ప్రత్యేక రాష్ట్రాన్నిక పడుకోబెట్టినట్టేనా? పరిస్థితులు పరికిస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇటు రాష్ట్రంలో రోజు రోజుకీ ఊపందుకుంటున్న సమైక్యవాదం, అటు కేంద్రంలో పాలక పక్షానికి భాగస్వాముల నుండి మొట్టికాయలు, తెలంగాణపై వేసిన తప్పటడుగుతో దేశంలో పుట్టగొడుగుల్లా తలెత్తుతున్న ప్రత్యేకవాద ఉద్యమాలు .. వెరసి, లేనిపోని లంపటంలో వేలుపెట్టామని తలపట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వాధినేతలు. ఈ పరిస్థితుల్లో తెలంగాణపై తెగించి ముందడుగేయటం ఇక సాధ్యం కాకపోవచ్చు. ‘రాష్ట్రం తీర్మానం చేస్తేగానీ మేమేం చెయ్యలేం’ అంటూ బంతిని రాష్ట్ర అసెంబ్లీలోకి నెట్టేసి కేంద్రం చేతులు దులుపుకునే అవకాశాలే మెండు. ఇప్పటికే ఆ దిశలో వెల్లడవుతున్న సూచనలు. రాష్ట్ర అసెంబ్లీలో ఆ తీర్మానమెటూ వీగిపోవటం ఖాయం – అదీ ఏ వంద ఓట్ల తేడాతోనో. కేసీయార్ మాత్రం ‘అసెంబ్లీ తీర్మానం అవసరమే లేదు. కేంద్రం తలుచుకుంటే రాష్ట్రాల్ని చీల్చటం ఓ లెక్కే కాదు’ అంటూ ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
ఆయన వాదనలోనూ నిజముందని కొందరు రాజ్యాంగ నిపుణులంటున్నారు. కానీ అసెంబ్లీ తీర్మానంతో పని లేకుండా కేంద్రం తెలంగాణ విషయంలో బిల్ పాస్ చేసే అవకాశముందా అన్నది సందేహం. ఆ అవకాశమున్నప్పుడు, తీర్మానం సంగతి మొదటే ప్రస్తావించకుండా ఉండాల్సింది కదా. తీర్మానం నిలబడినా, వీగిపోయినా కేంద్రం తను చెయ్యాలనుకున్నది చేసి తీరేట్లయితే అసలు తీర్మానం ఊసెందుకు? ‘ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలయింది’ అన్న ఒక్క ముక్కకే, ఆ ప్రక్రియ ఇంకా మొదలే కాకపోయినా, ఎప్పుడు మొదలవుతుందో సైతం తెలీకపోయినా తెల్లారే సరికి రాష్ట్రం భగ్గుమంది. ఎందుకు? ‘మా మనోభావాలు కనీసం తెలుసుకోకుండా కేంద్రం ఏక పక్షంగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని ప్రజలు అనుకోబట్టి. తమ అభిప్రాయాలు తెలుసుకోకపోయినందుకే ఆంధ్రులు అగ్గి మీద గుగ్గిలాలైతే, అసెంబ్లీలో భారీ తేడాతో తీర్మానం వీగిపోయాక సైతం కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకి పచ్చ జెండా ఊపితే ఇంకెంత రౌద్రంగా రియాక్ట్ అవుతారో ఊహించనలవి కాదు. అంత ఆగ్రహాన్ని తట్టుకోటానికి కేంద్రం సిద్ధంగా ఉందా? ఉండకపోవచ్చు. అసలు, అసెంబ్లీ నిర్ణయంతో పని లేకుండానే రాష్ట్ర విభజన చేసేయొచ్చని తెలిసినా ‘అసెంబ్లీ తీర్మానం’ మడత పెట్టటంలో మతలబు – పరిస్థితులు తారుమారైతే పరువు పోకుండా చేతులు దులుపుకోటానికే కావచ్చు. దాని వెనకున్న చిదంబర రహస్యమేదైనా, అప్పుడా క్లాజ్ పెట్టినందుకు చిదంబరం ఇప్పుడు చిదానందభరితుడౌతుంటాడు.
మొత్తానికి అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా – అది ప్రవేశ పెట్టటమంటూ జరిగితే – తన పని తాను చేసుకుపోయే ధైర్యం కేంద్రం చెయ్యకపోవచ్చు. ఆ సంగతి కేసీయార్‌కి తెలీదా? తెలీకేం – బ్రహ్మాండంగా తెలుసు. మరి ఇంకా ఏ ధైర్యంతో ‘తెలంగాణ వచ్చేసినట్లే’ అంటున్నాడు? అదర్ధం కావటానికి అంతగా తెలివితేటలక్కర్లేదు. ఆయన స్టైలే అది కదా. మొన్నటిదాకా ఆలూ చూలూ లేకపోయినా అడిగడిగో సోమలింగం అంటూ నెట్టుకొచ్చినోడికి, ఆకాశంలో మబ్బు తునక లేకున్నా నీళ్లు పట్టుకోటానికి బకెట్లతో నిల్చోమని తెలంగాణవాసుల్ని హడావిడి పెట్టేసినోడికి, ఉత్తి మాటలతోనే ఐదారేళ్లు అలవోకగా నెట్టుకొచ్చేసినోడికి – ఇప్పుడు ఇదిగిదిగో తెలంగాణ, ఇంకేముంది వచ్చేసింది అంటూ మరో ఐదారేళ్లు బండి లాగించే వెసులుబాటు దొరికింది. తెలంగాణ ప్రజలు అలవాటుగా దీన్నీ నమ్మేస్తారు. ఆంధ్రా బూచోళ్లని తిట్టుకుంటూ ఇంకొన్నేళ్లిలాగే దొర్లిస్తారు. అద్దంలో చందురుడిని చూపిస్తూ పబ్బం గడుపుకునే దొరలని అమాయకంగా నమ్మేస్తూ, ఎన్నటికీ రాని తెలంగాణ కోసం ఆవురావురుమంటూ తరాలకి తరాలే గడిపేస్తారు. ‘రాష్ట్రమొద్దూ గీష్ట్రమొద్దూ. చేతనైతే మాకిన్ని స్కూళ్లో, నీళ్లో తెచ్చియ్యి’ అని మాత్రం నిలదీసి అడగరు.
ఏతావాతా, ఇంత రభస, రచ్చ జరిగాక ఒరిగిందేమిటి? రాష్ట్రం చీలలేదు. రాష్ట్రంలో పార్టీలు మాత్రం రెండుగా చీలిపోయాయి. దాన్ని మించి – అసలు రాష్ట్ర ప్రజానీకమే ప్రాంతాలవారీగా చీలిపోయింది. మూడు ప్రాంతాలూ రెండు ప్రాంతాలుగా ఏకీకృతమయ్యాయి. ఆ రెండు ప్రాంతాల ప్రజలకీ మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. అందరూ తెలుగువాళ్లే ఐనా అందులోనే రెండు వేర్వేరు జాతులన్నంతగా పరిస్థితి ముదిరిపోయింది. ‘తెలుగు వేరు, ఆంధ్రం వేరు’ అంటూ ఒకటే భాషని రెండు విడివిడి భాషలుగా విడగొట్టి చూసే చోద్యపు పోకడలూ పుట్టుకొచ్చాయి. ఎవరివల్ల? పనీ పాటా లేకుండా కూర్చుని చేతికొచ్చినవి రాసిపారేసే స్వప్రకటిత భాషావేత్తల వల్ల. వాళ్లు రాసిన చెత్తనల్లా ముందూ వెనకా చూడకుండా అచ్చు గుద్ది పారేసే బాధ్యతారాహిత్య మీడియా వల్ల. ఈ మీడియాని వాడుకుని కొందరు తాజాగా ప్రచారం చేస్తున్న వితండవాదం: ‘ప్రత్యేకవాదం మిన్నంటినప్పుడే సమైక్యవాదం ఊపందుకోవటం ఏమిటి? దీని వెనక ఏదో కుట్రుంది’. రాష్ట్రం చీలే ప్రమాదం లేనప్పుడు కలిసుంటామంటూ ఉద్యమాలు చేయనవసరం ఏముంది, ఎవరికుంది? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని చవటాయిలు – ప్రత్యేకవాదాన్ని తలకెత్తుకున్న మేధావులు!
సమైక్యవాదం అనేది బోగస్ అని కేసీయారూ, ఆయన వందిమాగధులూ నోళ్లు పారేసుకోవచ్చుగాక. ఆ మాటలకు విలువీయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకవాదం ఎంత నిజమైనదో సమైక్యవాదమూ అంతే నిజమైనది. వీటిలో ఏదెంత నిజమైనదన్నది ప్రశ్నే కాదు. ప్రజల్లో దేనికెంత మద్దతున్నదన్నదే ప్రశ్న. ఆంధ్రా, సీమల్లో ఉన్నదంతా సమైక్యవాదమే. ఆ విషయంలో అనుమానాలు అనవసరం. తెలంగాణలో సైతం సమైక్యవాద గొంతుకలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయనేదాంట్లోనూ సందేహం లేదు. కాకపోతే ‘సమైక్యవాదుల తలలు నరుకుతాం, మెడలు తెగ్గోస్తాం’ అంటున్న వేర్పాటువాదుల విచ్చలవిడి హెచ్చరికలతో ఆ గొంతులు మౌనవ్రతం పట్టాయి. ఈ తరహా బెదిరింపులో పక్క, సమైక్యవాదమే బోగస్ అనే గోబెల్స్ ప్రచారం మరోపక్క కలిపి హోరెత్తించేస్తున్నారు వేర్పాటువాదులు. అందులో భాగంగా, పోయిన వారం మాటల మరాఠీ కేసీయార్ ‘ప్రపంచంలో ఎక్కడైనా విడిపోటానికి ఉద్యమాలు జరిగాయే తప్ప కలిసుండటానికి జరిగాయా’ అని చొప్పదంటు ప్రశ్నొకటేశాడు. ఉద్యమాలేం ఖర్మ, కలిసుంటానికి ఏకంగా యుద్ధాలే జరిగాయి. దొరవారు చిన్నప్పుడు బళ్లో బూతు కూతలు నేర్చుకోటమ్మీద పెట్టిన శ్రద్ధలో సగమన్నా చరిత్ర పాఠాల మీద పెడితే నేడీ పిచ్చి ప్రశ్నేసుండేవారు కారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి నూట యాభయ్యేళ్లనాటి అమెరికన్ సమాజాన్ని తలపిస్తుంది. బానిసత్వ నిషేధం వంకతో అమెరికా నుండి విడిపోతామన్న దక్షిణాది రాష్ట్రాలు (కాన్ఫెడరేట్ స్టేట్స్), వారికి వ్యతిరేకంగా సమైక్య మంత్రం పఠించిన ఉత్తరాది రాష్ట్రాలు (యునైటెడ్ స్టేట్స్), ఆ రెండు శిబిరాల మధ్యా జరిగిన నాలుగేళ్ల అంతర్యుద్ధంలో చివరికి గెలిచింది సమైక్యవాదులే. ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయేదీ అదే. సారువాడికి కాస్త చరిత్ర జ్ఞానమన్నా వస్తే వాగుడు కొంచెం కట్టిపెడతాడేమో. ఎటూ అమెరికా నుండి మస్తుగా మందు (ఏ మందో?) తెప్పించుకు తాగి జబర్దస్తుగా బాగుపడతానంటున్నాడుగా, పనిలో పనిగా ఒకట్రెండు ‘అమెరికన్ హిస్టరీ ఫర్ ఇడియట్స్’ పుస్తకాలు కూడా ఎగుమతి చేస్తే మంచిదీ మందుబాబుకి.
కొసమెరుపు: ఇప్పుడే అందిన వార్త. ‘ఆంధ్రోళ్ల సినిమాలు మాకెందుకు, కాలేజిలో నేను బెస్ట్ యాక్టర్ని’ అన్నాడు దొరబాబు. రేపు కొంపదీసి ప్రత్యేక రాష్ట్రంగానీ వస్తే అన్న సినిమా హీరో అవతారమెత్తుతాడన్న మాట. ఈ వార్త దావానలంలా వ్యాపించటంతో టీఆర్ఎస్ శ్రేణులు జెండాలవతల పారేసి కకావికలై ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోతున్నట్లూ, కరడుగట్టిన ప్రత్యేకవాదులు సైతం సమైక్య రాగం ఆలపించే ఆలోచనలో ఉన్నట్లూ విశ్వసనీయవర్గాల భోగట్టా.
మీ మాట