పలకల గణపతి

నా ఒకానొక కలా పోసన మీలో కొందరు ఎరుగుదురు. దానికి సంబంధించిన జ్ఞాపకమొకటి వినాయక చవితి పండగతో ముడిపడుంది. నేను హైస్కూల్లో ఉన్న ఐదేళ్లూ, ఏటేటా వినాయక చవితి సందర్భంగా నా చేతికి యమా గిరాకీ ఉండేది. నా సహాధ్యాయిల్లో ఎక్కువ మంది హాస్టల్ వాసులు. వినాయక చవితి పూజకి గణేశుడి బొమ్మ కోసమని ఇళ్లలో డబ్బులు తెచ్చుకునేవాళ్లు. అప్పట్లో రూపాయికో రెండ్రూపాయలకో ఏడెనిమిది అంగుళాల ఒండ్రు మట్టి విగ్రహమొకటి లభించేది. నా క్లాస్‌మేట్స్‌లో కొందరు ఆ రెండ్రూపాయల్ని పది నిమిషాల పూజానంతరం చెరువులో నిమజ్జనం చేసే బుద్బుధప్రాయమైన విఘ్నేశుడి కోసం వాడే బదులు ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ గోడ దూకి సాహసోపేతంగా వెళ్లొచ్చే మ్యాటినీ షో వంటి విలువైన పరమార్ధం కోసం వాడుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందనే విచక్షణ కలిగినవాళ్లు. కానైతే, వీళ్లకి పురుషార్ధంతో పాటు పుణ్యమూ కావాలి. దాని కోసం పూజ చెయ్యాలి. పూజకి వినాయకుడు కావాలి. విగ్రహమే అవసరం లేదు, ఏదో ఓ బొమ్ముంటే చాలు. అక్కడే నా అవసరం పడేది వీళ్లకి. పండక్కి వారం ముందే నాకు గణేశుడి బొమ్మల కోసం పాతిక దాకా ఆర్డర్లొచ్చేవి. ఇక నా పని – ఆ వారం రోజులూ ఖాళీ సమయంలో తెల్ల కాగితాలూ, స్కెచ్ పెన్నులూ ముందేసుకుని బొజ్జ గణపతి బొమ్మలు గీయటమే (ఇదంతా ఉచిత సర్వీసేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు). చవితి రోజున నా పాతిక వినాయకులూ దర్జాగా పూజలందుకునే వాళ్లు. ఆ తర్వాత ముక్కలుగా చింపబడి సమీపంలో ఉన్న బావిలోనో, చెరువులోనో నిమజ్జనం చెయ్యబడేవాళ్లు.

ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో వినాయకుడికి వాడిన ‘థీమ్’ గురించి స్టార్ న్యూస్‌లో చూస్తుంటే ఎందుకో నా హైస్కూలు వినాయకులు గుర్తొచ్చారు. అలా కాగితం వినాయకులకి పూజలు చెయ్యటం శాస్త్రం ప్రకారం సరైనదో కాదో తెలీని చిన్నతనమది. స్నేహితులకో రూపాయి ఆదా చెయ్యాలనే సదుద్దేశమే తప్ప శాస్త్రాలని పట్టించుకునే వయసు కాదది. పెరిగి పెద్దయ్యాక, వినాయక చవితి పేరుతో జరుగుతున్న తంతు గమనిస్తుంటే ఆవేశం తన్నుకొస్తుంది. ఎక్కడో చదివాను – నిమజ్జనం కోసం వాడే వినాయకుడి ఎత్తు ఎనిమిదంగుళాకన్నా ఉండ కూడదని, బంక మన్నుతో మాత్రమే దాన్ని తయారు చెయ్యాలనీ, నిమజ్జనం నిజోద్దేశం ఆ పత్రిలో ఉండే ఔషధ విలువలు బావుల్లోనూ చెరువుల్లోనూ జలాలని శుద్ధి చెయ్యటమనీ .. ఇలాంటి విశేషాలు. మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి?

మన మహా నగరాలు కొన్నిట్లో గణేశ్ చతుర్ధి అంటే గుర్తొచ్చేది పండగ వాతావరణం కాదు, రణ వాతావరణం. వినాయకుడు కొలువై ఉన్న ప్రాంతాల్లో వారం పదిరోజులపాటు లౌడ్ స్పీకర్ల హోరు, నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ జామ్‌లు, శాంతి భద్రతలపై భయాందోళనలు, నిమజ్జనాల దెబ్బకి కాలుష్యంతో నిండిపోయే చెరువులు. కనపడేదంతా ఆర్భాటమే, ఎవరితోనో పోటీ పడాలనే ఆరాటమే. ఆ పోటీ పరాయి మతస్థులతో కావచ్చు, పక్క వీధి వినాయకుడి పొడుగుతో కావచ్చు. కన్ను పొడుచుకున్నా కనపడనిది భక్తి ప్రపత్తులు. కనుమరుగైపోయింది చవితి అసలు స్ఫూర్తి. (ఇళ్లలో పద్ధతిగా పూజలు చేసుకునే వాళ్లు కోకొల్లలు. నా బాధంతా హైదరాబాద్, బొంబాయి వంటి నగరాల్లో చవితి పేరుతో జరిగే బహిరంగ జాతరలు, చందాల వంకతో సాగే దందాల గురించి మాత్రమే)

ఉన్న విపరీతాలు చాలనట్లు, కొన్నేళ్లుగా చవితి గణేశుడు కొత్త పుంతలు తొక్కుతున్నాడు. ఆ ఏడాది ప్రాచుర్యంలో ఉన్న వార్తనో, విశేషాన్నో బట్టి కూరగాయల వినాయకుడు, కంప్యూటర్ వినాయకుడు, క్రికెటర్ వినాయకుడు .. ఇలా రకరకాల గణపతులు కనిపిస్తున్నారు. ఈ ఏటి ప్రత్యేకత సిక్స్ ప్యాక్ వినాయకుడట! వినాయకుడికి ట్రేడ్ మార్క్ ఆయన బొజ్జ. అసలా బొజ్జ కారణంగానే కదా వినాయక చవితి పుట్టుకొచ్చింది. అలాంటిది సిక్స్ ప్యాక్ పేరుతో వినాయకుడ్ని బక్క చిక్కిస్తే నాకు చివుక్కుమనిపించింది. వినాయకుడు విదూషకుడైపోయాడా? ఈ వరసలో బ్లాగర్ వినాయకుడు, బాక్సర్ వినాయకుడు కూడా రావచ్చు త్వరలో. రాముడికో, కృష్ణుడికో ఇలాంటి ఆకారాలు కల్పించే ధైర్యముందా ఎవరికన్నా? వినాయకుడి విషయంలో ఆ తెగింపెక్కడి నుండొచ్చిందో అర్ధం కాదు.

అర్ధం కానిది మరోటీ ఉంది – తెలిసో తెలీకో ఇలాంటి పనులు ఏ బర్గర్ కింగో, కోకా కోలా వంటి విదేశీ కంపెనీవాడో చేస్తే విరుచుకు పడే దేశోద్ధారకులు, తెలిసీ వినాయకుడితో ఆటాడుకుంటున్న మనవాళ్లని ఏమీ అనకపోవటం! మన కంపు మనకి ఇంపు అంటే ఇదే కాబోలు. అయితే ఇందులో మరో కోణమూ ఉంది. ఇలాంటి విచిత్రాకారాల వినాయకులు, భారీ విగ్రహాల తయారీతో ఏడాదిలో కొన్నాళ్లైనా పొట్టపోసుకునే బడుగు జీవుల బతుకులు ఈ వేలంవెర్రి పైనే ఆధారపడి ఉన్నాయి. భక్తి ముఖ్యమా, బతుకు తెరువా అంటే నా ఓటు నిస్సందేహంగా రెండోదానికే. కానీ అదే సూత్రం బర్గర్ కింగుకీ వర్తించాలి కదా. పేరుకి బహుళజాతి సంస్థైనా, దానిపై ఆధార పడ్డ బ్రతుకులూ బడుగు జీవులవే. వాళ్లు చేస్తే అపచారం, మనం చేస్తే ఉపచారం! ద్వంద్వనీతి దొంగ భక్తుల నీడలో మనుగడ సాగించాల్సి రావటం మాత్రం మతం చేసుకున్న గ్రహచారం.

7 స్పందనలు to “పలకల గణపతి”


 1. 1 రవి 9:54 సా. వద్ద ఆగస్ట్ 24, 2009

  ఇదో వేలం వెర్రి. వినాయక చవితి పేరుతో జరుగుతున్న entertainment. నగరాల్లోనే కాదులెండి, పట్టణాల్లోనూ, అందునా రోడ్డు మధ్యలో విగ్రహాలు పెట్టి, ఇబ్బందులు పెడుతున్నారు.

  అయితే, మీ టపాలో బహుళ జాతి సంస్థ ఉద్యోగులు “బడుగు” జీవులు అనడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంట్లో ఒకరిమధ్య ఒకరికి ఎన్ని గొడవలయినా ఉండవచ్చు. బయట వ్యక్తి మన పోట్లాటలలో తలదూరిస్తే, రియాక్ట్ అవడం సహజం. ఇది ద్వంద్వ నీతి ఎలా అవుతుంది?

  • 2 అబ్రకదబ్ర 9:41 ఉద. వద్ద ఆగస్ట్ 25, 2009

   @రవి:

   నేను చెప్పింది – బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్ లాంటి సంస్థల్లో గంటకి $5 నుండి $8 వేతనానికి పని చేసే వేలాది మంది గురించి. ఒక ఫ్రాంచైజీ లొకేషన్లో సగటున పది మంది ఉద్యోగులు ఉంటే (సూపర్‌వైజర్లు, వంటగాళ్లు, క్యాషియర్స్, etc) వాళ్లలో ఆరుగురి దాకా ఇలా అతి తక్కువ వేతనమ్మీద పని చేసే బడుగు జీవులే.

   ఇక ఇంట్లో గొడవల గురించి – ఈ విషయంలో మీతో కొంతవరకూ ఏకీభవిస్తాను. బయటి వాళ్లు మనని వేలెత్తి చూపిస్తే ఊరుకోకూడదు, నిజమే. అదే సమయంలో వాళ్లు వేలెత్తి చూపే అవకాశం కూడా ఇవ్వకూడదు.

   ఈ మధ్య ఒక విదేశీయుడు ప్రపంచంలోని మత మౌఢ్య దేశాల గురించి ప్రస్తావిస్తూ ఇండియాని కూడా అందులో చేర్చేశాడు, గుజరాత్, గ్రాహం స్టెయిన్స్ వంటివి ఉదాహరణగా చూపిస్తూ. నేను అతనితో వాదులాట వేసుకున్నాను, ‘వంద కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో అలాంటివి ఒకట్రెండు సంఘటనలు పట్టుకుని దేశమంతా అలాంటివారే అనటం దారుణం. ఒకసారి ఇండియా వెళ్లి చూసొచ్చి తర్వాత మాట్లాడు’ అంటూ.

   ఇదే, నేను తోటి హిందూ/ముస్లిం అతివాదులతో మాట్లాడేటప్పుడు నా పద్ధతి వేరేగా ఉంటుంది. బహుశా అది మీకెరికే కావచ్చు. బయటివాళ్లు కలగజేసుకుంటే ఊరుకోకూడదు, అదే సమయంలో మన లోపాలు మనమే సరిదిద్దుకోటానికి ప్రయత్నించాలి. అలా చెయ్యకుండా, బయటి వాడికి బుద్ధి చెప్పి మనం తీరిగ్గా తెడ్డు నాకుతూ కూర్చోటం – నా దృష్టిలో ద్వంద్వనీతే.

   • 3 రవి 11:12 సా. వద్ద ఆగస్ట్ 25, 2009

    హ్మ్..మీరు చెప్పింది చాలా వరకు సబబు గానే ఉంది. ఇక్కడ నేను చెప్పబోయినది యేమంటే, ఎవరో తెలియని విదేశీయులతో మాట్లాడుతున్నప్పుడు, మనం మనల్ను defend చేసుకుంటున్నాం తప్ప, వాడికి ఇలా ఉండు, అలా ఉండు అని నీతులు బోధించట్లేదు. నీతులు బోధించి, తనవరకు వచ్చే సరికి ఇంకోలా ఉంటే, అది ద్వంద్వం అనాలి కానీ, ఒకడు మనలను అన్నప్పుడు మనం defend చేసుకుంటే, అది ద్వంద్వం అవదు అని నా అనుకోలు.

    Anyway, గణేశ్ విగ్రహాలకు సంబంధించి, పనికి రాని హంగామాను నేను గర్హిస్తున్నాను. అసలు ఈ సార్వత్రిక గణేశ పూజలు, వందేళ్ళ క్రితం తిలక్ మొదలెట్టగా నడమంత్రంగా మధ్యలో వచ్చి, పాతుకు పోయిన వ్యవహారం. ఈ పద్ధతిని మార్చుకుంటే, మనమే మన పర్యావరణాన్ని బాగు చేసుకున్న వాళ్ళవుతాం.

 2. 4 కె.మహేష్ కుమార్ 10:35 సా. వద్ద ఆగస్ట్ 24, 2009

  మనకున్నదే ద్వంద్వనీతి. అందులో ఏమాత్రం సందేహం లేదు.

  చందాల పేరుతో దాదాగిరీ చెయ్యడం. పోలీసుల పర్మిషన్ లేకుండా పండాల్ లు పెట్టెయ్యడం. కంరెంటుతీగల నుంచీ దొంగ కరెంటులాగేసి చుట్టుపక్కల్ని దేదీప్యమానాలు చేసెయ్యడం. నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద సౌండుతో చుట్టుపక్కల ఇళ్ళలోవాళ్ళ నిద్రలు పోగెట్టేలా రికార్డులు పెట్టెయ్యడం(అదేమిటో మన దేవుళ్ళందరూ చెబిటోళ్ళేనా! అనిపిస్తుంది ఇలాంటప్పుడు). ఇవేవీ కనిపించవు.

 3. 5 laxmi 10:42 సా. వద్ద ఆగస్ట్ 24, 2009

  భక్తి కి పరాకాష్ట నిన్ననే చూసానండోయ్. మా ఇంటి దగ్గర ఒక కూడలి లో పక్క పక్కనే అంటే తూర్పు మొహానికి ఒకటి, ఉత్తర మొహానికి ఒకటి గణేశులు వెలిసారు. ఒక స్పీకర్ లో ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా అని బాలూ పాడుతూ ఉంటె ఇంకో స్పీకర్లో డోలె డోలే దిల్ జర జర అంటూ ఆడా మగా కాని గొంతులతో ఎవరో పాడేస్తున్నారు. ఆ భక్తి పాటలకి అక్కడే ఉన్న భక్త జన సందోహం భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఒకరు జర్దా కిళ్ళీ లగాయిస్తా ఉంటే ఇంకొకరు సిగరెట్టులు, బీడీ లు లగాయించారు. జై జై గణేశా…

 4. 6 padmarpita 3:36 ఉద. వద్ద ఆగస్ట్ 25, 2009

  ఇదో వేలం వెర్రి…..Its 100% correct!

 5. 7 chandramouli 1:21 ఉద. వద్ద ఆగస్ట్ 26, 2009

  లక్మీదేవి ఫుటో పెట్టందే బర్గర్ కింగ్ దివాలా తీసేట్టు చెబుతారేంటి అన్నా మీరు…..కాని విగ్రహాలు తయారీ దారులు కేవలం విగ్రహం చేసుకునే బతుకునున్నారు.. బర్గర్ కింగ్లు చేసినది ఒక సైటైర్ మాత్రమే….. మన విగ్రాహాల విషయానికి వస్తే ….విగ్రహ తయారీకీ ఖచ్చితత్వము ఇవ్వాలనుకుంటే ఆగమ శాస్త్రాలు అని వుంటాయి కాదా వాటిని అనుసరించి విగ్రహ్ వాస్తు ప్రకారం కట్టాలి… ఎ కెమికల్ అంటే ఆ కెమికల్ వాడరాదు… ఇంతదూరం చేస్తే చాదస్తం అంటారు… బొజ్జతీసేసారు…. సిక్స్ పాక్ పెట్టారు అంటే …. అస్తిక చాంధస పరంగా తప్పు అయినప్పటికీ…. “తలచిన రూపున నను కొలవండి” ప్రతి దేవతలు ఇచ్చే వరం కింద మనం దాని అన్యదా భావించనవసరం లేదు…. ఎటూ కధాపరంగా విగ్రహంలోని తప్పును ఉపాసకులు గ్రహిస్తారు అనుకోండి…………


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: