“Where shall I begin, your Majesty?”
“Begin at the beginning and go on till you come to the end: then stop”
– from Alice in the Wonderland
—-
కిటికీ బయటి దృశ్యానికి నా గుండె ఝల్లుమంది. కింద, విమానం అడుగు భాగానికి తగుల్తుందా అనిపించేంత దగ్గరగా – క్షణక్షణానికీ మరింత దగ్గరౌతూ – పసిఫిక్ మహా సముద్రం.
ఇదేంటి! మరో నిమిషంలో లాండింగ్ అనగా అనుకోని అవాంతరమా? సముద్రంలో దించేస్తున్నారా కొంపదీసి? నాకు ఈత కూడా రాదే. టేకాఫ్ తీసుకున్నప్పుడు విమానవనిత ఇలాంటి సందర్భాల్లో ఏం చెయ్యాలో మూకాభినయంతో వివరించింది కానీ నేను వినిపించుకుంటేగా. హతవిధీ. ఇంటెనకే ఇండియన్ ఓషనుండగా ఇందాకా వచ్చి పసిఫిక్‌లో దూకాలా!
ఊపిరి బిగబట్టి ఒంట్లు లెక్కేస్తుండగానే దృశ్యం మారిపోయింది. సముద్రంలోకి చొచ్చుకొచ్చినట్లు, ఉన్నట్లుండి రన్‌వే మొదలయింది. వెనువెంటనే వెనుక చక్రాలు దాన్ని తాకిన చప్పుడు. ఆ వెంటనే ముందువీ.
—-
‘ఎస్-ఏ-ఎన్-జె-ఓ-ఎస్-ఇ …. శాన్‌జోస్’, అరడజను సార్లు నేనెళ్లబోయే ఊరు పేరు చెప్పీ చెప్పీ అలసిపోయి ఆఖరి ప్రయత్నంగా స్పెల్లింగ్ చెప్పాను విసుగ్గా నాకేసి చూస్తున్న ఇమిగ్రేషన్ అధికారితో.
‘ఓహ్. శాన్ హోసె’, అతని ముఖంలో రిలీఫ్. విసుగు స్థానంలో నవ్వు.
ఈనాడు పేపర్లోనూ తప్పులుంటాయని తెలుసుకున్న క్షణమది. శాన్‌జోస్ పదప్రయోగం వాళ్ల పుణ్యమే.
అమెరికాలో నేనేర్చుకున్న తొలి పాఠం: కొన్ని సందర్భాల్లో జె ని హెచ్ లా పలకాలి.
సీన్ కానరీ, మిఛెల్లీ, నికోలె, చెవర్లెట్ వగైరా పేర్లూ అలా పలక్కూడదని కాలక్రమంలో తెలిసింది.
—-
‘లేవు’
అమెరికాలో నా తొలి అబద్ధం – ‘సామానుల్లో పచ్చళ్లూ గట్రా ఉన్నాయా’ అన్న కస్టమ్స్ అధికారితో. అది బొంకని అతనికీ తెలుసు. నాలాంటివాళ్లనెందరిని చూసుంటాడో. ఐనా అడగటం వాళ్ల పని, సిగ్గు లేకుండా ‘లేవహో’ అనటం మన పని. దరిద్రం అదృష్టంలా తగులుకుంటే తప్ప ఇలాంటివి చూసీచూడకుండా వదిలేయటం వాళ్లకలవాటు. అమెరికన్ విమానాశ్రయాల్లో ఇది సర్వసాధారణ దృశ్యం.
కస్టమ్స్ కళ్లుగప్పి పచ్చళ్లు విజయవంతంగా స్మగుల్ చేసిన గర్వంతో ఛాతీ ఉబ్బుతుండగా, సూట్‌కేసుల ట్రాలీ నెట్టుకుంటూ అరైవల్స్ లాంజ్‌లోకి అడుగుపెట్టాను. అక్కడ నాకోసం చేతుల్లో దండల్తో ఎదురుచూస్తూ , డప్పులు వాయిస్తూ, చప్పట్లు చరుస్తూ, జేజేలు కొడుతూ …. ఎవరూ లేరు.
ఉండరని ఇండియాలో ఉండగానే తెలుసు. ప్రయాణానికి ముందురోజు మా సంస్థాధినేత ఓ కాగితమ్ముక్క చేతిలో పెట్టి చల్లగా కబురు చెప్పాడు: ‘ఈ నంబర్‌కి ఫోన్ చేసి నువ్వే టాక్సీ పిలుచుకుని వెళ్లాలమ్మా’. మనకోసం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికేవాళ్లెవరూ ఉండరని తెలిస్తే మా ఇంట్లోవాళ్లు నా అమెరికా ప్రయాణం రద్దు చేసినా చేస్తారు. ఇన్నేళ్లొచ్చినా నేను ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేనని వాళ్ల ప్రగాఢ విశ్వాసం! అందుకే, శాన్‌ఫ్రాన్సిస్కోలో నాకోసం కంపెనీవాళ్లు మేళతాళాలతో ఎదురొచ్చి వీరగంధం దిద్ది ఊరేగింపుగా తీసుకెళతారని ఇంట్లోవాళ్ల చెవుల్లో ఈ సీజన్లో దొరికే పూలన్నీ పెట్టొచ్చా.
జేబులోంచి ఫోన్‌నంబరున్న కాగితం తీసుకుని దగ్గర్లో కనపడ్డ ఫోన్ బూత్‌వైపు నడిచాను.
—-
శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రం నుండి పాతిక మైళ్ల దూరంలో ఉంది సిలికాన్ వ్యాలీకి రాజధానిగా పేరొందిన శాన్ హోసే అనబడే శాన్‌జోస్ నగరం. ఆ నగరానికి దక్షిణ సరిహద్దులో ఉంది డెన్ అని మేం ముద్దుగా పిలుచుకునే మా కంపెనీ అతిధి గృహం. ఉద్యోగార్ధులై వలసొచ్చిన నాలాంటి పక్షులు తాత్కాలికంగా తలదాచుకోటానికి కంపెనీవారు ఏర్పాటు చేసే బస అది. తాత్కాలికం అనేదానికి, ఉండేవారిని బట్టి, ఏడు రోజుల నుండి ఏడాది దాకా అనే అర్ధముండొచ్చు. నాకది ఇరవయ్యొక్క రోజులయింది.
ఆ మూడువారాలూ నా దినచర్య దాదాపు ఏకరీతిన సాగింది. డెన్‌లో అప్పటికే నాలాంటి పక్షులు మరో నాలుగున్నాయి. వాటిలో మూడు ఆంధ్రావి కాగా నాలుగోది అరవ పచ్చి. అందరి ధ్యేయమూ ఒకటే: వీలైనంత త్వరగా ఉద్యోగం తెచ్చుకుని డెన్ నుండి ఎగిరిపోవటం.
డెన్‌లో ఉన్నది ఒకటే ఫోన్. ఎవరికి ఇంటర్వ్యూ కాల్ వచ్చినా దానికే. అదెప్పుడు మోగుతుందా అని అందరం దాని చుట్టూ ఈగల్లా మూగి ఎదురుచూస్తుండేవాళ్లం. మా పరిస్థితి పెళ్లిచూపులకి ముస్తాబై కూర్చున్న పడుచు పిల్లలా ఉండేది (ఇది చాలా గౌరవప్రదమైన పోలిక. ఇంకో పోలికా ఉంది. అదిక్కడ రాస్తే బాగోదు). ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు దాకా ఆ ఎదురుచూపులు. రోజుకి నాలుగైదు సార్లు ఫోన్ మోగేది. మోగినప్పుడల్లా ‘నాకే ఇంటర్వ్యూ కాబోలు’ అని అందరూ ఆశ పడటం, ఎవరో ఒకరు తప్ప మిగతావాళ్లంతా భంగపడటం – ఇదీ తంతు.
సాయంత్రం ఐదింటికి దుకాణం కట్టేశాక – ఆ రోజుకిక ఫోన్ కాల్స్ రావని రూఢి చేసుకున్నాక – లేచి హడావిడిగా తయారై పొలోమంటూ దగ్గర్లో ఉన్న పబ్లిక్ లైబ్రరీకి బయల్దేరేవాళ్లం. అప్పటికింకా ఇంటింటా ఇంటర్నెట్ అందుబాట్లో లేదు. ఉచితంగా ఇ-మెయిళ్లు చూసుకోవాలంటే పబ్లిక్ లైబ్రరీలే గతి. వీటిలో ఇంకో సదుపాయం కూడా ఉండేది: ఒక్కొక్కరూ ఫ్రీగా పది కాగితాల మీద అవసరమైనవి ప్రింట్ తీసుకోవచ్చు. మేం ఐదుగురం కలిసి ముందూ వెనకా కలిపి వంద పేజీల దాకా సాఫ్ట్‌వేర్ గైడ్సూ గట్రా అచ్చేసుకుని వచ్చేస్తుండేవాళ్లం. ఇవన్నీ కాక, పైసా ఖర్చు లేకుండా కావలసినన్ని కంప్యూటర్ పుస్తకాలు అరువు తెచ్చుకునే సౌలభ్యం ఉండనే ఉంది.
ఇంతకీ, లైబ్రరీకి వెళ్లేటప్పుడు మా బృందం సోకు చూసి తీరాల్సిన విషయం.
అమెరికాలో అన్ని ప్రాంతాల్లోనూ చలి విరగదీస్తుందనే అపోహతో అమీర్‌పేట చౌరస్తాలో రెండో మూడో వేలు పోసి కొనుక్కొన్న తోలు జాకెట్ తలా ఒకటుండేది మా దగ్గర. జెర్కిన్స్ అనేవాళ్లం వాటినప్పట్లో. అందరమూ అవి తొడుక్కుని ఠంచన్‌గా సాయంత్రం ఐదున్నరకి – శత్రువులకి స్పాట్ పెట్టటానికి బయల్దేరిన గ్యాంగ్‌స్టర్లకి మల్లే – డెన్ నుండి బిలబిలా బయటికొచ్చేవాళ్లం. మాలో ఓ తమిళ తంబి ఉండేవాడన్నాను కదా. అతని పేరు శక్తివేల్. ఐదూ రెండు ఎత్తుతో అందర్లోకీ పొట్టివాడతను. మోకాళ్ల కిందకుండే పొడవాటి తోలు జాకెట్లో మునిగిపోయి పొట్టి బాస్ శక్తివేల్ ఠీవిగా కాలరెగరేసి తలెత్తుకు నడుస్తుండగా, అతనికి ముందో ఇద్దరు ఎస్ బాస్‌లూ, వెనకో ఇద్దరు ఎస్కార్టులూ నడుస్తూ – రాజు వెడలె రవి తేజములలరగ కుడి ఎడమల డాల్ కత్తులు మెరయంగా తరహాలో – లైబ్రరీకేసి సాగిపోయేవాళ్లం. ఏ హార్లీ డేవిడ్‌సన్ మోటార్ సైకిల్ చోదకులో తప్ప సాధారణ మానవుడెవడూ అలాంటి తోలు జాకెట్ తొడుక్కుని అమెరికా వీధుల్లో నడవడని తెలవటానికి చాన్నాళ్లే పట్టింది. అప్పట్లో మాత్రం అందరూ మమ్మల్నేదో గ్రహాంతరవాసుల్లా ఎందుకు చూసేవారో అంతుపట్టేది కాదు.
గ్రహాంతరవాసుల ప్రస్తావనెటూ వచ్చింది కాబట్టి పనిలో పనిగా ఏలియన్స్ గురించో ముక్క. మాలాంటి వలస పక్షులకి అమెరికన్ సర్కారు వారిచ్చే అధికారిక నామం ‘ఏలియన్స్’. ఇందులో మళ్లీ రెండు రకాలు: లీగల్ ఏలియన్స్ మరియు ఇల్లీగల్ ఏలియన్స్. ఆ తేడా వివరించక్కర్లేదనుకుంటా. హాలీవుడ్ సినిమాల్లో గ్రహాంతరవాస ఏలియన్స్‌ని దుష్ట దురాక్రమణదార్లుగా చిత్రీకరించటం వెనక, అమెరికన్ ప్రజానీకంలో వలసదారులపై విద్వేషం రగిల్చే ఉద్దేశం దాగుందనేదో కుట్ర సిద్ధాంతం. నిజానిజాలు హాలీవుడ్ స్టుడియోలకెరుక. నేనైతే నమ్మను.
సరే, ఏలియన్సునొదిలేసి మళ్లీ కథలోకొస్తే, అమెరికాలో నాకు బాగా నచ్చేవాటిలో ఒకటి ఇక్కడి ప్రజా గ్రంధాలయాల వ్యవస్థ. తొమ్మిదిన్నర లక్షల జనాభా ఉండే శాన్ హోసె నగరంలో పంతొమ్మిది గ్రంధాలయాలున్నాయి. అవన్నీ కంప్యూటర్లద్వారా అనుసంధానించబడి ఉంటాయి. శాన్ హోసె నగరవాసులందరికీ – మాలాంటి విదేశీయులతో సహా -వీటిలోకి సభ్యత్వం ఉచితం. మనకి అవసరమైన పుస్తకాలు, వీడియోలు స్థానిక గ్రంధాలయంలో లేకపోతే, మిగిలిన పద్దెనిమిదిట్లో ఎక్కడున్నాయో కనుక్కుని మరీ తెప్పించిస్తారు. (శాన్ హోసె ఉదాహరణగా వాడినా, దేశంలో అన్ని చోట్లా గ్రంధాలయాలు ఇంచుమించుగా ఇలాగే పనిచేస్తాయి). వీటిలో పనిచేసేవాళ్లు కూడా ఎక్కువ మంది వాలంటరీగా సేవ చేసేవాళ్లే. ‘డబ్బే సర్వం అనుకునే దేశం’ అని అమెరికా మీద అప్పటిదాకా ఉన్న అభిప్రాయం ఇలాంటివాళ్లని చూసి తొలగిపోవటం మొదలయింది నాలో.
అన్నట్లు, శాన్ హోసె పబ్లిక్ లైబ్రరీలో కుప్పలు తెప్పలుగా రఫీ సాబ్ జమానా హిందీ సినిమా పాటల సీడీలు దొరకటం అప్పట్లో నాకు చాలా అబ్బురంగా తోచేది. అవన్నీ తెచ్చుకుని డెన్‌లో మాకున్న ఏకైక వినోద సాధనమైన పాత సీడీ ప్లేయర్లో మోత మోగిస్తుండేవాడిని.
(సశేషం)
బావుంది. మంచి ప్రారంభం. ఆయా స్థలాలు వేరుకాని, నాదీ దాదాపు యిదే కత.
I think every one has to go through this.. 🙂
నా కర్ధం కాలేదు. కంపెనీ అతిధి గృహం అంటూ మళ్ళీ ఉద్యొగం వెతుక్కొవడం ఎమిటి? ఉద్యొగం లేకుండా అసలు ఎలా వెళ్లగలరు ?
H1B meeda velluntaaru. Employer atithi gruham lo untunnaru, I suppose.
ఎన్నిసార్లో విన్న, కన్న కథే ఐనా, రాసిన తీరు బావుంది. తరవాత?
ముందుగా చాలా బాగుంది,
సారీ.. చాలా చాలా బాగా రాసారు….
కానీ ఈ కామెంటు రాస్తుంటే కాళ్లు చేతులు వణుకుతున్నాయి.. ఇలా నా ఒక్కడికే అనిపిస్తుందా లేక ఇంకెవరికి అన్నా అనిపిస్తుందా?
నేను మీ అన్ని టపాలు ఎన్ని సార్లు చదివానో నాకే గుర్తు లేదు.. మీకంటూ ఒక శైలీ వుంది.
అతిశయోక్తి అనుకోకపోతే.. యండమూరి రచనలలో కధా నాయకులకి వుండే షార్ప్‌నెస్ మీలో ప్రతిఫలించేది.
ఈ టపాలో నాకెందుకో మీ శైలీలో కొత్తదనం కనిపిస్తుంది.. ఎలా రాసారు అంటే .. అబ్బా .. మాటలు గుర్తుకు రావడం లేదు..
కొంచెం అమాయకత్వం.. స్పైడర్ మాన్ లో పీటర్ పార్కర్ లా అనిపించారేమిటి ? ప్రయత్న పూర్వకమైన మార్పా? లేక ఈ మధ్య చదివిన ఎవరి రచనలో ప్రేరణా?
ఇంత త్వరగా మొదలు పెడతారనుకోలేదు……….. థేంక్యు.
అక్కడి గ్రంధాలయ వ్యవస్థ చాలా బాగుంది.
మీరు అమెరికా వెళ్ళిన సంవత్సరం కూడా ఇస్తే బాగుండేది.
దీని రైట్స్ నాకివ్వండి. నవలగా వేద్దాం! ఏమంటారు? అసలే యండమూరి స్టైలని పేరు కూడా కొట్టేస్తున్నారు.:-))
శాన్ జోస్, సీన్ కానరీ….! కేక!మరి ఇల్లినాయిస్ సంగతో? కీనూ రీవ్స్,జాలపానోస్(ఇప్పటికీ ఇక్కడ డామినోస్ లో వాటిని ఇలాగే ఉచ్చరిస్తారు తెలుసా) సంగతో?
అబ్రకదబ్ర గారు
అడిగిన వెంటనే ప్రారంభించినందుకు ధన్యవాదాలు. ఇంకా కొంత సమయం తీసుకొంటారేమో అనుకున్నా. బాగుంది. నాకు మంచి ఆసక్తిగా ఉంది. మా కజిన్ ఒకతను చికాగోలో ఉండేవాడు. అక్కడి విషయాలు చెప్పమని ఎంతలా అడిగినా శ్రద్ధ చూపేవాడు కాదు. ఇదిగో ఇప్పుడు ఇలా మీ ద్వారా తెలుసుకోగలుగుతున్నాను. మరో విషయమండీ మీకు పోటీగా శరత్ కాలం శరత్ గారు ఈ తరహా టపా ఆరంభించారు. చూసారా లేదా. 🙂
ఆసక్తికరమైన ఆరంభం. చదివించే గుణం ఎలాగూ మీ రచనా శైలిలో ఉంది. దానితోపాటూ మంచ సమాచారం కూడా…అభినందనలు.
ఆసక్తికరమైన వ్యాసాలు దానికి తగ్గట్టుగా ఆసక్తికరంగా ప్రారంభించారు. ప్రజా గ్రంథాలయ వ్యవస్థలో మీకంటే మేమొక ఆకెక్కువ, మా పట్టణ జనాభా మూడు లక్షలైతే గ్రంథాలయాలు ఇరవై(ఇక్కడకొచ్చి బుద్దెరిగాక యూనివర్సిటీ లైబ్రరీ తప్ప ఇంకో లైబ్రరీకి వెళ్ళలేదు). తరువాతి వ్యాసం కోసం ఎదురుచూస్తూ….
కొత్తగా చెప్పేదేముంది .. ఎప్పటిలాగే చాలాబాగుంది…అన్నీ చెప్పేయాలేం..ఒక్కటి కూడా వదలకూడదు ..
ప్రారంభం చాలా బావుంది.. టపాల మాలిక మధ్యలో ఆపకండి.. 🙂
@ శ్రీవాసుకి
ఆబ్రకదబ్రకి పోటీగా ఏమీ వ్రాయబోవడం లేదండీ 🙂 ఏదో అపుడప్పుడూ అమెరికానీ కెలికేద్దామనీ – అంతే.
Super Sir
Very nice. Waiting for next episode…..
కాస్త ప్లేస్ తేడాగా బోస్టన్ వేసుకుంటే దాదాపు గా కధ అదే ఇప్పటికి తలచుకుంటే అదురు పుట్టి ప్రాణం గొంతులోకి వస్తుంది ఇలా సముద్రం మీద లేండ్ అవుతోంది ఏమి రా నాయనఏడుకొండల వాడా అని దేవుడిని తలచుకోవటం. ఇక మీలా వుద్యోగ భాద్యతలు లేవు కాని అమెరికా కొత్త కోడలు బాధలు ఏమని చెపుతారు 96 లో. చాలా బాగా చెప్పేరు మీదైన శైలి లో. ఎదురు చూస్తుంటాము మరిన్ని భాగాల కోసం.
baagundi.
శుభారంభం……చికాగో, శాన్‌జోస్, మిచెల్లీ గురించి చెప్పారు బానే ఉంది. మరి యోగర్ట్, గ్రీసీ, షెడ్యూల్ కి బదులు స్కెడ్యూల్ అనడం, హౌ ఆర్ యు అనడిగితే గుడ్ అనడం ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు, అహా అంటే ఇవి నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు టైం పట్టిందీ అని? 😛
పనిలో పనిగా అమేరికా వెళ్ళేముందు “అబ్బే యేడాది మహా అయితే యేడాదిన్నర, తరువాత రెక్కలు కట్టుకుని ఇండియాలో వాలిపోతాం. అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశ్యం అస్సలు లేదు” అని చెప్పి పదేళ్ళు, పదిహేనేళ్ళయినా వెనక్కి రాని వారి సంగతి కూడా చెప్పండి. ఇందులో వ్యంగ్యం ఏమీ లేదండీ బాబు. నిజంగా కుతూహలంతోనే అడుగుతున్నాను. అలా తిరిగిరాలేని పరిస్థితులు, కట్టి పడేసి ఉంచే వ్యామోహాలు ఏవో తెలుసుకుందామని.
సౌమ్య గారు నేను భుజాలు తడుముకుంటున్నా.. నేనూ అలా అనే సింగపూర్ వచ్చి పదేళ్ళు అయిపోయింది.. ముఖ్యమైన కారణం డబ్బు… అమెరికా సంగతి తెలియదు కాని మాకు కాసింత ప్రశాంతమైన జీవితం … పేపర్ చదివినపుడు 6 నెలలకొకమారు మాత్రమే చిన్నా చితక ఆక్సిడెంట్ ల గురించి చదవడం.. చక్కటి వాతావరణం.. కారణాలు అనేకం.. ఇంకో విచిత్రం చెప్పనా… ఎన్ని ఉన్నా చీ చెత్త బ్రతుకు అందరికీ దూరాంగా ఇదీ ఒక జీవితమేనా… అక్కడ అందరూ కష్టానికీ ,సుఖానికి దగ్గర ఉంటారు ..ఇక్కడ ఎవరు ఏడ్చేరు మన బతుక్కి అని ఒకరు మరొకరితో కనీసం రోజుకొకసారైనా వాపోతాం.. తీరా ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు అనవసరంగా వెనక్కి వచ్చేసాం మావారు మళ్ళీ ట్రై చేస్తున్నారు అక్కడికొచ్చేయడానికి అని మళ్ళీ వాపోతారు..
బాగుందండి ! అంటే పాపం వెళ్ళగానే మీరు పడ్డ కష్టాలు గురించి కాదు 🙂
నేస్తంగారు మీ జవాబు బావుంది. మీ ఫీలింగ్స్ సహజమేనేమో! అబ్రకదబ్రగారు ఏం చెప్తారో చూడాలి.
Nice post. Tamla tambi di baagundi.
H1B meeda vellunte… mee employer punyamaa ani meeku twaragaa job raavaalani aasistunnaanu. (If at all this was not a past story)
Excellent start. Please continue