అతనో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యుడు. (నేతి బీరకాయలో నెయ్యి గురించీ, మన వ్యవస్థలో ప్రజాస్వామ్యం గురించీ చర్చించుకునే సందర్భం ఇది కాదు. వదిలేద్దాం) ఓదార్పు యాత్ర పేరుతో పైకి ఒప్పుకోకున్నా ప్రజల్లో పరపతీ, పలుకుబడీ పెంచుకునే పర్యటనొకటి తలపెట్టాడు. ఆ యాత్ర పరమార్ధం ఏమిటో, అతని అంతిమ లక్ష్యం ఏమిటో బహిరంగ రహస్యం. అతనీ యాత్ర తలపెట్టటాన్ని విమర్శించేవాళ్లున్నారు, దానికతను ఎంచుకున్న సమయాన్ని తప్పుపట్టేవాళ్లున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి. భిన్నాభిప్రాయాలు కలిగుండటం తప్పుకాదు. వాటిని వ్యక్తం చెయ్యటంలో తప్పు లేదు. అదే ప్రజాస్వామ్యంలో గొప్పదనం. వ్యతిరేకులకి ఎలాగైతే వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కుందో, అతనికీ అలాగే ప్రజల్ని కలుసుకునే హక్కుంది – అది రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా. ఆ మాటకొస్తే దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు అతనికుంది. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.
తెలంగాణలో జగన్ పర్యటిస్తే గొడవలవుతాయని ముందునుండే దుందుడుకు హెచ్చరికలు జారీ చేస్తూ జనాన్ని రెచ్చగొడుతున్న వర్గాలున్నాయి. అది జగన్ హక్కుల్ని కాలరాయటమే. ఆ వర్గాలు గీత దాటకుండా నిరోధించే దమ్ములేని ప్రభుత్వానికి జగన్‌ని అరెస్ట్ చేసే నైతిక హక్కులేదు. ఒక పార్లమెంటు సభ్యుడికే తాను వెళ్లదలచుకున్న చోటికి నిరాటంకంగా వెళ్లగలిగే అవకాశం కల్పించలేని ప్రభుత్వాలు ప్రజలనేం ఉద్దరిస్తాయి? జగన్ పర్యటనపై లేనిపోని రచ్చచేసి పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంటున్నవారెవరో, మహబూబాబాద్లో జగన్‌ని అడ్డుకున్నదెవరో, గొడవలు మొదలెట్టిందెవరో తెలుసుకోటానికి తెలివితేటలక్కర్లేదు. వాళ్లని అరెస్టు చేసే తెగువ ప్రభుత్వానికెందుకు లేకపోయింది? వేర్పాటువాదుల బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు ఇంకెంతకాలం తలొగ్గటం?
జగన్ పర్యటన కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలు చల్లార్చటానికీ, పరిస్థితి చెయ్యిదాటిపోకుండా చూడటానికీ అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నామని ప్రభుత్వ ఉవాచ. తెలంగాణేతరులపై నిత్యం విచ్చలవిడిగా నోరు పారేసుకునే కేసీఆర్ దొరవారు విజయవాడలో బహిరంగ సభకి హాజరవబోతుంటే కోస్తా, సీమల్లో ప్రజలు ప్రశాంతంగానే ఉన్నప్పుడు, జగన్ వరంగల్‌లో పర్యటిస్తే తెలంగాణలో సెగలెందుకు రేగుతాయి? అతనెప్పుడూ తెలంగాణ ప్రజల్ని తూలనాడలేదే! మహా ఐతే, జగన్ రాక నచ్చని వారు అతని సభలకి దూరంగా ఉంటారు, అతని పర్యటనని తుస్సుమనిపిస్తారు. అయినా – జగన్ ఖమ్మంలో పర్యటించినప్పుడు కాని గొడవలు వరంగల్‌లో ఎందుకవుతాయి? ఖమ్మం తెలంగాణలో భాగం కాదా?
ఈ యాత్ర వెనక జగన్‌కి స్వార్ధ ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు. ‘వరదల్లోనో, వడగాల్పుల్లోనో మృతి చెందినవారి కోసం జగన్ ఓదార్పు యాత్ర చేపట్టటం లేదెందుకూ’, ‘తండ్రి కోసం ప్రాణాలొదిన వందమందినో రెండొందల మందినో పరామర్శించాలంటే వాళ్లనే తన దగ్గరికి పిలిపించుకోవచ్చుగా’, ‘వైఎస్ కోసం ప్రాణాలొదిన వాళ్లలో అతని బంధువులెవరూ లేరేంటో’ .. ఇలాంటి ప్రశ్నలు కోకొల్లగా వినిపిస్తున్నాయి. అవి సమంజసమైనవే. అయితే అవేవీ జగన్ తెలంగాణ పర్యటనని వ్యతిరేకించేవారికి సమర్ధింపులు కాలేవు. మన దేశంలో నడుస్తుంది నియంతృత్వపాలన కాదు. ప్రాంతీయవాదాలు నెత్తినేసుకుని రాష్ట్రాలు చీల్చాలని గొడవచేసే హక్కు ప్రసాదించిన రాజ్యాంగమే దేశంలో ఎవరైనా ఏ మూలకైనా ప్రయాణించే హక్కూ కల్పించింది. దానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. రేపెప్పుడో రాహుల్ గాంధీ కాశ్మీర్‌లో అడుగుపెడితే రక్తం ఏరులై పారుతుందని పాకిస్తాన్ ప్రాయోజిత మిలిటెంట్ ముఠా ఏదో హెచ్చరిక జారీ చేస్తే సోనియా పుత్రరత్నాన్నీ ఇలాగే అడ్డుకుంటుందా కేంద్ర ప్రభుత్వం? జగన్ పర్యటనవల్ల గొడవలవుతాయన్న అనుమానముంటే అవి జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యటం ప్రభుత్వ కర్తవ్యం. రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల్ని ప్రయాణాలు మానుకోమంటే ఎలా ఉంటుంది? జగన్ విషయంలో ప్రభుత్వ స్పందన అలాగే ఉంది. గొడవలకి ప్రేరేపించేవాళ్లని అడ్డుకోవలసిందిపోయి ఓ వ్యక్తి ప్రాధమిక హక్కుని పరిహరించటం నిఖార్సైన బేవార్సుతనం. దీని వెనక ఎవరి రాజకీయాలు వారికుండొచ్చు. అంతిమంగా జరిగింది మాత్రం ప్రజాస్వామ్య ఖననం.
‘నక్సలైట్లు కూడా ఈ దేశ పౌరులే, వారి మీదకి సైన్యాన్ని ప్రయోగించం’ అన్నది ఈ మధ్యనే కేంద్ర పోలీసుమంత్రి వారి వ్యాఖ్య. దేశంలో మూడో వంతు జిల్లాల్లో సమాంతర ప్రభుత్వం నడుపుతూ అంతరంగిక భద్రతకి పెను సవాలు విసురుతున్న మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం చూపిన ఔదార్యం అది. అవన్నీ మెరమెచ్చు మాటలే కావచ్చు, తెర వెనక నక్సలైట్ల ఏరివేతకి ప్రభుత్వం అప్రజాస్వామ్యిక విధానాల్లో ప్రయత్నిస్తుండుండొచ్చు – కానీ దేశ సమగ్రతకి పెనుముప్పుగా పరిణమించి, భద్రతా బలగాలని పెద్ద ఎత్తున మట్టుపెడుతున్న మావోయిస్టుల హక్కుల విషయంలో పైపై మాటగానైనా చూపిన ఉదారత్వం రమారమి లక్ష ఓట్ల మెజారిటీతో అత్యున్నత చట్టసభకి ఎంపికైన ఓ రాజకీయవేత్త విషయంలో చూపలేని ప్రభుత్వాల చేవలేని నిర్వాకాలు ఇలాగే కొనసాగితే దేశంలో అరాచకం ప్రబలటం ఖాయం. ఆ రానున్న గడ్డుకాలానికి ఆంధ్రప్రదేశ్ ఓ నమూనా కానుందా?
లేక …. ఆల్రెడీ ఐపోయిందా?
మీ మాట