“సైన్స్ ఫిక్షన్ అనేది అద్భుతమైన ఆలోచనలకి వేదిక మాత్రమే కాదు, అది ప్రపంచాన్ని మెరుగుపరచేందుకు జరిగే ప్రయత్నాల్లో ఓ ముఖ్యభాగం. సాధారణ ప్రజానీకానికి తెలియని శాస్త్ర విశేషాలు విడమరచి, సైన్స్ తమపై చూపే ప్రభావాన్ని తెలియజెప్పే పనిముట్టు. సైన్స్ ఫిక్షన్ పఠితలకి ఈ విశ్వాన్ని పరిచయం చేస్తుంది; అందులో మనమెంత అల్పజీవులమో తెలియజెబుతుంది. అది వినమ్రత నేర్పుతుంది. బాలబాలికలకి మొదట్నుండే సైన్స్ ఫిక్షన్ చదవటమ్మీద ఆసక్తి కలగజేస్తే అది వాళ్ల మెదళ్లని వికసింపజేస్తుంది. అటువంటి మనుషులున్న సమాజం అనివార్యంగా జాగృతమవుతుంది”
పైవి నా మాటలు కావు. Hugo Gernsback అనే పెద్దాయన అరవయ్యేళ్ల కిందట అన్న మాటలవి. ఎవరీయన? సైన్స్ ఫిక్షన్ సాహిత్యానికి పితామహుడివంటివాడు. రచయిత, దార్శనికుడు, ఇన్వెంటర్. ఆయన పేరుమీద సైన్స్ ఫిక్షన్ మరియు ఫ్యాంటసీ సాహిత్యానికి ఏటేటా ప్రకటించే Hugo Awards సాహితీరంగంలో ప్రపంచప్రఖ్యాతిగాంచిన పురస్కారాలు.
ఇంతకీ సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటి? ఆ విషయంలో వాదోపవాదాలున్నాయి, కానీ అటూఇటూగా అందరూ అంగీకరించేది: ‘శాస్త్ర పరిశోధనలు, ఆధునాతన సాంకేతిక ఆవిష్కరణల ఆధారంగా ప్రత్యామ్నాయ ప్రపంచాలని సృష్టించేది సైన్స్ ఫిక్షన్’. కథలో సైన్స్ పేరిట ప్రస్తావించిన విశేషాలు గాలి కబుర్లు కాకుండా వీలైనంతవరకూ శాస్త్రీయంగా ఉంటే అది సైన్స్ ఫిక్షన్; లేకపోతే ఒట్టి ఫ్యాంటసీ.
ప్రధాన స్రవంతి సాహిత్యం నిన్నటి గురించీ, నేటి గురించీ ఐతే; సైన్స్ ఫిక్షన్ రేపటి గురించి. అది మనమెవరమూ అంతవరకూ చూసెరగని ప్రపంచాలని ఊహిస్తుంది. ఆ ఊహలు తదనంతరకాలంలో నిజాలైన సందర్భాలు లెక్కలేనన్ని. ట్రాన్సిస్టర్ల నుండి క్లోనింగ్‌దాకా మొదట సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో ఊపిరిపోసుకున్నవే. భవిష్యత్తు ఎలా ఉంటుందో/ఉండాలో ఊహించగలిగే శక్తినిచ్చేది సైన్స్ ఫిక్షన్. అంతేకాదు, అది ఎటువంటి భవిష్యత్తులని నిరోధించాలో కూడా తెలియజెబుతుంది. ఇంత శక్తివంతమైన సాహిత్యం దురదృష్టవశాత్తూ తెలుగులో అత్యంత అరుదు. ‘సైన్స్ ఫిక్షన్’ అనేదాన్ని అచ్చతెలుగులో ఏమంటారంటే తడుముకోవాల్సినంత అరుదు. ఏటా వివిధ మాధ్యమాల్లో విడుదలయ్యే పదిహేనొందల పైచిలుకు తెలుగు కథల్లో సైన్స్ ఫిక్షన్ కథలెన్నంటే వేళ్లు చూపించటానికీ వీల్లేనంత అరుదు. అందుకు కారణాలెన్నైనా ఉండొచ్చు. వాస్తవం మాత్రం ఒకటే: గతంలో ఒకరిద్దరు సాధికారికంగా సైన్స్ ఫిక్షన్ రచనలు చేసినవాళ్లున్నా, ప్రస్తుతం ఆ పని చేస్తున్నవారు దాదాపు లేరు.
నేను సైన్స్ ఫిక్షన్ కథలు రాయటానికి నేపధ్యం ఇది. ‘ఎవరూ రాయట్లేదని వాపోయే బదులు ఆ పనేదో మనమే చేస్తే పోలా’ అనుకుని కథన రంగంలోకి దూకాను, నాలుగేళ్ల కిందట. అప్పట్నుండీ ఆ తరహా సాహిత్యానికే పరిమితమయ్యాను. ఆ క్రమంలో రాసిన కథలు నాలుగు: ‘నాగరికథ‘, ‘మరో ప్రపంచం‘, ‘కల్కి‘, ‘రీబూట్‘.
సైన్స్ ఫిక్షన్ కథలు రాయటం ఇతర ప్రధానస్రవంతి కథలు రాయటం కన్నా కష్టం అంటాడు ఆర్ధర్ సి. క్లార్క్. ఇది ఇతర తరహా సాహిత్యాన్ని చులకన చేయటానికన్న మాట కాదు. పాఠకులకి అనుభవంలో ఉన్న ప్రపంచానికి చెందిన కథలు రాయటంలో ఉన్న వెసులుబాటేమిటంటే, వాళ్లకి ఆ ప్రపంచాన్ని ప్రత్యేకించి పరిచయం చెయ్యనక్కర్లేదు. ‘సుబ్బారావు ప్రభుత్వాఫీసులో గుమస్తా’ అంటే సరిపోతుంది. ప్రభుత్వాఫీసుల గురించి, గుమస్తాల విధుల గురించి వివరించనక్కర్లేదు. అదే ‘ఐజక్ ఓ బయాట్’ అని ఓ ముక్కలో రాసేస్తే కుదరదు. అధికశాతం పాఠకులకి బయాట్ అంటే ఏమిటో తెలిసే అవకాశం లేదు కాబట్టి అదేంటో వివరించాలి. కానీ, అది పనిగట్టుకుని పాఠం చెబుతున్నట్లుండకూడదు. ఏ సంభాషణలోనో యధాలాపంగా చెప్పినట్లు కనిపించాలి. మొత్తమ్మీద, పాఠకులకి పరిచయం లేని లోకాన్నొకదాన్ని వీలైనన్ని తక్కువ వాక్యాల్లో నిర్మించాలి, వర్ణించాలి. వర్ణన మరీ ఎక్కువైతే నిడివి సమస్య. అలాగని పొడిపొడిగా వివరిస్తే పాఠకులకి అర్ధంకాకపోయే ప్రమాదం. ఇవి చాలనట్లు అదనంగా, తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాయాలంటే భాషా సమస్యొకటి. Dark Matter, Causality Paradox, Wick Effect, Many Worlds Interpretation, Cryogenics, Androids vs Biots …. ఇలాంటివి తెలుగులో క్లుప్తంగా వివరించటమంటే కత్తిమీద సామే. ఈ సాముగరిడీలు నా మొదటి నాలుగు కథలకీ చెయ్యాల్సొచ్చింది. ఐదో కథకి మాత్రం అంత కష్టపడకూడదనుకున్నాను. తేలిగ్గా ఐపోయేదేదన్నా రాయాలనుకున్నాను. అలా పుట్టిందే ‘రహస్యం‘.
ఈ మధ్య రీడర్స్ డైజస్ట్‌లో కనబడ్డ ఓ వ్యాసం నన్ను అమితంగా ఆకట్టుకుంది. దాని సారాంశం: ‘గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం, అంతర్యుద్ధం, కరువుకాటకాల వల్ల కలిగే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది’. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే ఆర్యోక్తి అన్నిసార్లూ నిజం కాదనిపించింది అది చదివాక. భవిష్యత్తు ఎప్పుడూ భయంకరంగానే ఉండాల్సిన అవసరం లేదనిపించింది. అందులోనుండి ఓ ఆలోచన మొగ్గతొడిగింది.
టీవీల్లోనో, వార్తాపత్రికల్లోనో బాంబు పేలుళ్ల వార్తలు చూసినప్పుడు ఓ క్షణం ఉలిక్కిపడి, ఆ సమయంలో అక్కడ మనం లేనందుకు ఆనందపడతాం. ఆ ఘటన వెనకున్న తీవ్రవాదుల్ని తిట్టిపోస్తాం. దాన్ని అడ్డుకోలేకపోయిన పోలీసు, నిఘా వ్యవస్థల చేతగానితనాన్ని తూర్పారబడతాం. ఆ తర్వాత మన పనుల్లో మనం మునిగిపోతాం, మళ్లీ మరో సంఘటన జరిగేవరకూ. అంతే కానీ, ఓ వాస్తవం మాత్రం గమనించం. పేలిన ఒక బాంబు మాత్రమే మన దృష్టికొస్తుంది కానీ, పేలని వేల బాంబుల గురించి మనకెప్పటికీ తెలిసే అవకాశం లేదు. ‘రోజులు దారుణంగా ఉన్నాయి’ అనటమే మనకి తెలుసు. ‘అవి అంతకన్నా దారుణంగా ఉండొచ్చు …. కానీ లేవు’ అన్న నిజాన్ని మనం గుర్తించం. ‘ఎవరి పని వాళ్లు సరిగా చేస్తే ప్రపంచం ఇంతకన్నా భద్రంగా ఉండేది’ అనటమే మనకలవాటు. ‘ఎందరో నిజాయితీపరులు అవిశ్రాంతంగా వృత్తిధర్మం నెరవేరుస్తుండటంవల్లనే ప్రపంచం ఈ మాత్రమన్నా భద్రంగా ఉంది’ అనే విషయాన్ని మనం పట్టించుకోం. మనకి తెలీకుండానే అనుక్షణం మనల్ని ఎవరో ఒకరు కాపాడుతున్నారు. వాళ్లెవరో మనమెరగం. అయినా వాళ్లకి రుణపడి ఉన్నాం. గుర్తింపుకి నోచుకోని ఆ unsung heroes కి నివాళిగా ఓ కథ రాయాలనిపించింది.
నా కథలన్నీ larger than life విషయాల చుట్టూ తిరుగుతుంటాయి. ఈ కథకీ అటువంటి వస్తువే ఎంచుకోవాలనుకున్నాను. కథానాయకుడు హోల్‌సేల్‌గా భూమండలం మొత్తాన్నీ కాపాడటం …. టైపులో అన్న మాట. అంటే ముందు భూమండలానికో పెను ప్రమాదం ముంచుకొచ్చేలా చెయ్యాలి. ఎప్పుడో ఏవో సైన్స్ మేగజైన్స్ తిరగేస్తుంటే కళ్లబడ్డ ఓ విశేషం, తర్వాతెప్పుడన్నా కథగా మలచటానికి బాగుంటుందని గుర్తు పెట్టుకున్నది, ఇప్పుడు అక్కరకొచ్చింది. 1979లో డాక్టర్ బెంజమిన్ లిబెట్ అనే శాస్త్రవేత్త మెదడు పనితీరు గురించి నిరూపించిన ఓ ఆసక్తికరమైన విశేషం అది. (అదేంటో కథలో వివరించా కాబట్టి మళ్లీ ఇక్కడ రాయబోవటం లేదు). ‘భవిష్యత్తుని ముందే చూడగలిగే టెక్నాలజీ అందుబాటులోకొస్తే?’ అన్న ప్రశ్న అందులోంచి పుట్టుకొచ్చింది. దానివల్ల లాభాలూ ఉన్నాయి, నష్టాలూ ఉన్నాయి. ఓ సైంటిస్టు సాధారణంగా తన పరిశోధనా ఫలితాలు కలిగించే లాభాలనే దృష్టిలో పెట్టుకుంటాడు. దీనికి విరుద్ధంగా, ఓ నిఘా నిపుణుడు అటువంటి టెక్నాలజీ వల్ల వచ్చే ప్రమాదాలనే ముందుగా అంచనా వేస్తాడు. ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య ఉన్న వైరుధ్యం, వాళ్ల వృత్తి జీవితాలు వాళ్ల ఆలోచనల్ని , నమ్మకాల్ని ప్రభావితం చేసిన విధానం ఆధారంగా ప్రధాన పాత్రల మధ్య ఘర్షణ పుట్టించి చక్కని ఉత్కంఠతో ఓ కథ రాసే అవకాశం ఉంది. అలా ఈ కథ మొదలయింది. సైంటిఫిక్ సమాచారానికి కొంత కల్పన తాలింపుతో అది ‘రహస్యం‘గా మీ ముందుకొచ్చింది. ఇందులో ‘అరక్షణం తర్వాత జరగబోయేది ముందే చూడగలగటం’ మాత్రం శాస్త్రీయంగా నిరూపితమైన విషయం. మిగిలిందంతా నా ఊహ.
మీ మాట