ఫిబ్రవరి, 2010ను భద్రపఱచు

ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 8

ఎనిమిదో అబద్ధం:

హైదరాబాదు మాది .. మాదే.

ఇదీ నిజం:

నా పెరట్లో బావి తవ్వాను. నీళ్లు పడితే మంచిదే. ఆ బావీ నాదే, ఆ నీళ్లూ నావే. అదే పెట్రోల్ పడితే? అప్పుడా బావి దేశమ్మొత్తానిదీ. నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అది జాతీయ సంపద. నేను కొనుక్కున్న స్థలంలో ఉన్నంత మాత్రాన అది నా ఒక్కడిదేననే హక్కు నాకెలా లేదో, తమ తాత ముత్తాతలు నివాసమున్నంత మాత్రాన మన దేశ రాజధానినైనా, రాష్ట్ర రాజధానినైనా, ఆ మాటకొస్తే ఏ ఒక్క ఊరినైనా తమది మాత్రమే అనే హక్కు ఎవరికీ లేదు. హైదరాబాదుకైనా, బొంబాయికైనా, బెంగుళూరుకైనా, న్యూఢిల్లీకైనా ఇది నిజం .. ఇదే నిజం.

ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన ప్రతి చర్చా చివరికొచ్చి పడేది హైదరాబాదు దగ్గరికే. దేశంలో ఇంతకు ముందూ చిన్న రాష్ట్రాలెన్నో ఏర్పడ్డాయి. మరి కొన్నింటి కోసం ఇప్పుడూ ఉద్యమాలు నడుస్తున్నాయి. కానీ వాటిలో ఎక్కడా లేని విశేషం మన దగ్గరుంది. అది – రాష్ట్ర రాజధాని నగరం కొలువై ఉన్న ప్రాంతమే విడిపోతానని గొడవ చెయ్యటం. ఆ మధ్యెవరో పాత్రికేయుడన్నాడు: ‘ఇది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాదు. తెలంగాణవాదులు చేస్తున్న ప్రత్యేకాంధ్ర ఉద్యమం’. ఎంత నిజం! పేరుకి వేర్పాటువాదులు ‘మేం విడిపోతాం’ అంటున్నా, నిజానికి వాళ్లనేది ‘మీరు విడిపోండి’ అనే. ‘మీ రాజధానిని మీరు వెదుక్కోండి, మీ చావు మీరు చావండి’ అనే. అదేమంటే ‘ఠాఠ్. హైదరాబాదు మాది. మీరెవరు ఇక్కడికి రావటానికి’ అనే హుంకరింపులు.

దేశంలో ఏ ప్రధాన నగరాన్ని తీసుకున్నా దాని అభివృద్ధిలో స్థానికులకన్నా స్థానికేతరుల పాత్రే ఎక్కువుందన్నది కాదనలేని సత్యం. తెలుగువారి రాజధాని తెలంగాణవారిది మాత్రమే అని ప్రభుత్వాలూ, పారిశ్రామికులూ మడికట్టుకునో, గిరిగీసుకునో కూర్చుని ఉంటే హైదరాబాదు ఇప్పుడిలా ఉండేదీ కాదు, దాని గురించి ఇంత రచ్చ జరిగేదీ కాదు. ఈ మహానగరం ఆంధ్రప్రదేశ్ రాజధాని హోదాలో స్వదేశీ, విదేశీ వ్యాపారాల్నీ, పరిశ్రమల్నీ, లెక్కలేనన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్నీ, నిధుల్నీ, విద్యాలయాల్నీ, మరెన్నో సదుపాయాలనీ సముపార్జించుకుందే తప్ప ఒకానొక తెలంగాణ నగరంగా కాదు. ‘మనం’గా సమకూర్చుకున్న హంగులవన్నీ. ఇప్పుడవన్నీ ‘మావే’ అనటం దారుణం. ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం నయవంచన. తెప్పతో పాటు దాన్లోని సహ ప్రయాణీకుల్నీ తగలెట్టబూనటం వేర్పాటువాదుల నయావంచన.

‘హైదరాబాదు అభివృద్ధిలో మాకు మాత్రం భాగం లేదా’ అనడిగితే వచ్చే రొటీన్ రొడ్డకొట్టుడు సమాధానం, ‘ఏంటి మీరు చేసిన బోడి అభివృద్ధి. అప్పుడూ ఇప్పుడూ హైదరాబాదు స్థానం ఐదే’. ఈ ఐదో నంబరు ఏమిటో, ఏ విషయంలోనో అడిగేవాడు లేడు, చెప్పేవాడూ లేడు. నాకు తెలిసి – ఒకప్పుడూ, ఇప్పుడూ జనాభా పరంగా హైదరాబాద్ దేశంలో ఆరో పెద్ద నగరం. ఆ నంబరుకీ, అభివృద్ధికీ లంకె పెట్టేవాడు అమాయకుడు. అలాంటోళ్లని పట్టించుకోనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవతరించాక – ముఖ్యంగా గత ఇరవయ్యేళ్లలో – హైదరాబాదు వృద్ధిపధంలో దూసుకుపోలేదనేవాళ్లు అబద్ధాలకోర్లు (‘ఆ వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా లభించాయా’, ‘అభివృద్ధి పేరుతో నగరం కాలుష్య కాసారంగా మారలేదా’, వగైరా ఈ చర్చకి సంబంధం లేని ప్రశ్నలు. అవి హైదరాబాదుకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ నగరానికైనా వర్తించేవి). ఇలాంటోళ్లు నడిపే ఉద్యమాలు పిచ్చోళ్ల చేతుల్లో రాళ్లు. హైదరాబాదు గురించి వీళ్లో అరిగిపోయిన రికార్డేస్తుంటారు: ‘దేశానికి స్వతంత్రం వచ్చేనాటికి హైదరాబాదు రాజ్యం ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశం’. వీళ్ల అన్ని మాటల్లా ఇందులోనూ నిజం అరకొరే. అసలు నిజమేమిటంటే, 1948 నాటికి హైదరాబాదు నవాబు ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకడు. దానర్ధం హైదరాబాదు రాజ్యంలో ప్రజలంతా భోగభాగ్యాలతో తులతూగేవారని కాదు. అదే నిజమైతే 1956లో ‘తెలంగాణ వెనకబాటుదనం’ ప్రాతిపదికగా పెద్దమనుషుల ఒప్పందం ఎందుకు? సరే, అది వేరే చర్చ. వదిలేద్దాం. నాటి నవాబుల వైభవానికి నేటి కోస్తా, సీమ జిల్లాలెలా సమిధలయ్యాయో చూద్దాం.

ఒరిస్సాలోని గజపతి, గంజాం జిల్లాలతో కలిపి, శ్రీకాకుళం జిల్లా నుండి ప్రకాశం జిల్లా దాకా విస్తరించిన కోస్తా ప్రాంతం పదిహేనో శతాబ్దంలో బహమనీ సుల్తానుల పాలనలో ఉండేది. చరిత్ర క్రమంలో అది చేతులు మారుతూ పదహారో శతాబ్దం నాటికి (హైదరాబాదు నగర నిర్మాణం మొదలవటానికి ఇరవయ్యొక్కేళ్ల ముందు) గోల్కొండనేలిన కుతుబ్‌షాహీ వంశం అధీనంలోకొచ్చింది. గోల్కొండ సామ్రాజ్యం పదిహేడో శతాబ్దంలో ఔరంగజేబ్ పాలనలోకెళ్లి, అట్నుండి పద్దెనిమిదో శతాబ్దంలో (క్రీ.శ. 1724) మొదటి నిజాం నవాబు అధీనంలోకొచ్చింది. అనంతర కాలంలో నిజాముల రాజకీయ అవసరాల కోసం ఏవేవో ఒప్పందాల పేరుతో పైన చెప్పిన కోస్తా జిల్లాలు మొదటగా ఫ్రెంచి వారికీ, ఆ తర్వాత బ్రిటిష్ వారికీ తాకట్టు పెట్టబడ్డాయి. వాటినే ఉత్తరాది సర్కార్ జిల్లాలన్నారు. ప్రతిఫలంగా ఈ జిల్లాలపై బ్రిటిష్ వారినుండి నిజాం నవాబు ఏటేటా భారీ మొత్తంలో రొక్కం పొందేవాడు. క్రీ.శ. 1788లో సర్కారు జిల్లాలను బ్రిటిష్ వారు పూర్తిగా సొంతం చేసుకునేదాకా ఈ చెల్లింపులు కొనసాగాయి.

మరో పక్క – నాలుగో మైసూరు యుద్ధంలో ఫ్రెంచి వారితో జతగట్టిన టిప్పు సుల్తానుని ఓడించటానికి ఆంగ్లేయులతో చెయ్యి కలిపినందుకు టిప్పు ఓటమి అనంతరం నాటి మైసూరు రాజ్యంలోని దక్కను భాగం నిజాం నవాబుకు ఈనాముగా లభించింది. అందులో చాలా భాగాన్ని తర్వాత కాలంలో నిజాం రెండవ అసఫ్ ఝా ఆంగ్లేయులకు ధారాదత్తం చేశాడు. ఎందుకు? హైదరాబాద్  రాజ్యంపై ఫ్రెంచ్, మరాఠా దాడుల్ని కాచుకోటానికి ఆంగ్లేయుల సైన్య సహకారం అవసరమై, అందు నిమిత్తం ఓ ఒప్పందం కుదుర్చుకోవటం మూలాన. అలా ఇచ్చేసినవే తెలుగులో దత్త మండలాలుగానూ, ఆంగ్లంలో సీడెడ్ డిస్ట్రిక్ట్స్‌గానూ పేరొందిన నేటి రాయలసీమ జిల్లాలు. ఇది క్రీ.శ. 1800 నాటి మాట.

అదీ చరిత్ర. అటు సర్కారు జిల్లాలు (కోస్తాంధ్ర), ఇటు సీడెడ్ జిల్లాలు (రాయలసీమ) రెండూ హైదరాబాదు పాలకుల రాజకీయ చదరంగంలో పావులుగా ఉపయోగపడ్డాయి. పై ఒప్పందాలేవీ లేని హైదరాబాదు రాజ్యం భౌగోళిక స్వరూపం మరోలా ఉండేది. దాని చరిత్ర సైతం వేరేలా ఉండేది. ఆ చరిత్రలో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ అన్న మాటలే ఉండేవి కావు. ఈ ఉద్యమాలూ ఉండేవి కావు. కాబట్టి తెలంగాణ చరిత్ర నుండి కోస్తా, సీమలని విడదీసి చూడటం అసమంజసం. నాటి హైదరాబాదు సౌభాగ్యం కోసం పణంగా పెట్టబడ్డ ఈ రెండు ప్రాంతాలకి హైదరాబాదు నగరంతో ఏ సంబంధమూ లేదనటం అన్యాయం. అందులోనూ కోస్తా ప్రాంతం (సర్కార్ జిల్లాలు) 1788 దాకా ఏదో ఓ రూపంలో గోల్కొండ/హైదరాబాద్ పాలకులకి ఆదాయం తెచ్చిపెడుతూనే ఉంది. ఆ రకంగా – హైదరాబాదు నగరాభివృద్ధిలో తొలి రెండొందలేళ్లలోనూ కోస్తాంధ్ర భాగస్వామ్యం ఉంది.

అంతే కాదు, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ దరిమిలా మొదటి ఐదేళ్ల వరకూ (1961 దాకా) రాజధాని నగరానికి అవసరమైన హంగులకయ్యే ఖర్చు మొత్తమూ ఆంధ్ర, సీమ ప్రాంతాల పద్దులోనే వెయ్యబడింది. దానిక్కారణం – అప్పటికే హైదరాబాదులో అందుబాటులో ఉన్న భవనాలు, ఇతర సదుపాయాలన్నీ తెలంగాణ సమకూర్చినట్లు ప్రభుత్వం భావించటం, కొత్తగా అవసరమైన వాటికయ్యే ఖర్చు తెలంగాణేతర ప్రాంతాల ఖాతాలో వెయ్యటమే న్యాయమని అనుకోవటం. 1961 తర్వాత నుండీ ఈ ఖర్చుని కోస్తా/సీమ, తెలంగాణ ప్రాంతాలు 2:1 నిష్పత్తిలో పంచుకోవటం జరుగుతుంది. ఏతావాతా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వపరంగా చేసిన ఖర్చులో అధిక శాతం తెలంగాణేతర ప్రాంతాలే భరించాయి. అప్పుడు వాళ్లెవరూ నోరెత్తి ఇదేమనలేదు. ఎందుకు? ‘హైదరాబాదు మనందరిది’ అనుకోబట్టి. ప్రభుత్వపరమైన వృద్ధి సంగతి అటుంచి ప్రైవేటు రంగంకేసి దృష్టి సారించినా, ఈ యాభయ్యేళ్లలోనూ హైదరాబాదు సాధించిన విజయాల్లో తెలంగాణవారి పాత్రెంతో తెలంగాణేతరుల పాత్రా అంతే – కొండొకచో అంతకన్నా ఎక్కువే (‘తెలంగాణేతరులు’ అంటే కేవలం ఇతర తెలుగు ప్రాంతాల వారు కాదు, భారతీయులందరూ). అందుకే హైదరాబాదు జాతీయ సంపద. ‘ఇది నాది, నాదే’ అనే హక్కు ఏ ఒకరికీ లేదుగాక లేదు.

(సశేషం)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.