(సంవత్సరం క్రితం)
ఉడుత, మృగవీర వంటి హిట్ సినిమాల తర్వాత యువనటుడు జిగాస్టార్ రాజ్ కిరణ్ తేమ్ నటిస్తున్న మూడవ సినిమా ఈ రోజు మిట్టమధ్యాహ్నం అట్టహాసంగా ఆస్ట్రేలియాలో ప్రారంభమయింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు వెల్లడించటానికి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్మాత యోగేంద్రబాబు మాట్లాడుతూ ‘అన్నయ్యతో చెప్పుకోదగ్గ హిట్ సినిమా తీయలేకపోయిన లోటు ఈ సినిమాతోనైనా తీరుతుందేమో’ అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడే షాట్ గ్యాప్‌లో అటుగా వచ్చిన కిరణ్ తేమ్ పళ్లు పటపటలాడిస్తూ కెమెరాలోకి మొహం పెట్టి కళ్లెర్రజేసి చూస్తూ ‘బాబాయ్ కోరిక కనీసం నేనైనా తీర్చి తీరాలన్న కసితో ఈ సినిమా చేస్తున్నా’ అంటూ, తర్వాతి షాట్‌కి పిలుపు రావటంతో వడివడిగా వెళ్లిపోయారు. ఆ పిదప విలేకరుల ప్రశ్నలకు యోగేంద్రబాబు విపులంగా సమాధానాలిచ్చారు.
తెలుగులో యువదర్శకులెందరో ఉండగా తాజాగా గొరుగు వంటి కళాఖండం తీసి నిర్మాత గుండె రాజుకి నిండు క్షవరం చేసిపెట్టిన తమిళ తంబి తుస్‌కారన్‌ని ఏరికోరి ఈ సినిమాకి దర్శకుడిగా ఎంచుకోవటానికి కారణమేమై ఉంటుందని ఆరాతీసిన పాత్రికేయులకి ఆయన ‘ఒక్క ఫ్లాప్‌తో దర్శకుడి సత్తాకి వెలకట్టలేం. తుస్‌కారన్ గుండె రాజుకి గుండు గొరగక ముందు కునారిల్లుతో బాక్సాఫీసు బూజు దులిపిన విషయం అప్పుడే మర్చిపోతే ఎలా’ అని గుర్తు చేశారు. తానెప్పుడూ దర్శకుల నిర్మాతననీ, అందుకే కేవలం దర్శకుడి మీద ఉన్న నమ్మకంతోనే కథ పేరు మాత్రమే విని ఈ సినిమా నిర్మించటానికి ముందుకొచ్చానని యోగేంద్రబాబు అన్నారు.
ఆ తర్వాత చర్చ తాజా చిత్రం టైటిల్ మీదకి మళ్లింది. ‘అనేక పేర్లు పరిశీలించిన తర్వాత మా దర్శకుడు చెప్పిన కథకి పుచ్చకాయ అనే పేరైతే అన్నివిధాలా సరిపోతుందని ఆ పేరే ఖాయం చేశామని యోగబాబు చెప్పారు. ‘పేరు మాత్రమే విని నిర్మించటానికి ముందుకొచ్చాను’ అన్నవాక్యానికీ, దీనికీ పొంతన కుదరక తికమక పడ్డ ఒకానొక పాత్రికేయుని ప్రశ్నకి ఆయన సమాధానం దాటవేశారు. ఇందులో హీరో పాత్ర పేరు సచిన్ కావటంతోనూ, ఇదో భిన్నమైన ప్రేమ కథ కావటంతోనూ ఈ సినిమాకి ఉప శీర్షికగా ఓ సచ్చినోడి లవ్ స్టోరీ అనేది యాప్ట్‌గా ఉంటుందని అదే నిర్ణయించామన్నారు. ట్యాగ్‌లైన్‌నిబట్టి చూస్తే ఈ సినిమాలో కథానాయకుడు రికామీగా తిరిగే కుర్రాడై ఉంటాడని తెలుస్తుంది. మరి ‘మృగవీర’ ద్వారా కిరణ్ బాబుకి వచ్చిపడ్డ ఇమేజ్‌కి ఈ తరహా పాత్ర సరిపోతుందా అన్న ప్రశ్నకి నిర్మాత స్పందిస్తూ ‘అన్ని రకాల పాత్రలూ తోమితేనే నేనీనాడు ఇంతవాడినయ్యాను అని అన్నయ్య ఎప్పుడూ చెబుతుంటారు. ఆయన చూపిన బాటలోనే చిన్నారి కిరణ్ కూడా నడవాలనుకుంటున్నాడు. అందుకే తుస్‌కారన్ చెప్పిన ఈ ప్రేమకథ వినకుండానే ఒప్పుకున్నాడు’ అని విశదీకరించారు. ఇదే సందర్భంగా ఆయన ‘ఇందులో కిరణ్‌బాబు రికామీయే కాదు, బికారీ కూడా. అదే ఈ సినిమాలో విభిన్నత’ అని వెల్లడించారు. పుచ్చకాయ బడ్జెట్ పాతికకోట్ల పైమాటే అని వస్తున్న వదంతుల్ని ఉటంకిస్తూ ‘పేదవాడి ప్రేమకథకి పాతిక కోట్లా?’ అని ఓ పాత్రికేయుడు అడగ్గా ఆయన ‘మృగవీర వంటి సినిమా తర్వాత వస్తున్న కిరణ్‌బాబు సినిమా మీద మా జిగా ఫేమిలీ అభిమానుల్లో ఉండే అంచనాలే వేరు. అవందుకోవాలంటే ఆ మాత్రం ఖర్చుండాల్సిందే. అందుకే ఎంత ఖర్చైనా వెనుకాడకుండా సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తాం’ అని వివరించారు. ఆస్ట్రేలియాలో మాత్రమే కాకుండా కథానుసారం అంగారక గ్రహమ్మీద కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నామని ఓ అనుబంధ ప్రశ్నకి బదులుగా చెప్పారు. అంతటితో పాత్రికేయ సమావేశం ముగిసింది.
అంబలి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత యోగేంద్రబాబు సమర్పిస్తున్న పుచ్చకాయకి దర్శకత్వం తుస్‌కారన్. రాజ్ కిరణ్ తేమ్ మూడవ సినిమాగా భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా కుమారి తింగరి బుచ్చి నటిస్తుండగా, హాస్యనటుడు పరమానందం ఓ ప్రధాన పాత్ర ధరిస్తున్నారు. ఆస్ట్రేలియాలోనూ, అంగారక గ్రహమ్మీదా ఆఘమేఘాల మీద షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు రానుంది.
(ప్రస్తుతం)
ఏడాది పైగా నిరవధికంగా షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకి ఈ మధ్యనే విడుదలైన పుచ్చకాయ బాక్సాఫీసు వద్ద బుడగలా పగిలిపోయిన నేపధ్యంలో, ఆ సినిమా అందించిన అనుభవాన్ని గూర్చి ప్రశ్నించిన విలేకర్లతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ దర్శకుడు తుస్‌కారన్ మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిర్మాత యోగబాబు. రామజౌళి రూపొందిస్తున్న ‘దోమ’ ప్రారంభ వేడుకల్లో పాలుపంచుకోవటానికి విచ్చేసిన ఆయన తుస్‌కారన్‌ని కడిగిపారేశారు. కనీసం కథేమిటో చెప్పకుండానే తననీ, తమ హీరో కిరణ్‌తేమ్‌నీ దర్శకుడు ఎలా బురిడీ కొట్టించిందీ ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. ఓ పేదవాడి ప్రేమకథని సినిమాగా తీయటానికి పాతిక కోట్లు ఖర్చెందుకవుతుందని దర్శకుడిని నిలదీశారు. కథకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఆస్ట్రేలియాలోనూ, అంగారకుడి మీదా షూటింగ్ చేయించటాన్ని యోగబాబు తీవ్రంగా అధిక్షేపించారు. దర్శకుల మితిమీరిన ధోరణులే తెలుగు సినిమారంగాన్ని నిలువునా ముంచుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరమానందం వంటి ప్రతిభావంతుడిని జఫ్ఫాశాస్త్రిగా రొడ్డకొట్టుడు పాత్రలో చూపించటం దర్శకుడి చేతగానిదనానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెరమీదా, తెర వెనుకా కథానాయిక కుమారి తింగరి బుచ్చి ప్రదర్శించిన విన్యాసాలు కూడా సినిమా పరాజయానికి పరోక్షంగా కారణభూతాలయ్యాయని ఆయన చెప్పారు. పిచ్చాపాటీ ముగిస్తూ, సినిమా ఎలా ఉన్నా కిరణ్ తేమ్ నటన మాత్రం ప్రేక్షకుల మతులు పోగొడుతున్న విషయం మరోమారు గుర్తు చేశారు.
మీ మాట