డిసెంబర్, 2012ను భద్రపఱచు

అత్యాచారం

మూడు రోజుల వ్యవధిలో ఇటు అమెరికాని, అటు ఇండియాని కుదిపేసిన రెండు సంఘటనలు. పసిపిల్లలతో సహా ఇరవయ్యేడు మంది ప్రాణాలు తీసిన ఉన్మాదం ఒకచోట, ఇరవై మూడేళ్ల మెడికోపై అత్యాచారం చేసి రహదారిపై విసిరేసిన ఘాతుకం మరోచోట. రెండూ దారుణాలన్నవి నిజం. వాటికి ప్రజల ప్రతిస్పందన మాత్రం కడు భిన్నం. జబ్బుకి చికిత్స కనుక్కోవాలనే సంకల్పం ప్రపంచపు పురాతన ప్రజాస్వామ్యంలో; జబ్బుని గాలికొదిలి దాని లక్షణాలకి తక్షణ ఉపశమనం కనిపెట్టే ప్రయత్నం ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్యంలో!

కనెక్టికట్ షూటౌట్ నేపధ్యంలో – తుపాకీ సంస్కృతిపై కొరడా ఝళిపించేలా పటిష్ట చట్టాలు తీసుకొచ్చే దిశలో ప్రభుత్వాలపై వత్తిడి అమెరికాలో పెరిగిపోగా;  న్యూఢిల్లీలో – గ్యాంగ్ రేప్ నిందితుల్ని  వెంటనే ఉరితీయాలనీ, చిత్రవధలు పెట్టి చంపాలనీ, బహిరంగంగా కొట్టిచంపాలనీ, ఇన్‌స్టంట్ జస్టిస్ అమలు చెయ్యాలనీ కోరుతూ  ‘ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం మరణించింది’ లాంటి తలాతోకాలేని బ్యానర్లు చేతబుచ్చుకుని రోడ్లెక్కిన యువజనం! సామాజిక సైట్లలో కాలక్షేపం కబుర్లతో వివాదాల్లో ఇరుక్కునే పిల్లకాయల సమస్య పరిష్కరించటానికి సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి దిగిరావలసొచ్చిందంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎలా వెలిగిపోతుందో అర్ధమైపోతుంది. హమారా భారత్‌లో నిత్యం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఘటనలు చాలానే జరుగుతుంటాయి కానీ ఢిల్లీలో జరిగిన ఒకానొక అత్యాచారాన్ని వాటిలో ఒకటిగా జమకట్టటం చూస్తే ఈ రోడ్లెక్కిన జనానికి అసలు ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలుసా అన్న అనుమానం నాక్కలిగింది. ఆటవిక న్యాయం అమలుచెయ్యమంటుందా ప్రజాస్వామ్యం? అలా చేస్తే నేరాలు అదుపులోకొచ్చేట్లైతే ఇప్పటికే అటువంటి చట్టాలున్న దేశాల్లో వాటి అవసరం ఇంకా ఎందుకు మిగిలుంది?

ఢిల్లీ ఘటనలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకి రాజకీయ దన్ను లేకపోవటం వల్లనో, డబ్బు చేసిన కుటుంబాలకి చెందకపోవటం వల్లనో, ఎటువంటి ఇతర పలుకుబడి లేకపోవటం వల్లనో .. మొత్తమ్మీద నిందితుల నేరం రుజువై వాళ్లకి శిక్షపడే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇంతమాత్రం దానికి వేలాది మంది రోడ్లెక్కి ఉద్యమాలు చెయ్యాల్సిన అవసరమేముంది? బాధితురాలికి సంఘీభావం తెలపటం కోసం అనుకుంటే – ఆ పనేదో శాంతియుతంగా చెయ్యొచ్చు కదా. పార్లమెంటు దగ్గరకీ, రాష్ట్రపతి భవన్లోకీ చొచ్చుకుపోవాల్సిన అవసరమేంటి? అక్కడ పహరా కాస్తున్న పోలీసుల్ని రెచ్చగొట్టి రాళ్లు రువ్వటం, ప్రతిగా రబ్బరు బుల్లెట్లు రువ్వించుకోటం. ఇవన్నీ ఎందుకు? అన్నట్టు, ఢిల్లీ నిరసనల్లో దిష్టిబొమ్మలు తగలేస్తున్న ఈ కింది ఉద్యమకారుల్ని చూడంది. వీళ్లలో ఎవరి ముఖంలోనైనా బాధ, ఆందోళన, సానుభూతి లాంటివి కనిపిస్తున్నాయా? నాకైతే అందర్లోనూ రేపు పత్రికల్లో ముఖం చూసుకోవచ్చన్న సంతోషమే కనిపిస్తుంది. ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అన్నాడు సినీకవి. ఈ నిరసనలూ అలాగే అనిపిస్తున్నాయి నాకు.

121226094038-india-rape-protests-story-top

(Courtesy: CNN.com. No copyright infringement intended)

ఈ కొట్టి చంపటాలూ, కాల్చి చంపటాలూ రోగానికి చికిత్స చెయ్యకుండా దానివల్ల ఏర్పడ్డ పుండ్లకి లేపనాలు పుయ్యటం లాంటివి. ఇలా ఆవేశపడటం వల్ల ఒరిగేది సున్న. వీధుల నిండా పబ్బులు, బార్లు; అక్రమ సంబంధాల కథలతో నిండిపోయిన జీడిపాకం సీరియళ్లు, ఆకతాయి పనులే హీరోయిజమనే సినిమాలు, అంగాంగ ప్రదర్శనలు చేసే హీరోయిన్లు; విచ్చలవిడి సెక్స్ మంచిదికాదని తెలియజెప్పేబదులు ఆ చేసేదేదో కండోములు వాడి చేసుకోండని ప్రకటనలు; ఫ్యాషన్ పేరుతో అమ్మాయిల అసభ్య వస్త్రధారణ, స్కూల్ రోజుల నుండే బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ బంధాల గురించి ఆరాటాలు; డ్రగ్స్; ఆడా మగా తేడాల్లేకుండా టీనేజ్ ప్రాయం నుండే ధూమపానాలు, మధుపానాలు; కోరుకున్నది అడ్డదార్లోనైనా దక్కించుకు తీరాలనే మనస్తత్వాలు ప్రబలేలా చేస్తున్న వినిమయ సంస్కృతి …. ఒకటా రెండా …. మనుషుల్లో మనో వికారాలు, ఉద్రేకాలు రేకెత్తించటానికి సవాలక్ష కారణాలు. వీటన్నిట్నీ మించి – ప్రజలకి వ్యవస్థ మీద సడలిన నమ్మకం, ఏం చేసినా చెల్లిపోతుందన్న భరోసా. ఢిల్లీలో అల్లర్లు చేస్తున్న వేలాదిమందిలో – ఇటువంటి సమాజం మాకొద్దు, దీన్ని మార్చే దిశలో ముందడుగేయమని ప్రభుత్వాన్ని అడిగిన గొంతు ఒక్కటైనా ఉందా? మధ్యలో ఉత్తి పుణ్యానికి ప్రభుత్వ ఆస్తుల్ని (అంటే మన ఆస్తుల్నే) కాపాడే విధిలో తన పని తాను చేస్తున్న పోలీసుని కొట్టి చంపారు. ఆ పని చేసిన వాళ్లని నడిరోడ్డు మీద నరికి చంపమని రేపు దేశమంతటా పోలీసుల కుటుంబాలు రోడ్డుకెక్కితే? అంతకన్నా ముందుకెళ్లి .. ఆయుధాలెటూ అందుబాట్లోనే ఉంటాయి కాబట్టి .. అవి తీసుకుని సంతోష్ తోమార్ మీద దాడి చేసినోళ్ల పని పడితే? మనం ఎక్కడి నుండి ఎక్కడికెళుతున్నాం? ఇటువంటి సందర్భాల్ని వ్యవస్థకి చికిత్స ప్రారంభించేందుకు గొప్ప అవకాశాలుగా మార్చుకునే బదులు ఆవేశాలకి లోనై ఇప్పటికే భ్రష్టు పట్టిన సమాజాన్ని ఇంకా నాశనం చేసే కోరికలు కోరటం అవివేకం. నా దృష్టిలో ఆ రేపిస్టులకి, ఈ పోలీసుని చంపిన వాళ్లకి తేడా లేదు. వాళ్లలాగే వీళ్లకి కూడా ప్రాణం విలువ తెలీదు. ఎదుటి మనిషి మీద గౌరవం లేదు. వాళ్లదైనా వీళ్లదైనా మందబలమిచ్చే ధైర్యమే. ఇటువంటివాళ్లు ఆ అమ్మాయికి న్యాయం చెయ్యమని రోడ్లెక్కటమంటే దెయ్యాలు వేదాలు వల్లించటమే.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.