పసలేని కథలు

అనగనగా ఓ ఊళ్లో ఓ రెడ్డిగారున్నారు. ఆయనంటే అందరికీ గౌరవం. ఎందుకంటే – ఇందుకు.

రెడ్డిగారు శానా దరమ పెబువు. ఊళ్లో ఎవరికే తగువొచ్చినా ఆయనే తీరుస్తాడు. గుళ్లో చోరీ చెయ్యబోయిన దొంగోడి చేతులు నరికేయమంటాడు. కాబోయే అల్లుడు ఎవరో అమ్మాయిని పాడుచేశాడని (ఆ కుర్రోడు అడగ్గానే ఆ విషయం ఒప్పేసుకున్నాక) వాళ్లిద్దరికీ పెళ్లి చేసెయ్యమంటాడు. తన కొడుకు కులం తక్కువ పిల్లని ప్రేమించానని చెబితే వాళ్లిద్దర్నీ లేచిపొమ్మని ప్రోత్సహిస్తాడు.

ఇంతే కథ. ఈ మాత్రం మూలకథకి మూడు పేజీల వర్ణనలు, పేజీకో పదిహేను పాత్రలు, పాత్ర పాత్రకీ ఇంటిపేరుతో సహా పరిచయాలు, సవాలక్ష ఇతరత్రా వివరాలు – వాళ్ల వంశవృక్షాల కాణ్నించి, ఎవరేం పనులు ఎలా చేస్తారనేదానిదాకా. కూర తక్కువై తాలింపెక్కువైన తంతు. పై కథ చదివాక రెడ్డిగారు శానా దరమ పెబువు ఎలాగయ్యాడబ్బా అని మీరనుకుంటే మీరు నాలాంటివాళ్లైనట్లు; -కోకపోతే తెలుగు సాహితీ విమర్శనాగ్రేసరులైనట్లు. నాసి రకం రచనలు ఉత్తమ సాహిత్యంగా మన్ననలందుకోటం ఈ బాపతు విమర్శకుల పుణ్యమే.

నాలుగు పేజిల నిండా ఏం బరికినా, అచ్చైతే చాలు అదో కథైపోతుందనేది తెలుగునాట మళ్లీ మళ్లీ రుజువవుతున్న సత్యం. ఆ బరుకుళ్లకి బాపూ బొమ్మలు కూడా తోడైతే నా సామిరంగా ఇక అవి అల్లాటప్పా కథలు కావు. మనిషి జన్మనెత్తినవాడు చదివి తీరాల్సిన ఆణిముత్యాలు! పై ఆణిముత్యాన్ని పుట్టించింది వంశీ. ఇలాంటి ముత్యాలు మరో డెబ్భయ్యొకటున్నాయి ‘మా పసలపూడి కథలు’ పేరుగల ఆల్చిప్పలో. ఈ పుస్తకం గురించి ఈ మధ్య కాలంలో విన్నదాన్ని బట్టి ఏదేదో ఊహించుకుని, అట్ట మీదా లోపలా బాపు గీసిన బ్రహ్మాండమైన బొమ్మలు చూసి మురిసిపోయి ఇదేదో చదివి తీరాల్సిన పుస్తకమేననుకుని కొనుక్కొస్తే, సగం చదివేసరికి తల దిమ్మెక్కిపోయింది. తక్కిన సగం చదివే దమ్ము లేకపోయింది.

కనాకష్టంగా ఇందులో నే లాగించిన కథలు ముప్పై రెండు. అవన్నీ చదివాక నాకనిపించింది – వంశీ కథలు రాయటం పూర్తిగా మర్చిపోయాడని. కథ అనే పదార్ధానికి సంబంధించిన కనీస లక్షణాలేవీ లేనివే ఈ ముప్పై రెనండిట్లోనూ మెండు. ఉదాహరణకి ఒకటి.

‘దీపావళి ఇక మూడు వారాలుందనగా బాలవరంలో టీచరుగా చేరిన అనంతలక్ష్మికి రొంపజ్వరంలాగా వచ్చింది’.

‘కోరి రావులుగారి బస్ కండక్టర్’ అనే కథకి ప్రారంభ వాక్యం పైది. ‘అనంతలక్ష్మి దీపావళికి మూడు వారాల ముందు టీచరుగా చేరిందా, లేక పండక్కి మూడు వారాల ముందు ఆమెకి జ్వరమొచ్చిందా’ అన్న గందరగోళంలో పడ్డాన్నేను. ఆరు పేజీల ఈ కథలో ఒకటిన్నర పేజీలు బాపూ బొమ్మలకి పోగా మిగిలిన నాలుగున్నరలో ఒక పూర్తి పుట అనంతలక్ష్మి వివరాలతో నింపేసి ఆమెకి ఆ తర్వాతేమైందనే అసక్తి పాఠకుల్లో విజయవంతంగా కలిగించాక అసలు కథానాయకుడిని ప్రవేశపెడతాడు వంశీ. మిగిలిన కథంతా (అదంటూ ఒకటుంటే) సదరు పరోపకారి పాపన్న గురించే. అనంతలక్ష్మి దీపావళికి మూడు వారాల ముందు బళ్లో చేరిందో, సంక్రాంతి వెళ్లిన నాలుగో రోజు జ్వరపడిందో, ఆవిడ చుట్టాలు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో ఇవన్నీ ఈ కథకి అనవసరం. వంశీకేమో అవన్నీ పూర్తిగా అవసరం అనిపించినట్లున్నాయి. నాకు మాత్రం ఇది కాగితాలు నింపే యవ్వారంలాగే కనిపించింది.

కథకి ఏ మాత్రం ఉపయోగపడని ఇలాంటి వివరాలూ, విశేషాలూ కోర్రావులు గారి కండక్టరుకే పరిమితం కాదు. ‘తామరపల్లి సత్యంగారి తమ్ముడు రామం’ కథకీ తామరపల్లి సత్యంగారికీ ఎటువంటి సంబంధమూ లేదు. అందులో ఆయన ప్రస్తావన సైతం రాదు. దీన్ని ‘పుల్లాయమ్మ గారి పొరుగింట్లో ఉండే రామం’ అన్నా పోయేదేమీ లేదు – ఇలాంటి పిచ్చి ప్రశ్నలేసి అచ్చేయననే సంపాదకులు లేనంతవరకూ. తాను ఏం రాసినా, ఏం చేసినా చెల్లిపోతుందనే భావనో లేక పాఠకులపై అంత చిన్నచూపో – మొత్తమ్మీద కథలు రాయటమే కాక వాటికి పేర్లు పెట్టటంలో సైతం వంశీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందిక్కడ.

వంశీ నిర్లక్ష్యానికి ఉదాహరణలు వెదక్కుండానే కథకో పదన్నా కనపడతాయీ పుస్తకంలో. పైన చెప్పుకున్న రెడ్డిగారి సొదనే తీసుకుంటే, కిళ్లీ కొట్టు వీరన్న (ఉరఫ్ కిళ్లీరన్న) చెప్పే కథ అదంతా. రెడ్డిగారు కొడుకుని లేచిపొమ్మని ప్రోత్సహించటం మూడో మనిషికి తెలీకుండా చేసిన పని. మరది కిళ్లీరన్నకి ఎలా తెలిసిందో వంశీకే ఎరుక. ఈ కథ ఇంకా నయం. ఉత్తమ పురుషంలో నడిచే మిగతా కథల్లో కూడా ఇదే ధోరణి. ఎదుటి వ్యక్తి మనసులో అనుకునే విషయాలు సైతం కథకుడు అలా అలా అలవోకగా చెప్పుకుపోతుంటాడు!

‘మునగచెట్టు’ అనే మరో కథుంది. నెయ్యి అమ్ముకుని పొట్టపోసుకునే ఇద్దరు దంపతుల కథ.  కథ మొదట్లో ఈ దంపతులకి ఏడుగురు పిల్లలని చెప్పి, ఎవరే క్రమంలో పుట్టిందీ, వాళ్లకీ ఏ పేర్లు ఎందుకు పెట్టిందీ – ముద్దు పేర్లతో సహా – చెప్పుకుంటూ వస్తాడు రచయిత. కథ సగానికొచ్చేసరికి ఎనిమిదో కొడుకు పుట్టుకొచ్చేస్తాడు ఎక్కడ్నుండో! పిల్లలు పెద్దాళ్లై ఎవరెవర్ని పెళ్లి చేసుకున్నారు, ఎక్కడ కాపురాలు పెట్టారు – ఇవి మిగతా పేజీలకి సరిపడా సరుకు. పిల్లలందరూ ఎవరిదార్న వాళ్లు పోతే పెరట్లో పెంచుకున్న మునగచెట్టే ముసలితనంలో పెద్దాళ్లిద్దరికీ అన్నీ అయ్యిందనే నాటకీయ ముగింపు చివర్లో. ఇంతోటి కథకి ఎనిమిది మంది సంతానాన్ని పెట్టాల్సిన అవసరమే లేదు, వాళ్ల వివరాలతో కాగితాలు నింపటానికి తప్ప. ఇంత సంతు ఎందుకో వంశీకే తెలిసినట్లు లేదు. ఏదో నోటికొచ్చిన పేర్లన్నీ రాసుకుపోయినట్లున్నాడు. ఆ క్రమంలో పాఠకుల్ని గందరగోళపరచటమే కాక, స్వయంగా తానూ గందరగోళపడిపోయాడు – ఓ సారి ఏడుగురు పిల్లలనీ, ఇంకోసారి ఎనిమిది మందనీ అనటం ద్వారా. ఇది చదివాక, ఎడిటర్లు ఇలాంటి కథలు అచ్చేసేముందు కనీసం చదువుతారా లేదా అన్న సందేహమొచ్చింది నాకు. అయితే ‘బురకమ్మ కర్రీరెడ్డి’ చదవగానే బుర్రలో లైటు వెలిగింది; పై సందేహానికి సమాధానం తెలిసింది . ఎడిటర్లే కాదు, వంశీ సైతం ఓ సారి రాసి పడేశాక తన కథ తనే చదువుకోడని అర్ధమైపోయింది.కింది పేరా చదవండి.

‘ఆ మధ్యాన్నం సైకిలుషాపు పాపారావుగారింటి ముందు నిలబడ్డ ఆంబోతుకి పాపారావుగారి రెండోవాడు చేటలో కొత్త ఒడ్లు పెడితే తినేసెళ్లిపోయింది. మైకుసెట్టు గోపాళంగారింటి ముందు ఇసక గుట్ట మీద కూర్చున్న ఇద్దరు చిన్నపిల్లలు తలంబ్రాలు పోసుకున్నట్టు ఇసకని నెత్తిమీద పోసుకుంటుంటే అందులో ఓ పిల్లతల్లొచ్చి బాదుకుంటా తీసుకుపోయింది. బుచ్చిరాజు కిళ్లీకొట్టు ముందు వేలాడుతున్న అరిటిపళ్ల గెలకి కత్తి దిగబడి ఉంది. పెద్దవీధిలో అరుస్తా సైకిలు తొక్కుకుంటా వెళ్తున్న బట్టల మూటోడు బాగా లావుగా ఎత్తుగా ఉన్నాడు. వాడి గొంతు మట్టుకు ఆడదానిలాగుంది’

‘బురకమ్మ కర్రీరెడ్డి’ కథ మధ్యలో దర్శనమిచ్చే ఈ ఐదు వాక్యాలకీ అసలు కథతో బీరకాయపీచు సంబంధమన్నా ఉందని ఎవరన్నా నిరూపిస్తే నేను ముక్కు నేలకి రాసి కేసీఆర్‌కి కాల్మొక్తా. టెలిఫోన్లో క్రాస్ టాక్‌లా ఎక్కడ్నుండో ఊడిపడ్డ ఆ పేరా చదివాక కానేపు బుర్ర తిరిగింది. వేరే కథలో వాక్యాలు పొరపాటున ఈ కథలో అచ్చైపోయాయేమోనన్న అనుమానమొచ్చింది. వెన్వెంటనే – లావుపాటి బట్టల మూటోడి ఆడగొంతు గురించీ, నెత్తిలో ఇసుకపోసుకుంటున్న పిల్లల గురించీ, అరటిపళ్ల గెలకి దిగబడున్న కత్తి గురించీ, చేటలో కొత్త ఒడ్లు తిన్న ఆంబోతు గురించీ అప్రస్తుత ప్రసంగాలూ, అసందర్భ వర్ణనలూ చేయటం వంశీ మార్కనే సంగతి స్ఫురించి – అది అప్పుతచ్చు కాదన్న నమ్మకం కుదిరింది, తెలుగు కథల మీద విరక్తి ముదిరింది. చదివేవారు రాసేవారికి లోకువ అన్న లోకోక్తి ఇప్పటికే లేకపోతే పుట్టించాల్సిన తరుణం ఆసన్నమయింది.

రాసుకుంటూ పోతే ఇలా వస్తూనే ఉంటాయి కాబట్టి లోపాల గురించి ఆపేసి ఆయా కథల్లో వస్తువు గురించి చూద్దాం. ఉంచుకోటాలు, లేచిపోటాలు, భోగం మేళాలు, రికార్డింగ్ డాన్సులు, అక్రమ సంబంధాలు – ఇలా తనకిష్టమైన సబ్జెక్టుల చుట్టూతే దాదాపు అన్ని కథల్నీ తిప్పుతూ అదే గోదావరి సంస్కృతి అని నమ్మించబోయాడు వంశీ. ఒక్కో రచయితకీ ఒక్కో తరహా ఇతివృత్తాలపై ఆసక్తి ఉంటుంది. వంశీకి ఇవంటేనే అమితాసక్తేమో. మొత్తమ్మీద, ఎక్కువ శాతం ఒకే మూసలోని కథలు. అసలు మంచి కథలే లేవా వీటిలో అంటే, ఉంటానికి ఒకట్రెండున్నాయి. ‘జక్కం వీరన్న’, ‘సత్యం పలికే స్వరాజ్యరెడ్డిగారు’ అనేవి ఉన్నంతలో నాకు నచ్చిన కథలు. ముప్పై రెండు చదివితే రెండు ఫర్లేదనిపించే కథలు!

జక్కం వీరన్న గురించి కొంచెం చెప్పుకోవాలిక్కడ. ఒకప్పుడు గోదావరి జిల్ల్లాల్లో పేరుమోసిన వడ్రంగి  ఇతను. కాలక్రమంలో తాగుడుకి బానిసై సర్వభ్రష్టుడై చివరి రోజుల్లో జనానికి తన గతం గుర్తుచేస్తూ ముష్టెత్తుకున్న మనిషి. ‘పసలపూడి కథలు’ పుస్తకం మొదటి పేజీలో ప్రముఖంగా ముద్రించున్న బాపూ-రమణల ప్రశంసా పత్రం చూస్తే నాకు జక్కం వీరన్న కథే గుర్తొచ్చింది.

ఎందుకో?

36 స్పందనలు to “పసలేని కథలు”


  1. 1 nestam 9:15 సా. వద్ద సెప్టెంబర్ 15, 2011

    >>>ఉంచుకోటాలు, లేచిపోటాలు, భోగం మేళాలు, రికార్డింగ్ డాన్సులు, అక్రమ సంబంధాలు – ఇలా తనకిష్టమైన సబ్జెక్టుల చుట్టూతే దాదాపు అన్ని కథల్నీ తిప్పుతూ అదే గోదావరి సంస్కృతి అని నమ్మించబోయాడు వంశీ

    ఇది ఒప్పుకుంటాను ..అలాగే అనిపిస్తుంది నాకు కూడా..

    కాని వంశీ కధలు చదివేది కేవలం అతను వర్ణించే పల్లె సౌదర్యం, అక్కడి జనాలా జీవన విధానాలు కోసమే.. అందుకే మీరు మొదట్లో అన్నట్లు

    >>>>ఈ పుస్తకం గురించి ఈ మధ్య కాలంలో విన్నదాన్ని బట్టి ఏదేదో ఊహించుకుని

    మీకు చెప్పినవారందరూ మెచ్చుకున్నది అతని శైలి మాత్రమే…కధలో విషయ వస్తువు గురించి కాదనుకుంటాను..

    ఇంక

    >>>తామరపల్లి సత్యంగారి తమ్ముడు రామం’ కథకీ తామరపల్లి సత్యంగారికీ ఎటువంటి సంబంధమూ లేదు. అందులో ఆయన ప్రస్తావన సైతం రాదు…

    ఇక్కడేమిటంటే ..ఎక్కువగా పల్లెటూరిలో జనాలు (తూ.గో.జిల్లాల్లో) ఎవరిగురించైనా చెప్పినపుడు డైరెక్ట్గా ఆ పేరుతో చెప్పరు ఫలానా ఫలానా వాళ్ళ తమ్ముడు అని మొత్తం వంశాన్ని లాగుతూ మాట్లాడుతారు ..అదే కధల్లో ఉపయోగించాడు అనుకుంటాను..

    మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు చూద్దాం..
    🙂

  2. 2 bollojubaba 9:58 సా. వద్ద సెప్టెంబర్ 15, 2011

    వంశీ కధల్లో కనిపించే వర్ణనల అన్నీ తాను తిరిగిన ఆయాప్రాంతల వర్ణణలు తప్ప మరోటి కావు. ఇక పేర్లు కూడా చాలా మట్టుకు నిజ పాత్రలే. అంత రూఢీ గా ఎలాచెప్పగలవంటే, వంశీ యానాంలో ఉన్న రోజుల్లో రాసిన ఓ కధలో నేనూ నా మిత్రబృందం పాత్రలుగా వస్తే ఆయననే స్వయంగా అడుగగా, చెప్పిన విషయమిది. ఇకకధకు లైన్ కూడా నాకు తెలిసి తాను విన్న విషయాలనుండే వంశీ గ్రహిస్తాడనేది నా అభిప్రాయం.

    ఇంటిపేర్లు అనేవి నేటివిటీని ప్రతిబింబిస్తాయి. ఊరిపేర్లు, వీధుల పేర్లు కూడా అంతే.
    ఓ కధలో – యానాం వంతెన కట్టక ముందు అక్కడ నడచిన నావల గురించి, పంటుల గురించి,రేవుకు ప్రయాణీకులను తీసుకువచ్చే గుర్రపు బళ్ళగురించి, అక్కడి హొటళ్ళ గురించి, అక్కడ ఉపాధిపొందే కొన్ని పదుల కార్మికుల గురించి ఇంటిపేర్లతో సహా ఇచ్చిన వివరాలు – ఇవన్నీ నూటికి నూరుపాళ్ళూ వాస్తవాలని ఒక స్థానికుడిగా చెప్పగలను. ఈ రోజున ఒకనాడు పడవలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం నిర్జనంగా ఉంటుంది. కానీ అక్కడ కూర్చొని ఈ కధను చదువుకొంటే ఆనాటి ప్రపంచంలోకి వెళ్ళవచ్చు.(కనీసం నేను వెళ్ళగలను). ఆ రకంగా వంశీ ఒక స్థానిక విషయాన్ని కధరూపంలో రికార్డు చేశాడని అనుకొంటాను. (అదికూడా వంతెన మొదలైన కొత్తలో)

    కొన్ని స్థానిక విషయాలని కధలరూపంలోకి తీసుకువచ్చినప్పుడు కధకు అవసరమైనంత నాటకీయత తీసుకురాలేకపోవచ్చు. ఓ హెన్రీ ముగింపులు ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల సార్వ జనీనత లోపించవచు.
    బహుసా అందుకనే తనకథలకు పసలపూడి కధలు, దిగువగోదవరి కధలు అంటూ స్థానికతను ప్రతిబింబించే పేర్లనుంచాడేమో వంశీ

    అలా గనుకొంటే ప్రళయకావేరి కధలలో ఎంముందీ? సొంత గోల, భౌగోళిక విషయాలు తప్ప. అయినప్పటీకీ అవి గొప్పవనే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని స్థానిక విషయాల్ని రికార్డు చేస్తున్నాయి కనుక.

    ఇక శైలి విషయంలో ఎవరి శైలి వారికి. అందరూ ఒక మూసలో ఎందుకు రాయాలి. వంశీ వంశీలానే రాస్తాడు.
    వ్యాకరణ దోషాలు, అప్రస్తుత ప్రసంగాల విషయంలో మీ పరిశీలనలు సబబుగానే అనిపిస్తున్నాయి.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    చప

  3. 3 Indian Minerva 10:14 సా. వద్ద సెప్టెంబర్ 15, 2011

    మీరన్నది నిజమని నాక్కూడా అనిపించింది. కాకపోతే పరమహంసలాగా అనవసరమైన పాత్రలను ఫిల్టర్ చేసే టాలెంటుంది నాకు 🙂 (కొన్నిసార్లు ఒకపాత్రపేరు తగిలితే అదెవరో అర్ధంకాక “వీడుఎవ్వడు” అనుకుంటూ పుస్తకాన్ని వెనక్కి చదివే అలవాటుతోబాటు). ఇక మీరుచెప్పిన “ఐదు లైన్ల” దగ్గరికొస్తే సినిమా స్క్రిప్టులో లెఫ్టో రైటో (కోతికొమ్మచ్చిలోచదివాను) ఏదో అంటారు కదా ఇది ఆబాపతనుకుంటా. ఇదిచదివాక మరోసారి ఈ కధల్ని చదవాలనిపించింది.

  4. 4 అజ్ఞాత 11:29 సా. వద్ద సెప్టెంబర్ 15, 2011

    అబ్రకదబ్ర: సరిగ్గా రాశారు. ఏం రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో తెలీకుండా రాసిన రాతల్లాగా కనిపిస్తయ్యొకోసారి. ఒక సార్వజనీనమైన వస్తువుకు ప్రాంతీయత నేపథ్యంగా ఉంటే అది మెచ్చదగిన ప్రయత్నం కానీ, ప్రాంతీయతనే అడ్డుపెట్టుకుని కనిపించిన జీవితాలను కథగా మల్చడం అంటే – ఉప్పులో పప్పు వేసినట్టు ఉంటది. గోదావరి జిల్లాల్లో కాక పక్క జిల్లాల్లో పుట్టిన పాపానికి ఆ కథలు, ఆ యాస అర్థం కాక, మధ్యలో ఇంటిపేర్లు చదివి జీర్ణించుకోలేక, బాపు బొమ్మల్ని చూసి ఏమీ బయటకు చెప్పుకోలేక, పోనీ బ్రహ్మపదార్థంలాగా కనబడే కథను వెతికితే అదీ కనబడక – వంశీ తెగ ఏడిపిస్తాడు. అయినా ఏవనకూడదు – గొప్పవాడు కాబట్టి.

  5. 5 oorodu 12:44 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2011

    స్వాతి పత్రిక మొత్తంలో నేను ముట్టుకొని ఏకైక కధా శీర్షిక ఇది. అందరూ తెగ పొగిడేస్తుంటే, నేనే మామూలు మనిషిని కానని సరిపెట్టుకున్నా. నా లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారన్న మాట. 😛

  6. 6 oorodu 12:48 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2011

    ఇలాంటి కధలు ముప్పై రెండు చదివారంటే గొప్పే. నేనైతే ఖతర్నాక్ సినిమా ఇంకో రెండు సార్లు చూడగలనేమో గాని ఈ కధలు పడిన చదవలేను.. 😉

  7. 7 Mauli 1:29 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2011

    కధలు బాగున్నాయా, సరిగా ఉన్నాయా అని వదిలేస్తే ..అక్కడి సంస్కృతి గురి౦చి వ్రాసాడు . అన్ని ప్రా౦తాల సంస్కృతులు మనకి నచ్చాలని లేదు (ఇప్పుడు మారాయేమో )

  8. 8 M.V.Ramanarao 5:40 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2011

    వంశీ ఒక రంగంలో గొప్ప వాడైనంత మాత్రాన ఆయన ఏది రాసినా మెచ్చుకొవాలని లేదు. ఆయన కథలు కొన్ని చదివాను.అంత గొప్పగా లేవు.ఐతే ఈ సందర్భంలో రెండు మాటలు మనవి చేస్తాను.
    ఇలాంటి(genre) కథలు చాలా కాలం క్రిందటే వచ్చాయి.1.చింతా దీక్షితులుగారి ‘ వటీరావు కథలు.2.ము నిమాణిక్యంవారి ‘కాంతం కథలు.’ 3.భానుమతిగారి అత్తగారి కథలు.తర్వాతి కాలంలో వచ్చినవి.1,సత్యం శంకరమంచి ‘అమరావతి కథలూ2.నామిని
    ‘సినబ్బకథలూ3.దర్గామిట్టకథలూ4.దాక్షారామం కథలు 5.ఇప్పుడు వస్తున్న ‘హోసూరు కథలు మొదలైనవి.
    వీటన్నిటిలో ముఖ్యమైన అంశం ఏమంటే ,ఒకవూరు,స్థలం గాని ఒక వ్యక్తిని గాని తీసుకొని ఆ చుట్టూ అల్లినవి. వీటిలో ప్రధానంగా వ్యక్తి స్వభావం ,ప్రవర్తన, మాటలూ హాస్యంగా చిత్రింపబడతాయి.లేక ఒక వూరి లో ఉన్న వివిధ వ్యక్తుల గురించి తమాహాగా వర్ణిస్తూ ,చిన్నచిన్న ఘటనలతో ఆ వూరిప్రత్యేకతను తెలియచేస్తాయి. కథ పెద్దగా ఉండదు.కథకు ఎక్కువప్రాధాన్యం ఉండదు.సహజత్వానికి, వాతావరణానికి ,నేటివిటీకి ,హాస్యానికి
    ఇలాటి కథలు పేరు పడ్డాయి. ఐతే కొన్ని కథలుట్రాజిక్ గా కూడా ఉంటాయి. మొత్తం మీద నేటివిటీ ,వాతావరణాం బా గావుండాలి.
    ఐతే రచయిత ప్రతిభ,శిల్ప ప్రావీణ్యం మీద తరతమ భేదాలు ఆధారపడి ఉంటాయి.

  9. 9 కన్నగాడు 5:51 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2011

    స్వాతిలో ఈ కథలు కొన్ని చదివాను, అవసరమైన దానికంటే ఎక్కువ వర్ణన ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం ఆపకుండా రెండు పేరాలు చదివిన గుర్తు లేదు, కామాలు, పులిస్టాపులు లేని వాఖ్యాలు ఒకటికి రెండుసార్లు చదవాల్సి వచ్చేది.
    ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారూ సినిమాలో ‘గాలి దుమారం’ అని పాత్ర(M.S. నారాయణ) మాట్లాడినట్టు ఉంటుంది కథ కూడా.
    ఇక పేర్ల గురించి అంటారా! యండమూరి లాంటి వాళ్ళే దానికి అతీతులు కాదు. ‘అతడే ఆమె సైన్యం’ లో అనుకుంటా కథ సగానికి వచ్చే సరికి ఒక పాత్ర పేరు మారిపోతుంది. బహుషా గొప్ప రచయితలు అంతేనేమో.

  10. 11 chinni 6:04 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2011

    కథలు చదువుతుంటే దృశ్యం కళ్ళ ముందు చక్కగా కనిపిస్తూ మనం అక్కడ వున్నా అనుభూతి కలుగుతుందండి :-)అంత అధ్బుతంగా వుంటాయి వర్ణనలు .నిజం చెప్పాలంటే తు.గో .జిల్లా సంస్కృతి సంప్రదాయాలు అక్కడి ప్రజల జీవన విధానం తన కథల్లో పుష్కలంగా వుంటాయి ,వంశీ చెప్పేవరకు తెలీదు అక్కడ పులస కి ప్రసిద్దని .అలాగా బోల్డంత నాలెడ్జ్ 🙂

  11. 12 లలిత (తెలుగు4కిడ్స్) 6:51 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2011

    చిత్రంగా, మీరు ఈ కథల గురించి చెప్పి నాకు చదవాలనిపించేలా చేశారు. ఇంతకు ముందు చదివినవన్నీ యాస గురించీ, వర్ణనల గురించీ చెపుతూనే పొగిడినా, ఆకుపచ్చని జ్ఞాపకం సంకలనంలో ఒకటి రెండు కథలు చదివాక నేను వంశీ కథలు ఇష్టపడలేను అనిపించింది. అసలు వంశీ కథలలో ఏం ఆశించాలో ఇప్పుడు అర్థమయ్యింది. ఇప్పుడు మీరు వ్రాసినది చదివాక నేను ఏర్పరుచుకోవలసిన expectations కి స్పష్టత ఏర్పడింది. ఇంతకు ముందూ అర్థమైనా అవి కూడా రుచిస్తాయనుకోలేదు నేను. తీరా చదివాక ఏమనిపిస్తుందో చూడాలి.
    ఇక ప్రాంతీయత గురించి:
    అది కూడా నాకు ఈ రచయితని అందరూ మెచ్చుకుంటుంటే నాకంత గొప్పగా అనిపించకపోవడం గురించి ఆలోచించేలా చేసింది. ప్రతి ఒక్క రచనా ప్రతి ఒక్కరికీ నచ్చితేనే అది గొప్ప కథ కాదు. target audience కి సరిగ్గా అందితే ఆ కథ / కళా ఖండం సార్థకత సాధించినట్టే. నాకెపుడూ తెలుగు సృజనాత్మకత (కథలూ, సినిమాలూ, పిల్లల సాహిత్యం) గురించి ఆలోఛిస్తే, అవి అంతగా ఎదగకపోవడానికీ, మూసలను saturate చెయ్యడానికీ కారణాలు వెతికితే అనిపించేది ఇదె – అందరూ ‘అందరినీ ‘ (వత్తి పెట్టి చెప్పాలనిపిస్తుంది) ఆకర్షించి ఆనందింప చేసెయ్యాలనుకోవడం, అందుకు ఏ కొంచెం తక్కువైనా fail అయినట్టు భావించడం, అందువల్ల కొత్తగా ఆలోచించి చేసే ప్రయత్నాలు విజయవంతం కాలేదు అనుకోవడం గట్రా అనిపిస్తుంటుంది. ఒక కొత్త ప్రయత్నం box office దగ్గర విజయవంతం కాలేదు అనుకోవడం కన్నా, అది ఎటువంటి ప్రేక్షకులకి నచ్చింది, వారి కోసం తీస్తే ఏ స్థాయిలో రిటర్న్స్ ఆశించవచ్చు అని realistic గా ఆలోచించి అంతే ఆశలు పెట్టుకుని,అంతకు తగినంత పెట్టుబడే పెట్టి ప్రయత్నం చేస్తే ఆ స్థాయిలో విజయం సాధించి అక్కడ్నించీ ఎదగడం మొదలు పెట్టొచ్చు అనే ఆలోచనతో ప్రయత్నాలు చేస్తే కళకీ, కళాకారులకీ, ప్రేక్షకులకీ కూడా మంచి రోజులు వస్తాయి అనిపిస్తుంది.

  12. 13 Sravya V 9:52 సా. వద్ద సెప్టెంబర్ 16, 2011

    పదహారు అణాల తెలుగోడి అభిప్రాయం 🙂 ఒకవేళ ఇదే పోస్టు మీ పేరు తో కాకుండా , మీ బ్లాగులో కాకుండా ప్రచురించినా ఇది రాసింది మీరే అని గుర్తు పట్టేసి ఉండేదాన్ని 🙂

    మీ అభిప్రాయం తో మాత్రం నేను కొద్ది గా విభేదిస్తాను .. మరీ ముఖ్యం గా వర్ణనల విషయం లో , అసలు అలా వర్ణిచటం , పరిసరాలని మన కళ్ళ ముందు కి తీసుకు రావటం వంశీ కున్న ప్రత్యేకత , ఇంకా చెప్పాలి అంటే మిగిలిన వారి తో వేరు గా అతన్ని గుర్తించటానికి ఒక కారణం . అలాగే ఆయన రాసే కథలలో ఉన్న విషయం నాకు నచ్చదు , కాని అలా అని జరిగి ఉండకపోవచ్చు అలా ఎక్కడ జరగదు అనేది మాత్రం నేను నమ్మను . చాలా వరకు వంశీ కథలు నోస్తాల్జీయ మీద ఆధారపడివున్నవే , కాబట్టి ఆ రోజుల్లో ,ఒక చిన్న ఊర్లో అలాంటి సంఘటనలు జరిగే ఉండొచ్చు అని అనిపిస్తుంది . అవే కాకుండా ఇంకేమి వంశీ కి కనపడలేదు ఎందుకు అంటే అవును నిజమే ఎందుకో మరి తెలియదు .

    నాకు అన్ని వంశీ కథలు అన్నీ నచ్చవు కాని ఒక విషయాన్నీ ఎటువంటి మెసేజ్ లేదా అలాగే రచయత అభిప్రాయం ఇది అని ముద్ర లేకుండా రాయటం నచ్చుతుంది .

    ఇక కథల్లో అక్కడ కొన్ని తప్పులాంటారా అవును అది నిజం , అలాగే వంశీ సినిమాలలో ఎడిటింగ్ ప్రొబ్లెంస్ ఉంటాయి అది మొత్తం సినిమా మీద కాకుండా సీన్ల అల్లికల మీద ఎక్కువ ద్రుష్టి పెట్టటం వల్ల అనుకుంటా .

  13. 14 Vishwanath 11:59 సా. వద్ద సెప్టెంబర్ 17, 2011

    నేను నాలుగంటే నాలుగు కథలు మాత్రమే చదివి పక్కన పడేసాను దీన్ని, దీనితో పోలిస్తే దర్గామిట్ట కథలు కొంచెం బాగునట్టు తోచాయి నాకు,బహుశా ఇది చదినిన తరువాత దాని మీద అంచనాలు ఏమీ పెట్టుకోకపోవడం వలన అయి ఉండొచ్చు.

  14. 15 sujatha 2:33 ఉద. వద్ద సెప్టెంబర్ 18, 2011

    సెక్స్, తిండి ఈ రెంటి యావా ప్రతి కథలోనూ కనిపిస్తుంది. కొన్ని చోట్ల మరీ వెగటు పుట్టించేంతగా!

    కథలన్నీ మొనాటనస్ గా ఉంటాయి.

    దిగువ గోదారి కథలు,పసలపూడి కథలు, సీతారామా లాంచీ సర్వీసు….వీటిల్లో ఒకటి చదివితే చాలు!

    వంశీ కథల్లో గోదారి సంస్కృతి ఏమీ కనిపించదు నాకు. శ్రీపాద కథలు చదివితే అప్పుడు తెలుస్తుంది గోదావరి సంస్కృతి.

    కాకపోతే మరీ నామిని తిట్టినంత ఘోరంగా ఉండవు.

  15. 17 అబ్రకదబ్ర 3:01 సా. వద్ద సెప్టెంబర్ 19, 2011

    ఎక్కువమంది వ్యాఖ్యలు చదివాక నాకనిపించింది – తెలుగు పాఠకులకి సహనం, సర్దుకుపోయే తత్వం మరియు క్షమాగుణం చాలా ఎక్కువ 🙂

  16. 18 తాడేపల్లి 10:50 సా. వద్ద సెప్టెంబర్ 19, 2011

    “..తెలుగు పాఠకులకి సహనం, సర్దుకుపోయే తత్వం మరియు క్షమాగుణం చాలా ఎక్కువ”
    _______________________________________________

    బ్లాగుల్లో మాత్రం కాదండీ. అందుకే నేను నా బ్లాగులో వ్యాఖ్యాసౌకర్యం తీసేయాల్సి వచ్చింది.

  17. 19 Purnima 6:49 ఉద. వద్ద సెప్టెంబర్ 20, 2011

    WoW! WoW! WoW!

    ఇలాంటిదో వ్యాసం ’తెలుగోళ్ళు’ రాస్తారని నేనూహించలేదే! ఆహా! ’ఒక పుస్తకం నాకు నచ్చలేదు’ అని చెప్పటం పెద్ద గొప్ప కాకపోవచ్చు గానీ, ’ఒక సెలబ్రేటెడ్ తెలుగు పుస్తకం నాకు నచ్చలేదు’ అని ఇంత ధైర్యంగా రాసారంటే మీరు భలే గొప్ప. మీకు అర్జెంటుగా వీరతాళ్ళో, బ్రేవరీ అవార్డో.. ఏదో ఒకటి…

    కాకపోతే ఇప్పటిదాకా, ’పుస్తకాలు చదవటం ఎలా?’ అన్న లెక్చర్లు మీకు ఎవరూ ఇవ్వలేదేంటో? 🙂

    సంతోషం. హాపీ రీడింగ్! చదివాక, మీకు నచ్చిన నచ్చని అంశాలను ఇంతే ఖచ్చితంగా రాస్తూ ఉండండి.

  18. 20 Sai Brahmanandam Gorti 7:24 సా. వద్ద సెప్టెంబర్ 21, 2011

    పాపులర్ రచయితలకీ, మామూలు రచయితలకీ ఉన్న తేడా ప్రచారం. ఈ పసలపూడి కథల మాదిరిగానే దిగువ గోదావరి కథలొచ్చాయి. మీరన్నట్లు కథకి అక్కర్లేని పాత్రలతో అన్ని కథలూ నిండిపోయాయి.

    ఈ మధ్య నేనూ కోనసీమ కథలు పేరుతో ఈ మాటలో నా చిన్నప్పుడు నాకు తెలుసున్న మనుషుల గురించి రాస్తున్నాను. కేవలం అప్పట్లో విలక్షణమయిన మనుషుల గురించి చెప్పాలన్నదే ఈ కథల సారాంశం. కోనసీమ కథలని చెప్పి కనీసం కోనసీమ యాసలో రాయట్లేదని ఒకరూ, కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన కథలు రాస్తున్నారంటూ మరొకరూ కామెంట్లు విసిరారు. కోనసీమ కథలని పేరు పెట్టిన పాపానికి పసలపూడి కథలతో పోల్చి ఆ కథల్లో ఉన్న జీవితం లేదనీ, అక్కడ గ్రామాల వర్ణనా, మనుషుల రూపురేఖలూ వర్ణించలేదని ఒకాయన నాకు ప్రత్యేకంగా రాసారు. ప్రత్యేకంగా పసలపూడి కథల్లా రాయకూడదనే వేరే విధంగా రాసాను. ఒకవేళ నేనూ అలాగే వర్ణనలు చేస్తూ రాస్తే ప.పూ కథల్ని కాపీ కొట్టామంటారు. ఏదయినా కథకి చచ్చే చావే! చెప్పచ్చేదేవిటంటే, కథని కథగా చూడ్డం ఎప్పుడో పోయింది.

    అనిల్, మీకు దిగువ గోదావరి కథలు చదవడానికివ్వ గలను. చాలా గొప్పగా మాంచి పేపరుతో బాపు రంగుల బొమ్మలతో, నిఝం చెప్పద్దూ, కళ కళ లాడుతూ మెరిసింది. ఇలా అచ్చు వేయబడ్డ పుస్తకం నేను తెలుగులో చూడ్డం ఇదే ప్రథమం.

    నిజానికి ఆకుపచ్చని జ్ఞాపకంలో కొన్ని మంచి కథలున్నాయి. దీనికి పైన చెప్పిన రెండు పుస్తకాలకొచ్చిన పేరు రాలేదు. అయినా వంశీ బ్రాండు మీద జనాలకి మోజెక్కువే!

    -బ్రహ్మానందం

  19. 21 రమణ 3:59 ఉద. వద్ద సెప్టెంబర్ 22, 2011

    మీ “అభిప్రాయం” బాగా చెప్పారు. “సహేతుకంగా”. అంటే నచ్చకపోవటానికి, ఎందుకు నచ్చలేదో వివరించటానికి వైరుధ్యం లేదు. పైగా ఇది సమీక్ష కాదనుకుంటాను. ఏమో!. రెంటికీ తేడా నాకు తెలీదు :). వంశీ కధలు చదువుదాము అనుకుంటుండగా, భయపెట్టారు. చూద్దాం ఎలా ఉంటాయో !

  20. 22 Diwakar Venkata 5:03 ఉద. వద్ద సెప్టెంబర్ 22, 2011

    కొన్ని కథలు బాగున్నాయి.. కొన్ని పర్లేదు .. కొన్ని బాలేవు.. కాని అన్నిట్లో చివరకు ఏడుపుగొట్టు బాధాకరమైన ముగింపు నచ్చలేదు..

  21. 24 srinivas reddy gopireddy 9:12 ఉద. వద్ద అక్టోబర్ 6, 2011

    inni maatalela mithrama vamsi kathalu chadavatamu voters list leka telephone directory chadavatam okate

  22. 27 తెలుగు భావాలు 2:02 సా. వద్ద నవంబర్ 13, 2011

    టీ.వీ సీరియళ్ళు ఎక్కువగా చూడటం ఆయన రచనలను ప్రభావితం చేస్తోందేమో!

  23. 28 ప్రియతమ్ 1:17 సా. వద్ద మార్చి 16, 2012

    సెప్టెంబర్ 2011 నుండి ఏమీ రాయలేదేమి ?

  24. 29 bhanu 8:32 సా. వద్ద మే 13, 2012

    @ అబ్రకదబ్ర
    మీరు చెప్పినది కొంతవరకు నిజమే కావచ్చు.. కాస్త అనవసరపు సాగతీత ఉంటుంది వంశి రచనలలో.. కాని మీరు ఏ ప్రాంతం వారో చెప్పారు కాదు… ఎందుకంటే వంశి తన చిన్నప్పటి నుండి తను చుసిన తన చుట్టూ జరిగిన విషయాలనే కధావస్తువులు గా స్వీకరించాడు.. ఇంకా పాత్రల వర్ణన ల విషయం కి వస్తే …………… తూర్పు గోదావరి జిల్లా లో మరి ముఖ్యం గా పలసపుడి ప్రాంతం లో అక్కడ ప్రజల భాష యాస తన కథ లలో మనకి కనపడుతుంది …….. మీకో విషయం చెప్పదలచుకున్న మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమి అర్ధం అవుతోంది అంటే మీరు ఆ కథలు చదివే తప్పుడు మనసుతో చదవలేదు….. బహుశా మీరు ఆ ప్రాంతం వారు కాకపోవటం తో మీకు కనక్ట్ కాలేదని నాకు అనిపించింది …………………

  25. 30 శ్రీనివాస చామర్తి 7:33 ఉద. వద్ద జూలై 3, 2013

    బ్లాగు పేరు లాగనే వ్యాసం మొత్తం negativityతో నిండిపోయింది. అంతవరకు రచయిత కృతార్థులయ్యారు. అభినందనలు! గోదావరి జీవితంతో పరిచయంలేనివారికి ఈకథలే కాదు, వంశీ సినిమాలు కూడా నాసిరకంగాను అనవసరపు ఘోషగాను కనిపిస్తాయి. ఇలాంటి ఘోష ద్వారా వినిపిస్తాయి!

  26. 32 lakshmana rao bandarlanka 10:02 ఉద. వద్ద జూలై 3, 2013

    మీ టపా కారణంగా మరో సారి ఆ పుస్తకాన్ని చదివి ఆస్వాదించాను… కృతజ్ఞతలు

  27. 33 manibhushan 10:18 ఉద. వద్ద జూలై 3, 2013

    నాకు నచ్చాయి…. శ్రీనివాస చామర్తి, క్రిష్ గార్లకు మల్లే.

    ఓ ప్రాంతపు కథల్ని రాసేటప్పుడు నుడికారంతోపాటు అక్కడి సామాజిక వాతావరణం, జన జీవనంలోని మంచి చెడ్డలు, ఆర్థిక లావాదేవీలు, మానవ సంబంధాలు, చిట్కా వైద్యాలు, ఊళ్ళో బాగోతాలు… అన్నీ కలవాలి.
    నేను వంశీని వెనకేసుకు రావడం లేదు. అలాగని వ్యతిరేకించడమూ లేదు.
    ఉంచుకోవటాలు, లేచిపోవటాలు, అక్రమ సంబంధాలు అనేవి దాదాపుగా ప్రతి రచయితకు కథా వస్తువే. కథను అద్భుతంగా చెప్పిన చాసో అంతటివారే ‘లేడీ కరుణాకరం’, ‘బుగ్గి బూడిదమ్మ’, ‘ఏలూరెళ్ళాలి ‘ లాంటి కథల్లో అనైతిక సంబంధాల్ని ప్రస్తావించారు.
    కథకు చక్కటి ఉపమానాలంకారాల్ని అద్దిన రావిశాస్త్రి కథల్లోనూ చెడిపోయినోళ్ళ కథలున్నాయి.

    ఇవి గోదావరి జిల్లాలో ఓ ప్రాంతపు కథలు. ఖదీర్ బాబు ‘దర్గామిట్ట కథలు’ చదివి ఒకాయన “మా కావలిలో అలాంటి యాస భాషలే లేవు” అన్నాడు. ఆయనకు తెలిసిన కావలి వేరు, ఖదీర్ బాబు పెరిగిన కావలి వేరయి ఉండొచ్చు. మనకు తెలియనంతమాత్రాన ‘అంతా ట్రాష్’ అని తీర్పులెలా ఇచ్చేస్తాం!

    • 34 అబ్రకదబ్ర 10:31 ఉద. వద్ద జూలై 3, 2013

      మణిభూషణ్ గారు,

      నేను తీర్పులీయటం లేదు. నాకు నచ్చలేదని చెప్పుకుంటున్నా (అదీ నా బ్లాగులో) – నచ్చకపోవటానికి కారణాలతో సహా. కథలు నచ్చటానికి నాకు కొన్ని గీటురాళ్లుంటాయి. అలా ఉన్నవే నాకు నచ్చుతాయి. ఇతర్ల గీటురాళ్లు వేరుగా ఉండొచ్చు.

      ఓ కథ నచ్చాలంటే అది రాసిన వ్యక్తి నేపధ్యం, అతను పుట్టిపెరిగిన ప్రాంతం, అక్కడి ఆచారవ్యవహారాలు …. ఇలాంటివన్నీ తెలిసితీరాలంటే …. అది నావరకూ అర్ధంలేని వాదన. అవన్నీ తెలీనివారికి కూడా తెలిసేట్టు ఆ కథ చెయ్యగలగాలి.

      ఇతరులూ అలాంటి విషయాలతో కథలు రాశారన్నారు మీరు. వాళ్లు ‘అలాంటి కథలూ’ రాశారు. వంశీ అన్నీ అలాంటివే రాశాడు; రాస్తున్నాడు. అది ఆయనిష్టం. దాన్ని నేను తప్పు పట్టటం లేదే. కాకపోతే అదే గోదావరి సంస్కృతి అని నమ్మించబోవటాన్ని ప్రశ్నిస్తున్నా.

      ఇంతకీ, ఈ కథలు నాకు నచ్చకపోవటానికున్న కారణాల్లో సంస్కృతికన్నా సాంకేతిక విషయాలు ఎక్కువున్నాయి (ఉత్తమ పురుషంలో సాగే కథల్లో ప్రధాన పాత్రకి అవతలి మనుషుల అంతరంగాలు తెలిసిపోతుండటం, పాత్రల పేర్లు తారుమారపోవటం, మితిమీరిన వర్ణనలు, etc). అవి నాకు ముఖ్యం. మీకు కాకపోవచ్చు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: