జూన్, 2016ను భద్రపఱచు

మంతిరివరియా, ఏమంటివి ఏమంటివి!

అనగనగా మలయాళ దేశంలో కొలువైన ఒక ఆటల మంత్రివర్యులు. ఒకరోజు తెల్లారగట్లనే ఆయన ఇంటిమీద మీడియా వాలిపోయింది.

“మరే, ఆలీ పోయాడు. మీ స్పందనేంటి?” – మీడియా క్వొశ్నించింది, మైకు ముందరుంచి.

మంత్రి గారు అభమూ శుభమూ ఎరగడు. ఆలీ ఎవరో కూడా ఎరగడు. అయినా కూడా ఉలిక్కిపడ్డాడు. అలవాటుగా “అబ్బే నాకేం తెలీదు. ఈ హత్యకీ నాకూ సంబంధం లేదు. ఇదంతా ప్రతిపక్షం కుట్ర” అనేయబోయి ఆఖరు క్షణంలో తమాయించుకున్నాడు. “‘మీ స్పందనేంటి’ అన్నారే తప్ప ‘మీకు సంబంధముందా’ అనలేదు కదా. కాబట్టి మనం భయపడాల్సిందేమీ లేదు” అని గ్రహించాడు. ఆపై ఆయన మహా చురుకు బుర్ర వాయువేగ మనోవేగంతో ఇలా తర్కించింది.

“ఆలీ. మహమ్మదీయ నామం. మన రాజ్యంలో వారి సంఖ్య ఎక్కువే. కాబట్టి ఇక్కడి వాడే అయ్యుండాలి. మామూలోడు కాకపోవచ్చు. లేకపోతే మంత్రిని అడగరు కదా. ఇతని గురించి నన్నడిగారు. నేనెవర్ని? ఆటల మంత్రిని. ఏ చదువుల మంత్రినో కాక నన్నేఅడిగారంటే వీడో ఆటగాడయ్యుండాలి. అమాంబాపతు ఆషామాషీ ఆటగాడు అయ్యుండకపోవచ్చు. అవార్డులూ అవీ గెల్చినోడే అయ్యుండాలి. లేకపోతే నా అభిప్రాయం కోసం రారు కదా. అధమం పదో పరకో మెడళ్లు గెలిచే ఉంటాడు. కచ్చితంగా మలయాళ రాజ్యానికి పేరు ప్రతిష్టలూ వగైరా తెచ్చిపెట్టినోడయ్యుంటాడు. అదీ కథ. ఇహ విజృంభిద్దాం”

మంతిరివర్యులు గొంతు సవరించుకున్నారు.

ఆ తర్వాతి కథ మనకి తెల్సిందే.

అయితే అందరికీ తెలీని కథ కొంత మిగిలుంది.

పై ఎపిసోడ్ దరిమిలా వెల్లువెత్తిన పకపకల్ని తలచుకుంటూ మంతిరివర్యుల మహా చురుకు బుర్ర ఇలా వితర్కించింది.

“ఆలీ అంటూ నా దగ్గరికి లగెత్తుకొస్తే మనోడనుకోక ఆ మెరక రాజ్యం ఆటగాడని నేనెట్టా కలగంటా? ఆ రాజ్యానికీ ప్రధాన మంత్రో ఎవడో ఏడిచే ఉంటాడు కదా. ఈ బుర్ర తక్కువ వెధవలు పోయి వాడినడక్క నన్నడగటమేంటి, ఆనక నవ్వటమేంటి? ఈ దిక్కుమాలిన జనం దృష్టిలో తప్పొప్పులకే తప్ప తర్కానికి విలువ లేదబ్బా! వీళ్లని బాగు చెయ్యటం ఎవుడివల్లా కాదు”


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.