జూలై, 2008ను భద్రపఱచు

ఉద్యోగ విజయం – 2/2

ఉద్యోగ పర్వం ప్రధమాంకానికి స్వశక్తిపై నా నమ్మకమే పెట్టుబడైతే, ఈ భాగానికి మూలధనం ఓ వ్యక్తిపై నాకున్న గుడ్డి నమ్మకం. ఆ వ్యక్తి నాకు మొదటి అవకాశమిచ్చిన సంస్థ అధినేత. ఆయనకి నేను పనిచేసే సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థతో పాటుగా వై-2కె శిక్షణాలయం కూడా ఒకటుండేది. జంటనగరాల్లో వై-2కె శిక్షణలో దీనిదే అగ్ర స్థానం.

నేను ప్రాజెక్టులో చేరిన కొన్ని రోజులకో సంఘటన జరిగింది. కొందరు కుర్రాళ్లు ఆఫీసు మీద దాడి చేసి కనపడినవన్నీ ధ్వంసం చేసి నానా భీభత్సం సృష్టించారు. వాళ్లు మాజోలికి రాలేదు కానీ, ఆఫీసు మేనేజర్ని ఆయన గదిలోనే నిర్బంధించేశారు. ఆరా తీస్తే తెలిసిందిది: మా అధినేత తన వై-2కె శిక్షణాలయంలో ‘జాబ్ గ్యారంటీ’ పేరిట వేలకు వేల ఫీజులు గుంజి, తర్వాత ఉద్యోగాలు చూపించకుండా మొహం చాటేశాడట! వీళ్లంతా అక్కడ శిక్షణ పొందినవాళ్లు. ఆయనేమో అమెరికాకి బిచాణా ఎత్తేశాడట. వీళ్లొచ్చి ‘మా ఫీజులు మాక్కక్కు’ అంటూ ఆఫీసు మేనేజరు మీద పడ్డారు. ఆ రోజంతా ఇదే గొడవ. సాయంత్రానికి పోలీసులొచ్చి మేనేజర్ని విడిపించారు.

తర్వాత వారం పాటు ఆఫీసులో పూటకో పుకారు. ఎక్కడి పని అక్కడే. ‘ఇక్కడుంటే మనల్నీ ముంచేస్తాడు. ఈయనిచ్చే బోడి రెండు మూడు వేలకోసం ఇక్కడెందుకుండటం?’ అని కొందరి గొణుగుడు. ఎనిమిదో రోజు అధినేత ఆఫీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేశాడు. ‘నేనెవర్నీ మోసం చెయ్యలేదమ్మా. మన సంస్థకి వై-2కె కోచింగ్‌లో ఉన్న పేరు చూసి వాళ్లంతట వాళ్లు వచ్చి చేరటమే కానీ, నేను జాబ్ గ్యారంటీ అనెవరికీ చెప్పలేదు. ఈ గొడవ చేసిన కుర్రాళ్లందరికీ ఆల్రెడీ ఉద్యోగాలొచ్చేశాయి. ఎలాగైనా కోచింగ్ ఫీజులు వెనక్కి గుంజాలని వాళ్ల ప్లాన్. బిజినెస్ కోసం అమెరికా వెళితే దేశమొదిలి పారిపోయానని పుకారు పుట్టించారు’, ఇదీ ఆయన వివరణ. నమ్మినోళ్లు నమ్మారు, లేనోళ్లు లేదు. నేను నమ్మాను.

రెండు నెలలు గడిచాయి. పుకార్ల షికారు తగ్గలేదు. ‘కంపెనీ పరిస్థితేం బాలేదు. పీక్కెళ్లటం మంచిది’ అనుకున్న కొందరు బుద్ధిమతులు చెరువు దాటేశారు. మొదటిసారి అవకాశమిచ్చిన సంస్థ, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లటం భావ్యం కాదనిపించింది నాకు. ఓ రోజు వదంతులు నిజమయ్యాయి.  అధినేత ఉద్యోగులందర్నీ సమావేశపరిచి విషణ్ణవదనంతో ‘దురదృష్టవశాత్తూ ఈ ప్రాజెక్టుకి కొనసాగింపు రావటం లేదు. మరోదానిగురించి ప్రయత్నిస్తున్నాం. అందాకా మీకు జీతాలివ్వలేం’ అని అంజలి ఘటిస్తూ తలొంచి రెండు నిమిషాలపాటు మౌనం పాటించాడు.

తర్వాత తలెత్తి, ‘ఐతే మీరెవరూ భయపడనవసరం లేదు. నా సోదరునికో కంపెనీ ఉంది. మనకన్నా పెద్దది. ఆయనకి ఇక్కడన్నూ, అమెరికాలోనున్నూ చాలామంది నిపుణుల అవసరం ఉంది. మిమ్మల్ని ఆయన తీసుకోటానికి సిద్ధంగా ఉన్నాడు. జీతం కూడా మనకన్నా ఎక్కువే’ అని ఓ చల్లని వార్త చెవినేశాడు. సమావేశానంతరం అధినేతనుండి నాతో సహా పన్నెండుమందికి పిలుపొచ్చింది. ‘చూడమ్మా, మనం కూడా అమెరికాలో కన్సల్టింగ్ మొదలు పెడుతున్నాము. మీ పన్నెండుమందీ నా సోదర సంస్థకి వెళ్లకుండా ఉంటే నేనే పంపిస్తాను. మీ దగ్గర పైసా కూడా తీసుకోను. అయితే దీనికి నాలుగు నెలలు పట్టొచ్చు. అప్పటిదాకా శాలరీ మాత్రం ఇవ్వలేను. ఏమంటారు?’ అన్నాడాయన. నలుగురు ‘నో’ అన్నారు, నాతో సహా మిగిలినోళ్లు ‘ఎస్’ అన్నారు. ‘నో’ అన్న నలుగురు, తతిమ్మా నలభైమందీ సోదర సంస్థకి బదిలీ అయిపోయారు. అష్టదిగ్గజాల్లా మేం ఎనిమిదిమందిమే మాతృసంస్థలో మిగిలాం. రోజూ ఆఫీసుకొచ్చి తోచిన సాఫ్ట్‌వేర్ నేర్చుకోవటం తప్ప వేరే పనేదీ ఉండేది కాదు. నెల తిరిగేలోగా పాస్‌పోర్టు తెచ్చుకోవటం, హెచ్-1కి దరఖాస్తు చెయ్యటం జరిగిపోయాయి. మరో నెల గడిచింది. అన్నీ సవ్యంగా జరిగితే మూడు నెలల్లో అమెరికాలో ఉండేవాడిని. అప్పుడు జరిగిందది.

మే పదమూడున ఓ దుర్ముహూర్తాన – పెద్దన్న కళ్లుగప్పి – పోఖ్రాన్‌లో బుద్ధుడు నవ్వాడు. అది ఎగతాళనుకుని ఉడుక్కున్న పెద్దన్న మనదేశమ్మీద ఆంక్షల కొరడా ఝళిపించాడు. పన్లోపనిగా పలురకాల వీసాల జారీ నిలిపేశాడు. దేశంలో వేడెక్కిన రాజకీయం. ఎవడిగోల వాడిది. అంతా గందరగోళం. ‘ఈయన్ని నమ్మితే ముంచేశాడు కదా. సోదర సంస్థలోకెళితే ఇండియాలోనన్నా ఉద్యోగముండేది. అటూ ఇటూ కాకుండా పోయాం’ అని కొందరి నసుగుడు.  ‘పాపం ఆయనేమి చేస్తాడు. ఇక్కడుండాలనేది మన నిర్ణయమేకదా’ అని మరికొందరి నిట్టూర్పు. ఒకరోజు అధినేత మమ్మల్ని పిలిచి చెప్పాడు, ‘మీలో కొందరి హెచ్-1లు వచ్చాయమ్మా. అయితే వీసా వచ్చే అవకాశం లేదు. ఎప్పట్నుండీ ఇస్తారో తెలీటం లేదు. అందాకా నాదగ్గర ఖాళీగా పడుండే బదులు ఏదన్నా ఉద్యోగం వెదుక్కోండి. మంచిరోజులొచ్చాక కబురు చేస్తాను. అప్పుడు మీకిష్టమైతే వీసా తెచ్చుకుని అమెరికా వెళ్లొచ్చు’.

పరిస్థితి మొదటికొచ్చింది. ప్రస్తుతానికి తిండి-నీడ సమస్య లేకపోవటం గుడ్డిలో మెల్ల. మొదటి ఉద్యోగసాధన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో త్వరలోనే మరోటి పట్టుకోగలననే ధీమా ఉంది. దాని ఊతంతో ‘రెడ్డొచ్చె మొదలాడె’ అనుకుంటూ వెంటనే సమరాంగణంలోకి దూకాను.

అప్పట్లో హైదరాబాదులో సత్యం, టిసిఎస్ మాత్రమే పెద్ద ఐటి సంస్థలు. వీళ్లు ఎక్కువగా వై-2కె ప్రాజెక్టులు చేస్తుండేవాళ్లు. వాటికోసం కుప్పలు తెప్పలుగా ఉద్యోగుల్ని తీసుకుంటుండేవాళ్లు. ఆ రెంటికీ ఇంటర్యూలకెళితే కూడబలుక్కున్నట్లు ఒకటే సమాధానం: ‘ఎమ్మెస్సీ, ఎం.ఫిల్? ఊఁహు.. లాభం లేదు తమ్మీ. నువ్వు ఓవర్ క్వాలిఫైడ్. మాక్కావల్సింది జస్ట్ బి.ఎస్సీ వాళ్లు. మీలాంటోళ్లని తీసుకుంటే ఆర్నెల్లలో పెద్దాఫరొచ్చిందని చెక్కేస్తారు’.

ఇవి కాక మరికొన్ని చిన్నా చితకా సంస్థలున్నాయి. అప్పుడప్పుడే మొలకెత్తుతున్నాయవి. వీళ్ల దగ్గరికెళితే లంచాల బేరాలు! ప్రైవేటు సంస్థల్లో లంచాలతో పనుండదనుకున్నా. కానీ అవినీతి ఇక్కడా ప్రత్యక్షం. ఇలాంటిచోట్ల హెచ్.ఆర్ మేనేజర్లని ఇరవయ్యో పాతికో వేలతో బాదితేగానీ పని కాదని విశ్వసనీయవర్గాల భోగట్టా. అంత డబ్బు నాదగ్గరేది? ఉన్నా ఎందుకివ్వాలి?

ఓ వంక వేట ఫలించటంలేదు, మరో వంక వంక గది అద్దె కట్టటం కష్టమైపోతుంది. అనుకోకుండా ఓ రోజు బాల్య స్నేహితులు కొందరు తగిలారు. రాజధానిలో ఉద్యోగవేటకొచ్చిన పక్షులే వీళ్లు కూడా. ‘మా గదిలో జాగా ఉంది. అద్దె కూడా తక్కువే’ అనటంతో వెంటనే వాళ్ల దగ్గరకి మారిపోయాను. అలా ఆ సమస్య తీరింది కానీ ఉన్న డబ్బు ఐపోవస్తుండటంతో మళ్లీ డైటింగ్ మొదలెట్టక తప్పలేదు. ఈ గొడవలో ఉన్నా అడపాదడపా నా హెచ్-1 సంగతి కనుక్కుంటూనే ఉన్నాను. అదేమిటో కానీ, మిగతా ఏడుగురికీ హెచ్-1లు మంజూరయ్యాయి, నాకు మాత్రమే ఇంకా కాలేదు. వీసా సంగతెలా ఉన్నా, అసలు హెచ్-1 వస్తుందో రాదో తెలీని పరిస్థితి.

ఒకరోజు కాస్త పేరున్న కంపెనీ ఒకదాన్లో యునిక్స్ మరియు డాటాబేస్ డెవలపర్ ఉద్యోగాలున్నాయంటే ఇంటర్వ్యూకి బయల్దేరాను. వాళ్లకి కావలసినవన్నీ నాకు తెలిసుండటం, కాస్తో కూస్తో అనుభవం కూడా ఉండటం వల్ల నాకిది తప్పకుండా వస్తుందనే నమ్మకం. కానీ అలవాటులేని ‘రన్నింగ్ బస్’ ఎక్కే పని చెయ్యబోతూ జారిపడి ఆ అవకాశం పోగొట్టుకున్నా. అయితే బస్సు చక్రం కింద పడాల్సిన వాడిని అదృష్టవశాత్తూ చిన్నపాటి దెబ్బలతో తప్పించుకున్నాను. ‘ఉద్యోగం కోసం ప్రాణాలకు తెగించాలా?’ అనిపించిందప్పుడు. మళ్లీ ఎప్పుడూ అలాంటి సాహసాలు చెయ్యలేదు.

మరోసారి శ్రీవెన్ కంప్యూటర్స్ అనేదాంట్లో టన్నులకొద్దీ ఉద్యోగాలున్నాయంటే పరిగెత్తుకెళ్లాను. వాళ్లు రాత పరీక్ష పెడుతున్నారు. నేనూ కూర్చుని రాశాను. అరగంట మిగిలుండగానే అన్నిటికీ సమాధానాలు రాసేసి బయటికొచ్చి లాబీలో కూర్చున్నాను. పరీక్ష తప్పకుండా పాసవుతానని నమ్మకం. ఐదు నిమిషాల్లో లోపల్నుండి పిలుపొచ్చింది. గదిలో ముగ్గురున్నారు – హెచ్.ఆర్ మేనేజర్లట. నేను లోపలికెళ్లగానే తలుపు మూసి గడె పెట్టి గద్దించటం మొదలుపెట్టారు, ‘ఏదీ పేపరు?’ అంటూ.

మొదట వాళ్ల గోలేంటో అర్ధం కాలేదు. మెల్లిగా బోధ పడింది. పరీక్ష పేపరు లీకయిందట -అరగంట ముందే వెళ్లిపోయాను కాబట్టి నేనే దాన్ని తీసుకెళ్లానని అనుమానం. ‘ఇదేమన్నా ఎం.సెట్ పేపరా లీక్ చేసి అమ్ముకోటానికి? ఉద్యోగం కోసం వచ్చినవాడిని పేపర్ లీక్ చేసి నా నోట్లో నేనే ఎందుకు మట్టికొట్టుకుంటాను?’ – ఇవి నా లాపాయింట్లు. అయితే నా లాజిక్ ఎవడికి కావాలి. ముగ్గురూ కలిసి మీదకొచ్చి నేనే లీక్ చేసినట్లు ఒప్పుకుని ఆ సంగతి కాగితమ్మీద రాసి సంతకం పెట్టాలని ఒత్తిడి చెయ్యటం మొదలెట్టారు. అప్పటికే వాళ్లో కాగితమ్మీద క్షమాపణ పత్రం లాంటిదొకటి అచ్చేయించి సిద్ధంగా పెట్టుకునున్నారు. ‘సంతకం పెడితే క్షమించి ఒదిలేస్తాం, లేకపోతే నిన్ను హైదరాబాదులో ఏ కంపెనీ కూడా ఉద్యోగంలోకి తీసుకోకుండా బ్లాక్ లిస్టులో పెడతాం’ అని బెదిరింపు. పల్నాటిపౌరుషం ఉండనే ఉందికదా. వళ్లు పైనుండి కిందిదాకా మండింది. తలెగరేసి, ‘మీ చేతనయింది చేసుకోండి’ అని చెప్పి వచ్చేశాను. కొన్నాళ్ల తర్వాత పేరువెల్లడించటానికి ఇష్టపడని ఓ లోపలి వ్యక్తి ద్వారా అందిన ఉప్పు – పేపర్ లీక్ చేసింది సదరు హెచ్.ఆర్ మేనేజర్లే! అది బయటపడేసరికి దాన్ని కప్పెట్టటానికి ఓ బకరాని తెచ్చి బలివ్వటానికా ప్రయత్నం. వాళ్ల ఖర్మకాలి బకరా బదులు నేను దొరికాను. ఆ ముగ్గురి ఉద్యోగాలూ ఊడాయి-ట. ఇందులో నిజానిజాలు అల్లాకెరుక. నాకు మాత్రం అదో వింత అనుభవం.

అలా ఆగస్టొచ్చింది. పంద్రాగస్టు వెళ్లిన మర్నాడు అధినేతనుండి కబురొచ్చింది. ‘గుడ్ న్యూస్, వీసాలొస్తున్నాయమ్మా’ అని మిగతా ఏడుగురికీ చెప్పి నాకేసి తిరిగి ‘సారీ, నీ హెచ్-1 ఇంకా రాలేదు’ అన్నాడు విచారంగా. ‘అయితే, తప్పకుండా వస్తుందనే నమ్మకం నాకుంది. నువ్విక ఉద్యోగాల వేట ఆపెయ్యి’ అని కూడా అన్నాడు. ఆయన నమ్మకాన్ని నేనూ నమ్మాను. ఏడాదికి పైగా చేసిన పోరాటాల్లో అలసిపోయానేమో, ప్రస్తుతానికి మరేమీ చేసే శక్తి లేదెటూ. ఇక వేట చాలించి పెట్టే బేడా సర్దుకుని ఇంటికెళ్లిపోయాను.

డిసెంబర్లో శుభవార్తొచ్చింది – ఎట్టకేలకి హెచ్-1 మంజూరయ్యిందంటూ. ఉన్నపళాన మద్రాసెళ్లి వీసా తెచ్చుకోమని అధినేత ఫోన్ చేశాడు. తర్వాత రెండు నెలలు చక చకా గడిచిపోయాయి. ఓ ఫిబ్రవరి ఉదయాన బేగంపేట నుండి మంచుపొరల్ని చీల్చుకుంటూ పడమటి దిక్కుగా పైకెగసిందో లోహవిహంగం – నన్నూ నా కలల్నీ మోస్తూ, పసిఫిక్ తీరాన మరో బతుకాటకి తెర తీస్తూ.

(సమాప్తం)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.