టెలివిజన్లో పోటీ కార్యక్రమాలు – ఏ భాషవైనా, ఏ దేశానివైనా – చూసే అలవాటు నాకు పెద్దగా లేదు. నేను టీవీలో చూసేది ఎక్కువగా హిస్టరీ, ట్రావెల్, డిస్కవరీ వగైరా ఛానళ్లు; అడపాదడపా ఎవ్రిబడీ లవ్స్ రేమండ్, బిల్ కాస్బీ షో, ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్ పునఃప్రసారాలు మాత్రమే. ఆ మధ్య కొంతకాలం పాటు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకట్రెండు హిందీ జీడిపాకం సీరియళ్లు చూడాల్సొచ్చింది – తర్వాతెలాగో ఆ బాధ తప్పిందనుకోండి. ఆ సీరియళ్ల గురించి కాదు నేనిప్పుడు మొత్తుకోబోతుంది. నేటి నా గోడు – వారం పది రోజుల క్రితం జీటీవీలోనో సోనీలోనో చూసిన ఒకానొక నాట్య పోటీ కార్యక్రమం గురించి.
దాని పేరు ‘డాన్స్ ఇండియా డాన్స్’ అనుకుంటా. పేరేదైతేనేం, ఆ నాట్యాలు మాత్రం నాకు చిర్రెత్తించాయి. వెకిలి హావభావాలతో కాళ్లూ, చేతులూ, నడుమూ వెర్రిగా ఊపేస్తూ వికార భంగిమలు పెట్టటమే నాట్యం ఎప్పట్నుండయిందో! కూచిపూడి, భరతనాట్యం మాత్రమే నృత్యాలు, మిగతావి కావనే వితండవాదిని కాను నేను. సదరు పోటీలో సల్సాలూ, సాంబాలూ కుదురుగా చేసినోళ్లూ లేకపోలేదు. ఎక్కువ మందివి మాత్రం పిచ్చి గంతులే. తమాషా ఏంటంటే – ఎవరెంత పిచ్చిగా గెంతితే వాళ్లకి జడ్జీల నుండి అంత ప్రోత్సాహం!ఈ జడ్జీలు బాలీవుడ్లో ఛోటా మోటా నృత్య దర్శకులూ/రాళ్లూనట. అసలా పోటీదార్లకి శిక్షణిచ్చింది కూడా వీళ్లేనట. సందు దొరికింది కదాని శుభ్రంగా తమ సినిమా పైత్యం టీవీలకీ పాకించేశారు – పీలికల గుడ్డలు, పిచ్చి గంతుల రూపంలో.
సరే, మళ్లీ ఇందాకటి డాన్సాట పోటీ దగ్గరికొస్తే – అమ్మాయిల వస్త్రధారణ, వారి జఘన కుదుపుల నాట్య భంగిమలు చూసి కంపరమెత్తటం ఒకెత్తైతే, అదే పోటీలో కొందరబ్బాయిలని చూసి ఏకంగా డోకే వచ్చినంత పనయ్యింది నాకు! అబ్బాయిల్లోకి హైలైట్ – అదో రకం పైత్యకారీ వేషధారణతో గెంతినోడొకడు. ఇతని ఒంటి మీదున్నదల్లా గోచి పాత లాంటి గుడ్డ పేలికొకటి మాత్రమే. ఇంకా, వంటి నిండా ఎక్కడబడితే అక్కడ తగిలించుకున్న చెవి పోగుల్లాంటి రింగులు. వీటన్నిటికీ తోడు కోడి బొచ్చు లాంటి రంగులేసుకున్న జుట్టొకటి! పాత్రోచిత ఆహార్యమనుకుందామంటే – అతనేసిన డాన్సుకీ, ఆ గెటప్పుకీ సంబంధమేమిటో ఎంత బుర్ర చించుకున్నా అర్ధమవలా.
అర్ధం కానిది మరోటి కూడా ఉంది. ఈ పోటీలో పాల్గొన్నవాళ్లందరూ టీనేజ్ దాటని అమ్మాయిలు, అబ్బాయిలే. స్టుడియోలో పోటీని ప్రత్యక్షంగా తిలకిస్తున్న ప్రేక్షకుల్లో పోటీదార్ల కుటుంబాలూ ఉన్నాయి. కుమార్తెలు పీలికల బట్టల్లో వేదికెక్కి పిచ్చి గంతులేస్తుంటే ఆనందబాష్పాలు రాలుస్తూ చప్పట్లు చరుస్తున్న ఆ ఆదర్శ మాతాపితల్ని చూసి మళ్లీ బుర్ర గోక్కోవటం నా వంతయ్యింది. రెండు మూడేళ్ల క్రితమెప్పుడో చూసిన ‘బూగీ వూగీ’ అనబడే బుడతల డాన్సు పోటీలో కూడా ఇదే తంతు. అక్కడ మరీ ఘోరం. ఐదు నుండి పదేళ్లలోపు పిల్లలు ముమైత్ ఖాన్ తరహా నాట్యాలేస్తుంటే తల్లిదండ్రుల పట్టరాని పుత్ర/పుత్రికోత్సాహం!
ఇలాంటి సందర్భాల్లో నాకో అనుమానమొస్తుంది. నేను దేశమొదిలొచ్చాక భారతీయ సమాజమింత పురోగమించిందా, లేక నేనే మరీ వెనకబడిపోయానా?
తెలుగులో ఆట కార్యక్రమంలో కూడా పదిహేను, పదహారేళ్ళ అమ్మాయిలి బొడ్డు, నడుము కనిపించేలా బట్టలు వేసుకుని డాన్సులు చేస్తున్నారు. RSS వాళ్ళకి పబ్ లపై దాడి చేసి అమ్మాయిల్ని కొట్టడం తప్ప మగవాళ్ళని కొట్టడం చేతకాదు, ఇష్టం ఉండదు కూడా. ఎంతైనా వాళ్ళూ కూడా పురుష అహంకారులే కదా.
1996లో పత్రికలలో బూతు బొమ్మలు కనిపించాయి. 2006లో ఇంటర్నెట్ లో బూతు బొమ్మలు కనిపించాయి. కొత్త రకం మీడియా వచ్చినప్పుడు బూతు బిజినెస్ గాళ్ళు ఆ కొత్త మీడియాలోకి ప్రవేశిస్తారు.
Wonderful Analysis. నేను కూడా ఆ హిందీ పైత్యానికి బలయ్యాను ఒకసారి. వాళ్ళ కన్నీళ్ళు, ఇవే చివరి చూపులన్నట్టు “అమ్మా, నువ్వు ఇలా పెంచావు నన్ను, అలా పెంచావు” అంటూ తొక్కలో డైలాగులు, Simon Cowell ను కాపీ కొడుతూ ఒకడు తిడుతుంటే వాళ్ళ ఏడుపులు.. బాబోయ్!!
ఎక్స్ పోజింగ్ విషయానికొస్తే – కాస్త హాట్ గా కనిపించినా పర్లేదు కానీ, మరీ వల్గర్‌గా తయారవుతున్నారు ఈ మధ్య. అది చూసిన వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం చూస్తే జాలేస్తోంది. అన్నట్టు ఈటీవీలో “ఢీ II” మొదలయింది ఉదయభాను యాంకర్. కొందరు అమ్మాయిలను చూడగానే “థూ దీని *బూతు* *బూతు* *బూతు* ” అని తన్నుకుంటూ వచ్చేస్తోంది. చూసి తరించండి!!
మార్తాండ గారు, 2006 లో ఇంటర్నెట్లో బూతు బొమ్మలు కనిపించాయా?? పదేళ్ళ ముందే కనిపించాయి కదా!!
నేను 1999లో కంప్యూటర్ కంప్యూటర్ (LANతో సహా) నేర్చుకున్నాను కానీ అప్పట్లో ఇంటర్నెట్ టారిఫ్ గంటకి 60 రూ. అవి కూడా స్లో కనెక్షన్లు ఉండడం వల్ల ఇంటర్నెట్ దాదాపుగా ఎవరూ వాడేవాళ్ళు కాదు. 2002 – 2006 మధ్య కాలంలో మా అమ్మానాన్నలు బ్యాంక్ ఉద్యోగం ట్రాన్స్ఫర్ వల్ల ఒక పల్లెటూరికి వెళ్ళాల్సి వచ్చింది. నేను బస్ మీద 20 కి.మి. టౌన్ కి అప్ & డౌన్ అయ్యి ఇంటర్నెట్ చేసినా అప్పుడు కూడా స్లో కనెక్షన్లే. ఇప్పుడు కూడా పల్లెటూర్లలో ఇంటర్నెట్ కనెక్షన్లు దాదాపుగా కనిపించవు కానీ టౌన్ లలో మాత్రం ఇంటర్నెట్ వల్ల చెడిపోయిన వాళ్ళు కనిపిస్తారు.
పల్లెటూర్లలో టి.వి.ల వాడకం 1990కి ముందు కూడా ఉండేది. అప్పట్లో చిత్రహార్, చిత్రలహరిల పేర్లతో వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే బూతు డాన్సులు వచ్చేవి. ఇప్పుడు చానెల్స్ సంఖ్య పెరగడం వల్ల రోజూ బూతు డాన్సులు కనిపిస్తున్నాయి.
మీరు వ్రాసినది అక్షరాలా నిజం.ఏదో ఒకటీ, అరా తప్పిస్తే ట్.వీ లలో ప్రోగ్రామ్లు చూడడానికి అసహ్యం వేస్తోంది. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు అస్తమానూ కార్టూన్ నెట్వర్క్, పోగోలు చూస్తూ మనని మిగిలిన చానెల్స్ చూడనివ్వడం లేదని ఏడవఖర్లేదు. వాళ్ళ పనే హాయి.
ఈ పోటీల్లో పాల్గొంటున్న నర్తకనర్తకీమణులందరూ బాలీవుడ్ అవకాశాల కోసం అలమటిస్తున్నవాళ్ళే. కాబట్టి ఆమాత్రం “పట్టువిడుపు చూపించకపోతే”(pun intended)కుదరదు. వాళ్ళది భవిష్యత్ దృష్టి, మనది వక్ర దృష్టితో సాగే voyeuristic pleasure. అవెప్పుడూ ఉండేవే!
ఈ ఎన్నారైలందరికీ ఇంత దేశభక్తి ఎందుకో అర్థం కాదు. అక్కడికెళ్ళి కూడా ఇక్కడ నడిచే చెత్త ప్రోగ్రాములు చూడకపోతే ఏమో?
ఈ డాన్స్ ప్రోగ్రాములు, ఈ ఏడుపులూ, జీడిపప్పు గారు ఉదహరించిన “అమ్మ” డైలాగులూ, ఇవన్నీ పెద్ద నాటకాలు! మొత్తానికి మూలం స్పాన్సర్లూ, డబ్బులూ! బాలీవుడ్ అవకాశాలూ వీళ్ళ శ్రాద్ధాలూను!
నేనైతే హాయిగా అలాంటి ప్రైం టైం లో ben10 చూస్తున్నా కార్టూన్ నెట్ వర్క్ లొ! చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి!
ఇంత కష్ట పడినంతమాత్రాన వాళ్ళకి సినిమాలలో చాన్స్ దొరుకుతుందనుకోను. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చాన్స్ ఇస్తారు, నచ్చని వాళ్ళకి ఇవ్వరు. పోటీల వల్ల అశ్లీలత పెరిగిందనేది మాత్రం నిజం.
నేను టి.వి.లో వార్తా చానెళ్ళు తప్ప ఏవీ చూడను. ఇంతకు ముందు జెమిని టి.వి.లో “అమృతం” అనే కామెడీ సీరియల్ చూసేవాడిని. ఆ సీరియల్ చాలా బాగుంది కానీ స్టోరీ ఎండ్ చెయ్యడం వల్ల నాకు బాధ కలిగింది. టి.వి.లోని డాన్స్ కార్యక్రమాలు అశ్లీల డాన్సులుతో పాటు డబల్ మీనింగ్ పాటలు కూడా చూపిస్తున్నాయి. పాటల కార్యక్రమాలలో పిల్లల చేత వాళ్ళకి అర్థం తెలియని డబల్ మీనింగ్ పాటలు కూడా పాడిస్తున్నారు. నేను ఇప్పుడు టి.వి.లో న్యూస్ తప్ప ఏవీ చూడడం లేదు. రియల్ లైఫ్ లో మన అక్క లేదా చెల్లి నిక్కర్లు వేసుకుని తిరిగితే భరించలేము కానీ టి.వి.లో మాత్రం నిక్కర్లు వేసుకుని చేసే డాన్సులు చూస్తాం. ఇలా చేస్తూ మనలోని హిపోక్రిసీని మనమే బయట పెట్టుకోవడం ఎందుకు? అందుకే నేను టి.వి. చూడడం దాదాపుగా మానేసి ఇతర విషయాల మీద కాన్సెంట్రేషన్ పెంచాను.
@అబ్రకదబ్ర : 🙂 🙂 నాకు చాలా హాయిగా ఉంది; నేనెందుకు నా బ్లాగును రాస్తున్నానో మీకిప్పుడు చక్కగా అర్ధమవుతుంది.
ఇండియాలో ఉన్న నేను, తెలుగు ఛానెల్స్ లోనూ ఈ మార్పు రావడాన్ని చూసి జీర్ణించుకోలేక పోతున్న నా అవస్థ గురించి, మీకిప్పుడు సుస్పష్టంగా అర్ధం ఔతుంది….అందుకని నాకు హాయిగా ఉంది. నేనెందుకు మన సంస్కృతి చచ్చిపోతోందని బాధ పడుతున్నానో మీకూ తెలుస్తోంది.
ఇందులో పాశ్చాత్య ప్రభావం లేదని మీరంటే నేనేమీ చేయలేను; ఈ ప్రోగ్రామ్స్ అన్నింటికి ఇంటలెక్ట్యుయల్ బాక్ గ్రౌండ్ పాశ్చాత్య టివిల్లో ఆల్రెడీ వాడబడిన సక్సస్ ఫార్ములాలే! అన్నీ లాగానే దీన్ని కూడా ఇక్కడ కాపీ చేస్తున్నారు; ఇది చూడలేనప్పుడు, నేను సరదాగా ఇవే ప్రోగ్రామ్స్ ని ఆస్ట్రేలియన్ ఛానెల్స్ లో కూడా చూస్తాను. ఏ మాటకామాట, అక్కడ ఇంకొంచెం అంగాగ ప్రదర్శన జరిగినా, అందులో నాకు ఇంకొంచెం ఎక్కువ “కళ” కనబడుతుంది.
కౌన్ బనేగా కరోడ్ పతి అలా వచ్చిందే; స్లం డాగ్ మిలియనైర్ – భారతీయ – రచయిత ఆ ప్రోగ్రాం ని తన కధలో వాడుకున్నది కూడా, తన కధ కి యూనివర్సల్ అప్పీల్ అలా ఈజీ గా సాధించవచ్చునని! అన్ని దేశాల్లోనూ అలాంటి ప్రోగ్రాం ఒకటి ఉన్నదని!
గ్లోబలైజేషన్ వల్ల సంస్కృతి లో మొనోపోలీ సాధించ బడుతుంది అని నేనంటున్నప్పుడు – నేను ఇలాంటి ఎన్నో లక్షణాలని గమనిస్తున్నాను.
కానీ, ఇది మన సంస్కృతి కాదు అని గొంతెత్తిని మరుక్షణం, ఇది మన సంస్కృతిలో ఉన్నదేనని వాదించి నిరూపించడానికి ప్రయత్నిస్తారు; మోరల్ పోలీసింగ్ చేయ్యొద్దంటారు.భావ వైశాల్యం లేని వాడనంటారు. బహుశా నన్నూ హిందూత్వ వాదినంటారు! అప్పుడు నా వాదాన్ని నేనెలా వినిపించను!!!???? ఈ అవకతవక లక్షణాలు సంస్కృతి కి సంబంధించినవి కావు, విశ్వవ్యాప్తంగా ఇలాంటి వాటికి పాపులారిటీ ఎంత ఉంటుందో, వ్యతిరేకత అలాగా ఉంటుంది అని ఎలా చెప్పాను? ఇది ఓ రకమైన బానిసత్వం అని ఎలా నిరూపించను!!??
అందుకే నా జాతికి నేను చెప్ప దల్చుకున్నది – “నీదైనది నువ్వు సృష్టించుకో! అప్పుడదే నీ సంస్కృతి ఔతుంది. అలా నీ సంస్కృతి జీవనదిలా ఉంటుంది” అని.
బై దవే! మొన్న ఒబమా ఉపన్యాసం మీద ఓ పోస్టు వేయొచ్చుగా!? ఎలా కాలిపోర్నియన్ స్టేట్ – దేశంతో సమానంగా గ్రోత్ చూపిచ్చినా, ఎనెర్జీ కంసంఫ్షన్ లో సగం లో ఉన్నదని చెప్పాడో!? అలాగ, ఎవరి సమస్యలకి వారి నుంచే సమాధానాన్ని వెతుక్కోవచ్చునని చెప్పవచ్చుగా!? “ఉద్ధరేత్ ఆత్మనో ఆత్మన: ” అని నేర్పవచ్చుగా!!??
చివరగా : నేను నెక్స్ట్ వేయ బోయే “తెలుగు – మన సినిమా” అన్న నా పోస్టు మాత్రం మీరు తప్పకుండా చదవాలని నా అభ్యర్ధన.
I read almost all your posts 🙂
అయ్యో మీరింకా చాలా తక్కువ చెప్పారని చెప్పాలి. ఈ మధ్య పబ్లిసిటీ కోసం జడ్జ్‌ల మధ్య వివాదం, లేదా కొరియోగ్రాఫర్ల మధ్య గొడవలు, “నేను ఈ సారి గెలుస్తాను, గెలిస్తేనే మా అమ్మ నాతో మాట్లాడతానంది ” అంటూ సెంటిమెంట్ డైలాగ్స్, ఒకటేమిటి చిన్న సైజ్ కామిడి, ట్రాజిడి, సెంటిమెంట్ సినిమా చూడచ్చు ఇలాంటి పాటల, ఆటల పోటీలలో.
@రెరాజు: “మార్కెట్” అనేది culture by itself. మార్కెట్ సంస్కృతికి తెలిసింది లాభ-నష్టాలు. వలువల్లో ఉన్న నైతిక విలువలకన్నా,సాంస్కృతిక హననంకన్నా ‘రేటింగ్’ మిన్న. దాంతోవచ్చే అడ్వర్టైజ్మెంట్ మిన్న.
ఎవడి(ఆమెరికా)అవసరాలకోసమో, మనం పనిచేసిపెడితే అభివృద్ధి అన్నవేళనే మన so called సంస్కృతికి పర్మనెంటుగా బొక్కపడింది.దాని బైప్రాడక్టులే ఇవన్నీను.దాన్ని ఆపాలంటే మనవల్లకాదు. గ్లోబల్ మార్కెట్లో మనం ఒక భాగం. గ్లోబలైజేషన్ తో disengage అవడం ఎలాగో ప్రయత్నిస్తేతప్ప దీనికి మనదగ్గర సమాధానం దొరకకపోవచ్చు.
ఎలాగూ మనది sex starved దేశం. మన సంస్కృతి రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతి. కాబట్టి ఈ అవలక్షణాలకు అవకాశం కనిపించిందే తరువు, కబోర్డులనుంచీ, చీకటి గదులనుంచీ టీవీ మీదకొచ్చాయి. ఇందులో “ప్రభావం” ఎంతుందో మన “జాడ్యం” అంతే ఉంది.
ఆటలో ఒకరు గెలవడం, ఇంకొకరు ఓడిపోవడం సహజమే. చిన్న పిల్లలు ఆటలో తొండీ చేసి కొట్టుకున్నట్టు పదిహేనేళ్ళు దాటిన పెద్ద పిల్లలు కూడా ఇలాగే బిహేవ్ చెయ్యడం ఏమిటి? It’s too foolish. ఒక సారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన దృశ్యాలు కూడా చూపించారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరులోనూ, ఆ చుట్టు పక్కల గ్రామాలలోనూ వేర్వేరు గ్రామాల మధ్య క్రికెట్ టోర్నమెంటులు జరిగినప్పుడు ఒక గ్రామం వాళ్ళు తొండీ చేస్తే ఇంకో గ్రామానికి చెందిన యువకులు దాడి చెయ్యడం జరిగేవి. ఇప్పుడు తొండీ చేసే సంస్కృతి టి.వి. చానెళ్ళలోనీ పోటీలకి కూడా పాకింది.
రేరాజ్ గారు… సంస్కృతి విషయంలో రొమాంటిసిజంకీ, రియాలిటీకి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. సినిమాలలోనూ, టి.వి. డాన్సులలోనూ నిక్కర్లు వేసుకునే ఆడవాళ్ళని చూస్తాం కానీ నిజ జీవితంలో మన కుటుంబానికి చెందిన స్త్రీలు అలాంటి బట్టలు వేసుకుంటే చూడలేం. గ్లోబలైజేషన్ పేరుతో పాశ్చాత్య సంస్కృతిని బలంగా సమర్థించేవాళ్ళు కూడా రియల్ లైఫ్ లో ఇలాగే బిహేవ్ చేస్తారు.
ఇది మన సంస్కృతి కాదు అని ఇక్కడ పదే పదే వినబడుతున్న మాట అబద్ధం. ఇది కచ్చితంగా మన సంస్కృతే. ఎందుకంటే మన దేశంలోనే ఇది విరాజిల్లుతోంది గనక .. దీనిలో ప్రదర్శించేందుకూ, ప్రదర్శించినదాన్ని ఆస్వాదించేందుకూ మనమే ఎగబడుతున్నాము గనక. మన దేశంలో యాభయ్యేళ్ళనాటి పత్రికల్ని చదివితే ఆ నాటి సినిమాల్లోనూ ఎంత వల్గారిటీ చూపించారో ఆ రివ్యూల్లో తెలుస్తుంది. బూతు మన సంస్కృతి కాకపోతే పేలికల వస్త్రధారిణుల ముఖచిత్రంతో అలరారే సపరివార పత్రిక తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక అవదు.
ఆ కార్యక్రమాల్ని అసహ్యించుకోండి, చెత్తగా టేస్టు లేకుండా ఉన్నయ్యి అనండి, మన సంస్కృతి కాదని మాత్రం అనొద్దు.
జీడిపప్పు గారు అమ్మ డైలాగులంటే ఒక విషయం గుర్తువచ్చింది
జి తెలుగు లో అనుకుంటా ఆట-2 అని ఒక ప్రోగ్రాం వచ్చేది ..అందులో సుబ్రాజ్ అని ఒక అబ్బాయి కొరియొగ్రాఫర్ .. అసలు ఆ అబ్బాయి డాన్స్ చేస్తుంటే ఈ తల్లిదండ్రులు ఇక్కడినుండి ఏడుపులు ఆనంద బాష్పాలు … మా అమ్మ,నాన్న లే నా ఉన్నతికి కారణం అని ఆ అబ్బాయి మరీ మరీ చెప్పాడు.. ఆ తరువాతా ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతనిని ఎంత హింసించారో ,అతనిని ఎన్ని బాధలు పెట్టారో tv9 చానెల్ వాడితో సహా అందరూ చూపించి బాగా కేష్ చేసుకున్నారు .. ఈ చానెల్ వాళ్ళ కు ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకోవాలో బాగా తెలుసు ..అలాగే చూసే జనాలు అలాంటివాళ్ళే .. తీస్తున్నారు కాబట్టి చూస్తున్నారు,చూస్తున్నారు కాబట్టి తీస్తున్నారు 🙂
ఏదో టైం పాస్ కార్యక్రమాల గురించి ఇంత చర్చ అవసరమా?
ఆ సమయంలో మన మూడ్ బాగుండి నచ్చితే చూడడం లేదా రిమోటుకి పని కల్పించడమే.
Here is a cute example of the above post. Hope you will enjoy this..
నేను ఒక సారి విజయవాడ నుంచి పాలకొల్లు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు నా ఎదురుగా కూర్చున్న గుడివాడకి చెందిన ఒక వ్యక్తి గుడివాడలో వ్యభిచారం, పెరిగిపోతున్న ఎయిడ్స్ కేసులు గురించి తన మిత్రులతో మాట్లాడబోయాడు. పబ్లిక్ ప్లేసెస్ లో ఇలాంటివి మాట్లాడకూడదు, వినే వాళ్ళకి బాగుండదు అని ఒకతను అభ్యంతరం చెప్పాడు. నేనేమీ వ్యభిచారం చెయ్యమని చెప్పడం లేదు, అలాంటి వాటి వల్ల వచ్చే డేంజర్ గురించి మాట్లాడకపోతే డేంజర్ ని అదుపుచెయ్యడం కష్టం అని మొదటి వ్యక్తి సమాధానం చెప్పాడు. సెక్స్ గురించి మాట్లాడితేనే పరువు పోతుంది అనుకునే సమాజంలో ముమైత్ ఖాన్ చేసే బూతు డాన్సులు ఎలా చూస్తున్నారు? ఇది పచ్చి హిపోక్రిసీ కాదా? హిపోక్రిసీ కొందరి నరనరాలలో జీర్ణించుకుపోయింది.
🙂 సంస్కృతి గురించి రాసీ రాసీ అదే పదం దొర్లింది లెండి. పొరబాటే. ఇది మన సంస్కృతిలో ఉన్నదే!
@అబ్రకదబ్ర : చూసారా! వెంటనే వచ్చే రియాక్షన్ ఏదో చెప్పాను కూడా!!! నా పోస్టు తయారు చేసుకొని, వేసుకొచ్చేసరికి అది జరిగి పోయింది. కానీ అన్ ఎక్స్ పెక్టడ్ క్వార్టర్స్ నుంచి వచ్చింది!
నేనన్నదానికి, జనాలు అర్ధం చేసుకున్నదానికి మధ్య చాలా తేడా ఉన్నదని నాకు తెలుస్తోంది; అర్ధమయ్యేదాకా చెప్పే బాధ్యత నాదేగా! ఎనీ వే! నా పోస్టు వేసేశాను. చదవగలరు. అందులో ఇక్కడ దొర్లిన తప్పు జరగలేదనుకుంటాను. నిజానికి ఇక్కడ కూడా నేను – ” ఈ అవకతవక లక్షణాలు సంస్కృతికి సంబంధించినవి కావు, విశ్వవ్యాప్తంగా ఇలాంటి వాటికి పాపులారిటీ ఎంత ఉంటుందో, వ్యతిరేకత అలాగే ఉంటుంది అని ఎలా చెప్పను? ఇది ఓ రకమైన బానిసత్వం అని ఎలా నిరూపించను!!?? ” అని! సరే ఇక దాన్ని వదిలేద్దాం.
@మహేష్ : ఈసారి మీరు క్వైట్ ఆఫ్ ది మార్క్ ఉన్నారు. నా ఆలోచన వేరుగా ఉంది.
కాకపోతే – టి.వి. రేటింగ్ కోసం ఈ ప్రోగ్రాం నే టెలికాస్ట్ చేసుకోవాలని ఎలా నిర్ధారిస్తారు!? వీళ్ళకు ఎవరు నేర్పారు!? మనం ఇలా కాపీ కొట్టుకొని – అమెరికన్ ఐడల్ లాగా ఇండియన్ ఐడల్ అని, మిలియనేర్ కి కరోడ్ పతి అని,…….అలా ప్రతీది అక్కడ ఉన్నదానికి ఇక్కడా ఓ వెర్షన్ ఉండాలి అనే ఆలోచన తప్పు. యూ నీడ్ టు బి క్రియేటివ్ ఇన్ సచ్ యాస్పెక్ట్స్! అలాగ ఇది మనకి “పుట్టిన” ఆలోచన కాదు. సెక్స్ కి, సెక్సి కోరికలకి సంబంధిచిన సంస్కృతి కాదు – ఈ మార్కెట్ కల్చర్ లో వచ్చిన ఐడియా ఇట్సెల్ఫ్ ఈజ్ నాట్ ఒరిజినల్, జస్ట్ ఎ కాపీ కాట్! హియర్ ఆల్సో ఒన్ నీడ్స్ టు బి ఒరిజినల్! మనదంటూ ఓ మార్కెట్ కల్చర్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒరిజినాలిటీ చాలా విషయాల్లో రావాలి మహేష్! అది మొత్తం సమాజంలో తీసుకురావాడానికి ఏదో ఒకటి చేయాలి.
పోనీ నచ్చినా, నచ్చక పోయిన పక్కన బెట్టి ఆ “రహస్య కుతి” ని మన సంస్కృతిలో ఓ ఒరిజినాలిటీ అందామా!? అక్కడ్నుంచి చాలా ఇరగ దీయచ్చు – ఆ లక్షణం వల్ల ఉన్న లాభాలు, వచ్చిన నష్టాలు చెప్పుకోవచ్చు ; సరి దిద్దు కోవచ్చు; ఇది తప్పింది కదా అని , “బాహాట కుతి” ని కావలిచ్చుకుందామా!? ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ కలసి
చూసే టి.వి. ప్రోగ్రాములు ఇవి మన దేశంలో! మరి వాళ్ళ దేశాల్లో మనంత ఫ్యామిలీ వ్యూయింగ్ జనాభా ఉన్నదా!? పోనీ ఇండివిడ్యుయల్ గా టీనేజ్ పిల్లలని వదిలేద్దాం. విచ్చలవిడిగా ఎంజాయ్ చేయమందాం – ముఫ్ఫై ఏళ్ళ దాకా తల్లిదండ్రుల సంపాదన మీద బతకడానికి వీల్లేదు అని చెప్పామా!? అన్ని రకాల వాళ్ళకి వాళ్ళ సంపాదనమార్గాలు కల్పించామా!? ఇట్ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ యూ స్టేటెడ్ మహేష్!
నే రాద్దాం అనుకున్నదాన్ని తమరు రాసేసారు.
>>ఎలాగూ మనది sex starved దేశం. మన సంస్కృతి రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతి.
మన సంస్కృతి మీద అంత విషం దేనికో జనలకి? నిజమైన సంస్కృతి ఎంటో విజ్ఞులు తెలియజెప్పాలి నాలాంటి అజ్ఞానులకి.
సుజాత గారు >> ఈ ఎన్నారైలందరికీ ఇంత దేశభక్తి ఎందుకో అర్థం కాదు. అక్కడికెళ్ళి కూడా ఇక్కడ నడిచే చెత్త ప్రోగ్రాములు చూడకపోతే ఏమో?
ఇదెలా? ఎక్కడకి వెళ్ళినా ఏదో మన అనే దానికోసం చూడటమే, కేవలం టైంపాస్ కోసం. అంతే కానీ ఓ పెద్ద పొందే లాభం ఏమీ లేదు వీటివల్ల, నెలకి పది డాలర్ల బొక్క తప్ప.
ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానెళ్ళు విధిగా ఇవి ఏ ఆడియన్స్ కోసమో చెప్తే కాస్త గుడ్డిలో మెల్ల. ఇది చదవండి ఒకసారి http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_23.html
సంస్కృతి గురించి గొప్పగా మాట్లాడేవాళ్ళు కూడా చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి బోగం గుడిసెలు అన్నట్టు సీక్రెట్ గా టి.వి.లో ముమైత్ ఖాన్ డాన్సులు చూస్తారు. సమాజంలో ద్వంద్వ నీతి ఉన్నంత కాలం టి.వి. ప్రోగ్రాంలలో పిల్లల చేత కూడా బూతు డాన్సులు చెయ్యించడం, వాళ్ళకి అర్థం తెలియని డబల్ మీనింగ్ పాటలు పాడించడం జరుగుతుంది.
ఆ నాట్యల తోపాటు ఈ నాట్యాలు కూడా చూసి ఆనందించండి 🙂
http://andhrawatch.com/tv-shows-and-new/2267-ganga-bhavani-a-others-dancing-before-gandhi-statue-video.html,
అప్పట్లో సినిమాల్లో జ్యోతి లక్ష్మి డాన్సులు చూసి … ఇలానే గుండెలు బాదుకునే వారు. మరి అవేమన్నా ఆగాయా?? కాకపోతే ఇప్పుడు మమైత్ ఖాను.. అభినయ శ్రీ అంతే తేడా?? అలాగే పత్రికల్లో కూడా… రమణి, రాదిక, చిలక… ఏవి ఆగలేదు.. కాకపొతే ఇంకో రూపంలో.. శృంగారం అనే ముసుగులో. కాకపోతే… ఓడిన వారి విన్యాసాలు… అదే ఒకర్నొకరు వాటేసుకొని ఏడవడం , విషాద సంగీతాలు, మొహాలని బ్లాక్ అండ్ వైట్ లో చూపించడాలు వీటన్నిటిని కామేడిగా తీసుకుంటే సరి. లేకపోతె చేతిలో ఎలాను ఉందికదా రిమోట్… దానిని వాడేయ్యడమే.
వీటి కంటే ప్రమాదకరంగా నేటి ప్రపంచం, నేర ప్రపంచం లాంటి పత్రికలు వస్తున్నాయి. చిన్నప్పుడు నేర ప్రపంచం పత్రికలో “మరిది పొందు కోసం భర్తని చంపిన భార్య” కథ చదివాను. అలాంటి కథలు చదివితే మర్డర్లు చెయ్యడం చేతకాని వాళ్ళకి మర్డర్లు ఎలా చెయ్యాలో సులభంగా తెలిసిపోతుంది. ఆ పత్రిక ఇప్పుడు కూడా పబ్లిష్ అవుతోంది. పార్నోగ్రఫీ ఇండియాలో నేరం. పత్రికలలోనైనా, సినిమాలలోనైనా, టి.వి.లోనైనా, ఇంటర్నెట్ లోనైనా పార్నోగ్రఫీ ప్రొమోట్ చెయ్యడం నేరమే. అయినా బూతు సినిమాలు, బూతు డాన్సుల టి.వి.ప్రోగ్రాంలు ప్రదర్శించడం జరుగుతూనే ఉంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి బోగం గుడిసెలు అన్నట్టు పబ్లిక్ లో నీతివంతులు లాగ నటిస్తూ ఇంటిలో టి.వి. వేసుకుని బూతు డాన్సుల ప్రోగ్రాములు చూసే హిపోక్రైట్ గాళ్ళు ఉన్నంతవరకు బూతు సంస్కృతి ఉనికిలో ఉంటుంది.
కొత్తపాళీ గారి POV చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకస్థాయిలో అర్జంటుగా ఒప్పుకునేలా ఉంది.
నేను ఇదివరకూ మనది sex starved nation అన్నప్పుడు మనదేశ ఘనతను గురించి కొందరు పెద్దలు చెబుతూ this is the land of KAMASUTRA and KHAJARAHO అని నాకళ్ళు తెరిపించారు. నిజమే కామసూత్రా,ఖజరహోలలో వెలసిల్లిన మన ఘనమైన సంస్కృతిని బూతు, పాశ్చాత్య ప్రభావం అంటే ఎంత దారుణం.
మన ఊర్లల్లో జాతర్లప్పుడుండే రికార్డింగు డ్యాన్సులు ఇప్పుడు బిల్లితెరకెక్కాయి. ఇందులో మీడియం మారిందేతప్ప మన సంస్కృతి ఎట్టుండేది అట్టే ఉందబ్బా!
నువ్వు రికార్డింగ్ డాన్సులు గురించి విన్నావు కానీ అవి ఎలా ఉంటాయో నీకు తెలియదు. రికార్డింగ్ డాన్సులు సినిమాల్ని చూసి ఇమిటేట్ చేసేవే మహేష్. మా అమ్మానాన్నలు తూర్పు గోదావరి జిల్లాలోని పల్లెటూర్లలో బ్యాంక్ ఉద్యోగం చేసే రోజుల్లో రికార్డింగ్ డాన్సులు నా కంట కూడా పడ్డాయి. పోలీసులు పగటి పూట వస్తారనుకుని రాత్రి పూట రికార్డింగ్ డాన్సులు వేస్తారు. ఒకవేళ రాత్రి పూట పోలీసులు వస్తే పోలీసులకి లంచం ఇస్తారు. లంచం సరిపోకపోతే పోలీసులు వాళ్ళని జైళ్ళో పెడతారు. ఆ రికార్డింగ్ డాన్సులు సినిమాల్ని ఇమిటేట్ చేసే స్టెప్పులే కానీ వేరే కాదు. విచిత్రం ఏమిటంటే పోలీసులు సినిమా వాళ్ళని వదిలేసి రికార్డింగ్ డాన్సర్లని అరెస్ట్ చెయ్యడం.
మహేష్ గారూ, మీరు కబుర్లు చెపుతారు కానీ పరిష్కార మార్గం చెప్పరు. మరదలి పొందు కోసం భార్యని చంపడం, మరిది పొందు కోసం భర్తని చంపడం కూడా సెక్స్ స్టార్వేషన్ యొక్క వికృత పరిణామాలే. బ్లూ ఫిలిం సి.డి.లు, బూతు పత్రికలు మార్కెట్ లో ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతాయి.
@మార్తాండ: మీ అంత ఖచ్చితమైన సమాధానాలు నాదగ్గరుండవు. అందుకని సమస్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
మీరైతే ఎంచక్కా కమ్యూనిజాన్ని దిగుమతిచేసి కమ్యూనిస్టు డిక్టేటర్షిప్ లో వీటినన్నింటినీ బ్యాన్ చేసేస్తామని చెప్పగలరు. కానీ, నా లాంటి ప్రజాస్వామ్య అర్భకులు, ముందు చర్చిద్ధాం తరువాత మెజారిటీ చూసి నిర్ణయిద్ధాం అంటూ తాత్స్యారం చేస్తుంటార్లెండి. మాకు అదొక సరదా!
నేటి ప్రపంచం, నేర ప్రపంచం లాంటి బూతు పత్రికలు ప్రజాస్వామ్యంలో కూడా ఉండకూడదు. మరి అలాంటివి proletarian dictatorship (కార్మిక నియంతృత్వం) లో ఎలా ఉండనిస్తాము?
రాతలెక్కువైన నాకు, మీ పోస్టు మీద వేద్దామనుకున్న అసలు వ్యాఖ్య చాలా పెద్దదై పోవడంతో పోస్టు చేసుకున్నాను. మీ దగ్గర వ్యాఖ్యానించిన వారికి కూడా సమాధనం అందులో రాసాను. ఏదీ ఏమైన, నేను విమర్శకులను విమర్శిస్తున్నది, కేవలం వారి దృక్పదంలో ఓ మార్పుని అర్ధించడం కోసం.నా పోస్టు పేరు “టివి ప్రోగ్రామ్స్ “ అని పెట్టాను.