టటానికి విడిగా కేటాయించాలి. నిరసనల్లో భాగంగా తన్నుకున్న కార్యకర్తలకీ ఆరోగ్యశ్రీ కవరేజ్ కల్పించాలి.

పైదంతా చదివి ‘అయితే సందడంతా ఒక వర్గానిదేనా’ అంటే కానే కాదన్నది సమాధానం. మొదట్లో మౌనంగా ఉన్న వైరి వర్గీయుల గళాలూ క్రమంగా బలం పుంజుకున్నాయి. పైకి, వాళ్ల తరపున హడావిడి తక్కువే కనిపిస్తున్నా, నిజానికి హైకమాండ్ వద్ద పారుతుంది వాళ్ల పాచికలే. ఆయా వర్గాలు ఎవరి గొడవలో వాళ్లు మునిగితేలుతుంటే గప్‌చుప్‌గా తనపని తాను చేసుకుపోతున్నారు గడుసరి రోశయ్యామాత్యుల వారు. అలనాడు కేంద్రంలో పీవీ ఏకులా వచ్చి మేకైన రూపకం రాష్ట్రంలో రోశయ్య రూపంలో మళ్లీ రక్తి కట్టనుందేమో భవిష్యత్ చరిత్రే చెప్పాలి. ప్రస్తుతానికైతే అంతా గందరగోళం. ఈ గందరగోళంలో ఎటూ తేలని, తేల్చుకోని ముచ్చటైన మూడో వర్గమూ ఒకటుంది. ఎటో ఒకటు తేలితే ఎక్కడ మునుగుతామోనన్న భయం వీళ్లది. వీళ్ల సందడీ తక్కువేం లేదు. అధిష్టానానిదే తుది నిర్ణయం అనొకసారి, తమకి అనుకూలంగా ఆ నిర్ణయం లేకపోతే రాజీనామా చేస్తామనొకసారి, అలా అననే లేదని మరోసారి, ఆ అర్ధంలో అనలేదని ఇంకో సారి .. ఇలా గంటకో రకంగా మాట్లాడుతున్న ఈ గోపీ వర్గం నేతల మాటల్లో గూఢార్ధాలు అంతుపట్టక జుట్టు పీక్కుంటున్న అమాయకులు కొందరున్నారు. కాంగీయుల తీరే అంతని అర్ధం చేసుకోవటం ఏమంత కష్టం? ఏ ఇతర పార్టీలోనూ కనరాని వాక్కు స్వాతంత్రం కాంగిరేసు సొంతం. టీవీ కెమెరాల ముందు చిత్తమొచ్చినట్లు వాగి చిద్విలాసంగా నడిచిపోవటాన్నే వాక్‌-స్వాతంత్రం లేదా వాగు స్వాతంత్రం అందురని సీపీ బ్రౌన్ నిఘంటువువాచ. తసమదీయులు దాన్ని చిత్త చాంచల్యం అని ఈసడించొచ్చుగాక, అసమదీయులకి మాత్రం అదే అంతర్గత ప్రజాస్వామ్యం. ఏ ఎండకా గొడుగు పట్టటం సగటు కాంగీయుడి నైజం కాదు. ఏ పుట్టలో ఏ పాముందో, ఎటు పోయి ఎటొస్తుందో అనుకుంటూ ఏక కాలంలో అన్ని గొడుగులూ పట్టుకోటమే అతని గుణం. అదే కాంగిరేసు మార్కు రాజకీయం. ఆ తరహా రాజకీయ జాతరే ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుంది. అనవసరపు ప్రశ్నల్తో బుర్ర బద్దలుకొట్టుకునే బదులు తిరునాళ్లు సాగినన్నాళ్లూ ఆనందించటం తెలివిగలవాడు చేసే పని. తలాతోకా లేని తెలుగు సినిమాలెన్నిట్నో పిచ్చి ప్రశ్నలెయ్యకుండా చూట్టంలా? ఇదీ అంతే.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.