డిసెంబర్ 31 చక్కా పోయింది, నరసింహుడు అన్నట్లే నూతన సంవత్సరం చక చకా వచ్చేసింది. జనవరి ఆరు సైతం రానూ వచ్చింది, పోనూ పోయింది. రానిది భూకంపాలు. ఐపు లేకుండా పోయింది అంతర్యుద్ధాలు సృష్టిస్తామంటూ అరచి రంకెలు పెట్టినోళ్లు. మూతపడింది రాష్ట్రాన్ని చీల్చకపోతే నరుకుతాం, చంపుతామంటూ మిడిసి పడ్డ నోళ్లు. కరడుగట్టిన ప్రాంతీయవాదుల కళ్లు బైర్లు కమ్మేలా ‘అభివృద్ధిలో తెలంగాణకి దక్కిన వాటా ఘనమే; రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతం తెలంగాణ కాదు – రాయలసీమే’ అంటూ ఆధారసహితంగా వాస్తవాల కుండ బద్ధలు కొట్టిన నివేదికపై వేర్పాటువాదులెంతగా విరుచుకుపడనీ, ‘అప్పు రేపు’ టైపులో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే రాజీనామాలు చేస్తామంటూ మేకపోతు గాంభీర్యాలెన్నైనా చిలకరించనీ …. కళ్లముందున్న నిజమొకటే: అబద్ధాల పునాదులపై కట్టబోయిన అద్దాల సౌధం పేకమేడలా కూలిపోయింది. తెలంగాణ రాదని తేలిపోయింది. రాష్ట్రం చీలదని తెలిసిపోయింది. అవరోధాలెన్నెదురైనా అంతిమంగా సత్యానిదే జయం. సమైక్యతకే పట్టం.
ఇంత జరిగినా, సెంటిమెంటంటూ ఎంత ఊదరగొట్టినా, తెలంగాణలో ఆగ్రహం అంబరాన్నంటలేదు. ఉలుకెక్కడన్నా ఉంటే గింటే అది ఉన్మాదియా యూనివర్సిటీ పెరట్లోనే. విశ్వవిద్యాలయాలు వినూత్న ఆవిష్కరణలకు వేదికలవటం విదేశాల్లోనే జరిగే వింత. మన పుణ్యభూమిలో ఏ విశ్వవిద్యాలయమూ అంత పుణ్యం మూటగట్టుకున్న పాపాన పోలేదు. మన రాష్ట్రంలో డజనుకు పైగా పోగుబడ్డ పేరు గొప్ప విశ్వవిద్యాలయాలదీ అదే తీరు. వాటిలో తక్కినవన్నీ ఒకెత్తైతే హైదరాబాదు నడిబొడ్డునున్న ఈ వందేళ్ల పైబడ్డ యూనివర్సిటీ ఒక్కటీ ఒకెత్తు. అదేమి ఖర్మో కానీ, దీని పేరు వినగానే తాజా తరంలో ఎవరికన్నా గుర్తొచ్చేది అక్కడ తగలబడ్డ బస్సుల సంఖ్య; కిందటి తరంలోనైతే ఆ పేరెత్తితే అమెరికన్ కాన్సులేట్లు వీసాలు నిరాకరించిన వైనం; ఇంకా ముందుకెళితే అక్కడి విద్యార్ధులు ఇక్కడ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనవసరం లేదనే వెక్కిరింపులు దర్శనమిచ్చిన ఉత్తరాది కంపెనీల కార్యాలయాలు. వెనకబాటుదనం, వివక్ష, వగైరా కబుర్లన్నీ తేలిపోయాక వేర్పాటువాదులకు మిగిలిన దిక్కు ఇంత ఘనత వహించిన విశ్వవిద్యాలయ ‘విద్యార్ధుల’ భావావేశం. హైదరాబాదులో కొలువైన అరడజను పైగా ఇతర విశ్వవిద్యాలయాల్లోనూ, వందలాది కళాశాలల్లోనూ విద్యార్ధులకు లేని దురద ఈ ఒక్కచోటి విద్యార్ధులకేలయా అంటే అది బహిరంగ రహస్యమే. అక్కడ గొడవలు చేస్తున్న ‘విద్యార్ధులకి’ ఆదేశాలూ సందేశాలూ, డబ్బూ దస్కం ఎక్కడినుండొస్తున్నాయో అందరికీ ఎరుకే. రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేసిన మంచిపనేదన్నా ఉంటే అది ఇప్పటికన్నా కళ్లు తెరిచి ఈ యూనివర్సిటీని పట్టిన దెయ్యాల్ని పారదోలబూనటం. పనిలో పనిగా, ప్రభుత్వోద్యోగాల్లో ఉండి విద్యార్ధుల్ని రెచ్చగొట్టే ప్రొఫెసర్లనీ ఓ పట్టు పడితే మిగిలిన దరిద్రమూ వదులుద్ది.
నివేదికపై ఉద్యమ పార్టీ పెదవి విరిచిన విధానం విస్తుగొల్పదు. తాము ‘ఆంధ్రోళ్లు దోపిడీదార్లు, దొంగలు’ అంటూ వేసిన నిందల్నీ, తెలంగాణ వెనకబాటుదనమ్మీద చేసిన అసత్య ప్రచారాన్నీ పిచ్చిగా నమ్మేసే వెర్రిబాగుల జనాలు ఓ అధికారిక నివేదిక బయటపెట్టే అసలు నిజాలని అంతకన్నా తేలిగ్గా అంగీకరిస్తారన్న తెలివితేటలున్న దొరగారు ముందుచూపుతో మున్ముందుగానే దాన్నో దిక్కుమాలిన కమిటీగా వర్ణించిన నాడే వారి ఓటమి ఖరారైపోయింది. ఈ రోజిక అయ్యవారెన్ని వీరాలాపాలు చేసినా ఒరిగేది సున్న. ఓ పక్క వేర్పాటువాద కాంగీ వృద్ధ జంబూకాలు అధిష్టానం మొట్టికాయలతో మూలకూర్చుని, మరోపక్క తెలంగాణ తెలుగు తమ్ముళ్లు సైతం అధినేత ఎట్టకేలకి చూపిన తెగువకి అవాక్కై తోకముడిచాక … ఇక ఈ పది అబద్ధాల ముద్దు బిడ్డ కథ కంచికే. రాబోయే నెలల్లో అడపా దడపా అడ్డంకులెదురైనా, ఆఖరుకి మిగిలేది అవిభక్త ఆంధ్రప్రదేశ్.
ఆఖర్లో ఓ పొడుపు కథ: ఇచ్చుడో చచ్చుడో అన్నాడో పిట్టలదొర. అందులో ముందుది అయ్యేపని కాదని తేలిపోతే మిగిలింది జరిగేనా, జరగక మానేనా?
మీ మాట