ఫిబ్రవరి, 2011ను భద్రపఱచు

పేడ బిరియానీ

సంక్రాంతి సందర్భంగా కోస్తాలో కోడి పందేలకి తరలి వెళ్లిన తెలంగాణ నాయకులు‘ – చద్ది వార్త

‘ఆంధ్రోళ్ల బిర్యానీ పేడ లెక్కుంటది’ – తాజా వార్త

—-

అసుర సంధ్య వేళ దాటి అటూ ఇటూగా ఆరుగంటలయింది. ఆఖరి కస్టమర్ ఇచ్చిన బిల్లు డబ్బులు సరిచూసుకుంటున్నాడు వెంకట్రావు. పగలంతా డొంకరోడ్డు మీద దుమ్మురేపిన ట్రాఫిక్ అప్పటికి బాగా తగ్గిపోయింది. సంక్రాంతి సీజన్ కావటంతో అర్ధరాత్రి కావస్తున్నా రద్దీ పూర్తిగా సద్దుమణగలేదు. లేకపోతే తొమ్మిది గంటలకే హోటల్ కట్టేసుండేవాడతను.

‘బిర్యానీ బ్రహ్మాండంగా ఉంది బాబాయ్. ఈ సారి మళ్లీ ఇటొస్తే తప్పకుండా ఇక్కడాగి తినాల్సిందే’.

కస్టమర్ మాటలకి చిరునవ్వు నవ్వాడు వెంకట్రావు. అతనికీ అభినందనలు కొత్త కావు. అతని హోటల్ బిర్యానీకి ఆ చుట్టుపక్కల యాభై కిలోమీటర్లదాకా తిరుగులేని పేరుంది మరి.

‘అయ్యగారూ, గోంగూర పచ్చడి రుబ్బి ఇస్తర్లో పెట్టినా. గిన్నిలోకి మార్చి ఫ్రిజ్జిలో సర్దుకో. పోతన్నానింక. శానా ఆలిస్సెమైనాది’, కొంగుకి చేతులు తుడుచుకుంటూ అటుగా వచ్చి చెప్పింది నాగి.

‘పోదువు కానీ ముందా గొడ్లు కట్టెయ్యి. అదే చేత్తో కొష్టం కొంచెం శుభ్రం చేసిపో’, చిల్లర లెక్కపెట్టి కస్టమర్‌కిస్తూ చెప్పాడు వెంకట్రావు. అయిష్టంగా మొహం పెట్టి అటెళ్లింది నాగి.

‘ఈ సారి బెట్టింగ్ కోట్లలోనే ఉందంట బాబాయ్. నైజాం సైడు నుంచి పెద్ద పెద్ద లీడర్లు కూడా వచ్చి ఆడుతున్నారంట’, చిల్లర జేబులో పెట్టుకుంటూ అన్నాడు కస్టమర్. అతని దృష్టి దూరంగా ఉన్న కొండమలుపు వైపు ఉండటం చూసి తనూ అటు చూశాడు వెంకట్రావు. నాలుగైదు కార్లు రయ్యి రయ్యిన వస్తున్నాయి అట్నుండి.

ఆ కొండ వెనకాల ఏటేటా ఈ సీజన్లో కోడి పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అలనాడు పలనాటి ఊళ్లలో దర్జాగా వెలిగిపోయిన పందేలు నిషేధం దరిమిలా నీరసంగా ఇలాంటి కొండలూ గుట్టల వెనక్కి తరలిపోయాయి. నాలుగైదేళ్లుగా వాటిల్లో పేరుమోసిన రాజకీయ నాయకుల పెట్టుబడులు ఎక్కువైపోయాక అధికారిక నిషేధం కాగితం పులయ్యింది, కోళ్ల పందాలు అనధికారిక సంస్కృతీ చిహ్నాలయ్యాయి. ఏది ఏమైనా, కోడి పందేల నిమిత్తం ఆ దారిన వచ్చేపోయే వాళ్లందరూ తన హోటల్ బిర్యానీ కోసం ఎగబడటంతో వెంకట్రావుకి మాత్రం పంట పండింది.

—-

‘దొరకి ఈ కోడి పందేల పిచ్చేందిబై? ఎక్కడ జనం గుర్తుపడ్తరో అని హడలి చచ్చినా. ఓడిపొయి బచాయించినం. లేపోతే రేపూ గీడ్నే ఉండాల్సొచ్చేది’, గుసగుసగా అన్నాడు యాద్గిరి.

‘ఛస్.. మూస్కుని గాడీ తోలుబే. సాబ్‌కి ఇనిపిస్తే సస్తవ్. ఎక్వ తక్వ వాగక్. సాబ్ ఏదంటే అదే రైటనాల, ఏం సేస్తే అది మూస్కుని సూడాల. గదే మన పని. సమజైందా?’, మెల్లిగా కసురుకున్నాడు మల్లేష్ వెనక్కి తిరిగి చూస్తూ.

వెనక సీట్లో వ్యూహాత్మక మౌనంలో మునిగున్నాడు దొరసాబ్. కారెక్కేముందు పూటుగా పట్ట్టించిన నాటుసారా మత్తులో సోలుతున్నా, ఆయన బుర్రమాత్రం పాదరసంలా పనిచేస్తుంది – కోడిపందాల్లో పోగుట్టుకున్న కోటిన్నరకి డబల్ మొత్తంలో తిరిగి సంపాదించే పన్నాగాలు పన్నుతుంది.

‘గది కాదు బై. గదేదో మనసైడు ఆడుకోవచ్చుగా. రేసులున్నై, బ్రాకెట్టాటుంది, కిర్కెట్ బెట్టింగుంది. గయ్యన్నీ ఆడ్తడుగదా. మల్లా గిటొచ్చీ కోళ్లపందేలేందిబై. జనాలు గుర్తు పట్టిన్రంటే మనకీడనే బొందల్ పెట్టుండేటోల్లు ….’. యాద్గిరి గొణుగుతూనే ఉన్నాడింకా, అంతలోనే దొరసాబ్ గొంతు మోగింది.

‘బిడ్డా, ఆడ ఓటలేదో ఉన్నట్టుంది జర ఆపు. ఏదన్నా తిని పోదం’

—-

ఆఖరి కస్టమర్ ఉత్తి వాగుడుకాయలాగున్నాడు. అతని కబుర్లకి ఊకొడుతూ వెంకట్రావు గల్లాపెట్టె సర్దుకుంటుండగా వచ్చి హోటల్ ముందాగింది ఇందాక కొండమలుపులో కనిపించిన కార్ల సమూహం. ఆగీ ఆగగానే బిలబిలమంటూ పదిమందికి పైగా దిగారు. వెంకట్రావు తలెత్తి అటు చూసేలోపే వాళ్లలో ఒకతనొచ్చి కౌంటర్ ముందు నిలబడ్డాడు. మరుక్షణం అతని గొంతు ఖంగుమంది: ‘తినేందుకేం దొర్కుతది భై? పద్కొండు మందిమున్నం’. ఖంగుమనిపించినవాడు మల్లేష్.

వెంకట్రావు నోరు తెరిచేలోపే వాగుడుకాయ చెప్పేశాడు, ‘బాబాయ్ దగ్గర బిర్యానీ చాలా ఫేమస్ గురూ. అది ..’

అతని మాటలు పూర్తి కాకముందే మల్లేష్ గొంతు మళ్లీ ఖంగుమంది, ‘ఐతే గదే పట్కరా’.

అంతలో కరెంట్ పోయింది. అంతటా అంధకారం.

‘నాగీ. ఆ పెట్రోమాక్స్ లైట్ అంటించి పట్రావే’, కేకేశాడు వెంకట్రావ్, ‘ఇంతమందికి సరిపడా బిర్యానీ మిగిలుందో లేదో’ అనుకుంటూ.

‘గదొద్దు. జర మోంబత్తులుంటే సూడు’, మల్లేష్ మరోమారు ఖంగు ఖంగుమన్నాడు.

‘ఏం బత్తులు!?!’

‘గదే భై. కొవ్వత్తుల్’

వింతగా అతనికేసి చూస్తూ మళ్లీ కేకేశాడు వెంకట్రావు, ‘పెట్రొమాక్స్ వద్దు, నాలుగు కొవ్వొత్తులంటించవే’

—-

దొరసాబ్ కారు దిగి పక్కనున్న నీళ్ల గాబు దగ్గరికెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కున్నాడు. అనుచరుడందించిన తువ్వాలుతో చేతులు తుడుచుకుని పక్కనున్న నులకమంచమ్మీద కూలబడ్డాడు.

అంతలో మల్లేషొచ్చి చెప్పాడు, ‘గీడ బిర్యానీ మస్తుంటది సాబ్. గదే ఆర్డరేసినా. పంద్రా మినిట్లో రెడీ ఐపోద్ది’.
దొరసాబ్ తలాడించాడు. ఆడించాక అనుమానంగా మొహం పెట్టి మల్లేష్ వంక చూశాడు. అర్ధమైనట్లు చూసి చెప్పాడు మల్లేష్.

‘పరేషానవ్వొద్దు సాబ్. కరెంట్ పీకేసినం, మోంబత్తులెట్టమని సెప్పినం. ఎవ్‌డూ గుర్తుబట్టడింక. నువ్వు బిందాస్‌గుండు’.

దొరసాబ్ ముఖంలోంచి అనుమానం మటుమాయమైంది. వెనక్కి వాలి కూర్చుని కళ్లు మూసుకుని మళ్లీ వ్యూహాత్మక మౌనంలోకి జారుకున్నాడాయన. మల్లేష్, యాద్గిరి పక్కనే నిలబడి పహారా కాయసాగారు.

—-

పావుగంట గడిచింది. చెప్పినట్లే బిర్యానీ సిద్ధమయింది. అందరికీ విస్తరాకులు, మంచినీళ్లు సిద్ధం చేసింది నాగి – ఆఖరి క్షణంలో వచ్చి తను ఇంటికెళ్లటం ఇంకా ఆలస్యం చేసినందుకు అందర్నీ లోలోపలే తెగతిట్టుకుంటూ, ఆ చికాకు బయటికే ప్రదర్శిస్తూ.

దొరసాబ్, మల్లేష్, యాద్గిరి బయట నులక మంచం ముందే టేబుల్ వేయించుకుని తింటామన్నారు. మిగతావాళ్లు పొలోమంటూ హోటల్ లోపలికెళ్లారు. నాగి కొవ్వొత్తొకటి తెచ్చి టేబుల్ మీద పెట్టబోతే వారించాడు మల్లేష్.

వేడివేడి కోడి బిర్యానీ ఆవురావురుమంటూ రెండు ముద్దలు తిన్నాక నోరు విప్పాడు దొరసాబ్, ‘నిజంగనే మస్తుంది. గుంటూరు ఘాటు మన బిర్యానికేడినుండొస్తది? దీన్ల గోంగూర పచ్చడి నంజుకుంటేనా  … ఇగ జూస్తోరి ….’, మాట పూర్తికాకముందే ఆయన దృష్టి ఎదురుగా రోటి పక్కన గట్టుమీద పెట్టున్న విస్తరాకు మీద పడింది. పిల్లగాలికి రెపరెపలాడుతుందది. అర్ధచంద్రుడి కిరణాలు అందులో ఉన్న పదార్ధమ్మీద పడి పరావర్తనం చెందుతున్నాయి. దాన్ని చూసి ఆయన కళ్లు మిలమిల మెరిశాయి. కారుమబ్బులు కమ్మినట్లుండే ఆయన మొఖం ఆ కాంతిపుంజాల ధాటికి అంత చీకట్లోనూ వెలిగిపోయింది.

‘అద్గో గోంగూర పచ్చడి. అనుకోగనే కనపడింది. ఫ్రెష్‌గా నూరినట్టుండ్రు. లాగిద్దాం జల్దీ తీస్కరండి’ అన్నాడాయన అరమోడ్పులైన కళ్లతో అటే చూస్తూ, నోట్లోనుండి ఉబికి వస్తున్న లాలాజలాన్ని ఆపుకునే ప్రయత్నమన్నా చెయ్యకుండా.

మరునిమిషంలో వాళ్ల డైనింగ్‌టేబుల్ మీద వాలిందా విస్తరాకు. ఎంగిలి చేత్తోనే ఆబగా అందులోంచి అందినంత అందుకుని బిర్యానీమీద కుమ్మరించుకుని కసాపిసా కలిపి ఓ ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు దొరసాబ్. తక్కినోళ్లిద్దరూ అదే పని చేశారు.

మొదటి ముద్దకే యాద్గిరికి పొలమారింది. గ్లాసందుకుని నీళ్లు తాగుతూ మల్లేష్ చెవిలో గుసగుసలాడాడతను ‘గుంటూరు గోంగూర గురించి కతల్ కతలే ఇన్నా. గిదేందిభై గిట్లుంది. అంత సొల్లు కార్చుకునేదానికి గిందులో ఏముంది?’

మోచేత్తో అతని డొక్కలో పొడిచాడు మల్లేష్. అతని మొహంలోనూ ఏదో చిత్రమైన కవళిక కదలాడింది. అది దాచుకుంటూ దొరసాబ్‌తో అన్నాడు, ‘బిర్యానీ జబర్దస్తుగుందిగానీ గోంగూర పచ్చడికంత సీన్ లేదు సాబ్’.

‘అరె చుప్. ఆంధ్రాల గోంగూర పచ్చడి గిట్లనే ఉంటది. ఎప్పుడైనా తిన్న మొగమైతేగదా ఆ రుచి తెలిసేది. వంకల్ పెట్టకుండా నోర్మూస్కు తిను బిడ్డా’, దొరసాబ్ కసిరాడు ఆకులోంచి మరో ముద్ద తీసి బిర్యానీలో దట్టిస్తూ.

—-

భోజనాల తర్వాత అరగంటసేపక్కడే విశ్రాంతిగా కూర్చున్నాక ఇక బయల్దేరదామన్నట్లు లేచాడు దొరసాబ్. మల్లేష్ తప్ప మిగతా అనుచరులందరూ అప్పటికే కార్లలో కూర్చుని అసహనంగా ఎదురుచూస్తున్నారు. యాద్గిరి కడుపులో తిప్పుతుంది. ‘ఛత్. దీని ఘాటేమొ గాని ఐద్రాబాద్ పోయేతల్కి ఖతమయ్యేటట్టున్న. గింకెప్పుడూ ఆంధ్రోల్ల బిర్యానీ తిన్రాదు మల్ల’ అనుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఆపసోపాలు పడుతున్నాడు.

కార్లోకి ఎక్కబోతుండగా నాగి మాటలు వినపడి ఆగిపోయాడు దొరసాబ్. రోటి దగ్గరనుండి వెంకట్రావుతో పెద్ద్దగా అరిచి చెబుతుందామె.

‘పండగ పూట ముగ్గులో గొబ్బెమ్మల కోసరం ఈల్దాక గొడ్లకాడ్నించి ఇంత పేడ ఇస్తర్లోకెత్తి ఈడ గట్టు మీదెట్టినా. నువ్వేమన్నా తీసి పారేసినావా అయ్యగారూ?’

అప్పటిదాకా అరవిరిసినట్లున్న దొరసాబ్ వదనం అవి చెవినబడగానే ఆముదం తాగినట్లయింది.

 

 

 

 


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.