ఆగస్ట్, 2008ను భద్రపఱచు

పందిరాజము

ఈ టపా శీర్షిక వింటే చాలు ఎంత చిరాకులోనైనా నా ముఖాన చిరునవ్వు విరబూస్తుంది. హైస్కూల్లో మా లెక్కల మాస్టారు సృష్టించిన పదమది. సెట్ థియరీ పాఠాలు చెప్పేటప్పుడు ఆయన ఉదాహరణలెప్పుడూ పందులతో మొదలై పందులతోనే ముగిసేవి. శ్వేత వరాహాలన్నీ ఒక సమితి, నల్లవి మరో సమితి. అలాగే బురద కొట్టుకున్నవి, గోధుమ రంగువి, బొద్దువి, బక్కవి, ఊరపందులు, సీమపందులు, ఇలా రకరకాల సమూహాలు. ఈ గుంపుల మధ్య యూనియన్లు, ఇంటర్‌సెక్షన్లు లాంటి ఆపరేషన్లు చేసి చివరికి ఎన్ని పందిరాజాలు మిగిలాయో ఆయన అలవోకగా వివరించేస్తుంటే మాకు ‘ఓస్, సెట్ థీరీ ఇంత వీజీయా’ అనిపించేది. ఆ కారణంతో చిన్నప్పుడే పందులంటే అవ్యాజానురాగం పుట్టుకొచ్చింది. దానికి ఆజ్యం పోసిన వాడు ‘ఈనాడు’ శ్రీధర్. అతని కార్టూన్లలోని పంది బొమ్మలు నాకు తెగ ముద్దుగా అనిపించేవి.

అంత ముద్దొస్తున్నా అదేంటోగానీ వీటంత దారుణంగా జనాలు అపార్ధం చేసుకున్న జంతువు మరోటి లేదు. తెలివితక్కువ మాలోకాలంటూ చులకన చేస్తారు కానీ భూమ్మీద మనుషులు, కోతులు, డాల్ఫిన్ల తర్వాత అత్యంత తెలివితేటలు గల జంతువులు పందులే. వాటి పరిశుభ్రత గురించీ ఎక్కువమందివి తప్పుడు అభిప్రాయాలే. నివాస ప్రాంతాలని శుభ్రంగా పెట్టుకునే అతి కొద్ది జంతువుల్లో ఇవీ ఒకటి. చెమట గ్రంధులు లేకపోవటం వల్ల వళ్లు చల్లబరుచుకోటానికి అవి బురదలో పొర్లాడుతుంటే చూసి చీదరించుకోటమే కానీ అయ్యోపాపం అనుకునేవాళ్లెందరు? వాసన చూడటంలో జాగిలాలకున్నంత నేర్పున్నా పోలీసన్నలు నేర పరిశోధనలో కుక్కలకి ఇచ్చినంత విలువ పందిరాజాలకివ్వకపోవటం వాటికెంత అవమానం?

అసలు దశావతారాల్లో పంది అవతారంకన్నా విశిష్టమైనది ఏదీ లేదు. మిగతావన్నీ భూమ్మీద ఏ కొందరి కష్టాలో తీర్చటానికి ఉపయోగపడ్డవే కానీ వరాహావతారంలా మొత్తం భూమండలాన్నే హోల్‌సేల్‌గా రక్షించేసిన అవతారం మరోటుందా? ఆనాడు విష్ణుమూర్తి పందిగా మారి భూమినీ, పన్లో పనిగా వేదాలనీ కాపాడకపోతే ఎంత దారుణం జరిగిపోయుండేది? తెల్లోళ్లు మన వేదాలని కాపీ కొట్టేసి కంప్యూటర్లూ, ఇంటర్నెట్టూ కనిపెట్టగలిగేవాళ్లా? అప్పుడు బ్లాగర్ల గతేమయ్యుండేది? మరి విష్ణుమూర్తంతటోడే ప్రపంచాన్ని కాపాట్టానికి ఏ కుక్కదో, పిల్లిదో కాకుండా పందిరాజం అవతారమెత్తాడంటేనే తెలీటంలా దాని గొప్పేంటో? యుగాల నాటి మాటెందుకు, మనమీనాడు స్వతంత్ర భారద్దేశంలో స్వేచ్చా వాయువులు పీల్చేస్తూ కులాసాగా పందులగురించి కబుర్లు చెప్పుకుంటున్నామంటే అది ఎన్ని వరాహమాతలు కన్నబిడ్డల త్యాగఫలమో. వాటి కారణంగా కాదూ సిపాయిల తిరుగుబాటు మొదలయింది. పందులా మజాకా!

సెట్ థియరీ నేర్పాయన్న కృతజ్ఞతతో హైస్కూలు రోజుల్లో పందులంటే పూజ్య భావముండేది నాకు. అప్పట్లో ఉదయాన్నే రేడియో వినటం నాకలవాటు. రోజూ ఉదయం ఏడున్నరకో ఎనిమిదికో – వివిధభారతిలో అనుకుంటా – వాణిజ్య వార్తల్లాంటివొచ్చేవి. అందులో ‘సీమ పంది వారు కిలో ఒక్కింటికి గన్నవరంలో పది రూపాయలు‘ అన్న వాక్యం వినగానే నాకు గుండెలో కలుక్కుమనేది. దాంతో, జన్మలో పందిమాంసం ముట్టనని హైస్కూల్లో ఉండగా పెట్టుకున్న ఒట్టు ఇప్పటికీ తీసి గట్టుమీద పెట్టలేదు. గురువుని ఎలా భోంచేసేది? కొన్నేళ్ల తర్వాత నాలాగే ముస్లిములు కూడా పందిమాసం తినరని తెలిసింది. నాటినుండీ ముస్లిములన్నా, ఇస్లామన్నా నాకు వల్లమాలిన అభిమానం.

హైస్కూల్లోనే, ఓ రోజు నా లావుపాటి సహాధ్యాయిని ఓ బక్కోడు ‘పంది వెధవా’ అని తిడితే ఆ తిట్లు తిన్నోడికన్నా నాకెక్కువ కోపమొచ్చేసింది. సదరు పంది వెధవ గమ్మునున్నా నేనెళ్లి ఆ బక్క వెధవ మొహం పచ్చడి చేసొచ్చా. అంత కోపమొస్తే ఏనుగు వెధవా అనో హిప్పో వెధవా అనో అనొచ్చు కదా. ఏం, పందులంత తేరగా దొరికాయా? అరె, ఆఖరుకి సమసమాజమంటూ ఊదరగొట్టిన శ్రీశ్రీ సైతం వరాహాలని చిన్నచూపు చూసినోడే! ‘పంది పిల్లా, అగ్గి పుల్లా’ అనుంటే ఆయన సొమ్మేం పోయేది? మొదటిసారి అది చదివినప్పుడే నిర్ణయించుకున్నా – కవితలేం ఖర్మ, పందిరాజములు ఏకంగా వ్యాసాలకే అర్హమైనవని నిరూపించాలని. అసలు ఈ అమాయక ప్రాణులకి వ్యతిరేకంగా క్రీస్తు పూర్వమే ప్రపంచవ్యాప్తంగా పెద్ద కుట్ర జరిగిందని నా అనుమానం. లేకపోతే నాటినుండి నేటిదాకా కుక్కల్నీ, పిల్లుల్నీ ఎగబడి పెంచుకునేవాళ్లే కానీ పందిరాజాలని పట్టించుకునేవారేరీ? దొంగలు పడ్డాక ఆర్నెల్లకి మొరిగే కుక్కలకీ, గోడమీద కూర్చుని ఎటు వీలైతే అటు జంప్ చేసే పిల్లులకీ ఉన్న గౌరవం బాధ్యతగా తమ పని తాము చేసుకుపోయే పందులకి లేకపోవటం ఎంత ఘోరం? నట్టింట్లో తోక ముడేసుకుని గున గున నడుస్తూ పంది పిల్లలు సందడి చేస్తుంటే వచ్చే అందం నాలుక వేలాడేసుకుని చొంగ కార్చే కుక్కల్తోనో, మూతి నాక్కుంటూ మిడి గుడ్లేసుకు చూసే పిల్లుల్తోనో వస్తుందా?  నాకే గనక అధికారం ఉంటే ఇంటికో పందిరాజాన్ని పెంచుకు తీరాలని శాసనం చేసి పారేస్తా. డబ్బులుంటే అక్షయ్ కుమార్‌ని పెట్టి ‘పిగ్ ఈజ్ కింగ్’ పేరుతో హాలీవుడ్ సినిమా తీసేసి పందుల గొప్పదనాన్ని ప్రపంచమంతటా చాటుతా. చిరంజీవికున్నంత ఫాలోయింగుంటే ‘పందిరాజ్యం’ పార్టీ పెట్టేసి ప్రజల్నీ, పందుల్నీ ఉద్ధరించేస్తా. అవేవీ లేవు కాబట్టి ప్రస్తుతానికిలా బ్లాగైటంతో సరిపెడుతున్నా.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,834

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.