ఆగస్ట్, 2009ను భద్రపఱచు

భౌభౌ

పలు బ్లాగుల్లో మతాధార రిజర్వేషన్ల గురించిన రచ్చ రగులుతుంది. ఇంతకు ముందు ఇలాంటి సందర్భాల్లో జరిగిన రక్తపాతంతో పోలిస్తే ఇప్పుడు చాలావరకూ ప్రశాంతంగానే చర్చలు నడుస్తున్నట్లు లెక్క. ఐనా ఎంతో కొంత ఉద్రిక్త వాతావరణముంది. దాన్ని తగ్గించటానికి, కాసేపు అందరి దృష్టీ మళ్లించటానికీ నా ఈ చిన్న పోస్టు. పైగా, నేనో సరదా టపా రాసి చాన్నాళ్లయింది; నాళ్లేమిటి, నెలలే అయింది. పనిలో పనిగా ఆ లోటు తీర్చటానికీ ఈ పోస్టనుకుందాం. ఇది సరదా పోస్టు మాత్రమే, హాస్య పోస్టు కాదు (ఆ రెంటికీ తేడా ఏమిటో?)

తెలుగు బ్లాగర్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఒకే విషయమ్మీద పుంఖాను పుంఖాలుగా రాసేవారు కొందరు, కనపడ్డ ప్రతి విషయమ్మీదా రాసేవారు కొందరు, ఖండఖండాలుగా రాసేవారు కొందరు, ఏకాంకికలే రాసేవారు కొందరు, ప్రత్యేక అజెండాలతో రాసేవారు కొందరు, జెండాలు భుజానేసుకు రాసేవారు కొందరు, బ్లాగంటూ ఉన్నాక రాయాలి కాబట్టి రాసేవారు కొందరు, కవితలూ రాసేవారు కొందరు, కవితలే రాసేవారు కొందరు .. మొత్తమ్మీద అందరూ ఏదో ఒకటి రాసేస్తూ బ్లాగుల్ని కళకళలాడిస్తుంటారు. టపాలు రాయటంలో ఎవరి శైలి వారిది. వాటికి శీర్షికలు పెట్టటంలోనూ ఎవరి శైలి వారిదే. వీళ్లందరికీ ఒకే అంశం (కుక్క) ఇచ్చి దానిపై ఓ టపా రాయమంటే ఎవరు ఎలాంటి శీర్షిక పెడతారు అన్న ఆలోచన ఈ టపాకి ప్రేరణ.

కింద వరుస క్రమానికి ఏ ప్రత్యేకతా లేదు. నాకు గుర్తొచ్చిన క్రమంలో రాశాను. ఈ జాబితాలో ఉన్నవారేదో పేద్ద ప్రముఖ బ్లాగర్లు, తతిమ్మా వారు కాదు అని కూడా కాదు. నిజానికి, ఈ జాబితాలో లేనివారు ఏ మూసలోనూ అంత తేలిగ్గా ఒదగరు. ముఖ్యంగా – కవితారాధన చేసే చాలామంది మహిళా బ్లాగర్లు, బొల్లోజు బాబా గారు మొదలైనవారు. అందుకే వాళ్ల జోలికి వెళ్లలేదు.

ముందే చెప్పినట్లు, ఇదంతా సరదాకి మాత్రమే. చదివి, నవ్వొస్తే నవ్వుకోండి. లేకుంటే మర్చిపోండి. వీలైతే మీరూ చేతనైనన్ని శీర్షికలు జోడించండి. ఎవరినీ నొప్పించే వ్యాఖ్యలు మాత్రం చేయకండి.

అమ్మఒడి: మన సంస్కృతిపై నకిలీ కణికుడి కుట్ర – కుక్కల పాత్రకి ఆధారాలు-2314
తేటగీతి: భైరవద్వీప రహస్యం-132
డా. ఆచార్య ఫణీంద్ర: శునక శతకము (తొంబదియారవ భాగము)
ప్రమాదవనం: ఎనభయ్యారో నంబరు ప్రమాద సూచిక – కన్సాస్ కుక్కటేశ్వర్రావుగారితో తుంటర్వ్యూ
రేరాజ్ రివ్యూస్: పిచ్చి కుక్కలు కరిచేముందు తెలుగులో ఆలోచిస్తాయా?
చాకిరేవు: పగలదీస్తామంటూ బీరాలు పలుకుతూ వచ్చి కుక్కలరిస్తే పంచెలెగ్గట్టి పరుగుతీశారట బావామరుదులు
ఏ టు జెడ్ డ్రీమ్స్: ఆర్జీవీ డైరెక్షన్లో రామ్‌చరణ్ హిందీ సినిమా ‘శునక్’
చదువరి: కుక్కకాటు బాధితుల రహస్య సమావేశం
కలగూరగంప: ఎవడన్నాడు కుక్కలకు దేశభక్తి ఉండదని
నా ప్రపంచం: కుక్కల్లో నాస్తికత్వం
హరిసేవ: శునక శుశ్రూష ద్వారా స్వర్గారోహణ భాగ్యం
పర్ణశాల: కులవాదం Vs కుక్కలవాదం
అంతర్యానం: లౌకిక కుక్కలా, లేకి కుక్కలా. కిల్ దెమ్ ఆల్
రెండ్రెళ్లారు: కుక్క కాట్లకు చెప్పు దెబ్బలు
బ్లాగాడిస్తా: దాన వీర శూర శునక
శరత్ కాలం: కుక్కల్లో స్వ.సం. (ఓ మనో వైజ్ఞానిక రచన)
నరసరావుపేట్రియాట్స్: నర్షాపేట్లో కుక్కల లెక్కలు
నెల్లూరు బ్లాగుల సముదాయం: నెల్లూరులో కుక్కల అందాల పోటీలు
కాల్పనికలోకం: సినిమాలోకం!!:: మన!! సినిమాల!! జయాపజయాల్లో!! కుక్కల!! పాత్ర!!
టాలీవుడ్ ఫొటో ప్రొఫైల్స్: ‘గోదావరి’ డాగ్, ‘Godavari’ Dog
జురాన్: హాలీవుడ్ కుక్క – టాలీవుడ్ కుక్క
జీడిపప్పు: అమెరికాలో కుక్కల దర్జా
తెలు-గోడు: భౌభౌ
మనిషి-మనసులో మాట: ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి
కొత్తపాళీ: ఊరకుక్కల కబుర్లు – ఏప్రిల్ 26
నలభీమపాకం: మీ కుక్క కోసం బొక్కల చారు
మారుతీయం: శునకం స్వగతం
అయ్యస్పీ అడ్మిన్ మార్తాండ: శ్రీకాకుళంలో మా ఇంటి పక్క వీధిలో ఒక కుక్క ఐదు పిల్లలు పెట్టింది


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.