పత్తిత్తులు

వారం రోజులుగా ఆంధ్రదేశంలో తెడేపాయేతర నాయకులందరి నోటా మోత మోగుతున్న మాట: రాజకీయం. బాబ్లీ గొడవలో చంద్రబాబునాయుడు రాజకీయం చేస్తున్నాడట. చూడబోతే, రాజకీయం అనేదో పరమ ఛండాలమైన పనని వాళ్ల ఉద్దేశంలాగుంది. అఫ్‌కోర్స్, మన ఉద్దేశమూ అదే అనుకోండి. కానీ ఆ మాట స్వయానా రాజకీయులే చెప్పుకోటం విడ్డూరం. ఇప్పుడూ – నాకు నా సహోద్యోగంటే పీకల్దాకా మంట. అది వెళ్లగక్కాలంటే ఆ వ్యక్తిని తిడతానే కానీ అతని వృత్తిని కాదు కదా. అలా చేస్తే నన్ను నేను తక్కువ చేసుకున్నట్లే. ఓ గాడిద మరో గాడిదని ‘అడ్డ గాడిదా’ అన్నట్లుంది వీళ్ల వరస. మరీ అంత తల లేనోళ్లా మన లీడర్లు! సరే, వాళ్ల తెలివితేటల సంగతి మనకెందుగ్గానీ, అయ్యవార్ల అమాయకత్వం మాత్రం చూడ ముచ్చటేస్తుంది. అదేంటో – చంద్రబాబో రాజకీయ నాయకుడన్న విషయం ఇప్పుడే కనుక్కున్నంత హాశ్చర్యం వాళ్ల ముఖాల్లో!

రాష్ట్రానికి సంబంధించినంతవరకూ – రాజకీయమనే ముడిపదార్ధమ్మీద సర్వహక్కులూ తమవి మాత్రమేనన్నదే యదార్ధమనీ, తక్కినవన్నీ మిధ్యనీ ఈ లీడర్ బాబుల నమ్మకం. ఉప ఎన్నికల సందర్భంగానే బాబ్లీ సమస్య బాబుకి గుర్తొచ్చిందా అని వాళ్ల సూటి ప్రశ్న. ఆ సమస్యపై ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నదీ, తన్నులు తింటున్నదీ (అవును – ఇంతకు ముందూ ఓ సారి తిన్నారు ఇదే తెదేపా వాళ్లు, ఇదే విషయంలో) తెదేపాయేనని సమయానుకూలంగా మర్చిపోవటం రాజకీయం కాదు. మరాఠాలతో మక్కెలిరగదన్నించుకున్న బాబు ఎక్కడ సానుభూతి ఓట్లు కొల్లగొడతాడోనన్న భయంతో అసలు సమస్యని పలుచన చేసే ప్రయత్నం కూడా రాజకీయం కాదు. బాబు ఇంకెప్పుడూ కుదరనట్లు ఇప్పుడే బాబ్లీ దర్శన కార్యక్రమం పెట్టుకోటం మాత్రమే రాజకీయం. మరే. ఈ విసుర్ల మాటున దాగున్నదల్లా ‘అడ్డెడ్డె, ఈ అవిడియా ముందు మాకే ఎందుకు రాలేదబ్బా’ అన్న సుమర్లే.

చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడన్న మొదటి మహానుభావుడు మన అముఖ్యమంత్రి. రాజకీయ నాయకుడు రాజకీయం చెయ్యక మరేం చేస్తాడో రాజకీయాల్లో పండిపోయిన రోశయ్యామాత్యులే వివరిస్తే బాగుండేది. రాజకీయవేత్తకి టైమింగ్ ముఖ్యం. అది అతని ఉనికికి మూలం. ఆ సంగతి తెలియని అమాయకులా రోశయ్య గారు? లేని సమస్యలు పుట్టించి మరీ రోజులు నెట్టుకొస్తున్న దొరలున్నారు మన రాష్ట్ర రాజకీయాల్లో. వాళ్లని వేలెత్తి చూపటం రోశయ్యగారికి చేతకాదు. అయినదానికీ కానిదానికీ ‘అయినను పోయి రావలె హస్తినకి’ అనుకుంటూ బయల్దేరటమ్మాత్రమే ఆయనకొచ్చిన విద్య. బాబ్లీ మనకో సమస్యే కాకపోతే, ఉప ఎన్నికల నేపధ్యంలో బాబు వేషాలేస్తున్నాడన్న విమర్శలో పస ఉండేది. ఒకవేళ ఇప్పుడు ఉప ఎన్నికల్లేకపోతే బాబుకి రోశయ్యగారి మద్దతుండేదా? అదేం రాజకీయం!

ఇక మన మాటల మరాఠీగారు చంద్రబాబు మరాఠీలకీ తెలుగోళ్లకీ మధ్య తగువు పెడుతున్నాడని వాపోయారు! తెలుగోళ్ల మధ్య ప్రాంతాలవారీ చిచ్చుపెట్టిన ప్రబుద్ధుడు వేదాలు వల్లించటం ఎంత ఎబ్బెట్టుగా ఉందో వర్ణించటమూ కష్టమే. దీనికి తోడు, మహారాష్ట్రలో ఉన్న తెలంగాణవారికి ఏమౌతుందోనన్న భయంతో ఈయన బాబ్లీ సమస్యపై ఆచితూచి వ్యవహరిస్తున్నారట. కోస్తా జనాలని కోసెయ్యండి, నరికెయ్యండి అన్నప్పుడు అక్కడ స్థిరపడ్డ తెలంగాణవారి సంగతేమిటన్న స్పృహ వీరికుండదు. మహారాష్ట్ర తెలంగాణవాసులపై అంత ప్రేమ కారిపోతుంటే ఈయన కలలుగంటున్న తెలంగాణ సామ్రాజ్యంలో అక్కడి భాగాలనీ కలపాలని ఎందుకు గొడవ పెట్టడో. మన తెలంగాణకన్నా అవతలి వైపు మరింత పేదరికంలో మగ్గుతుందన్నది సత్యం కాదా? పైగా, ‘సీమాంధ్ర మీడియా’ చంద్రబాబు యాత్రకి అనవసరమైన ప్రాధాన్యతిస్తుందని ఈయన గగ్గోలు. డెబ్భయ్యారు మంది ప్రజా ప్రతినిధుల్ని పక్కరాష్ట్రం నాలుగు రోజుల పాటు బొక్కలో తోసిన విషయాన్ని ప్రముఖంగా ప్రచురించిన సీమాంధ్ర మీడియానే, ఈయనగారి బక్కప్రాణం చేసిన ఉత్తుత్తి దీక్ష డ్రామాకి అంతకన్నా పెద్దగా బాకాలూదిందని మర్చిపోవటం ఏ రకం రాజకీయమో!

పైనోళ్లిద్దర్నీ మించి బాబు మీద నోరు చేసుకుందో పెద్దావిడ. ఈవిడకి ప్రపంచంలో అన్ని విషయాలూ తమ వంశం చుట్టూతే తిరుగుతుంటాయనో పిచ్చి నమ్మకం. తమ తండ్రిగారికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత లేదట. ఆనాడు చంద్రబాబు ఎన్టీయార్ని ఏ పోటు పొడిచినా, అది వాళ్ల కుటుంబ సమస్యే తప్ప తెలుగుజాతిది కాదు. కానీ ఈనాడు మహారాష్ట్ర పోలీసులు కుళ్లబొడిచింది ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడినే కానీ అన్నగారి మూడో అల్లుడిని కాదు. అక్కడ పోయిన పరువు ఆంధ్రులదే తప్ప అన్నగారి కుటుంబానిది కాదు. ఐనా, ఆనాటి ఆగస్టు సంక్షోభంలో పతిదేవుడికి వీర తిలకం దిద్ది మరీ బాబుకి తోడు పంపిన నారీమణి, పదవులపై ఆరాటంతో తమ తండ్రిగారు జీవితాంతం వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో చేరటానికీ సిద్ధపడ్డ పుత్రికారత్నం తీరిగ్గా ఇప్పుడు వెన్నుపోటు ప్రేలాపనలు చెయ్యటం గురివింద నైజం. ఇదో దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయం.

చెప్పొచ్చేదేమంటే, అందరూ అందరే.

16 స్పందనలు to “పత్తిత్తులు”


  1. 2 Satyanveshi 2:51 సా. వద్ద జూలై 23, 2010

    సమస్యలకు చట్టబద్దమయిన పరిష్కారాలకోసం ప్రయత్నించకుండా పెంచి పోషించి ప్రజలను రెచ్చగొట్టి కొట్టుకునేలాగా చెయ్యడమే రాజకీయమా? అదే రాజకీయ నాయకుల విధి కాబోలు. కోర్టుల్లో తేలాల్సిన వ్యవహారాలను బలం ఉన్నవాడిదే న్యాయం అన్న ఫాక్షనిస్టు రాజకీయాలతో రాజోలిబండ గేట్లు పగలగొట్టినట్లు మహారాష్ట్రతో వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది. రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటే సామాన్య తెలుగు, మరఠీ ప్రజలు కర్రలు పుచ్చుకుని కొట్టుకోవడానికి రెడీ అయ్యారు.

    మన రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు డామును చూడడానికి వెల్లిన నాయకులపై లాఠీ చార్జీ జరగగా మహారాష్ట్రలో అది ఎలా సాధ్యమవుతుంది?

    హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ప్రాంతపు ప్రజలు నిర్భయంగా ఉన్నా వారి సేఫిటీ గురించి తెగ వర్రీ అయిపోయిన సీమాంధ్ర నాయకులు మహారాష్ట్రలో షోలాపూర్, పూనే, నాగ్‌పూర్ లాంటి అనేక చోత్ల ఉన్న తెలుగు వారి రక్షణ గురించి ఆలోచిచడం తప్పు పట్తడం విచిత్రం. బహుషా ఎక్కువగా తెలంగాణా ప్రాంతం వారు మహారాష్టలో ఉండడమే అందుకు కారణం కాబోలు.

    ఇక సానుభూతి వోట్లు అంటారా!! క్రితం సారి అలిపిరి సంఘటన సానుభూతి వోట్ల ఆశకు ముందే ఎన్నికలకి తెరతీస్టే ఎన్ని సానుభూతి వోట్లు రాలాయో ఇప్పుడూ బాబుకి అన్నే రాలుతాయి. రాని వోట్లకోసమ సమస్యని ఇంకాస్త జటిలం చెయ్యడం ఎందుకు?

  2. 4 Indrasena 8:32 సా. వద్ద జూలై 23, 2010

    chandra babu raajakeeyam cheste,mari migataa vaallu raajakeeyam cheyakudada?evadi raajakeeyam vaadidi..meeru maree yellow colours ni anti antanatlu gaa choopistnnaare..naaku nachchale..mee sthaayiki tagga postu kaadu idi..

  3. 5 సుజాత 9:56 సా. వద్ద జూలై 23, 2010

    ఆనాడు చంద్రబాబు ఎన్టీయార్ని ఏ పోటు పొడిచినా, అది వాళ్ల కుటుంబ సమస్యే తప్ప తెలుగుజాతిది కాదు. కానీ ఈనాడు మహారాష్ట్ర పోలీసులు కుళ్లబొడిచింది ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడినే కానీ అన్నగారి మూడో అల్లుడిని కాదు. అక్కడ పోయిన పరువు ఆంధ్రులదే తప్ప అన్నగారి కుటుంబానిది కాదు. …..!

    చప్పట్లు చప్పట్లు!

  4. 6 కన్నగాడు 3:28 ఉద. వద్ద జూలై 24, 2010

    ఎవ్వరూ పత్తిత్తులు కాదు, ఎవరి స్వార్దంప్రయోజనాల కోసం తప్ప నిఝంగా జనాల ప్రయోజనం కోసం ఒక పని తలపెట్టిన రాజాకీయ నాయకులు ఎక్కడున్నారు.

  5. 7 bonagiri 6:31 ఉద. వద్ద జూలై 24, 2010

    ఇప్పుడు జనాలు కూడా మారిపోయారు.
    ప్రతీదానిలో రాజకీయం చూస్తున్నారు.
    ఆత్మగౌరవం ఎవడిక్కావాలి?
    ఎవడి సంపాదన వాడికి ముఖ్యం.

  6. 8 dasari taranath 7:12 ఉద. వద్ద జూలై 24, 2010

    once K.S. has commented in The Hindu that there are no leaders but dealers.that is true even today.most of our political leaders [sorry dealers] are engaged in their own business & doing politics on a part time basis. everybody is missing the basic question whether babli is constructed illegally & the treatment meted out to our elected representatives by the maharastra govt is correct ?.coming to the back stabbing issue,there are only suicides in politics but no murders.people have accepted CBN as leader of TDP in the subsequent elections& rejected LP as political heir of NTR.this issue could have been closed by CBN long back if he had handled it properly.but YSR has kept it alive with his false propaganda both inside&outside the assembly.YSR kept on saying that CBN is a back stabber,not trust worthy & a liar.this gobbles propaganda has stuck CBN due to his inept handling & i believe that this was the major cause of defeat in 2009 elections.

  7. 9 చదువరి 11:23 ఉద. వద్ద జూలై 24, 2010

    “.. ప్రజలను రెచ్చగొట్టి కొట్టుకునేలాగా చెయ్యడమే రాజకీయమా? అదే రాజకీయ నాయకుల విధి కాబోలు.” రాజకీయమంటే కొట్టుకునేలాగా చెయ్యడం మాత్రమే కాదు, అంతకంటే ఘోరం! అబద్ధాలు చెప్పి, ఉన్నవీ లేనివీ కల్పించి, విషప్రచారం చేసి, ప్రజలను రెచ్చగొట్టి, మనసులు విరిచేసి, ఆత్మహత్యలు చేసుకొనే స్థాయికి తెచ్చి, పబ్బం గడుపుకునే రాజకీయ జనం మనమధ్య ఉన్నారు. అంతర్యుద్ధం, రక్తపాతాలు, రక్తతర్పణాల గురించి నిత్యం మాట్టాడే రాజకీయ జనం మధ్య మనమున్నాం.

  8. 10 Satyanveshi 1:12 సా. వద్ద జూలై 24, 2010

    @ చదువరి

    టీఆరెస్ ఆవిర్భవించి 9 ఏళ్ళయినా,సంవత్సరం నుంచి ఈ ఉద్యమం తీవ్రతరంగా కొనసాగుతున్నా ఇప్పటివరకూ మీరన్నట్లు తెలంగాణా, ఆంధ్ర ప్రజలు ఎవరో చిచ్చు పెట్టినట్లు కొట్టుకోలేదు. కేవలం ఒకరోజు ఆంధ్ర మెస్సులపై, దుకాణాలపై దాడి జరిగింది, అది కూడా జగన్ వర్గం చేపించినట్లు పుకార్లు.

    మరి మీ బాబు గారు పెట్టిన చిచ్చుతో ధర్మాబాద్‌లో ఆంధ్రా, మహారాష్ట్రా ప్రజల మధ్య ఘర్షణ జరిగింది, శివసైనికికులు సాలూర పేల్చివేస్తామంటూ బయల్దేరారు. పోలీసులు సకాలంలో స్పందించకుంటే అదికూడా రాజోలిబండ డైవెర్షన్ సీమ ఫాక్షనిస్ట్లుల గూండాగిరీకి బలి అయిపోయినట్లుగా బలి అయిపొయ్యేది.

    రాజకీయాలు తెలియని తెలంగాణా వాదులు ఊరికే ఆవేషపడతారు. రాజకీయాలలో ఆరితేరినవారు ఏమీ మాట్లాడకుండానే విద్వేషాలు రెచ్చగొడుతారు బాబులాగా. అవును, రాజకీయ నాయకులు రాజకీయాలు గాక మరేమి చేస్తారు? అందులో ఉద్దండులు ఉద్దండ రాజకీయాలు చేస్తారు..

  9. 11 గిరిధర్ దుగ్గిరాల 3:58 సా. వద్ద జూలై 24, 2010

    చాల బాగా రాసారు గురూ గారు

  10. 12 శ్రీకృష్ణ చింతలపాటి 2:54 ఉద. వద్ద జూలై 26, 2010

    Hello Anil Royal గారూ,
    I dont know why< i just Love your blogs .
    నేను విపరీతంగా అభిమానించే బ్లాగర్లలో మీరొకరు అండీ. ఈసారి నేను US వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. మీకు వీలయితేనే !

    Thank you-Sri

  11. 13 sri 8:30 సా. వద్ద జూలై 26, 2010

    thokkalo aatma gouravam. Aaatma nigraham leni prajalaku aatma gouravam yenduku. Atuvanti aatma nigrahame vunte, free current kosam, free vaidyam kosam, free deenikosam, free daani kosam yegabadi YSR vanti donga ku votu veyyaru. Oka saari vote vesi naaka, YSR, vaadi Koduku, Vaadi Alludu, vaadi thottu gaalu andharu kalisi State ni rape chesi padesaaru. Malli vuntaamo pothamo annattu gaa dochukoni padesaaru YSR and gang. Ituvanti vaallani Elect chesukunnappude, TELUGU vaadi aatman gouravam manta kalisindi. Ippudu kotthaga poyyindi yemi ledhu.

    By the way, CBN nu thanni Maharashtra vallu baaga cheesaaru. Leka pothe, state lo intha looti chesina YSR and party ni vadhili pakka rashtram paina paddaadu.

  12. 15 suresh reddy 10:16 సా. వద్ద జూలై 29, 2010

    ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఉప ఎన్నికలలో 3 వ స్థానం

  13. 16 Satyanveshi 9:10 ఉద. వద్ద జూలై 30, 2010

    పాపం మహారాష్ట్ర వెళ్ళి ఎంత తన్నించుకున్నా సానుభూతి వోట్లు రాలినట్లు లేవు, అనేక చూట్ల డిపాజిట్లు కూడా దక్కక పళ్ళు రాలగొట్టుకున్నారు. ఇప్పుడు ముందే వేసుకున్న ప్లాను ప్రకారం బాబ్లీ మూలంగా ఉప ఎన్నికలపై దృష్టి పెట్టలేదని చెప్పుకుంటున్నాడు మన పత్తిత్తు.


వ్యాఖ్యానించండి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 304,018

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.