సెప్టెంబర్, 2011ను భద్రపఱచు

పసలేని కథలు

అనగనగా ఓ ఊళ్లో ఓ రెడ్డిగారున్నారు. ఆయనంటే అందరికీ గౌరవం. ఎందుకంటే – ఇందుకు.

రెడ్డిగారు శానా దరమ పెబువు. ఊళ్లో ఎవరికే తగువొచ్చినా ఆయనే తీరుస్తాడు. గుళ్లో చోరీ చెయ్యబోయిన దొంగోడి చేతులు నరికేయమంటాడు. కాబోయే అల్లుడు ఎవరో అమ్మాయిని పాడుచేశాడని (ఆ కుర్రోడు అడగ్గానే ఆ విషయం ఒప్పేసుకున్నాక) వాళ్లిద్దరికీ పెళ్లి చేసెయ్యమంటాడు. తన కొడుకు కులం తక్కువ పిల్లని ప్రేమించానని చెబితే వాళ్లిద్దర్నీ లేచిపొమ్మని ప్రోత్సహిస్తాడు.

ఇంతే కథ. ఈ మాత్రం మూలకథకి మూడు పేజీల వర్ణనలు, పేజీకో పదిహేను పాత్రలు, పాత్ర పాత్రకీ ఇంటిపేరుతో సహా పరిచయాలు, సవాలక్ష ఇతరత్రా వివరాలు – వాళ్ల వంశవృక్షాల కాణ్నించి, ఎవరేం పనులు ఎలా చేస్తారనేదానిదాకా. కూర తక్కువై తాలింపెక్కువైన తంతు. పై కథ చదివాక రెడ్డిగారు శానా దరమ పెబువు ఎలాగయ్యాడబ్బా అని మీరనుకుంటే మీరు నాలాంటివాళ్లైనట్లు; -కోకపోతే తెలుగు సాహితీ విమర్శనాగ్రేసరులైనట్లు. నాసి రకం రచనలు ఉత్తమ సాహిత్యంగా మన్ననలందుకోటం ఈ బాపతు విమర్శకుల పుణ్యమే.

నాలుగు పేజిల నిండా ఏం బరికినా, అచ్చైతే చాలు అదో కథైపోతుందనేది తెలుగునాట మళ్లీ మళ్లీ రుజువవుతున్న సత్యం. ఆ బరుకుళ్లకి బాపూ బొమ్మలు కూడా తోడైతే నా సామిరంగా ఇక అవి అల్లాటప్పా కథలు కావు. మనిషి జన్మనెత్తినవాడు చదివి తీరాల్సిన ఆణిముత్యాలు! పై ఆణిముత్యాన్ని పుట్టించింది వంశీ. ఇలాంటి ముత్యాలు మరో డెబ్భయ్యొకటున్నాయి ‘మా పసలపూడి కథలు’ పేరుగల ఆల్చిప్పలో. ఈ పుస్తకం గురించి ఈ మధ్య కాలంలో విన్నదాన్ని బట్టి ఏదేదో ఊహించుకుని, అట్ట మీదా లోపలా బాపు గీసిన బ్రహ్మాండమైన బొమ్మలు చూసి మురిసిపోయి ఇదేదో చదివి తీరాల్సిన పుస్తకమేననుకుని కొనుక్కొస్తే, సగం చదివేసరికి తల దిమ్మెక్కిపోయింది. తక్కిన సగం చదివే దమ్ము లేకపోయింది.

కనాకష్టంగా ఇందులో నే లాగించిన కథలు ముప్పై రెండు. అవన్నీ చదివాక నాకనిపించింది – వంశీ కథలు రాయటం పూర్తిగా మర్చిపోయాడని. కథ అనే పదార్ధానికి సంబంధించిన కనీస లక్షణాలేవీ లేనివే ఈ ముప్పై రెనండిట్లోనూ మెండు. ఉదాహరణకి ఒకటి.

‘దీపావళి ఇక మూడు వారాలుందనగా బాలవరంలో టీచరుగా చేరిన అనంతలక్ష్మికి రొంపజ్వరంలాగా వచ్చింది’.

‘కోరి రావులుగారి బస్ కండక్టర్’ అనే కథకి ప్రారంభ వాక్యం పైది. ‘అనంతలక్ష్మి దీపావళికి మూడు వారాల ముందు టీచరుగా చేరిందా, లేక పండక్కి మూడు వారాల ముందు ఆమెకి జ్వరమొచ్చిందా’ అన్న గందరగోళంలో పడ్డాన్నేను. ఆరు పేజీల ఈ కథలో ఒకటిన్నర పేజీలు బాపూ బొమ్మలకి పోగా మిగిలిన నాలుగున్నరలో ఒక పూర్తి పుట అనంతలక్ష్మి వివరాలతో నింపేసి ఆమెకి ఆ తర్వాతేమైందనే అసక్తి పాఠకుల్లో విజయవంతంగా కలిగించాక అసలు కథానాయకుడిని ప్రవేశపెడతాడు వంశీ. మిగిలిన కథంతా (అదంటూ ఒకటుంటే) సదరు పరోపకారి పాపన్న గురించే. అనంతలక్ష్మి దీపావళికి మూడు వారాల ముందు బళ్లో చేరిందో, సంక్రాంతి వెళ్లిన నాలుగో రోజు జ్వరపడిందో, ఆవిడ చుట్టాలు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో ఇవన్నీ ఈ కథకి అనవసరం. వంశీకేమో అవన్నీ పూర్తిగా అవసరం అనిపించినట్లున్నాయి. నాకు మాత్రం ఇది కాగితాలు నింపే యవ్వారంలాగే కనిపించింది.

కథకి ఏ మాత్రం ఉపయోగపడని ఇలాంటి వివరాలూ, విశేషాలూ కోర్రావులు గారి కండక్టరుకే పరిమితం కాదు. ‘తామరపల్లి సత్యంగారి తమ్ముడు రామం’ కథకీ తామరపల్లి సత్యంగారికీ ఎటువంటి సంబంధమూ లేదు. అందులో ఆయన ప్రస్తావన సైతం రాదు. దీన్ని ‘పుల్లాయమ్మ గారి పొరుగింట్లో ఉండే రామం’ అన్నా పోయేదేమీ లేదు – ఇలాంటి పిచ్చి ప్రశ్నలేసి అచ్చేయననే సంపాదకులు లేనంతవరకూ. తాను ఏం రాసినా, ఏం చేసినా చెల్లిపోతుందనే భావనో లేక పాఠకులపై అంత చిన్నచూపో – మొత్తమ్మీద కథలు రాయటమే కాక వాటికి పేర్లు పెట్టటంలో సైతం వంశీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందిక్కడ.

వంశీ నిర్లక్ష్యానికి ఉదాహరణలు వెదక్కుండానే కథకో పదన్నా కనపడతాయీ పుస్తకంలో. పైన చెప్పుకున్న రెడ్డిగారి సొదనే తీసుకుంటే, కిళ్లీ కొట్టు వీరన్న (ఉరఫ్ కిళ్లీరన్న) చెప్పే కథ అదంతా. రెడ్డిగారు కొడుకుని లేచిపొమ్మని ప్రోత్సహించటం మూడో మనిషికి తెలీకుండా చేసిన పని. మరది కిళ్లీరన్నకి ఎలా తెలిసిందో వంశీకే ఎరుక. ఈ కథ ఇంకా నయం. ఉత్తమ పురుషంలో నడిచే మిగతా కథల్లో కూడా ఇదే ధోరణి. ఎదుటి వ్యక్తి మనసులో అనుకునే విషయాలు సైతం కథకుడు అలా అలా అలవోకగా చెప్పుకుపోతుంటాడు!

‘మునగచెట్టు’ అనే మరో కథుంది. నెయ్యి అమ్ముకుని పొట్టపోసుకునే ఇద్దరు దంపతుల కథ.  కథ మొదట్లో ఈ దంపతులకి ఏడుగురు పిల్లలని చెప్పి, ఎవరే క్రమంలో పుట్టిందీ, వాళ్లకీ ఏ పేర్లు ఎందుకు పెట్టిందీ – ముద్దు పేర్లతో సహా – చెప్పుకుంటూ వస్తాడు రచయిత. కథ సగానికొచ్చేసరికి ఎనిమిదో కొడుకు పుట్టుకొచ్చేస్తాడు ఎక్కడ్నుండో! పిల్లలు పెద్దాళ్లై ఎవరెవర్ని పెళ్లి చేసుకున్నారు, ఎక్కడ కాపురాలు పెట్టారు – ఇవి మిగతా పేజీలకి సరిపడా సరుకు. పిల్లలందరూ ఎవరిదార్న వాళ్లు పోతే పెరట్లో పెంచుకున్న మునగచెట్టే ముసలితనంలో పెద్దాళ్లిద్దరికీ అన్నీ అయ్యిందనే నాటకీయ ముగింపు చివర్లో. ఇంతోటి కథకి ఎనిమిది మంది సంతానాన్ని పెట్టాల్సిన అవసరమే లేదు, వాళ్ల వివరాలతో కాగితాలు నింపటానికి తప్ప. ఇంత సంతు ఎందుకో వంశీకే తెలిసినట్లు లేదు. ఏదో నోటికొచ్చిన పేర్లన్నీ రాసుకుపోయినట్లున్నాడు. ఆ క్రమంలో పాఠకుల్ని గందరగోళపరచటమే కాక, స్వయంగా తానూ గందరగోళపడిపోయాడు – ఓ సారి ఏడుగురు పిల్లలనీ, ఇంకోసారి ఎనిమిది మందనీ అనటం ద్వారా. ఇది చదివాక, ఎడిటర్లు ఇలాంటి కథలు అచ్చేసేముందు కనీసం చదువుతారా లేదా అన్న సందేహమొచ్చింది నాకు. అయితే ‘బురకమ్మ కర్రీరెడ్డి’ చదవగానే బుర్రలో లైటు వెలిగింది; పై సందేహానికి సమాధానం తెలిసింది . ఎడిటర్లే కాదు, వంశీ సైతం ఓ సారి రాసి పడేశాక తన కథ తనే చదువుకోడని అర్ధమైపోయింది.కింది పేరా చదవండి.

‘ఆ మధ్యాన్నం సైకిలుషాపు పాపారావుగారింటి ముందు నిలబడ్డ ఆంబోతుకి పాపారావుగారి రెండోవాడు చేటలో కొత్త ఒడ్లు పెడితే తినేసెళ్లిపోయింది. మైకుసెట్టు గోపాళంగారింటి ముందు ఇసక గుట్ట మీద కూర్చున్న ఇద్దరు చిన్నపిల్లలు తలంబ్రాలు పోసుకున్నట్టు ఇసకని నెత్తిమీద పోసుకుంటుంటే అందులో ఓ పిల్లతల్లొచ్చి బాదుకుంటా తీసుకుపోయింది. బుచ్చిరాజు కిళ్లీకొట్టు ముందు వేలాడుతున్న అరిటిపళ్ల గెలకి కత్తి దిగబడి ఉంది. పెద్దవీధిలో అరుస్తా సైకిలు తొక్కుకుంటా వెళ్తున్న బట్టల మూటోడు బాగా లావుగా ఎత్తుగా ఉన్నాడు. వాడి గొంతు మట్టుకు ఆడదానిలాగుంది’

‘బురకమ్మ కర్రీరెడ్డి’ కథ మధ్యలో దర్శనమిచ్చే ఈ ఐదు వాక్యాలకీ అసలు కథతో బీరకాయపీచు సంబంధమన్నా ఉందని ఎవరన్నా నిరూపిస్తే నేను ముక్కు నేలకి రాసి కేసీఆర్‌కి కాల్మొక్తా. టెలిఫోన్లో క్రాస్ టాక్‌లా ఎక్కడ్నుండో ఊడిపడ్డ ఆ పేరా చదివాక కానేపు బుర్ర తిరిగింది. వేరే కథలో వాక్యాలు పొరపాటున ఈ కథలో అచ్చైపోయాయేమోనన్న అనుమానమొచ్చింది. వెన్వెంటనే – లావుపాటి బట్టల మూటోడి ఆడగొంతు గురించీ, నెత్తిలో ఇసుకపోసుకుంటున్న పిల్లల గురించీ, అరటిపళ్ల గెలకి దిగబడున్న కత్తి గురించీ, చేటలో కొత్త ఒడ్లు తిన్న ఆంబోతు గురించీ అప్రస్తుత ప్రసంగాలూ, అసందర్భ వర్ణనలూ చేయటం వంశీ మార్కనే సంగతి స్ఫురించి – అది అప్పుతచ్చు కాదన్న నమ్మకం కుదిరింది, తెలుగు కథల మీద విరక్తి ముదిరింది. చదివేవారు రాసేవారికి లోకువ అన్న లోకోక్తి ఇప్పటికే లేకపోతే పుట్టించాల్సిన తరుణం ఆసన్నమయింది.

రాసుకుంటూ పోతే ఇలా వస్తూనే ఉంటాయి కాబట్టి లోపాల గురించి ఆపేసి ఆయా కథల్లో వస్తువు గురించి చూద్దాం. ఉంచుకోటాలు, లేచిపోటాలు, భోగం మేళాలు, రికార్డింగ్ డాన్సులు, అక్రమ సంబంధాలు – ఇలా తనకిష్టమైన సబ్జెక్టుల చుట్టూతే దాదాపు అన్ని కథల్నీ తిప్పుతూ అదే గోదావరి సంస్కృతి అని నమ్మించబోయాడు వంశీ. ఒక్కో రచయితకీ ఒక్కో తరహా ఇతివృత్తాలపై ఆసక్తి ఉంటుంది. వంశీకి ఇవంటేనే అమితాసక్తేమో. మొత్తమ్మీద, ఎక్కువ శాతం ఒకే మూసలోని కథలు. అసలు మంచి కథలే లేవా వీటిలో అంటే, ఉంటానికి ఒకట్రెండున్నాయి. ‘జక్కం వీరన్న’, ‘సత్యం పలికే స్వరాజ్యరెడ్డిగారు’ అనేవి ఉన్నంతలో నాకు నచ్చిన కథలు. ముప్పై రెండు చదివితే రెండు ఫర్లేదనిపించే కథలు!

జక్కం వీరన్న గురించి కొంచెం చెప్పుకోవాలిక్కడ. ఒకప్పుడు గోదావరి జిల్ల్లాల్లో పేరుమోసిన వడ్రంగి  ఇతను. కాలక్రమంలో తాగుడుకి బానిసై సర్వభ్రష్టుడై చివరి రోజుల్లో జనానికి తన గతం గుర్తుచేస్తూ ముష్టెత్తుకున్న మనిషి. ‘పసలపూడి కథలు’ పుస్తకం మొదటి పేజీలో ప్రముఖంగా ముద్రించున్న బాపూ-రమణల ప్రశంసా పత్రం చూస్తే నాకు జక్కం వీరన్న కథే గుర్తొచ్చింది.

ఎందుకో?


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.