కథా సాగులోకి అడుగు పెట్టిన ఐదేళ్లలో నా చేతులకి ఎన్నడూ లేనంత దురద పోయినేడాది పుట్టింది. అందులోంచి ఐదు కథలు వరదలా కొట్టుకొచ్చి కథాసాగరంలో కలిశాయి. కాలగమనంలో క్యాలండర్ మారింది. దురద తీరలేదు కానీ దాని తీరు మారింది. ఇప్పుడది రాసే దశనుండి గీసే దిశగా పయనించింది. అనగనగనగనగనగా అప్పుడెప్పుడో దశాబ్దం కిందట అటకెక్కించిన తైలవర్ణచిత్ర కళని వెలికితీసి అర్జెంటుగా పోషించేయాలని నిర్ణయించే స్థాయికది పరిణమించింది. లేడికి మల్లే నాకూ లేచిందే పరుగు కాబట్టి సదరు కలాపోసన కార్యక్రమం వెంటనే మొదలయింది.
ఈ ఆయిల్ పెయింటింగ్స్ వేసే విషయంలో నాకో చిక్కుంది. ‘పరుగాపటం ఓ కళ’ అనో అలాంటిదే ఇంకోటేదో అన్నాడు వెనకటికో పెద్దాయన. చిత్రకారులకి ఏ బొమ్మ ఎక్కడ ఆపేయాలో తెలుసుండటం అతి ముఖ్యం. లేకపోతే చిత్రానికి అదే పనిగా నగిషీలు చెక్కుతూ కూర్చుని చివరాఖరికి బొమ్మని చెడగొట్టేసే అవకాశాలెక్కువ. అదే నా సమస్య. దాన్నుండి బయటపడలేక అసలు పెయింటింగ్స్ వేసే అలవాటే వదిలిపెట్టేశాను – పదేళ్ల కిందట. ఇప్పుడు మళ్లీ కుంచె పట్టుకున్నాక నేనో నియమం పెట్టుకున్నాను. అదేమంటే: రెండు గంటలకి మించి ఏ బొమ్మ మీదా సమయం వెచ్చించకూడదు. ఆ రెండు గంటల్లో ఎంతవరకూ పూర్తైతే అంతవరకే వేసి వదిలేయాలి – అది అసంపూర్ణంగా మిగిలిపోయినా సరే.
అలా అనుకున్నాక గీసిన మొదటి తైలవర్ణ చిత్రం వివిధ దశల్లో తీసిన ఫోటోలు కింద పొందు పరుస్తున్నాను. (థంబ్నెయిల్స్ అనబడే బొటనవేలి గోళ్ల మీద నొక్కితే బొమ్మలు పెద్దగా అగుపిస్తాయి)
స్పెయిన్లో ప్రసిద్ధి చెందిన ‘ఫ్లమెంకో’ అనే జిప్సీ నృత్య భంగిమ ఇది. ఇంటర్నెట్లో లభించిన ఓ చిత్రానికి నేను గీసిన నకలు. అలా ప్రీమా (alla prima) పద్ధతిలో రెండు గంటల వ్యవధిలో నేను గీయగలిగింది ప్రస్తుతానికి ఇంతే. భవిష్యత్తులో మెరుగవుతానేమో చూడాలి.
|
బాగుంది. మీ చిత్రకళా కార్యక్రమాలు కొనసాగించండి.
బాగుంది మీ కలా-సాధన!
కొనసాగిస్తే, “పోసకులు” అయ్యే ఛాన్స్ చాలా ఉంది.
చాలా బాగా గీశారండీ.
రెగ్యులర్ గా గీస్తూ ఉండండి.
మీ కళాపోసన మాకెంతో ఆనందదాయకం!
రాయగా రాయగా అరుంధతీ రాయ్ అవుతారనీ…
గీయగా గీయగా పాబ్లో పీకాసో అవుతారనీ… వెనకటికి ఓ సామెత ఉండేదండి!
చాలా బాగుంది అనిల్ గారూ. 2 గంటల్లో వేసారంటే నమ్మలేకున్నాను. కథా దురద, బొమ్మల దురదా మిమ్మల్ని వెన్నంటే ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మీ దురదే నాలాంటి మీ అభిమానులకు ఎంతో హాయి. అంటే దురద మీదీ హాయి మాదీ అన్నమాట. మీ కథల బుక్ కి ముఖచిత్రం వేసిపెట్టమని మరో చిత్రకారున్ని దేబిరించక్కరలేదు మరి – జగదీష్
మిత్రుడు గొరుసు అన్నట్టు, కానివ్వండి…మీ కధలకి మీదే గీత!