ఫ్యాక్ష-నిజం

కర్నూలు జిల్లాలో కొన్నేళ్ల నిద్రావస్థ తర్వాత మళ్లీ పడగ విప్పిన ఫ్యాక్షన్ భూతం గతవారం స్థానిక కప్పట్రాళ్ల గ్రామ తెలుగుదేశం నేత పాలెగారు వెంకటప్పనాయుడుతో సహా తొమ్మిదిమందిని బలితీసుకుంది. దీనిపై స్పందిస్తూ తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పటిమాదిరిగానే వైఎస్ పై, ఆయన ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఇది ఫ్యాక్షన్ ప్రభుత్వమని, ఈ ముఖ్యమంత్రి హయాంలో తమ పార్టీ కార్యకర్తలెవరి ప్రాణాలకూ భరోసా లేదనీ, .. ఇలా మనం ఎన్నో సార్లు వినున్న వాక్యాలే మళ్లీ వల్లె వేశారు. అయితే, హతుల నేపధ్యం తెలిసినవాళ్లకు చంద్రబాబు మాటలు గురివింద చందంగా అనిపిస్తే అది వాళ్ల తప్పుకాదు.

కాంగ్రెసు అధికారంలోకొచ్చాక రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల ఆగడాలు పెరిగిపోయిన మాట నిజమే. అయితే, ఫ్యాక్షనిజం మహమ్మారిని ప్రోత్సహించటంలో తెలుగుదేశం కూడా తక్కువేమీ తినలేదు. రాజకీయావసరాల కోసం వైరివర్గాలను చేరదీసి రాయలసీమలో రక్తపుటేర్లు పారిస్తున్న తిలాపాపం కాంగ్రెసు, తెలుగుదేశాలకు తలా పిడికెడు. కత్తితో చంపేవాడు కత్తితోనే మరణిస్తాడన్న బైబిలు వాక్యం సాక్షిగా ముఠా తగాదాలతో మమేకమైపోయిన జీవితాలు అలాగే ముగిసిపోతాయి. చేసుకున్న వారికి చేసుకున్నంత. ముప్పై ఎనిమిదేళ్లుగా ఫ్యాక్షన్ తో పెనవేసుకున్న వెంకటప్పనాయుడి బ్రతుకూ అలాగే తెల్లారిపోయింది. నిజమిలా ఉంటే, హతుల గత చరిత్ర తెలియనట్లు చంద్రబాబు అమాయకత్వం ఒలకబోయటం విడ్డూరం.

‘ఫ్యాక్షన్ అనేది ఫాషన్ కాదు. ఒక సారి ఈ ఊబిలో కూరుకున్నారంటే బయటకు రాలేరు. నా కధ విన్నాకైనా దీనికి దూరంగా ఉండండి’ అని నాలుగేళ్లనాటి ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పిన వెంకటప్పనాయుడి మాటల వెనుక ఒక నిస్సహాయుడి ఆవేదన కనిపిస్తుంది. అతని ప్రత్యర్ధులని కదిలించినా దాదాపు ఇవే మాటలు చెబుతారేమో. ఇరు వర్గాలూ విసుగెత్తిపోయి ఉన్నా ఇంకా ఫ్యాక్షన్ బ్రతికే ఉండటానికి కారణం నిస్సందేహంగా రాజకీయ పార్టీల చదరంగమే. ఫ్యాక్షన్ గురించి చంద్రబాబు, వైఎస్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం ఆపి దీన్ని అరికట్టటానికి కలిసి కృషి చెయ్యాలి. ఫ్యాక్షనిస్టులకు తమ పార్టీలలో చోటు ఇవ్వమని ప్రకటనలతో సరిపెట్టటం కాకుండా దాన్ని చేతల్లో చూపించాలి. పోలీసులకు ఈ విషయంలో పూర్తి అధికారాలిచ్చి వారిపై రాజకీయ ఒత్తిడి లేకుండా చూడాలి. ఫ్యాక్షన్ నుండి రాజకీయాన్ని విడదీసిన నాడు ఎందుకు లొంగదీ పెనుభూతం?

ఫ్యాక్షనిజాన్ని పౌరుషానికి చిహ్నంగా చూపుతూ తొడలుగొట్టి మెడలు నరికే సినిమాలు పదులకొద్దీ తీస్తున్న తెలుగు చిత్రపరిశ్రమ కూడా ఈ విషయమై పునరాలోచించుకోవాలి. ఇన్నాళ్లూ ఫ్యాక్షన్ పేరిట సొమ్ముచేసుకున్న నిర్మాతలు కాస్తంత సామాజిక బాధ్యత వహించి అదే ఫ్యాక్షనిజాన్ని తెగనాడుతూ సందేశాత్మక చిత్రాలెందుకు తీయకూడదు? సొంత లాభం కొంత మానుకుని సినీ మాధ్యమానికున్న శక్తిని సమాజ హితంకోసం ఎందుకు వాడకూడదు?

 

2 స్పందనలు to “ఫ్యాక్ష-నిజం”


 1. 1 arunaa 4:43 ఉద. వద్ద మే 21, 2008

  avunandi atu rajakiya nayakulu faction nu prothsahinchakudadu.. prajalu kuda evariki varu avesalaku lonu kakunda chusukovali.. aruna

 2. 2 రాకేశ్వర రావు 7:23 ఉద. వద్ద మే 21, 2008

  మీ వ్యాసం చదివితే కొంత నవ్వు అంత కంటే ఎక్కువ బాధా వేస్తున్నాయి.

  ఒక ప్రక్క స్వప్రయోజనాల కోసం భూతాలను పెంచి పోషించడమేగాని కలసి వాటిని హరికట్టలేని మన రాజకీయ పక్షాల గురించి తెలిసి కూడా మనము ఇంకో ప్రక్క ఇలా ఆశ వదులుకోలేకపోవడం…

  దేఁవుఁడు కాపాడాలి దేశాన్ని !


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: