టెలివిజన్లో పోటీ కార్యక్రమాలు – ఏ భాషవైనా, ఏ దేశానివైనా – చూసే అలవాటు నాకు పెద్దగా లేదు. నేను టీవీలో చూసేది ఎక్కువగా హిస్టరీ, ట్రావెల్, డిస్కవరీ వగైరా ఛానళ్లు; అడపాదడపా ఎవ్రిబడీ లవ్స్ రేమండ్, బిల్ కాస్బీ షో, ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్ పునఃప్రసారాలు మాత్రమే. ఆ మధ్య కొంతకాలం పాటు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకట్రెండు హిందీ జీడిపాకం సీరియళ్లు చూడాల్సొచ్చింది – తర్వాతెలాగో ఆ బాధ తప్పిందనుకోండి. ఆ సీరియళ్ల గురించి కాదు నేనిప్పుడు మొత్తుకోబోతుంది. నేటి నా గోడు – వారం పది రోజుల క్రితం జీటీవీలోనో సోనీలోనో చూసిన ఒకానొక నాట్య పోటీ కార్యక్రమం గురించి.
దాని పేరు ‘డాన్స్ ఇండియా డాన్స్’ అనుకుంటా. పేరేదైతేనేం, ఆ నాట్యాలు మాత్రం నాకు చిర్రెత్తించాయి. వెకిలి హావభావాలతో కాళ్లూ, చేతులూ, నడుమూ వెర్రిగా ఊపేస్తూ వికార భంగిమలు పెట్టటమే నాట్యం ఎప్పట్నుండయిందో! కూచిపూడి, భరతనాట్యం మాత్రమే నృత్యాలు, మిగతావి కావనే వితండవాదిని కాను నేను. సదరు పోటీలో సల్సాలూ, సాంబాలూ కుదురుగా చేసినోళ్లూ లేకపోలేదు. ఎక్కువ మందివి మాత్రం పిచ్చి గంతులే. తమాషా ఏంటంటే – ఎవరెంత పిచ్చిగా గెంతితే వాళ్లకి జడ్జీల నుండి అంత ప్రోత్సాహం!ఈ జడ్జీలు బాలీవుడ్లో ఛోటా మోటా నృత్య దర్శకులూ/రాళ్లూనట. అసలా పోటీదార్లకి శిక్షణిచ్చింది కూడా వీళ్లేనట. సందు దొరికింది కదాని శుభ్రంగా తమ సినిమా పైత్యం టీవీలకీ పాకించేశారు – పీలికల గుడ్డలు, పిచ్చి గంతుల రూపంలో.
సరే, మళ్లీ ఇందాకటి డాన్సాట పోటీ దగ్గరికొస్తే – అమ్మాయిల వస్త్రధారణ, వారి జఘన కుదుపుల నాట్య భంగిమలు చూసి కంపరమెత్తటం ఒకెత్తైతే, అదే పోటీలో కొందరబ్బాయిలని చూసి ఏకంగా డోకే వచ్చినంత పనయ్యింది నాకు! అబ్బాయిల్లోకి హైలైట్ – అదో రకం పైత్యకారీ వేషధారణతో గెంతినోడొకడు. ఇతని ఒంటి మీదున్నదల్లా గోచి పాత లాంటి గుడ్డ పేలికొకటి మాత్రమే. ఇంకా, వంటి నిండా ఎక్కడబడితే అక్కడ తగిలించుకున్న చెవి పోగుల్లాంటి రింగులు. వీటన్నిటికీ తోడు కోడి బొచ్చు లాంటి రంగులేసుకున్న జుట్టొకటి! పాత్రోచిత ఆహార్యమనుకుందామంటే – అతనేసిన డాన్సుకీ, ఆ గెటప్పుకీ సంబంధమేమిటో ఎంత బుర్ర చించుకున్నా అర్ధమవలా.
అర్ధం కానిది మరోటి కూడా ఉంది. ఈ పోటీలో పాల్గొన్నవాళ్లందరూ టీనేజ్ దాటని అమ్మాయిలు, అబ్బాయిలే. స్టుడియోలో పోటీని ప్రత్యక్షంగా తిలకిస్తున్న ప్రేక్షకుల్లో పోటీదార్ల కుటుంబాలూ ఉన్నాయి. కుమార్తెలు పీలికల బట్టల్లో వేదికెక్కి పిచ్చి గంతులేస్తుంటే ఆనందబాష్పాలు రాలుస్తూ చప్పట్లు చరుస్తున్న ఆ ఆదర్శ మాతాపితల్ని చూసి మళ్లీ బుర్ర గోక్కోవటం నా వంతయ్యింది. రెండు మూడేళ్ల క్రితమెప్పుడో చూసిన ‘బూగీ వూగీ’ అనబడే బుడతల డాన్సు పోటీలో కూడా ఇదే తంతు. అక్కడ మరీ ఘోరం. ఐదు నుండి పదేళ్లలోపు పిల్లలు ముమైత్ ఖాన్ తరహా నాట్యాలేస్తుంటే తల్లిదండ్రుల పట్టరాని పుత్ర/పుత్రికోత్సాహం!
ఇలాంటి సందర్భాల్లో నాకో అనుమానమొస్తుంది. నేను దేశమొదిలొచ్చాక భారతీయ సమాజమింత పురోగమించిందా, లేక నేనే మరీ వెనకబడిపోయానా?
మీ మాట