అనగనగనగనగా నేనో స్థానిక క్రికెట్ జట్టుకి నాయకత్వం నెరపే రోజుల్లో – అనగా క్రీపూ కాలంలో అన్నమాట – ప్రత్యర్ధి జట్లని బురిడీ కొట్టించటానికి కొన్ని పద్ధతులు అమల్లో పెట్టేవాడిని. వాటిలో ఒకటి: టోర్నమెంట్ల సందర్భంగా కొత్త ప్రత్యర్ధి జట్లు తారస పడ్డప్పుడు వాళ్లతో ఓ ముందస్తు స్నేహపూర్వక పోటీ ఏర్పాటు చేయించటం, సదరు పోటీ కోసం రూపొందించే నా జట్టుని అనామక ఆటగాళ్లతో నింపటం, ఆ ఫ్రెండ్లీ గేమ్ కావాలనే ఓడిపోవటం, ఆ విధంగా ఎదుటి జట్టులో నా జట్టంటే తేలిక భావాన్ని నింపడం .. అలా మమ్మల్నో పసలేని జట్టుగా అంచనా వేసి ఆడుతూ పాడుతూ టోర్నమెంట్ మ్యాచ్‌లోకి దిగిన ప్రత్యర్ధి జట్టుపైకి నా అసలు జట్టుని దింపి వాళ్లు తేరుకోలేని దెబ్బ కొట్టటం. ఈ వ్యూహం కొన్నాళ్లు బాగానే పని చేసింది. తర్వాత్తర్వాత నా స్నేహపూర్వక పోటీల వెనక దాగున్న మర్మం ఆనోటా ఈనోటా పడి పాతా కొత్తా ప్రత్యర్ధులందరికీ తెలిసిపోయింది. దీనివల్ల నా వ్యూహానికి నూకలు చెల్లాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. రహస్యం బట్టబయలయ్యాక – నా జట్టు నిజంగానే ఆడలేక చేతులెత్తేసి చిత్తుగా ఓడిపోయిన పోటీలని సైతం ప్రత్యర్ధి జట్ల నాయకులు ‘ఇదో వ్యూహాత్మక ఓటమి మాత్రమే’ అని పొరబడటం, ఏ పుట్టలో ఏ పాముందో అనుకుంటూ ఆ కన్‌ఫ్యూజన్‌లో మాతో ఆడే తరువాతి పోటీలో మితిమీరిన రక్షణాత్మక ధోరణి అవలంబించబోయి బోర్లాపడటం .. ఇదీ తంతు.
పద్దెనిమిదో శతాబ్దపు ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్ పేరు మీద లెక్కలేనన్ని అర్బన్ లెజెండ్లు చెలామణిలో ఉన్నాయి. వాటిలో నాకు నచ్చేదిది: తాను ముట్టడించిన దేశంలో అడుగు పెట్టగానే నెపోలియన్ చేసే మొదటి పని, తాము తరలొచ్చిన నౌకలన్నిట్నీ తగలబెట్టించటం! తిరుగు ప్రయాణానికి వాహనాలు లేకుండా చెయ్యటం వెనక మతలబు, తన సైన్యం పలాయనం చిత్తగించే మార్గం మూసేయటమే కాక, ‘మీ ఇళ్లకి తిరిగెళ్లాలంటే ఈ యుద్ధం గెలిచి తీరాల్సిందే’ అని తనదైన శైలిలో నొక్కిచెప్పటమన్నమాట. అదో రకం సైకలాజికల్ గేమ్. నా క్రికెట్ విజయ మంత్రాలు కొన్నిటికి ఇదే స్ఫూర్తి. కాకపోతే వాటిని సొంత జట్టు మీద కాకుండా ప్రత్యర్ధుల మీద ప్రయోగించేవాడిని. అయితే చింతకాయలు రాలాలంటే మంత్రాలేసి ఊరుకుంటే సరిపోదు – చేసే పనిలో చెయ్యితిరిగుండటం అత్యవసరం. నెపోలియన్ యుద్ధాలైనా, నా క్రికెట్ మ్యాచ్‌లైనా – ఆయా గెలుపుల వెనక ఈ చిట్కాల పాత్ర బహు పరిమితం. సుశిక్షితులైన సైనికులు నెపోలియన్ విజయ రహస్యం; రంజీ ట్రోఫీ నుండి ఇంగ్లీష్ కౌంటీల దాకా ఆడిన అనుభవమున్న మెరికల్లాంటి ఆటగాళ్లు నా జట్టు విజయ రహస్యం. ఈ సైకలాజికల్ గేమ్సూ గట్రా వ్యూహాలన్నీ ఆ తర్వాతే. ఆ స్పృహ నెపోలియన్‌కుంది, నాకూ ఉంది. లేనే లేనిది నేటి తరం తెలుగు సినీ నిర్మాతలకి.
ఆ మధ్య ఏయ్ అనే తెలుగు సినిమా ఒకటొచ్చింది. మాజీ బాల నటి భీమిలి కథానాయికగా నటించిన మొట్టమొదటి చిత్రం కావటం దాని ఏకైక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతని వీలైనంత సొమ్ము చేసుకుందామనుకున్న సదరు చిత్ర దర్శక నిర్మాతలు సినిమా విడుదలయ్యేదాకా భీమిలి నిశ్చల చిత్రాలు బయటికి రాకుండా సకల జాగ్రత్తలు తీసుకుని, పెద్దదయ్యాక ఆ అమ్మాయెలాగుంటుందో అన్న ఉత్కంఠ ప్రేక్షక జనాల్లో విజయవంతంగా కలిగించారు. తీరా సినిమా విడుదలయ్యాక భీమిలిని చూసిన ప్రేక్షకులు పెదవి విరవటం, కథలో పస లేకపోవటంతో సినిమా పేలిపోవటం వెంటవెంటనే జరిగిపోయాయి. పక్కోడి అనుభవం నుండి పాఠం నేర్చుకునేవాడు తెలుగు నిర్మాతెందుకవుతాడు? ఏడాది తిరిగేలోపు అదే ఎత్తుగడ పునరావృతమైంది – నరుడు నామధేయంగల తాజా చలన చిత్రానికి. ఈ చిత్రంలో నారి పాత్ర పోషించిన నూతన నటి భామశ్రీ నెహ్రా విషయంలో ఈ గోప్యతా సూత్రం మరింత పకడ్బందీగా పాటించారు – కథానాయిక పేరు సైతం బయటికి పొక్కకుండా. ఫలితం? మళ్లీ అదే. అతి చేస్తే గతి చెడుతుందన్న జ్ఞానముంటే చేదు అనుభవాలు ఎదురవవు. సినిమాలో సరుకుంటే ఇలాంటి చిల్లర చిట్కాలు చన్నీళ్లకి వేన్నీళ్లలా మరిన్ని వసూళ్లు తెచ్చి పెడతాయే తప్ప అవే సినిమాని సూపర్ హిట్ చేసి పెట్టవన్న తెలివి మన నిర్మాతలకెప్పుడు వంటబట్టేనో.
జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెట్టుద్దనేది పాత జాతీయం. అసలు జుట్టే లేకపోయినా ఫర్లేదు విగ్గుతో లాగించొచ్చనేది మన సినీ జనాల ధీమా. ఎన్టీవోడు తెరనేలిన రోజుల్లో ఆ ధీమాకో అర్ధముండేది – అప్పట్లో ప్రేక్షకమారాజులు సినిమాల్లో విలన్లు బయటా ఆ టైపే అని నమ్మేసి శాపనార్ధాలు పెట్టేసేంత అమాయకులు కాబట్టి. దరిమిలా రోజులు మారాయి. విగ్గులున్నది బోడి గుండుని కప్పెట్టటానికేనని కనిపెట్టగలిగేంతగా తెలివిమీరిపోయారు నేటి ప్రేక్షక దేవుళ్లు. వీళ్ల ముందా దర్శక నిర్మాతల కుప్పిగంతులు? వంటకం సరిగా వండకుండా ఎన్నెన్ని మసాలాలతో దానికి తిరగమోతేసిందీ మోత మోగిస్తే ఏం లాభం? మసాలాలంటే గుర్తొచ్చింది – ఈ మధ్య ‘మా సినిమాలో ఫలానా కథానాయిక బికినీ ధరించింది’ అనేదో రొటీన్‌కి భిన్నం కాని ప్రచారపుటెత్తుగడైపోయింది. ఆ చింకిపాతల్లో చిందులేసే హీరోయిన్లని చూసి తరించటానికే చొంగలు కార్చుకుంటూ జనాలంతా సకుటుంబ సపరివార సమేతంగా సినిమాహాళ్లముందు బారులు తీరతారని వాళ్ల వీర భీకర నమ్మకం! ఆ తరహా రసిక ప్రేక్షక వర్గమొకటి లేకపోలేదు. అయితే, ఓ సినిమా జయాపజయాలు నిర్ణయించగలిగే సంఖ్యాబలం వాళ్లకున్నదా అన్నది ప్రశ్న. వాళ్లని రంజింపజేసే ఉద్దేశంతో చొప్పించబడ్డ అనవసర సన్నివేశాల వల్ల సినిమాకి దూరమైపోయే మరో వర్గంతో పోలిస్తే .. గంప లాభం చిల్లి తీసేసినట్లు కాదూ? సరే, ఆ లెక్కలొదిలేద్దాం. చెప్పొచ్చేదేమంటే, బికీనీలు ప్రస్తుతం తెలుగే కాక అన్ని భారతీయ భాషా సినిమాల ప్రచార వ్యూహాల్లోనూ ప్రధానాస్త్రాలైపోయాయి. ఇంతా చేసి ఆ సినిమాలో ఆ ఫలానా నాయిక ధరించింది ఈత డ్రస్సు మాత్రమే అయ్యుంటుంది. సాధారణ స్విమ్ సూట్‌కీ, రెండు పీలికల బికినీకీ తేడా తెలీని దర్శకులు సినిమాలు తీసి పారేస్తున్నారు ఖర్మ. వాళ్లకి తెలీకపోతే పోయె, ఆ తేడా ఏదో ఆ సంగతి అచ్చేసి మనమీదకొదిలిన మీడియా మహారధులకీ తెలిసిన దాఖలాల్లేవు.
మీడియా ప్రస్తావన రానే వచ్చింది కాబట్టి చివరగా వాళ్ల గురించీ ఓ ముక్క. కొన్నేళ్లుగా మన మీడియా జనుల పుణ్యాన ఓ కొత్త రాజకీయ పదబంధం విస్తారంగా వాడుకలోకొచ్చింది: వ్యూహాత్మక మౌనం. కీలకాంశాలపై ఎటూ తేల్చకుండా ఏళ్లూ పూళ్లూ నాన్చే నాయకమ్మన్యుల గోడమీద పిల్లివాటం గుణానికీ, ప్రత్యర్ధుల ఎత్తులకి చిత్తై చేతులు ముడుచుక్కూర్చునే నేతల చేతగానితనానికీ మన పాత్రికేయులు పెట్టిన మహాగొప్ప ముద్దు పేరది. ఆయా మౌనాల వెనకాల నిజంగానే కళ్లు చెదిరే వ్యూహాలున్నాయని ఆ రాసినోడూ, దాన్నచ్చేసినోడూ నమ్మితే నమ్మిపోయారుగాక .. నేను మాత్రం నమ్మను. నా ప్రత్యర్ధి క్రికెట్ జట్ల నాయకులు చేసిన పొరపాటే మన నాయకుల విషయంలో చెయ్యటానికి నేనేమన్నా పిచ్చోడినా?
మీ మాట