నామహరణం

నారా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి మరియు జేసీ దివాకర రెడ్డి. రాజకీయ నాయకుల పేర్లు కావివి, యాభయ్యేళ్ల తర్వాత రాయలసీమలో నాలుగు జిల్లాల పేర్లు. ఇప్పటికే రంగారెడ్డి, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం ఉన్నాయి. వాటికి తోడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి చేరింది. భవిష్యత్తు తరం ఆంధ్రాలో కోడెల శివప్రసాద రావు, బొత్స సత్యనారాయణ జిల్లాలు, తెలంగాణలో సలావుద్దీన్ ఒవైసీ, జైపాల్ రెడ్డి తదితర జిల్లాలూ చూడొచ్చు.

నిక్షేపంగా ఉన్న జిల్లాల పేర్లు నేతల పేరిట ఖరాబు చెయ్యాల్సిన అవసరం ఇప్పుడంత అర్జెంటుగా ఏమొచ్చిపడిందో అర్ధం కాని సంగతి. ఓ పక్క కనీవినీ ఎరుగని వరదల్లో మునిగి రాష్ట్రం కల్లోలంగా ఉంటే, కొంపలు మునిగిపోయినట్లు కడప జిల్లాకి వైఎస్ పేరు పెడుతూ రాత్రికి రాత్రే శాసనం జారీ చెయ్యటంలో ఔచిత్యమెంత? పుత్ర రత్నం ఫ్యాక్టరీల కోసం నిబంధనలు తుంగలో తొక్కి శ్రీశైలం రిజర్వాయర్ సామర్ధ్యం పెంచే శాసనం జారీ చేసి నేడు కర్నూలు నిండా మునగటానికి ప్రత్యక్షంగా కారణమైన మహానుభావుడి పేరు పొరుగు జిల్లాకి పెట్టేందుకు ఎంచుకునే సమయం – ఇదా? ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని జిల్లాలకీ ఉన్నట్లే కడపకీ ఆ పేరు వెనక తరాల చరిత్ర దాగుంది. దాని పేరు మార్చటమంటే ఆ చరిత్రని చెరపటమే. పుక్కిటి పురాణాలకీ, ఉందో లేదో తెలీని వేదకాలపు ప్రాభవానికీ ఇచ్చేపాటి విలువలో వీసమెత్తైనా చరిత్రకి ఇవ్వకపోవటం భారతీయుల బలహీనత. దానికి దర్పణమే పర్యాటక ప్రదేశాల్లో ప్రాచీన శిల్ప సంపదని ముందూ వెనకా చూడకుండా పిచ్చిరాతలతో నింపటం, దొరికిన కాడికి దోచుకుపోవటం. ఈ మధ్య, ప్రజలకి బుద్ధి నేర్పాల్సిన ప్రభుత్వాలూ ఆ పనిలో ఓ చెయ్యేస్తున్నాయి.

నాయకుల జ్ఞాపకార్ధం ప్రభుత్వ పధకాలకో, భారీ భవనాలకో, మహా కట్టడాలకో, రహదారులకో వాళ్ల పేర్లు పెట్టటం అన్ని దేశాల్లోనూ ఉన్న ఆచారమే. అయితే దానికీ ఓ పద్ధతుంది. అప్పటికే ఉన్నవాటిని అలాగే ఉంచి కొత్తగా వచ్చిన వాటికి నాయకుల పేర్లతో నామకరణం చెయ్యటం అందరికీ ఆమోదయోగ్యం. ఈ విషయంలో లోకమంతటిదీ ఓ దారయితే, మన ఉలిపికట్టె ప్రభుత్వాలది మాత్రం మరో దారి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రముఖ పధకాల, ప్రదేశాల పేర్లు మారిపోవటం ఇక్కడ అలవాటైపోయిన వింత. సదా అధిష్టానం కరుణా కటాక్షాల కోసం అలమటించే కాంగిరేసు కామందుల ఏలుబడిలోనయితే ఈ నామహరణాల భాగోతానికి అంతే లేదు. ఒకడు కేపీహెచ్‌బీ కాలనీ పేరు మారుస్తానంటాడు, మరొకడేమో ఏకంగా రాష్ట్రం పేరే ఇందిరా ప్రదేశ్ చెయ్యాలంటాడు! ఉన్నది చాలనట్లు – ఈ మధ్య ఊళ్లకీ, జిల్లాలకీ సైతం తమవారి పేర్లు పెట్టేసే పైత్యం మన రాష్ట్రంలో మొదలయింది. స్వయానా రాహుల్ గాంధీకే వెగటు పుట్టించే స్థాయి రాజీవ జపంలో తరించిపోయిన వైయెస్ శకం అంతమై రోశయ్య జమానా మొదలైనా, పాత వాసనలు మాత్రం పోయిన దాఖలాల్లేవు. జగన్ వర్గాన్ని బుజ్జగించటానికే పెట్టాడో, వైఎస్‌పై నిజంగానే భక్తి ప్రపత్తులెక్కువై పెట్టాడో కానీ – రోశయ్య చేసింది మాత్రం గర్హనీయం. ఆర్ధికంగా కుదేలైన భారత దేశాన్ని ఒడ్డుకు చేర్చిన రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు పేరిట తెలుగునాట ఏ ప్రముఖ జ్ఞాపకార్ధమూ లేదు. తెలుగువాడు వేరు, మదరాసీ వేరని మిగతా భారతావనికి తెలియనేర్పిన ఎన్టీరామారావుకీ ఏ మాత్రం గౌరవం దక్కలేదు. అప్పుడూ తెలుగోడు పట్టించుకోలేదు. ఆ మధ్య దాకా రాయలసీమకే పరిమితమైన పాలెగాళ్ల పంధాని, ఫ్యాక్షనిస్టుల దందాని ఐదేళ్లలో రాష్ట్ర రాజధానికి పాకించిన ముఠానేత పేరు కడప జిల్లాకి పెట్టటం విడ్డూరాల్లో విడ్డూరం. అయినా ఇప్పుడూ తెలుగోడు అలవాటుగా పట్టించుకోడు.

ఈ సందర్భంగా నాకో తెలుగు సినిమా జోక్ గుర్తొస్తుంది. ఆ సినిమాలో హాస్య నటుడు సునీల్ పాత్ర పేరు ఎర్రబ్బాయి. ‘నల్లగా ఉన్నావుగా. అదేం పేరు’ అన్న మరో పాత్రకి అతనిచ్చే బదులు: ‘అందుకే ఆ పేరెట్టుకున్నా. ఇప్పుడు చచ్చినట్లు నన్ను ఎర్రబ్బాయనాల్సిందే’!

అదీ సంగతి. అదీ – తెలుగోడు పట్టించుకోని కారణం.  జనం గుండెల్లో నిలిచిపోయిన నేతలకి మరణం లేదు. తరాలు మారినా జన హృదయాల నుండి వాళ్ల జ్ఞాపకాలు చెరిగిపోవు. వాళ్ల పేర్లు దేనికి పెట్టినా పెట్టకున్నా వాళ్ల గౌరవానికొచ్చిన లోటు లేదు. ఆ అవసరం రెండో రకం నేతలకే. ఆ అవసరం నకిలీ ఎర్రబ్బాయిలకే.

(ఇటువంటి అంశాల మీదనే చదువరి రాసిన పాత టపా ఇక్కడ, మరియు రేరాజ్ రాసిన తాజా టపా ఇక్కడ)

62 స్పందనలు to “నామహరణం”


  1. 1 శ్రీ 5:40 సా. వద్ద అక్టోబర్ 6, 2009

    తెలుగువాడ్ని అని చెప్పుకోవటానికి ఈ మధ్య (గత 6 సంవత్సరాలుగా) కొద్దిగా సిగ్గుగా వుండెది. ఇప్పుడు అసహ్యం వేస్తోంది. ఇంకొన్ని రోజులిలానే వుంటే ఎలావుంటుందొ.

    కడుపునింపుకోవటానికి పడుపు వృత్తి చెసే వాళ్ళకికూడా సిగ్గువుంటుంది. మరి వీళ్ళకి?

    • 2 Praveen 10:59 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

      భోగం పనులు చేసేవాళ్ళు వందలు, వేలు సంపాదిస్తారు. రాష్ట్రాన్ని లేదా దేశాన్ని అమ్మేసేవాళ్ళు కోట్లు సంపాదిస్తారు. వీళ్ళకీ, రాజకీయ నాయకులకీ పోలిక ఏమిటి?

  2. 5 Praveen 7:29 సా. వద్ద అక్టోబర్ 6, 2009

    మనవాళ్ళకి స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తల కంటే ఫాక్షనిస్టుల మీదే గౌరవరం ఎక్కువ. ఈ ట్రెండ్ కొత్త కాదు. కోట్లకి కోట్లు కుంభకోణాలు చేసిన పి.వి. నరసింహారావు పేరు కరీంనగర్ జిల్లాకి పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి రాష్ట్ర స్థాయి అవినీతి టైకూన్స్ అయితే పి.వి. నరసింహారావు కేంద్ర స్థాయి అవినీతి టైకూన్. మన దేశంలోని మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు కర్నూల్ జిల్లాకి లేదు. రాష్ట్రంలోని మొట్టమొదటి సంఘసంస్కర్త అయిన వీరేశలింగం గారి పేరు తూర్పు గోదావరి జిల్లాకి లేదు. నీతిగా బతకడం ఇష్టం లేని రాజకీయ నాయకులు స్వాతంత్ర్య సమరయోధులకీ, సంఘ సంస్కర్తలకీ గౌరవం ఎందుకు ఇస్తారు? దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కంటే రాష్ట్రాన్ని లేదా దేశాన్ని అమ్మివేసే టాలెంట్ ఉన్న రాజకీయ నాయకులే ఎక్కువ గౌరవం పొందుతున్నారు.

  3. 7 suguana_sreekanth 8:49 సా. వద్ద అక్టోబర్ 6, 2009

    It is certainly to please YSR’s son and Fans. Weak, and shameless politicians.

  4. 8 రవి 9:23 సా. వద్ద అక్టోబర్ 6, 2009

    సిగ్గు, లజ్జ, మానం, మరియాద అన్ని వదిలేసిన జాతి, ఈ రాజకీయుల జాతి. ఇది తెలుగు వాడికి దక్కిన అవమానం తప్ప మరొకటి కాదు.

  5. 9 Praveen 9:30 సా. వద్ద అక్టోబర్ 6, 2009

    గాంధీ జయంతి నాడు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజిలో హింస జరిగింది. రాజశేఖర రెడ్డి ఫ్లెక్స్ బ్యానర్ తయారు చెయ్యించి గాంధీ విగ్రహం పక్కన పెట్టారు. రాజశేఖర రెడ్డి బొమ్మ గాంధీ బొమ్మ కంటే పెద్ద సైజ్ లో కనిపించింది. దీనికి ఒక వర్గం స్టూడెంట్స్ అభ్యంతరం చెప్పారు. కాలేజి స్టూడెంట్స్ రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు.

  6. 10 VenkataRamana 10:42 సా. వద్ద అక్టోబర్ 6, 2009

    రోశయ్య కొంచం మంచివాడు అనుకున్నాను. అతను కూడా ఆ బాపతేనా! . ఛీ. అసహ్యం వేస్తుంది.

  7. 11 Praveen 11:04 సా. వద్ద అక్టోబర్ 6, 2009

    జగన్ వర్గం నుంచి వ్యతిరేకత రాకూడదని కడప జిల్లాకి రాజశేఖర రెడ్డి పేరు పెట్టి ఉంటాడు.

  8. 12 తాడేపల్లి 12:57 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    పురుషులందు పుణ్యపురుషులు వేఱయా ! రాజకీయాల్లో ఉన్న ప్రతివాడూ బందిపోటు కాదు. పి.వి. నరసింహారావు మనకున్న అత్యంత పరిశుద్ధ నాయకుల్లో ఒకరు. ఆయన తనకున్న వెయ్యెకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఈరోజున ఆయన కుటుంబానికి మిగిలిందేమీ లేదు. ఏ విధమైన ఆధారాలూ లేకుండా అలాంటి మనిషి మీద అభాండాలు వెయ్యడం బాగాలేదు. రాజకీయాలన్నాక ప్రత్యర్థులేవో ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అవన్నీ నిజమేనని నమ్మరాదు. మనమే స్వయంగా రాజకీయాల్లో ఉన్నా మనమీద ఇలాంటి అవాకులూ, చెవాకులూ పేలేవాళ్ళుంటారు.

  9. 14 తాడేపల్లి 12:58 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    నెల్లూరు రాయలసీమ కాదు. సముద్రతీరం గల కోస్తా జిల్లా

  10. 15 sn 1:37 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    మనకి తెలిసినంత వరకు పి.వి నరసింహారావు మీద చూస్తున్న మొట్టమొదటి అరోపణ ఇది…. ఎందుకో చాల బాధ గా ఉంది.
    మనకున్న అతి కొద్దిమంది నిస్స్వార్థ రాజకీయదురంధరుల్లో ఆయనొకరు… ఆయన గురించి ఆయన అతి సన్నిహితం గా పనిచేసిన సెక్రటరి మాకుటుంబానికి అతి సన్నిహితులు. అలా పి.వీ గారి వ్యక్తిత్వం అతిదగ్గరగా చూడటం/వినటం జరిగింది.

    మీరు మరి ఏ ఆధారంతో ఆయన మీద ఎ అభాండం వేస్తున్నారొ నాకు తెలీడం లేదు. మరి కోట్లు వెనకేసి ఉంటె వాటిని మిగుల్చుకోడానికి అయినా కుమారులు రాజకీయాల్లొ వచ్చేవారు కదా!!!

    మీ దగ్గర ఆధారాలుంటే బయట పెడుతూ పోస్ట్ రాస్తే బావుంటుంది…మేమూ తెలుసుకుంటాం!!!!

  11. 17 చదువరి 4:08 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    బిడ్డజచ్చినా పురిటికంపు పోలేదనీ.. ఏంటో మనకీ ఖర్మ!?

    సచ్చుపుచ్చు, సవకబారు రాజకీయ నాయకులే తప్ప మన ప్రజాసౌకర్యాలకు పేర్లెట్టుకునేందుకు మరొకరు గుర్తురారు. గతంలో తాడేపల్లిగారన్నారు -రాజకీయ నాయకత్వమే తప్ప సాంస్కృతిక నాయకత్వంపై గౌరవం లేదు మనకు అని. ఎంత నిజం!

    పేర్లుపెట్టడంపై నేను గతంలో రాసిన ఒక జాబు చూడండి.

  12. 18 Praveen 4:31 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    విశాఖపట్నం జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని డిమాండ్ ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి రంపచోడవరం ప్రాంతాన్ని వేరు చేసి అల్లూరి సీతారామరాజు పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చెయ్యాలనే మరో డిమాండ్ కూడా ఉంది. రెండు డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ నీ ప్రభుత్వం అంగీకరించలేదు.

  13. 19 సుజాత 5:59 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    సిగ్గు లేకుండా ఎవరు ఏ పేరు మారిస్తే ఆ పేరుని ఫాలో అవుతున్నాం కానీ మొదటినుంచీ ఒక్కసారన్నా వ్యతిరేకించామా ప్రజలుగా? ఒక సినిమాలో “ముంబాయి” అనడానికి బదులుగా “బాంబే”అని ఒక పాత్ర అన్నందుకు “సినిమా ఎలా ఆడుతుందో చూస్తా”మని థాకరే ఫామిలీ బెదిరిస్తే వాడితో పెట్టుకోవడం దేనికని కరణ్ జోహర్ వెళ్ళి వాడి కాళ్ళమీద పడి “భవిష్యత్తులో ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయనని”మొత్తుకుని క్షమాపణ చెప్పి వచ్చాట్ట!

    మన ఖర్మ!

    మా పేట పేరు శివప్రసాద్ పేట అనో, కృష్ణారెడ్డి పేట అనో మారిస్తే మాత్రం నేనూరుకోను!

  14. 21 G 6:37 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    The Narasaraopet station road is named after PV. But too few people know about it.

    You vented your anger in a proper way. But, one thing is obvious. You might have some old scores to settle with YSR. 😀 (Just kidding)

    • 22 అబ్రకదబ్ర 11:44 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

      అది బహిరంగ రహస్యం. వైఎస్ నన్ను సీఎమ్ కానీకుండా అడ్డుకున్నాడు 😀

      ఏమాటకా మాటే – ముక్కూ మొహం తెలీని వాళ్లక్కూడా వైఎస్ అడగ్గానే రికమెండేషన్ లెటర్లు రాసిచ్చేవాడు (ప్రతిపక్షంలో ఉన్నప్పటి సంగతి లెండి). వాటినెవడన్నా పట్టించుకునేవాడా లేడా అన్నది వేరే సంగతి. నాకు బాగా దగ్గరి వాళ్లకి అలాంటి సహాయాలు చేశాడాయన. అయితే, అలా చేశాడు కదాని ఆయన రాష్ట్రాన్ని దోచి పారేస్తుంటే వెనకేసుకు రావటం నాకు చేతకాని పని. ఈ విషయంలో వైఎస్ అయినా, చంద్రబాబైనా ఒకటే. ప్రస్తుతం అధికారం కాంగ్రెసుది కాబట్టి నా తూటాలు వాళ్ల మీదకి పేల్తున్నాయి. అంతే.

  15. 23 మంచుపల్లకీ 9:01 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    మన ఒరిజినల్ పేర్లను బ్రిటీషు వాడు వాడికి అనువు గా వుంటుందని మార్చిన పేర్లను మనం తిరిగిమార్చడం లొ తప్పులేదు అని నా అభిప్రాయం (కొల్కత్తా, బెంగలూరు, ముంబై మొదలయినవి ). కానీ ఇక్కడ జరిగినది మాత్రం పైన ఎవరొ చెప్పినట్టు తెలుగువాళ్ళకు అవమానం .

    పి.వి. నరసింహారావు – మన తెలుగువాళ్ళు గర్వంగా చెప్పుకొదగ్గ వాళ్ళలొ ఒకాయన. ” ఆయన తనకున్న వెయ్యెకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు” ఇది కాదు అనుకుంటా జరిగింది. . ఆయన యెకరాలలొ అన్నలు ఎర్రజండా పాతేసారు. ప్రబుత్వం లొ ఉన్నా , సాక్షాత్తు ప్రదానిమంత్రి అయినా , రామోజిరావ్ లా తన భూమిని ఎర్రజండా నుండి కాపాడుకొవడం మీద శ్రద్ద చూపించలేదు. ఇప్పుడు ఆయన ఫేమిలి అస్తులు చుస్తే మన బాబు , రెడ్డి ఆస్తిలొ ఒక 1-2 % వుంటుందెమొ అని నా అంచనా..

  16. 24 తాడేపల్లి 9:40 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    పి.వి.నరసింహారావుగారు తన జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ నాకు తెలిసి ఒక్కటే ఉంది – ఝార్ఖండ్ ముక్తిమోర్చాకి చెందిన ఎమ్పీలకి కాంగ్రెస్ పార్టీ తరఫున డబ్బిలిచ్చి తన ప్రభుత్వం కూలిపోకుండా నిలబెట్టుకున్నారని ! అయితే అది ఈరోజు దాకా నిరూపణ కాని ఆరోపణే. సెయింట్ కిట్స్ గట్రా వ్యవహారాలు వి.పి.సింగ్ కి సంబంధించినవి. పి.వి.కి సంబంధించినవి కావు. పి.వి. నిజంగా అవినీతిపరుడైతే వారి కుటుంబానికి ఇప్పుడు భారీగా ఆస్తులుండాలి కదా ? ఏవీ కనిపించవేం ? భూసంస్కరణలు తీసుకొచ్చి తన సొంత భూమిని కూడా త్యాగం చేసి పేదల బతుకుల్ని బాగుచేసిన పి.వి. మీద మన తెలుగువాళ్లే ఇలా ఆధారాలేమీ లేకుండా నిష్కారణంగా అభాండాలు వేయడం నిజంగా మహాపాపం. తెలిసీ తెలియకుండా మహానుభావుల మీద నిందలు వేయకూడదు.

    • 25 Praveen 9:54 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

      అతని కొడుకు రంగారావు అప్పులు చేసి వ్యాపారాలలో పెట్టాడు. రంగారావు గురించి చిన్నప్పుడు వార్తలలో చదివాను. మీరన్నట్టు పి.వి. కుటుంబానికి ఉన్నది వెయ్యెకరాల భూమి కాదు. 300 ఎకరాల భూమి. వాళ్ళ కుటుంబం నిజాం కింద కరణం (గ్రామ పట్వారీ) ఉద్యోగం చేసే రోజుల్లో వాళ్ళకి ఈనాంగా వచ్చిన భూమి అది. పి.వి. పేరు కరీంనగర్ జిల్లాకి పెట్టడం హాస్యాస్పదమే. అతను చంద్రస్వామితో కలిసి చేసిన మోసాల లిస్ట్ కూడా ఉంది.

  17. 26 Praveen 10:05 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    రాజశేఖర రెడ్డి అభిమానులు చేసే తప్పు మీరు కూడా చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి అభిమానులు అతను చేసిన ఫాక్షన్ హత్యల గురించి మాట్లాడరు. రియాజ్ అనే మార్క్సిస్ట్-లెనినిస్ట్ పార్టీ ప్రతినిధిని శాంతి చర్చలు పేరుతో పిలిచి ఎంకౌంటర్ లో చంపించి రియాజ్ ఎవరో తనకి తెలియదు అని పచ్చిగా అబద్దం చెప్పిన విషయం గురించి అడిగినా రాజశేఖర రెడ్డి అభిమానులు సమాధానం చెప్పరు. కడప జిల్లాకి రాజశేఖర రెడ్డి పేరు పెట్టేటప్పుడు అతను చేసిన ఘోరమైన నేరాలేమీ గుర్తు లేనట్టు నటిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకి పి.వి. నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేసేవాళ్ళు కూడా పదిహేనేళ్ళ క్రితం ఏమి జరిగిందో గుర్తు లేనట్టు నటిస్తున్నారు.

  18. 28 a2zdreams 10:17 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    ఏ పేరు అయితే ఏముంది ?

    మనోడు చేస్తే ఒప్పు, కానోడు చేస్తే తప్పు అనిపిస్తుంది.

    తమ జిల్లాకు తమ అభిమాన నాయకుడి పేరు పెడితే గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎక్కువ వున్నంత కాలం ఇది మామూలే. నచ్చని వాళ్ళు “ఏ పేరు అయితే ఏముంది ?” అని అనుకోవడం తప్ప చేసేది ఏమిలేదు.

  19. 29 రవి వైజాసత్య 10:18 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    ఈ దరిద్రపు పేరు మార్పులకు నిరసన తెలియజేయటం తప్పితే చేయగలిగిందేఁవీ లేనందుకు చింతుస్తున్నాను. కడప అన్న చక్కని పేరు..ప్చ్

  20. 30 మంచుపల్లకీ 10:33 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    P V ji donated 950 acres in single day along with Pingali family. Remaining land is occupied by naxals and no one uses that land now, i believe.

    అతని కొడుకు రంగారావు అప్పులు చేసి వ్యాపారాలలో పెట్టాడు. This is correct because his father did not earn any dirty money.

  21. 31 తాడేపల్లి 10:39 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    ప్రవీణ్ గారూ ! మీ ఆరోపణలకి సమాధానాలు మీ వ్యాఖ్యలోనే ఉన్నాయి. పి.వి. కుమారుడు అప్పులు తీసుకొని వ్యాపారం చెయ్యాల్సిన అగత్యం ఎందుకొచ్చిందంటారు ? తన తండ్రి ఇతరుల్లా ప్రభుత్వ బొక్కసాన్ని లూటీ చెయ్యలేకపోవడం వల్లనే కదా ? ఒక తప్పు స్టేట్ మెంట్ ఇచ్చి దాన్ని సమర్థించుకోవడం కోసం మఱిన్ని తప్పులకి పాల్పడుతున్నారు మీరు. మిమ్మల్ని కన్చిన్స్ చేయడం నా ఉద్దేశం కాదు గనుక ఇంతటితో విరమిస్తున్నాను. మీకభిమానపాత్రమైన ఏవోకొన్ని ఎఱ్ఱపుస్తకాలు/ ఎఱ్ఱపత్రికలూ చదివి వాటిని గుడ్డిగా నమ్మేసే అలవాటు మీకున్నట్లు తోస్తున్నది.

  22. 33 మంచుపల్లకీ 11:00 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    ప్రవీణ్ గారు ..మీరు కుల ప్రస్తావన లేకుండా ఎమీ మాట్లాడలేరనుకుంట..

    • 34 Praveen 11:06 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

      కుల ప్రస్తావన అసందర్భంగా తీసుకురాలేదు. పదిహేనేళ్ళ క్రితం ఏమి జరిగిందో మరచిపోవలసిన అవసరం ఎవరికి ఉంటుందో చెప్పాను. రాజశేఖర రెడ్డి అభిమానులు తప్పు చేస్తే వేరే వాళ్ళు కూడా అలాంటి తప్పులే చేస్తున్నారు తమ లీడర్ కోసం.

  23. 35 అబ్రకదబ్ర 11:12 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    @తాడేపల్లిగారు:

    నెల్లూరు సీమ జిల్లా అని ఎవరన్నారు!

    @ప్రవీణ్:

    ఇక్కడ చర్చ ఎవరు చేస్తే తప్పు, ఎవరు చేస్తే ఒప్పు అన్నదాని గురించి కాదు – పేర్లు మార్చటంలో ఉన్న ఔచిత్యం గురించి. Please do not wander off track.

  24. 36 Praveen 11:19 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    కొండా వెంకట రంగారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్ల కూడా రంగారెడ్డి జిల్లాకి అతని పేరు పెట్టారు. అతను కేవలం రాజకీయ నాయకుడు కావడం వల్ల కాదు. రాజశేఖర రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడూ కాదు, భవిష్యత్ తరాలని ప్రభావితం చేసిన సంఘ సంస్కర్త కూడా కాదు. అతని పేరుని జిల్లాకి పెట్టడానికి జస్టిఫికేషన్ లేదు.

  25. 37 మంచుపల్లకీ 11:21 ఉద. వద్ద అక్టోబర్ 7, 2009

    ప్రవీణ్ గారు
    చాలా పొరబాటు పదుతున్నారు.. పి. వి. కేవలం ఒక కులానికి లీడర్ కాదు. ఆయనకి కేవలం ఆయన కులపొళ్ళే అభిమానులు ఉండరు.
    In my opinion, He is the best prime minister India has had so far .
    అలాగే రాజశేకర్ రెడ్డి కూడా.. ఆయన అబిమానులు అందరూ ఆయన కులపొళ్ళే కాదు.

    అనవసరం గా కుల ప్రస్తావన తెచ్చి ఈ పొస్ట్ ని డైవర్ట్ చెయ్యకండి. ఈ పొస్ట్ కడప జిల్లా పేరు మార్చి నాటకాలు అడుతున్న వారికొసం.. కరీం నగర్ కొ ఇంక దేనికొ PV పేరు పెట్టాలని ఇక్కడ ఎవరూ ధర్నాలు చెయ్యడం లేదు. తెలుగోడు గారు ఉదాహరణ గా ఆయన, అన్నగారి పేర్లు వాడి వుంటారు. మీరు దాన్ని తీసుకుని మద్యలొ కుల ప్రస్తావన్ తెచ్చి ఈ కామెంట్స్ ని కంపు చెయ్యకండి.

  26. 40 rayraj 6:44 ఉద. వద్ద అక్టోబర్ 8, 2009

    http://rayraj.blogspot.com/2009/10/blog-post_07.html

    I have done my bit :)as per your comment on chaduvri’s blog.

    This does not go on koodali. I am trying it on blogger;
    I am just checking if jalleda and haaram can pick-it up on their own. I never registered my wordpress blog with them but they were grabbing it somehow.

    And i think blogger does not have an in built blogstats inside.This is the reason, every one is adding it as widget. Am i right!? It is fast in a way; But…I think wordpress is better 🙂

  27. 41 వేణూశ్రీకాంత్ 6:56 ఉద. వద్ద అక్టోబర్ 8, 2009

    కాలం తోపాటు వాడుక లో రూపుమారిన పేరును సంస్కృతి ఉట్టిపడేలా సరిదిద్దుకోవడం కొంతవరకూ సమర్ధనీయమేమో కానీ ఇలా ఒక జిల్లా పేరు మార్చి వ్యక్తి పేరు పెట్టడం శోచనీయం. అంతగా అయితే ఒక ముఖ్య వీధికో, లేదా సెంటర్ లో ల్యాండ్ మార్క్ లాటి స్మారకం కట్టించి ఆ సెంటర్ కో తన పేరు పెట్టుకుంటే బాగుండేది.

  28. 42 Praveen 10:11 ఉద. వద్ద అక్టోబర్ 8, 2009

    రాజకీయ నాయకుల పేర్లే ఎందుకు? సాహితీవేత్తలు మాత్రం గొప్ప వాళ్ళు కారా? శ్రీకాకుళం జిల్లాకి గిడుగు రామమూర్తి పంతులు పేరు లేదా తాపీ ధర్మారావు పేరు, విజయనగరం జిల్లాకి గురజాడ పేరు, విశాఖపట్నం జిల్లాకి శ్రీశ్రీ పేరు, తూర్పు గోదావరి జిల్లాకి చలం లేదా వీరేశలింగం పేరు, పశ్చిమ గోదావరి జిల్లాకి రంగనాయకమ్మ పేరు, కృష్ణా జిల్లాకి గోరా పేరు, గుంటూరు జిల్లాకి శేషేంద్ర శర్మ పేరు లేదా కొడవటిగంటి కుటుంబరావు పేరు ఇలా జిల్లాలకి సాహితీవేత్తల పేర్లు ఎందుకు ఉండకూడదు? రాజశేఖర రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక ఫాక్షనిస్ట్ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయికి చేరిన వ్యక్తి. వందేళ్ళ తరువాత రాజశేఖర రెడ్డి ఎవడో జనానికి గుర్తు ఉండదు. గిడుగు రామమూర్తి పంతులు గారు, గురజాడ గారు, శ్రీశ్రీ గారు వెయ్యేళ్ళ తరువాత కూడా జనానికి గుర్తు ఉంటారు. వీళ్ళ ప్రాధాన్యత కాదని ఫాక్షనిస్టులకి ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు?

    • 43 అబ్రకదబ్ర 10:34 ఉద. వద్ద అక్టోబర్ 8, 2009

      @praveen:

      you are missing the point – again. It’s not about picking the right name. We are opposing changing established names. ఎవరి పేరు పెట్టాలనేది ప్రశ్నే కాదు. ఉన్న పేర్లు మార్చటమెందుకనేదే ప్రశ్న. పైన వేణూశ్రీకాంత్ అన్నట్లు, అవసరం మేరా సంస్కృతి ఉట్టిపడేలా సరిదిద్దుకోవటం వరకూ సమర్ధనీయం కానీ జిల్లాలకు ఉన్న పేర్లు మార్చేసి వ్యక్తుల పేర్లు పెట్టటం ఖండనార్హం. అది తాపీ ధర్మారావుదైనా, ఎన్టీ రామారావుదైనా, రాజశేఖరరెడ్డిదైనా .. పేరు మార్పిడీ ఘోరం.

  29. 44 M.RadhaKrishna 10:46 ఉద. వద్ద అక్టోబర్ 8, 2009

    yes.this is not right time to name Kadapa as ysr district.Kurnool district and other parts of Andara in worst situation, all of the sudden why this leadears has named Kadapa as ysr dricrict.If they have favour in their favourate leader they may name a centre as ysr centre. But Kadapa is a name in memory of lord venkateswara Gadapa,in days it turned as Kadapa.But very few know this thing.

  30. 45 చదువరి 11:11 ఉద. వద్ద అక్టోబర్ 8, 2009

    ప్రముఖుల పేరిట తపాలా బిళ్ళలు విడుదల చెయ్యడానికి ఒక రూలుంది- పుట్టి వంద సంవత్సరాలైతేనే వేస్తారంట. అలాగే ఈ బాపతు పేరుమార్పిళ్ళకు కూడా మనిషి చచ్చీ చావగానే కాకుండా ఓ పాతికేళ్ళో యాభై యేళ్ళో ఆగాక, అప్పుడు కూడా అతడు/ఆమె ప్రజలకు గుర్తుంటే అప్పుడు పెట్టొచ్చని ఓ నిబంధన పెడితే ఈ పేర్లమార్పిడి పీడను కొంత ఆల్సెం చెయ్యొచ్చు.

  31. 47 తాడేపల్లి 11:19 ఉద. వద్ద అక్టోబర్ 8, 2009

    Place names are place names. ప్రదేశాలకి ఇప్పటికే సుప్రసిద్ధమైన పేర్లున్నప్పుడు, ఆ పేర్ల మీద ఏ వైపునుంచి ఏ విధమైన వివాదాలూ లేనప్పుడు వాటికి కనీవినీ ఎఱుగని కొత్తపేర్లు తగిలించడంలోని హేతుబద్ధత్వాన్ని, ఔచిత్యాన్ని నిగ్గదీసి ప్రశ్నించాల్సి ఉంది. ప్రదేశాల పేర్లు ప్రదేశాలకుందాలి. వ్యక్తుల పేర్లు వ్యక్తులకుండాలి. వ్యక్తుల పేర్లు తీసుకుకెళ్ళి ప్రదేశాలకి పెట్టడం అసమంజసం. ఆ వ్యక్తులెంత గొప్పవాళ్ళైనా సరే ! ప్రకాశం పంతులు పేరు గానీ, రంగారెడ్డి పేరు గానీ జిల్లాలకి అసలెందుకు పెట్టాలని నేను ప్రశ్నిస్తున్నాను. అంతగా ఆయా వ్యక్తులమీద అభిమానమున్నవారు తమకో, తమ కొడుకులకో, కూతుళ్ళకో, మనవలకో, మనవరాళ్ళకో ఆ పేర్లు పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరముండదు. కానీ తమ వ్యక్తిగత అభిమానాల్ని, ఉన్మాదాల్ని పేరుమార్పుల పేరిట ఒక ప్రాంతానికి చెందిన యావత్తు ప్రజానీకం మీదా నిరంకుశంగా రుద్దడం, ప్రభుత్వ జీవీల నడ్డం పెట్టుకొని ఆ నిరంకుశత్వాన్ని శాశ్వతం చేసెయ్యడం – మళ్లీ ఆ వ్యక్తుల కులప్రవరలు వెలుగులోకొచ్చి, ఆ పేరేదో తమ కులహోదాని ఉద్ధరించేదిగా ఆయా కులస్థులు తెగ ఫీలైపోవడం – ఈ నానా వెఱ్ఱిమొఱ్ఱి ధోరణులు నశించాలి. మన జాతి ఇహనైనా కాస్త brainy people గా మారాలి.

    ఱేపు కడపజిల్లాలో రెడ్డికులానికి చెందిన ఫ్యాక్షనిస్టుల్ని ఎవరైనా సవాల్ చేస్తే “అసలీ జిల్లాయే మా కులానిదిరా ! చూడు దీని పేరు రెడ్డిజిల్లా ! నీకిష్టముంటే ఈ జిల్లాలో మా చెప్పుచేతలకింద పడుండు. లేకపోతే వెళ్ళిపో” అని మీసం మెలేస్తారు. పేరుమార్పుల ద్వారా ఈ ధోరణుల్ని పెంచిపోషించడం మనకి అర్జెంటా ?

    • 48 సుజాత 5:48 ఉద. వద్ద అక్టోబర్ 9, 2009

      అవునండీ, ఈ ధోరణి మీద నాక్కూడా వ్యతిరేకత ఉంది! వాళ్ళు గొప్పవాళ్ళు అయితే కావొచ్చు, ప్రాంతాలకి, ఊళ్ళకి మనుషుల పేర్లు పెట్టడం ఏమిటి? పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అట! ఎంత అసహజంగా ఉంది చదవడానికి?

  32. 49 చిన్ని 11:25 సా. వద్ద అక్టోబర్ 8, 2009

    క్షమించాలి రంగనాయకమ్మ చలం ఎవరు ఏం చేసారు చిన్నప్పుడు ఒక పుస్తకం లో కుడా వాళ్ళ పేర్లు రాయలేదే !

  33. 50 VenkataRamana 2:49 ఉద. వద్ద అక్టోబర్ 9, 2009

    // వ్యక్తుల పేర్లు వ్యక్తులకుండాలి. వ్యక్తుల పేర్లు తీసుకుకెళ్ళి ప్రదేశాలకి పెట్టడం అసమంజసం. ఆ వ్యక్తులెంత గొప్పవాళ్ళైనా సరే.ప్రకాశం పంతులు పేరు గానీ, రంగారెడ్డి పేరు గానీ జిల్లాలకి అసలెందుకు పెట్టాలని నేను ప్రశ్నిస్తున్నాను.

    బాగా చెప్పారు తాడేపల్లి గారు.

  34. 51 Praveen 3:26 ఉద. వద్ద అక్టోబర్ 9, 2009

    రాజశేఖర రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఫాక్షనిస్ట్ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయికి చేరిన వ్యక్తి. వందేళ్ళ తరువాత రాజశేఖర రెడ్డి ఎవరో ఎవరికీ గుర్తు ఉండదు. జిల్లాల పేర్లు మార్చడం అనవసరం అనుకుంటే ఫాక్షనిస్టుల పేర్లు పెట్టడం మరీ అనవసరం అనుకోవాలి.

  35. 52 Praveen 3:46 ఉద. వద్ద అక్టోబర్ 9, 2009

    యాభై ఏళ్ళ క్రితం ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రకాశం పంతులు గారిని కూడా మా అమ్మమ్మ గారు గుర్తు పెట్టుకోలేకపోయారు. ఇక రాజశేఖర రెడ్డిని జనం ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారనుకుంటే అది ఒక జోక్. మా బంధువు ఒకతను ప్రకాశం జిల్లా చీరాల నుంచి వచ్చిన ఒకామెని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు మా అమ్మమ్మ గారు “ప్రకాశం” జిల్లాకి ఆ పేరు ఎలా వచ్చింది అని నన్నే అడిగారు. నేను 1983లో పుట్టాను, నేను పుట్టక ముందు జరిగిన విషయాలు మీ ముసలివాళ్ళకి తెలియవా? అని నేను అడిగాను. ఇక రాజశేఖర రెడ్డి యాభై ఏళ్ళ తరువాత ఎంత మందికి గుర్తు ఉంటాడో వేరేగా చెప్పాలా? వందేళ్ళ తరువాత ఒక్కడికి కూడా గుర్తు ఉండడు.

    • 53 సుజాత 5:46 ఉద. వద్ద అక్టోబర్ 9, 2009

      ప్రవీణ్,
      ప్రకాశం పంతులు పేరిట ఆ జిల్లా ఏర్పడిందని చాలా మందికి తెలీదులే! మీ అమ్మమ్మ గారు మర్చిపోవడం కాదు, ఆమెకు తెలియకపోవడం అయ్యుంటుంది విషయం! తెలిస్తే ఎవరూ మర్చిపోరు. మీ బంధువుల విషయాలు లేకుండా, విషయాన్ని పక్కదారి పట్టించకుండా మీరొక వ్యాఖ్య రాస్తే చదవాలని ఉందండీ మీరేమీ అనుకోకపోతే!

      • 54 Praveen 6:33 ఉద. వద్ద అక్టోబర్ 9, 2009

        ఆవిడకి ప్రకాశం పంతులు గారు ఎవరో కూడా గుర్తు లేదు. 1951లో పెళ్ళి చేసుకుని ఒరిస్సా నుంచి ఆంధ్రాకి వచ్చావు, 1953లో ముఖ్యమంత్రి అయిన ప్రకాశం పంతులు గారు మీకు తెలియదా అని అడిగాను. అప్పుడు జరిగినవి తనకి గుర్తు లేవు అని సమాధానం చెప్పారు. ప్రకాశం పంతులు గారినే గుర్తు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు ఫాక్షనిస్ట్ ని మాత్రం ఎవరు గుర్తు పెట్టుకుంటారు? యాభై ఏళ్ళ తరువాత పిల్లలు తప్పకుండా అడుగుతారు “రాజశేఖర రెడ్డి ఎవరు?” అని. గుర్తున్న వాళ్ళు అతను ఒక ఫాక్షనిస్ట్ అని నిజం చెపితే ఫాక్షనిస్టుల పేర్లు కూడా జిల్లాలకి పెట్టే వ్యవస్థ ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతారు. వాడు నల్లమల కోబ్రాస్ లాంటి గ్యాంగులతో చెయ్యించిన హత్యల గురించి చెపితే ఇంకా ఆశ్చర్యపోతారు. పేర్లు మార్చడమే అనవసరమనుకున్నప్పుడు నరహంతకుల పేర్లు గ్లోరిఫై చెయ్యడం నిజంగా హాస్యాస్పదంగానే ఉంటుంది. అవసరం అనిపిస్తే పేర్లు మార్చడం తప్పు కాదు. ఒంగోలు జిల్లాకి ప్రకాశం పంతులు గారి పేరు పెట్టడం కూడా తప్పు అనుకోను. ఒక జిల్లాకి ఫాక్షన్ లీడర్ & కోబ్రా గ్యాంగ్స్ లీడర్ పేరు పెట్టడం పైనే అభ్యంతరం.

  36. 55 raajEMdra kumaar dEvarapalli 9:51 ఉద. వద్ద అక్టోబర్ 9, 2009

    యావండీ అబ్రకదబ్ర గారు,
    గుంటూరు జిల్లా పేరు మారిస్తే గీరిస్తే మీ పల్నాడు వాళ్ళు తప్ప మా యేపు మరెవరూ లేరనుకుంటున్నారా?? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.అసలట్లా పేరు మార్చాల్సొస్తే మా ఊళ్ళోనే కనీసం అరడజను మంది అర్హులున్నారు మరి.అమ్మా !!!

  37. 58 Praveen 9:05 ఉద. వద్ద అక్టోబర్ 10, 2009

    డొంక తిరుగుడు ఎందుకు? మనసులో ఉన్న మాట డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. కోబ్రా గ్యాంగులతో హత్యలు చెయ్యించిన వాడు చస్తే శని వదిలినందుకు సంతోషించాలి కానీ జిల్లాకి వాడి పేరు పెట్టడం ఎందుకు?

  38. 59 bonagiri 3:27 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

    ఉప్పల్ స్టేడియం కి పేరు మార్చే దాకా చార్జర్స్ గెలవరేమో.

  39. 60 రామ 10:31 సా. వద్ద అక్టోబర్ 24, 2009

    మొత్తం 59 కామెంట్లలో ప్రవీణ్ గారివే పదిహేడున్నాయి (ముప్ఫై శాతం) :).
    ఆ విషయం పక్కన పెడితే, నాకెందుకో ఈ పేరు కూడా ఏదో temporary name అనిపిస్తోంది. మరి రేపు పొద్దున్న, తాడిని తన్నే వాడి తల తన్నే వాడు ఇంకోడు వస్తాడు కదా, అప్పుడు ఈ పేరు పీకేసి వాడి పేరు పెడతారు (పెట్టాల్సి వస్తుంది). సో ప్రవీణ్ గారు మీరు బెంగ పెట్టుకోనవసరం లేదు. అలా కొన్నాళ్ళు రొటేట్ అయ్యాక, విసుగు పుట్టి వాళ్ళే మానొచ్చు (ఇది తప్పకుండ wishful thiking ఏ).

  40. 61 Kishore 11:53 సా. వద్ద నవంబర్ 13, 2009

    అయ్యా, లేట్ గా చూసినా సరే, మంచి విషయంపై చర్చ చదివాను. ఆ పేరు ఎక్కడ మరవనిస్తున్నారు? సాక్షి టివి వాళ్లు నిత్యం అదే జపం కదా. వీళ్ళ వరస చూస్తుంటే ఆయనకి సెయింట్ హుడ్ కూడా ఇవ్వాలని అడిగేట్టున్నారు. అదిసరే గాని, మా జిల్లాకి నా పేరు పెట్టే అవకాశముంటే చూద్దురు, బాబ్బాబ్బు, మీ మేలు మరచిపోను.

  41. 62 రహంతుల్లా 12:36 ఉద. వద్ద డిసెంబర్ 26, 2009

    రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

    ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
    ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
    1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad. nic.in/
    1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur. nic.in/
    1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor. nic.in/
    1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari .nic.in/
    1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur. nic.in/
    1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad. nic.in/
    1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa. nic.in/
    1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar. nic.in/
    1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam. nic.in/
    1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna. nic.in/
    1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool. nic.in/
    1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar .nic.in/
    1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak. nic.in/
    1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda. nic.in/
    1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore. nic.in/
    1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad. nic.in/
    1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam. nic.in/
    1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy. nic.in/
    1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam. nic.in/
    1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatna m.nic.in/
    1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram .nic.in/
    1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal. nic.in/
    1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari. nic.in/
    విశేషాలు

    * అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.


వ్యాఖ్యానించండి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 304,028

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.