జూలై, 2011ను భద్రపఱచు

తన్నేరు, తరిమేరు

మన కచరా గారికి తీరని నోటి తీట. తెలిసిన సంగతే. వారి మేనల్లుడు తహరాగారు రెండాకులెక్కువ చదివారు కాబట్టి నాలుగడుగులు ముందుకేసి కనపడ్డోళ్లందరి మీదా చెయ్యి చేసుకుంటుంటారు. ఆ గుణం జన్యు సంక్రమణం. మొన్నామధ్య అసెంబ్లీలో డార్విన్ సిద్ధాంతాన్ని మరోమారు రుజూ చేస్తూ కల్లు తాగిన కోతిలా బెంచీల మీంచీ, సహచర సభ్యుల శిరస్సుల మీంచీ చెంగు చెంగున గెంతుతూ గవర్నర్ గార్ని తన్నబోయిన వైనమూ, అదే రోజు గాంధీ బొమ్మ సాక్షిగా జేపీ నారాయణపై చెయ్యి చేసుకున్న దృశ్యమూ ఇంకా జనాల తలపుల్లో తాజాగానే ఉన్నాయి. ఈ చేతిదూలకి జన్యు దోషమే కాక మరో కారణమూ ఉందనేది ఈ మధ్యనే తెలిసిన విషయం. తప్పు తహరా గారిది కాదు, వారి పూర్వీకులది. ఎదురైన వాళ్లందర్నీ ఎగిరి తన్నటానికి పురికొల్పుతుంది వారి ఇంటి పేరే తప్ప మరొహటి కాదు. తన్నేరు హరీష్ రావు గారి గృహనామానిదే తప్పు తప్ప ఆయన దోషమేం లేదని మన రాష్ట్ర ప్రభుత్వం నమ్మేసి మిన్నకుండటంతో అసెంబ్లీ సాక్షిగా ఓ ఎమ్మెల్యేని ఉతికినా తహరాగారు బతికిపోయారు. ఇంటి పేరు నిలబెట్టటం కోసం ఆయన పడుతున్న ఆరాటంగా ఆంధ్రులు కూడా అర్ధం చేసుకుని క్షమించి వదిలేశారు. అయితే అందరు ఆంధ్రుల్లోనూ అదే స్థాయి క్షమాగుణం ఉండదు కదా. అందునా ఆంధ్రప్రదేశం బయటుండేవాళ్లలో అది అస్సలుండకపోవచ్చు.అనువుగాని చోట అధికులమనరాదని అచ్చ తెలుగు సామెత. హైదరాబాదులోనూ, తెలంగాణలోనూ ఏ వెధవ్వేషాలేసినా చెల్లిపోయింది కానీ, దేశ రాజధానిలో సైతం అవే పోకడలు పోతే ఎలా కుదురుతుంది? కానీ ఆ పాటి జ్ఞానం ఉంటే ఆయన కచరాగారి మేనల్లుడెలా అవుతారు? పైగా, వారి భాష వేరే కాబట్టి అచ్చ తెలుగు సుద్దులు వారికర్ధమైతే ఒట్టు. అందుకే అలవాటుగా ఢిల్లీలో తమ చేతివాటం ప్రదర్శించబోయి భంగపడ్డారు.

అదేం విచిత్రమో కానీ –  తెల్లారి లేస్తే తెలంగాణ కోసం ప్రాణాలిస్తాం, పీకలు కోసుకుంటాం, రక్తం చిందిస్తాం, అగ్నికి ఆహుతౌతాం అని గొంతులు చించుకునే ఏ ఒక్క లీడరూ అన్న మాటకి కట్టుబడి పుణ్యం మూటగట్టుకోలేదు. ఆ నీతిమాలిన నేతల మాటల మాయలో పడి తమని తాము తగలేసుకునేవాళ్ళు మాత్రం అడపాదడపా రాలిపోతున్నారు. (అసలీ ఆత్మహత్యల్లో ఆత్మప్రబోధాల శాతమెంతనే అనుమానాలు వెల్లువెత్తినా, అవన్నీ సీమాంధ్ర మీడియా అల్లిన కల్లబొల్లి కహానీలంటూ అదే సీమాంధ్ర మీడియా దన్నుతో విరుచుకుపడే తెలివితేటలీ తెలబాన్ దొరల సొంతం కాబట్టి అలాంటి వెర్రిమొర్రి అనుమానాల జోలికెళ్లకుండా వాళ్లు చెప్పిందే వేదమనుకుంటే అందరికీ సుఖం) ఈ ప్రాణాలు తీసుకునే ట్రెండ్‌కి ఓ పసందైన డ్రామాతో ప్రాణప్రతిష్ట చేసిన తహరా దొర మాత్రం మడతలు నలగని ధవళ వస్త్రాల్లో తెల్ల మల్లెలా మెరిసిపోతూ హుషారుగా, కుశాలగా తిరిగేస్తూనే ఉన్నాడు. కనపడ్డోళ్లందర్నీ కుమ్మేస్తూనే ఉన్నాడు. అయితే శవాల మీద చిల్లరేరుకునే ఆత్రంలో ముందూ వెనకా చూసుకోకుండా ఎవర్నిపడితే వాళ్లని కుమ్మేస్తే ఎలా? అవతలున్నదెవరో, అతని కులమేంటో తెలుసుకునే పనిలేదా? అనగనగా అపుడెపుడో అయ్యేయెస్ వెలగబెట్టిన అగ్రవర్ణ అసెంబ్లీ సభ్యుడిని అలవోకగా తన్ని తగలేసినా అడిగేవాడుండడు కాబట్టి చెల్లిపోద్ది. పీడిత తాడిత దళిత చిరుద్యోగికీ అదే సామాజికన్యాయం వర్తింపజేస్తామంటే మాత్రం అంబ పలుకుద్ది, పంబ రేగుద్ది. తన్నులు తిన్న దళితోద్యోగి సహధర్మచారిణి చెప్పు తీసుకు తరిమినప్పుడు ఈ సూత్రం మస్తుగా వంటబట్టింది తన్నేరువారికి. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఢిల్లీ చట్టానికి తెలంగాణతో చుట్టరికం లేదు కాబట్టి దాని పని అది చేసుకుపోయింది. తెల్లారే సరికి తహరాగారి మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు బనాయించబడింది. అది వారి బ్యాండ్ బజాయిస్తుందా లేదా అన్నది వేరు ప్రశ్న. ఈ సంఘటన నాలో రేకెత్తించిన ధర్మ సందేహాలు వేరే.

తహరా తన్నింది ఓ అగ్రవర్ణ అధికారినైతే కేసుల ఊసు లేకుండా తప్పించుకునేవాడా? తహరా సైతం దళితుడయ్యుంటే ఆయన మీద అట్రాసిటీస్ చట్టం ప్రయోగించవచ్చా లేదా? తన్నబోయే ముందు తన్నించుకునేవాడి కులమేదో తెలుసుకునే తన్నాడా? అవతలున్నది ఓ దళితుడని తెలీక తన్నాడని రుజువైతే ఆయన అమాయకుడంటూ కేసు కొట్టేస్తారా? ‘దళిత ప్రభుత్వోద్యోగిపై చెయ్యిచేసుకున్న ఎమ్మెల్యే’ తరహా వార్తాశీర్షికలు సదరు ప్రభుత్వోద్యోగిని కులం పేరుతో అవమానించటం కిందకి రావా?ఎవరు దళితులో ఎవరు కాదో, ఎవరిని ఎవరు తన్నొచ్చో, ఎవరెవరిని ఎవరెవరు తన్నకూడదో తేలిగ్గా తెలిసేలా ప్రజలంతా మెడల్లో తమ తమ కులాల పేర్లుండే బోర్డులు వేలాడదీసుకు తిరగాలంటూ దేశవ్యాప్త శాసనం చేస్తే ఎలా ఉంటుంది?


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.