ఈ ఏడాది నా కథల తూణీరం నుండి వెలువడ్డ ఐదో బాణం: ‘ప్రియ శత్రువు‘ – ఈ ఆదివారం ‘వార్త’ దినపత్రిక అనుబంధంలో.
షరా మామూలుగా, ఈ కథకీ నిడివి సమస్యలొచ్చాయి. రమారమి రెండువేల ఐదొందల పదాల పైచిలుకు కథని తమకున్న ‘పదహారొందల పదాల కట్టుబాటు’ గట్టుమీద పెట్టి, ఆనవాయితీకి భిన్నంగా నాలుగు పేజీల కథగా మలిచి, అవసరానుసారం ఫాంట్‌సైజ్ కుదించి మరీ ప్రచురించిన ‘వార్త’ ఆదివారం సంపాదకవర్గానికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
కథలు రాసేటప్పుడు ఎక్కడ ఏ పదం వాడాలి, పదాల మధ్య విరామ సూచకంగా ఎన్ని చుక్కలు వాడాలి, పేరాగ్రాఫులు ఎక్కడెక్కడ విడగొట్టాలి, ఎక్కడ ఆశ్చర్యార్ధకాలు వాడాలి వంటి విషయాల మీద నేను అత్యంత శ్రద్ధ చూపిస్తాను. అందువల్ల నేను రాసింది రాసినట్లుగా అచ్చులో రావాలన్న విషయం ముందుగానే పత్రికలకి స్పష్టంగా చెబుతాను. సంపాదకులు కూడా ఈ విషయంలో చాలా సహకరిస్తుంటారు. అయితే కొన్నిసార్లు పత్రికల్లో స్థలాభావం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రచయితకి చెప్పకుండానే చిన్న చిన్న మార్పులు చేస్తుంటారు. అటువంటి పరిస్థితి ‘ప్రియ శత్రువు‘కి ఎదురయింది. అంగుళ మాత్రమైనా స్థలాన్ని వృధా చెయ్యకుండా అచ్చువేయాల్సి రావటంవల్ల అక్కడక్కడా రెండు మూడు పేరాగ్రాఫుల్ని కలిపివేయాల్సి వచ్చింది. అది కథాగమనానికి అడ్డుపడకపోయినా, పాఠకులకి ‘ఏదో తేడా’ ఉన్నట్లు అనిపించే అవకాశముంది. ఆ తేడా బారిన పడకుండా ఉండాలంటే, ఈ కథకి సంబంధించిన అసలు ప్రతి చదవమని నా సలహా. అది ఇక్కడ లభిస్తుంది.
మీ మాట