జనవరి, 2010ను భద్రపఱచు

ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 6

ఆరో అబద్ధం:

నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య

ఇదీ నిజం:

భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ దుర్ఘటన జరిగి పాతికేళ్లు దాటిపోయింది. అందులో మృతి చెందినవారి సంఖ్య దాదాపు పాతిక వేలు. ఆ విషవాయువుల ధాటికి వివిధ జన్యు సంబంధిత రోగాల బారిన పడ్డవారి సంఖ్య రమారమి ఐదు లక్షలు! అంత దారుణ దుర్ఘటన జరిగి ఒక తరం గడిచిపోయినా, ఆ బాధితులకి ఇప్పటికీ న్యాయం జరగలేదు. కారణం? మన దేశంలో చట్టాలు చట్టుబండలయ్యాయి కాబట్టి, ప్రభుత్వాలు అంత పసందుగా పని చేస్తాయి కాబట్టి. మన వ్యవస్థ కుళ్లిపోయింది. దానితో పాటే అది పుట్టించే నాయకులూనూ. అలాంటి వారికి సమస్యల నిజ పరిష్కారాలు వెదకటం కన్నా, వాటిని పెంచి పోషించటం, పనిలో పనిగా కొత్త సమస్యలు పుట్టించటం, తర్వాత తీరుబడిగా వాటిని తమ స్వలాభాలకి వాడుకోవటం ముఖ్యం. శవాల మీద చిల్లరేరుకునే రాజకీయవేత్తలు మనకి కొత్త కాదు. వాళ్లకి మేధావిగణాలు సైతం వంత పాడటం మన రాష్ట్రంలో మొదలైన వింత.

తాగు నీటిలో ఫ్లోరిన్ ప్రమాదకరమైన మోతాదులో (1.5 mg/l కన్నా ఎక్కువ) ఉంటే వచ్చే జబ్బు ఫ్లోరోసిస్. పంటి జబ్బుల నుండి ఎముకలు క్షీణించటం దాకా పలు రకాల వ్యాధులు దీనివల్ల వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ నివారించాల్సినవే కానీ, నయం చెయ్యలేని జబ్బులు. పారిశ్రామిక వ్యర్ధాలు భూగర్భ జలాలనీ, నదీ జలాలనీ కలుషితం చెయ్యటం నీటిలో ఫ్లోరిన్ శాతం పెరిగిపోవటానికి ప్రధాన కారణం. సాధారణంగా నిరుపేదలే ఫ్లోరోసిస్ బారిన పడటం కద్దు. ఇటువంటి వారి సంఖ్య ఒక్క నల్లగొండ జిల్లాలోనే లక్షల్లో ఉందనేది నివేదికలు నిగ్గుదేల్చిన నిజం. దశాబ్దాలుగా ఆ వ్యాధిగ్రస్తుల వేదన అరణ్య రోదనే ఔతుందన్నదీ నిజం.

ఈ సమస్య వేర్పాటువాదులకి వరంలా సిద్ధించిందన్నది వీటన్నిట్నీ మించిన నిఖార్సైన నిజం. నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య అపరిషృతంగా ఉండటం వీళ్ల పంట పండించింది. అసలు సమస్య పరిష్కారం విషయంలో వీళ్లకి చిత్త శుద్ధే ఉంటే, తెలంగాణపై వీళ్లకి నిజమైన ప్రేమే ఉంటే ఆ సమస్య ఇప్పుడింత తీవ్రంగా ఉండేదే కాదు. కానీ సమస్యల్లేకపోతే వీళ్ల పబ్బం గడిచేదెలా? అవలా ఏళ్లూ పూళ్లూ సాగటమే వీళ్లకి ముద్దు. ఎంచక్కా దాన్నీ పక్కోళ్ల మీదకి నెట్టేసి, వివక్షాభియోగాలు సంధించి, తెలంగాణవాసుల్ని రెచ్చగొట్టేసి తమ పన్లు కానిచ్చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతుందదే.

నల్లగొండలో ఫ్లోరోసిస్‌కీ ఆంధ్రోళ్లే కారణమట! మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టటం కన్నా విచిత్రమైన విషయమిది. ఇన్నేళ్లలో తెలంగాణకి అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ ప్రాతినిధ్యమే లేదా? నల్లగొండ ఫ్లోరోసిస్ గురించి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పోరాట్టానికి ఆంధ్రా, సీమల ప్రజా ప్రతినిధులే తెలంగాణకి దిక్కయ్యారా? ఇంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ఏకంగా ఓ ప్రధానమంత్రి సైతం తెలంగాణ ప్రాంత నుండి వచ్చారు. వాళ్లందరూ ఫ్లోరోసిస్ విషయంలో చేతులు కట్టుక్కూర్చున్నారా? వాళ్లని నిలదీయాల్సిన వేర్పాటువాదులు ఆ తప్పునీ ఆంధ్రోళ్ల మీదకి నెట్టటం – వాళ్ల స్వభావానికి తగ్గట్లే ఉంది. సాక్షాత్తూ వేర్పాటువాదుల్లోనే మంత్రి పదవులు వెలగబెట్టిన మహానుభావులున్నారు. తమ తమ పదవీకాలాల్లో నల్లగొండ ఫ్లోరోసిస్ విషయంలో వాళ్లేం ఊడబొడిచారో అడిగేవారు లేరు, చెప్పేవారూ లేరు.

ఇంతకీ, ఈ ఫ్లోరోసిస్ అనేది నల్లగొండకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ప్రపంచంలో పాతిక పైగా దేశాల్లో ఉన్న సమస్యిది. మన దేశంలో ఇరవై రాష్ట్రాలు ఫ్లోరోసిస్ బారిన పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే, పందొమ్మిది జిల్లాల్లో ఫ్లోరోసిస్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వాటిలో నల్లగొండ ఒకటి. ఫ్లోరోసిస్ కేసుల్లో నల్లగొండకి దీటైనది ప్రకాశం – ‘ఆంధ్రోళ్ల’ జిల్లా. నిజానికి, ప్రపంచంలో మొట్టమొదటి ఎముకల/నరాల సంబంధిత ఫ్లోరోసిస్ కేసు వెలుగు చూసిందే ప్రకాశం జిల్లాలో – 1937లో. అప్పట్నుండీ ప్రభుత్వాలెన్ని మారినా ఆ సమస్య ఏ ఏటికాయేడు పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గింది లేదు. దానిక్కారణం ఓ పక్కనున్న తెలంగాణవాళ్లో, మరో పక్కనున్న రాయలసీమ వాళ్ళో అని ప్రకాశంవాసులు అనలేదే. తెలంగాణ వేర్పాటోద్యమాల పుణ్యాన నల్లగొండ ఫ్లోరోసిస్‌కి దేశవ్యాప్త గుర్తింపొచ్చింది కానీ, ప్రకాశం జిల్లాకి ఆ భాగ్యమూ లేదు. ఆ వారా, నల్లగొండ ఫ్లోరోసిస్ బాధితులకి అంతోయింతో సహాయమన్నా అందింది. ప్రకాశం బాధితుల గోడెవరు వినేది? వాళ్లే కాదు, మిగిలిన జిల్లాల బాధితుల దుర్గతీ అదే. వాటిలో తెలంగాణ జిల్లాలూ ఉన్నాయి. వేర్పాటువాదులకి తక్కిన తెలంగాణ జిల్లాల బాధ పట్టదు. నల్లగొండలో ఫ్లోరోసిస్ కేసులెక్కువ కాబట్టి, వీళ్ల నాటకాలకి అక్కడ రాలే చిల్లర ఎక్కువ కాబట్టి, ఎంతకీ నల్లగొండ ఫ్లోరోసిస్ గురించే గొంతు చించుకుంటారు, ఆ వంకతో ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు. రేపు తెలంగాణ ఏర్పడితే అప్పుడు మిగతా జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్య ముందుకు తెచ్చి మరో రాష్ట్రం కావాలనటానికి ముందస్తు జాగ్రత్తగా అటక మీద దాచుకుంటున్న అస్త్రమన్న మాట.

ఫ్లోరోసిస్ సంగతి పక్కన పెడదాం. మన రాష్ట్రంలో ఆరోగ్య సంబంధిత సమస్యల్లేనిదెక్కడ? మన్యంలో ఏటా విష జ్వరాల బారిన పడి మట్టిలో కలిసిపోయేవాళ్లెందరు? పోషకాహార లోపంతో పుట్టుకలోనే అవకరాల బారినపడే పిల్లల్లేని జిల్లాలు రాష్ట్రంలో ఎన్ని? వీటన్నిటికీ పక్క జిల్లాల మీదనో, ప్రాంతాల మీదనో పడి ఏడవటంలో ఔచిత్యమెంత? అలా ఏడిస్తే బాధితులకి నికరంగా ఒరిగేదేంటి? సమస్యలకి నిజమైన పరిష్కారాలు వెదక్కుండా పిడుక్కీ బిచ్చానికీ ఒకే మంత్రమంటూ ప్రతిదానికీ ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమనే పాట పాడటం ఎవరి ప్రయోజనం కోసం?

ప్రాంతాలకు ప్రాంతాలే దారుణమైన వ్యాధులకి గురౌతున్నా ప్రభుత్వాల్లో చలనం ఉండకపోవటం దేశవ్యాప్తంగా అతి మామూలైన విషయం అనేదానికి భోపాల్ సంఘటన ఓ తిరుగులేని రుజువు. ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ జిల్లా మాత్రమే రోగాలతో బాధపడుతున్నట్లూ, దానికి కారణం ఆంధ్రా/సీమ వాసులన్నట్లూ చిత్రీకరించటం వేర్పాటువాదుల అతి తెలివికి నిదర్శనం. ఈ అబద్ధాన్ని అత్యంత పకడ్బందీగా ప్రచారం చేసే కుహనా మేధావులు వాళ్లకి తోడవటం తెలుగు జాతి ఖర్మం. అభివృద్ధి, సంస్కృతి, భాష, ఉద్యోగాలు .. కాదేదీ వేర్పాటుకనర్హం. ఆఖరికి జబ్బులు కూడానా!

(సశేషం)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,834

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.