జూన్, 2011ను భద్రపఱచు

అసహజం

హామీ నెరవేర్చకపోతే అసహజ పరిణామాలు – దొరసాబ్

—-

ఇన్నాళ్లూ కారుతో సహా ఏ కారుమబ్బుల చాటున దాగున్నాడో, మన తుంటరి చంద్రయ్య తనదైన శైలిలో మళ్లీ ఓ తులిపి వ్యాఖ్యతో మంది ముందుకొచ్చేశాడు. ఏడాదిన్నర కిందట ఓ అర్ధరాత్రి పొరుగు రాష్ట్రపు అరవతంబి అడావిడిగా గుప్పించి, ఆనక తీరుబడిగా వెనక్కి లాక్కున్న అస్పష్ట హామీని అర్జెంటుగా అమలు చెయ్యకపోతే అసహజ పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తుందట. అంటే ఏంటో ఆయన చెప్పలేదు, అడిగినోడెవడూ లేడు. బహుశా, తాగుబోతు మాటలకి తాత్పర్యాలెందుకన్న తృణీకారభావమేమో.

ఐతే, తాగినోడి నోట నిజం తన్నుకొని వస్తాదన్నాడు సినీకవి. కాబట్టి దొరవారి మాటలు నిజమేననుకోవాలి. కాకపోతే ఒకటి. అసహజ పరిణామాలనేవి కొత్తేం కాదిక్కడ. అసలీ ఉద్యమమే అసహజం. అధికారిక గణాంకాల సాక్షిగా – యాభయ్యేళ్లకి పైగా వెనకబాటుదనం పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసి, పొరుగు ప్రాంతాలని పస్తులు పెట్టి ఉన్నదంతా తెలంగాణకి ఊడ్చిపెట్టించుకుని వ్యవసాయం కాడ్నించి పరిశ్రమల దాకా అన్నింట్లోనూ ముందుకెళ్లిపోయాక తెప్ప తగలెయ్యబూనటం కన్నా అసహజ పరిణామం మరేముంది? రాష్ట్ర రాజధాని కొలువయ్యున్న ప్రాంతం వెనకబడిపోయిందని గగ్గోలు పెట్టి తిమ్మిని బమ్మిని చెయ్యబూనటంకన్నా విడ్డూరం వేరేముంది? దశాబ్దాల యోగ సాధనతో దేహాన్ని అదుపులో పెట్టిన మహా మహా బాబాలే నాలుగు రోజుల నిరాహార దీక్షకి నీరసించిపోతుండగా, పది దినాల పాటు పొట్ట మాడ్చుకున్న భోగి పన్నెండో నాడు
చెంగు చెంగున చిందులేసిన వైనాన్ని మించిన వింతేముంది?

కానీ దొరవారి నోటెంట ఎప్పుడూ నిజాలే జాలువారుతుంటాయని పైన అనేసుకున్నాం కాబట్టి, అసలు నిజం అనే పదార్ధానికి అర్ధమేంటని మనం ఆరా తీయాలి. ‘తెలుగు భాష వేరు, తెలంగాణ భాష వేరు’ అని దొరసాబ్ వేరు వేరు సందర్భాల్లో పరి పరి విధాలుగా వాకృచ్చియున్నారు కాబట్టి, ఆ క్లూ ఆధారంగా తీగ లాగితే కదిలేదేంటయ్యా అంటే – తెలంగాణ భాషలో సహజమైనవి తెలుగు భాషలో అసహజాలన్న మాట. అంటే ఈ ఉద్యమం వెనకాలున్న అసహజత్వమూ, అసంబద్ధతా దొరవారి దృష్టిలో నికార్సైన నిజమన్నమ్మాట.

మరైతే దొరబాబు నిఘంటువులో అసహజమనే పదానికి అర్ధమేంటనే ప్రశ్న వెంటనే ఉదయించనోడు పిచ్చోడవ్వాలి, లేదా దొరబాబు వీరభక్తుడవ్వాలి. నేనా రెండు వర్గాలకీ చెందనివాడ్ని కాబట్టి ఆ ప్రశ్న ఉదయించేసింది. సమాధానమూ తట్టేసింది.  దొరబాబు భాషలో సహజం అనబడేది పరభాషలో అసహజమైనప్పుడు, వారి భాషలో అసహజం అనే పదానికి వేరే భాషల్లో అసహ్యం అనే అర్ధముంటుందేమో! ఆ ఊహే నా వళ్లు జలదరింపజేసింది. ఎందుకని? ఇదిగిదిగో, ఇందుకని.

లక్ష్య సిద్ధి కోసం పాదయాత్రలూ రథయాత్రలూ చేసే పద్ధతి పాతబడిపోయింది. అయినా ఇంకా వాటినే పట్టుకు వేలాడుతున్న ప్రబుద్ధులు రాష్ట్రంలోనూ, దేశంలోనూ మందలు మందలుగా ఉన్నారనుకోండి. మన దొరవారి పంధా వేరు. ఊరి దారితో వారికి పనిలేదు. వారి దారి వేరే. అయ్యవారి బుర్రలో అవిడియాలే అవిడియాలు. తలచుకున్న పని జరగటానికి బొంత పురుగుల్ని కౌగలించుకోవటం దగ్గరనుండి బొందలు పెట్టటం దాకా నానారకాల చిత్రవిచిత్రమైన ఆలోచనలు ఆయన తలకాయ నుండి ఊడిపడ్డాయిప్పటిదాకా. వాటితో పని జరగటం లేదన్న గ్రహింపుతో ఆలోచనలకి మరింత పదును పెడితే రహదారుల్ని పాకశాలలుగా మారిస్తే పనైపోతుందన మహత్తరమైన చిట్కా తట్టింది. తెలుగుజాతి మధ్య ఇప్పటికే వేర్పాటు కుంపట్లంటించిన అనుభవంతో ఈ సారి నిజం కుంపట్లే అంటించేస్తే భలేగా ఉంటుందన్న సరదా దానికి తోడయ్యింది. మండుటెండల్లో నిరాహారదీక్షలంటూ కడుపు కాల్చుకోమంటే మహా ఐతే పదిమందొస్తారేమో ముందుకు. అదే ఆహార దీక్షకి రారమ్మంటే అధమం అడుక్కునే వాళ్లన్నా రాకపోదురా అన్నది దొరవారి తాజా తలంపు.తలచుకోవటం ఆలస్యం, హైదరాబాదు రోడ్ల మీద సమరోత్సాహంతో పది లక్షల కుంపట్లు అంటించేశారు. (ఈ సంఖ్య తప్పనిన్నీ, అంటుకున్న కుంపట్లు అందులో వందో వంతు కూడా లేవనిన్నీ వచ్చినవన్నీ అచ్చ తెలుగు వార్తలని అనుకోవాలి. తెలంగాణ తల్లి భాషలో పది లక్షలంటే తెలుగులో నాలుగు వేలని ఇంకా తెలుసుకోకపోతే ఇప్పుడు తెలుసుకోండి. అలాగే, పిన్ని భాషలో మిలియన్ అంటే పర భాషల్లో రెండు వేలని అర్ధం. ఈ సూత్రం మొన్న మార్చి పదిన రుజువయింది). కానీ ఏం లాభం? ఎండదెబ్బకి వెరవకుండా తిండియాగం చేసినా ఒరిగింది శూన్యం. అన్ని పొయ్యిల్లోంచి పిల్లుల్ని లేపగలిగారే కానీ ఆంధ్రోళ్లని మాత్రం అంగుళం కూడా కదల్చలేకపోయారు. సహజ పద్ధతుల్లో చెబితే వినే రకాలు కారు వీళ్లు. ఇకనుండీ అసహజమైన పద్ధతులు అవలంబించాల్సిందే. తప్పదు మరి. రాజధాని రహదార్లని పాయిఖానాలుగా మార్చటం అనే పసందైన కార్యక్రమంతో ఈ అసహజ పరిణామాలకి శ్రీకారం చుట్టవచ్చని నా అనుమానం. ఆరుబయలు బహిర్భూమి మన పుణ్యభూమిలో అపరాధమేం కాదు కాబట్టి శాంతిభద్రతల వంకతో ప్రభుత్వం దీనికి ఎసరు పెట్టే అవకాశమూ లేదు.రోడ్లమీదా, రైలు పట్టాల మీదా వంటావార్పుతో ఎన్ని పచ్చికట్టెలంటించి ఎంతెంత పొగబెట్టినా పోనే పోమంటూ నగరంలో తిష్టవేసుక్కూర్చున్న దుర్మార్గ సీమాంధ్ర దోపిడీ జనాలు ఈ వినూత్నపాయిఖానా పధకం దెబ్బకి పెట్టే బేడా సర్దుకుని బతుకుజీవుడా అనుకుంటూ పారిపోతారని దొరబాబు అంచనా కావచ్చని నా అంచనా. చూద్దాం, ఎవరి అంచనా నిజమో.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.