కథ ఎలా పుడుతుంది? ఒక్కో కథకుడికీ ఒక్కో విధంగా. నావరకూ అది ఓ ప్రశ్నలోంచి పుడుతుంది: ‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నలోంచి. ‘నాగరికథ‘ నుండి ‘రీబూట్‘ దాకా అదే పద్ధతి. ఇది ‘రీబూట్’ కథాయణం. కాబట్టి ఆ కథ ఏ ప్రశ్న నుండి పుట్టింది, ఎలా పెరిగింది, చివరికి ఇప్పుడున్న రూపానికెలా వచ్చింది అనేది చూద్దాం. (ఆ కథ చదవనివాళ్లు ఇక్కడ నొక్కితే దొరుకుతుంది. అది చదవకపోతే ఈ టపా అర్ధమయ్యే అవకాశాలు తక్కువ. నే చెప్పాల్సింది చెప్పేశా)
నూటపదిహేనేళ్ల కిందట (1898లో) హెచ్.జి.వెల్స్ War of the Worlds రాశాడు. సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో అదో మైలురాయి. అంగారకవాసులు భూగ్రహమ్మీద దాడి చేసి దొరికినవారిని దొరికినట్లు చంపుకుతినటం ఆ నవల ఇతివృత్తం. మొదట్లో ఇష్టమొచ్చినట్లు చెలరేగిపోయిన మార్స్ దళాలు, అనుకోనిరీతిలో భూమ్మీది బాక్టీరియా ధాటికి కుదేలవటం, దెబ్బకి తోకముడిచి తమగ్రహానికి పారిపోవటంతో ఆ నవల ముగుస్తుంది.
ఆ నవల చదివినప్పట్నుండీ నన్నో ప్రశ్న తొలిచేది. ‘అలా పారిపోయిన అంగారకవాసులు రోగనిరోధకశక్తి పెంపొందించుకుని తిరిగి మన మీద దాడి చేస్తే? వాళ్లని కాచుకోటానికి ఉన్న ఒక్క ఆయుధమూ నిరుపయోగమైపోతే మనుషుల పరిస్థితేంటి?’. నేను కథలు రాయటం ప్రారంభించిన తొలినాళ్లనుండి ఈ అంశంతో ఓ కథ రాయాలన్న ఆలోచనుండేది. అంటే, War of the Worldsకి సీక్వెల్ రాసే ఆలోచన అన్నమాట. ఐతే, కథలు రాయటమ్మీద కాస్త పట్టు చిక్కేదాకా దీని జోలికి పోకూడదని అప్పుడే అనుకున్నాను. ముందో మూడు కథలు రాసి, తర్వాతో రెండున్నరేళ్లు విరామం తీసుకున్నాక, మళ్లీ కథ రాసే మూడొచ్చింది; సీక్వెల్ ఆలోచనకి దుమ్ము దులిపే వీలు కుదిరింది. అలా ఈ కథ మొదలయింది. దీనికి ముందు నేను రాసిన మూడిట్లో రెండు కథలు టైమ్‌ట్రావెల్ నేపధ్యంలో రాసినవే. అదే నేపధ్యంలో మరోటీ రాసేసి ‘ఇదిగిదిగో నా టైమ్‌ట్రావెల్ త్రయం’ అనాలనే దుగ్థ ఒకటి ఈ రెండున్నరేళ్లుగా తొలుస్తూనే ఉంది. అందుకే, War of the Worlds కి కొనసాగింపు రాయటానికి సిద్ధమైనప్పుడు దానికి అనుకోకుండానే టైమ్‌ట్రావెల్ నేపధ్యమై కూర్చుంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్న మాట.
సరే. కథకి కీలకమైన ప్రశ్న ఎదురుగా ఉంది: ‘మార్షియన్స్ మళ్లీ వస్తే మనుషుల గతేంటి?’. సమస్య సిద్ధం. సమాధానమూ సిద్ధమైతే కథ సగం పూర్తైనట్లే. ఆ తర్వాత చెయ్యాల్సిందల్లా పాత్రలు, సన్నివేశాలు, సంఘర్షణ ఇత్యాదివి కల్పించటం. ఇక్కడే చిక్కుముడి పడింది. మనుషుల దగ్గరున్న ఒక్క ఆయుధమూ లాగేసుకుని వాళ్లని అంగారకవాసులతో పోరాడమంటే, చివరికి ఎవరు గెలిచినట్లు చూపించాలి? ఎలా గెలిచినట్లు చూపించాలి? ఓ కష్టమైన సమస్య ఎదురైనప్పుడు దాన్ని కాసేపు పక్కనబెట్టి తేలిగ్గా పరిష్కరించగల ఇతర సమస్యల మీద దృష్టి పెట్టటం మంచి పద్ధతి. కాబట్టి కాసేపు పై ప్రశ్నల గురించి మర్చిపోయి వేరే ప్రశ్నల మీదకి మళ్లాను.
ఎప్పుడో నూట పదిహేనేళ్ల కిందట హెచ్.జి.వెల్స్ అంగారకవాసులు భూమ్మీద దాడి చేశారని రాస్తే అప్పట్లో చెల్లిపోయింది. ఇప్పుడలా అనాలంటే కుదరదు – మార్స్ మీద జీవం లేదని మనకిప్పుడు తెలుసు కాబట్టి. మరిప్పుడేం చెయ్యాలి? మార్స్ బదులు మానవులెరగని మరే సుదూర గ్రహాన్నో ఎంచుకుంటే? అప్పుడు మళ్లీ రెండు సమస్యలు: అంత దూరగ్రహాలకి ప్రయాణాలే ఏళ్లూ పూళ్లూ పడతాయి. అక్కడినుండి ఎప్పుడుబడితే అప్పుడొచ్చి మనమీద దాడి చెయ్యగలగాలంటే వాళ్లు కాంతి వేగంతోనో, అంతకన్నా వేగంతోనో ప్రయాణించాలి. అలా చేస్తే వాళ్లు టైమ్‌ట్రావెల్ చేసినట్లే. అప్పుడిక నా కథకి అర్ధమే ఉండదు. రెండో సమస్య: అంగారకుడికి బదులు వేరే గ్రహాన్నెంచుకుంటే అది War of the Worlds కి నిజమైన సీక్వెల్ కాదు. కాబట్టి నాకు మార్సే గతి. నిజానికి ఈ సమస్యకి పరిష్కారం చాలా తేలిక. అంగారకుడిపై నిజంగా బుద్ధిజీవులుంటే, వాళ్ల ఉనికి గురించి మానవులని తప్పుదోవ పట్టించొచ్చు కదా. రోవర్లు తప్ప మనుషులు మార్స్ మీదకెళ్లి చూసింది లేదు. ఆ రోవర్ల సమాచారం ఎంత నిఖార్సో ఎవరికెరుక? ఆ సంగతే ఓ వాక్యంద్వారా కథలో చొప్పించాను.
ఇక్కడ కాసేపు పిడకల వేట.
నా కథల్లో జరిగిన/జరుగుతున్న చరిత్ర, ఎప్పుడో జరిగిపోయిన/జరగని పురాణాల ప్రస్తావన లీలా మాత్రంగా చొప్పించటం నాకలవాటు – వాటిక్కాస్త సైన్స్ పూతపూసి. అవి కనబడేవాళ్లకి కనపడతాయి, లేనివాళ్లకి లేదు. కలియుగం చివర్లో కలి పురుషుడొచ్చి యుగాంతం చేస్తాడనే హైందవ నమ్మకం ఆధారంగా నేను ‘కల్కి‘ కథ రాశాను. కాకపోతే యుగాంతం అనే మాటని వేరే అర్ధంలో తీసుకున్నాను. క్రీస్తు శకం మారిపోయి కల్కి శకం రావటం అన్న అర్ధంలో దాన్ని వాడాను. ఇది కొందరు పాఠకులు గమనించిన విషయమే (వాళ్ల నుండి వచ్చిన ఇ-మెయిళ్ల ఆధారంగా). కల్కి పాత్ర రామాయణంలో కుంభకర్ణుడి పాత్ర ఆధారంగా రూపొందిందన్న విషయం మాత్రం ఎవరూ పట్టుకున్నట్లు లేరు.
పిడకల వేట సమాప్తం.
‘రీబూట్’కి కూడా అలాగే పురాణాల నుండి ఏదన్నా లంకె పెట్టే ఉద్దేశంతో వాటికేసి చూశాను – ఏదన్నా బ్రహ్మాండమైన, విశ్వజనీనమైన సంఘటన ప్రస్తావన కోసం. పెద్దగా వెదికేపని లేకుండానే దొరికేసిందది. అందరికీ తెలిసిందే. ప్రతి 43 లక్షల సంవత్సరాలకీ (మహాయుగం) ఓ సారి (కలియుగాంతంలో) ప్రళయం వచ్చి భూమ్మీది పరిస్థితులు రీసెట్ అవుతాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రళయం ప్రస్తావన ఇంచుమించుగా అన్ని పురాతన సంప్రదాయాల్లోనూ ఉంది – సుమేరియన్లు, గ్రీకులు, యూదులు (జెనెసిస్), మాయన్లు, ఇంకా హిందూ పురాణాలు. అన్నిట్లోనూ స్థూలంగా ఒకటే కథ: మానవుల మధ్య కలహాలు ముదిరిపోయి ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగితేలుతుంటే విసిగిపోయిన దేవుడు ప్రళయం ద్వారా మానవజాతిని మళ్లీ మూలాల్లోకి పంపటం. ఇదో ప్రపంచవ్యాప్త నమ్మకం. దీన్ని నా కథకి అనుగుణంగా వాడుకుందామనుకున్నాను. మూడో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిస్థితులు, మానవులు భూగృహాల్లో బతకటం, ఇలాంటివి అలా వచ్చి కథలో కలిశాయి. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో మనుషుల బదులు మరసైనికులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి (అది మరో విధంగా ఇప్పటికే జరుగుతుంది, నిజానికి) ఆ రకంగా కథలోకి రోబోట్స్ కూడా వచ్చి చేరాయి. అలా, కథకి మొదట్లో లేని కొత్త కోణం వచ్చి కలిసింది. ఇప్పుడు కథ ‘మానవులు మార్షియన్లని ఎలా ఎదుర్కున్నారు’ అనే ప్రశ్న దాటి మరింత పెద్ద ప్రశ్నకి సమాధానం అన్వేషించే దిశలో సాగింది. ఆ ప్రశ్నేంటో చివర్లో చెబుతాను.
మరమనిషి ప్రధాన పాత్ర అనగానే ఐజక్ అసిమోవ్ కథలు గుర్తొస్తాయి. ఆ తరహా సాహిత్యమ్మీద ఆయన వేసిన ముద్ర అంత బలమైనది. ఆ మహారచయిత గురించి తెలుగు పాఠకలోకంలో ఎక్కువమందికి తెలీదు. అందుకే ఆయన్ని పరిచయం చేసినట్లుంటుందని కథలో అసిమోవ్ ప్రస్తావన తెచ్చాను (అసిమోవ్ వర్ధంతి సందర్భంగా ప్రచురిస్తే బాగుంటుందన్న నా సూచన మన్నించి, కథ పంపిన నెలలోపే ప్రచురించిన ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి నా కృతజ్ఞతలు). ఈ కథకి అసిమోవ్ ‘ఐ, రోబట్’ ప్రేరణ అనుకున్నారు కొందరు అంతర్జాల పాఠకులు. అది పాక్షికంగానే సత్యం. అసిమోవ్ మూడు నియమాల ఆధారంగానే నా కథలో ఐజక్‌కి విధించబడ్డ ఏక నియమం రూపొందింది. అంతవరకే పోలిక. ఆ మూడు నియమాలు అసిమోవ్ అన్ని కథల్లోనూ పునరావృతమవుతాయి, కొద్ది కొద్ది మార్పులతో.
ఐజక్ తనకి విధించబడ్డ నియమాన్ని ఉల్లంఘించకుండానే, తనకి అప్పగించబడ్డ పని చేయకుండా మరో పని ఎలా చేశాడనే అంశాన్ని కథలో కాన్‌ఫ్లిక్ట్ తేవటానికి, ఉత్కంఠ మేళవించటానికి వాడుకున్నాను. అందుకోసం ఐజక్ నైతికంగా ఆలోచించటం అవసరం. మరమనిషికి నైతికత ఎలా వర్తిస్తుంది? అది మనుషులకే ప్రత్యేకమైన గుణం. అందుకే ఐజక్‌ని మామూలు మరమనిషి కాకుండా మనిషి మెదడు అమర్చబడ్డ ఓ బయో-రోబట్ (బయాట్) గా చేశాను.
ఇక్కడిదాకా వచ్చేసరికి మొదటి ప్రశ్నకి (మార్షియన్స్‌ని మనుషులు ఎలా ఎదుర్కొన్నారు?) దానంతటదే సమాధానం వచ్చేసింది. అదేంటో కథ చదివినవాళ్లకి తెలుసుకాబట్టి ఆ కథంతా వివరించనిక్కడ. వేరే చిన్న ప్రశ్నలు కొన్ని మిగిలాయి. ‘కాలంలో వెనక్కెళ్లటం ఎందుకు? జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం మానవుడు ఎటూ వస్తాడు కదా?’ అనేది వాటిలో ముఖ్యమైనది. భూమ్మీదకి మనిషెలా వచ్చాడనేదాని మీద డార్విన్‌కన్నా ముందు, ఆ తర్వాతా కూడా అనేక వాదాలు, వివాదాలూ ఉన్నాయి. వాటి ఆధారంగా ఈ ప్రశ్నకి కథలోనే ఓ చోట సమాధానమిచ్చాను. బైబిల్‌లో చెప్పే ఆదిదంపతుల గాధ వాటిలో ఒకటి. అది స్ఫురించేలా కథ ముగింపు రూపొందించాను. ఆడమ్ అండ్ ఈవ్ లని దేవుడు సృష్టించి భూమ్మీద వదిలిపెట్టాడనేది ఆ గాధ. ‘ఆ దేవుడు ఎవరు, ఏ పరిస్థితుల్లో ఆ పని చేయాల్సొచ్చింది’ అనేది ఈ ముగింపుతో నేను సూచించిన విషయం. (అంతే కానీ, కొందరు పాఠకులనుకున్నట్లు దీనికి స్ఫూర్తి ‘Knowing’ సినిమా కాదు)
మీ మాట