‘మంగుళూరు పబ్‌లో రామదండు దాడి చేసి అక్కడ తాగి తందనాలాడుతున్న వాళ్లని – ముఖ్యంగా అమ్మాయిలని – చితక్కొట్టింది’, నిన్నటి వార్త. దీని గురించి దేశమంతా మీడియాలో గగ్గోలు. ఎవరి ప్రతిభకు తగ్గట్లు వాళ్లు సంచలనాత్మక శీర్షికలు పెట్టి ఊదరగొట్టేశారు. దృశ్య మాధ్యమాల్లోనైతే చెప్పక్కర్లేదు. దాడి వీడియోని తిరగా మరగా వేసి చూపిస్తూ తెగ బాధపడిపోయారు. అందరిదీ ఒకే మాట: ‘మంగళూరులో దారుణం’. కొన్ని టీవీ ఛానళ్లైతే మరీ ముందుకెళ్లి ‘హారర్ ఇన్ మంగళూర్’ అని పేరు పెట్టేసి ప్రసారం చేశాయీ వార్తని – ఇదేదో బొంబాయి మీద తీవ్రవాదుల దాడంత ఘోరమైన సంఘటనలా చిత్రీకరిస్తూ! ఇది జరిగిన రోజే మన రాష్ట్రంలో ప్రేమ పేరుతో రెండు దాడి సంఘటనలు జరిగాయి. ఇలాంటివి ఈ మధ్య కాలంలోనే మరెన్నో జరిగాయి. వాటి గురించెప్పుడూ జాతీయ మీడియా ఇంత హడావిడి చేసిన పాపాన పోలేదు. పేజ్-3 విషయాల్లోనూ, తాజ్ హోటల్ ఘోరంలోనూ ఉన్న ఆకర్షణ వీటికెక్కడిది మరి?
పట్టణ ప్రజానీకంలో మంగళూరు ఘటనపై తలో మాట. ‘స్వతంత్ర దేశంలో ఎవరిష్టమొచ్చినట్లుగా ఉండే హక్కు వారికుంది. మోరల్ పోలీసింగ్ చెయ్యటానికి వాళ్లెవరు?’ అన్నది విమర్శకుల సూటి ప్రశ్న. మంచి ప్రశ్నే. ‘అలనాడు సారా వ్యతిరేకోద్యమంలో ఊరూ వాడా స్త్రీలంతా ఏకమై కల్లు బట్టీలు ధ్వంసం చేసినప్పుడు జైకొట్టిన నోళ్లే ఇప్పుడు నాలుక మడతేసి పబ్‌పై దాడిని ఖండిస్తున్నాయి. రెండు చోట్లా జరిగేది తాగి తందనాలాడటమే. ఒక చోట ఒప్పైన దాడి మరో చోట తప్పెలా అయింది? తేడా ఎక్కడ?’ – లాంటివి చొప్పదంటు ప్రశ్నలు. ‘ఇదే రామదండు హైదరాబాదు పాతబస్తీలో ఏ కల్లుపాకపైనో దాడి చేస్తే – అప్పుడూ మీడియా వైఖరి ఇలాగే ఉంటుందా? దాన్నీ ‘దారుణం’ అంటారా లేక ‘చిన్న సంఘటన’గా సరిపెడతారా? అప్పుడు ఈ విమర్శకుల గళాలు మరోలా ఉండేవా?’ – ఇవి నాలాంటి మధ్యేవాదుల కొసరు ప్రశ్నలు. భారతీయత విషయంలో కాషాయ దండుకి పేటెంట్లిచ్చేసిన వర్గమొకటి ఇప్పుడు పబ్బుల మీద వాళ్లు దాడి చేస్తే ఉలిక్కి పడుతుంది. మొత్తానికి – ‘మాదాకా రాకపోతే సంస్కృతి పరిరక్షణ పేరుతో ఎవరెలా పెట్రేగినా ఫర్వా నై, కావలిస్తే కూసింత నైతిక మద్దతూ అందిస్తాం’ అనుకునే గుణం పేరుకుపోయిన కొందరిలోనైనా చిన్నపాటి కలవరం – ‘పేనుకు పెత్తనమిచ్చామా’ అన్న శంక.
అసలు కధలోకొస్తే – మంగుళూరు సంఘటనలో తప్పెవరిదన్న విషయంలో భిన్నాభిప్రాయాలు. ఇటువంటి ప్రతి సంఘటనలోనూ ఉన్నట్లే – ఇక్కడ తప్పు రెండు వర్గాలదీ. పులిని చూసి వాతలు పెట్టుకున్నట్లు అడ్డగోలుగా పాశ్చాత్య పోకడలు పోవటమే స్వేఛ్చ అనుకునే అబ్బాయిలూ, వాళ్లకి దీటుగా చెడిపోవటమే సమానత్వమనుకునే అమ్మాయిలూ, ఇలాంటోళ్లని దారిలో పెట్టటానికి భౌతిక దండనే దారనుకునే అతివాద మూకలూ .. వీళ్లు భావి భారత నిర్మాతలు! విశృంఖలతకి స్వేఛ్చ అనే పేరు తగిలించుకునే వాళ్లు కొందరు, రాముడి పేరుతో అరాచకాలకి తెగబడేవాళ్లు మరికొందరు. వీళ్ల దారులు కలవనంతవరకూ గొడవే లేదు. ఒకరికి ఒకరు అడ్డొచ్చినప్పుడే భీభత్స రసం. మంగళూరు ఘటనలో నాకైతే మంచే కనిపిస్తుంది. ఇలాంటి దాడులు సమర్ధనీయమని దానర్ధం కాదు. కనీసం ఈ ఘటన వల్లనైనా దేశమంతా యువతలో పెరిగిపోతున పబ్ కల్చర్, ఆధునికత ముసుగులో పొడుచుకొస్తున్న పెడపోకడలపై అంతో ఇంతో చర్చ జరిగే అవకాశముంది. అదే సమయంలో, కాషాయ దళాలకి పెత్తనమివ్వటమంటే తాలిబాన్ తరహా పద్ధతులకి తలుపులు తెరవటమేనన్న విషయమూ అవగాహనలోకొచ్చేలా చేసిందీ ఘటన. ఆ మేరకు రాముడే ఏదో తారకమంత్రమేసినట్లున్నాడు.
మీ మాట