ఎక్‌స్ట్రా క్లాస్

సంక్రాంతంటే చాలామందికి గుర్తొచ్చేది అరిసెలు, హరిదాసులు, రథం ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలి పటాలు. పల్నాడువాసులకి గుర్తొచ్చేది మాత్రం కోళ్ల పందేలు. అలనాటి బ్రహ్మనాయుడి గడ్డ మీద పుట్టి పెరిగినా కోళ్ల పందేలాడిన, కనీసం చూసిన అనుభవం నాకు లేదు. పందెం కోళ్లలా క్రికెట్ పోటీలాడిన అనుభవం మాత్రం చాలా ఉంది. ఆ జ్ఞాపకాల్లో ఒకటి అప్పుడెప్పుడో క్రికెట్ బాంబు పేరుతో పంచుకున్నాను.

నేనీ క్రికెట్ మతం స్వీకరించటం నా ప్రమేయం లేకుండానే జరిగింది – నా హైస్కూలు రోజుల్లో. అప్పట్లో క్రికెట్ ఇంకా సిటీల్లో తప్ప పల్లెటూర్లలోనూ, ఓ మోస్తరు పట్టణాల్లోనూ అంతగా ప్రాచుర్యం పొందని ఆట. మా ఊర్లో అదాడేవాళ్లు పట్టుమని పాతికమంది ఉండేవాళ్లేమో. రిలయన్స్ కప్పొచ్చి ఆ పరిస్థితిని రాత్రికి రాత్రే మార్చిపారేసిందనుకోండి. ఇది అంతకు ముందు మొదలైన కథ. ఓ రోజు మా ఊరి జట్టుకి, పక్కూరి జట్టుకి పోటీ జరుగుతుండగా నేనా దారిన పోతూ ఆగి ఆసక్తిగా గమనించటం మొదలెట్టాను. సమయానికి స్థానిక జట్టులో ఓ తలకాయ తక్కువవటం, నోరు తెరుచుకుని చూస్తున్న నేను వాళ్ల దృష్టిలో పడటం, నన్ను బలవంతాన మైదానంలోకి నెట్టి క్రికెట్ బ్యాట్ పట్టించటం, ఏం చేస్తున్నానో అర్ధమవకుండానే విన్నింగ్ షాట్ కొట్టి స్థానిక జట్టుని గెలిపించటం .. వరసగా జరిగిపోయాయి. ఆనాడు నేను చేసినవి ముచ్చటగా మూడు పరుగులు. ముందు రోజు దాకా పరిచయం లేని కుర్రాళ్లు నన్ను భుజాల మీద మోస్తూ చిందులేస్తూ గ్రౌండ్ బయటికి తీసుకొస్తుంటే – మొట్టమొదటిసారిగా నాకు విజయగర్వం అనేది అనుభవంలోకొచ్చింది. అప్పుడే పడిపోయాను పీకల్లోతు ప్రేమలో (నా బ్లాగులో ఈ మాట దొర్లటం ఇదే మొదటి సారనుకుంటా!) – క్రికెట్టాటతో. ఇరవయ్యేళ్ల తర్వాతా అది చెక్కుచెదరలేదు. నాడెత్తిన బ్యాట్ నేటికీ దించలేదు. ఐతే విశేషమేంటంటే, నాకు క్రికెట్ ఆడటమంటేనే ఇష్టం – చూడటమంటే కాదు. క్రికెట్ పోటీలాట్టానికి కాలేజ్ క్లాసులు ఎగ్గొట్టిన రోజులున్నైగానీ, టీవీలో మ్యాచ్ చూట్టానికి ఆ పని చేసిన రోజుల్లేవు.

ఇంటర్మీడియెట్‌లోకొచ్చేసరికి క్రికెట్ పిచ్చి ముదిరింది. క్లాసులెగ్గొట్టటమూ ఎక్కువయింది. ఎంత జాగ్రత్త పడ్డా క్లాసులెగ్గొట్టి క్రికెట్ మ్యాచ్‌కెళ్లిన సంగతి ఒక్కోసారి ఇంట్లో తెలిసిపోయేది. ఆటలంటూ ఎక్కడ చదువు పాడు చేసుకుంటానో అని ఇంట్లోవాళ్ల భయం. దాంతో, నా కదలికల మీద కర్‌ఫ్యూ విధించేశారు. వారాంతాల్లో ఈ నిఘా మరింత పటిష్టంగా ఉండేది. మన మ్యాచ్‌లేమో శనాదివారాల్లోనే ఎక్కువుండేవి. అయినా మనది సైకో & క్రిమినల్ బుర్ర కదా (ఆరోప్రాణం పాఠకులెవరో ఆ బిరుదిచ్చేశారు), ఆ దరిద్రానికి విరుగుడు ఉపాయం వెంటనే తట్టింది. ఆదివారాలు ఎక్‌స్ట్రా క్లాసులని చెప్పి సినిమాలకో, షికార్లకో చెక్కేయటం ఆ వయసు పిలగాళ్ల సహజగుణం. నాకు మాత్రం క్రికెట్ మ్యాచ్‌ల కోసమే ఎక్‌స్ట్రా క్లాసులు అక్కరకొచ్చేవి.

అలా ‘ఎగస్ట్రా క్లాసు’ వంకతో వీకెండ్ గేమ్‌ని విజయవంతంగా నెట్టుకొచ్చేవాణ్ని. అయితే అప్పుడప్పుడూ ఈ వ్యూహం బెడిసికొడుతుండేది. కొన్నిసార్లు ఇంట్లోవాళ్లు కాలేజ్‌మీద మెరుపు దాడి చేసి ఆకస్మిక తనిఖీ జరపటమో, వేగుల ద్వారా సమాచారం సేకరించి ఎక్‌స్ట్రా క్లాసుల నిగ్గు తేల్చటమో చేస్తుండేవాళ్లు. అప్పటికే క్రికెటర్‌గా పల్నాడు పరగణాల్లో పెరిగిన నా ప్రతిష్ట సైతం కొన్నిసార్లు తిప్పలు తెచ్చి పెడుతుండేది. ఊళ్లోవాళ్లెవరో ‘మొన్న ఫలానా మ్యాచ్‌లో మీ అబ్బాయి విరగదీశాడట కదండీ’ అనే పొగడ్త మా ఇంట్లోవాళ్ల చెవినేసేవాళ్లు. రికార్డుల ప్రకారం మనం ఆ ఫలానా టైములో ఎక్‌స్ట్రా క్లాసులో ఉన్నామాయె! ఇంకేముంది, ఆ సాయంత్రం ఇంట్లో ప్రైవేటు. అందుకే ఇప్పటికీ నాకు పొగడ్తలన్నా, పొగిడేవాళ్లన్నా భయం.

ఇప్పట్లా అప్పట్లో టెన్నిస్ బాల్ క్రికెట్ అనేదుండేది కాదు. శుభ్రంగా లెదర్ బాల్, లేదా కార్క్ బాల్‌తో కుమ్మేస్తుండేవాళ్లం. అది తగిలితే అదే స్థాయిలో వళ్లు వాచిపోతుండేది. ఆ దెబ్బలు ఇంట్లో తెలీకుండా మేనేజ్ చెయ్యటం ఓ కళ. కాలక్రమేణా అందులో ఆరితేరిపోయాన్నేను. ఇలా .. ఇన్ని సమస్యల మధ్య కూడా ఏ మాత్రం వెరవకుండా క్రికెట్ ఆడుతూనే ఉండేవాడినా, ఒక్క విషయం మాత్రం మాచెడ్డ చిరాకుగా ఉండేది. వేగుల డేగ కళ్లనీ, ఆకస్మిక తనిఖీలనీ, భట్రాజుల లీకేజీల్నీ, బంతి దెబ్బల్నీ నా క్రిమినల్ బుర్రతో దీటుగా ఎదుర్కునేవాణ్ని కానీ మా కపిల్‌దేవ్ గాడి తడాఖా మాత్రం తట్టుకోలేక ఇంట్లో దొరికిపోతుండేవాణ్ని. కపిల్‌దేవ్ గురించి మాట్లాడుకునే ముందు విక్కీ గురించి చెప్పాలి. ‘విక్కీ’ అంటే ‘వికెట్ కీపర్’ అని మీలో గల్లీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నోళ్లు ఈజీగానే పట్టేసుంటారు. మిగిలిన అగ్నానుల కోసం మళ్లీ రాస్తున్నా: ‘విక్కీ’ అంటే ‘వికెట్ కీపర్’.

ఆ రోజుల్లో ప్యాడ్లు, గ్లవ్స్ వంటివి మాబోటి పిల్ల క్రికెటర్లకి లగ్జరీ సామాన్లు. జట్టు మొత్తానికీ కలిపి ఒక జత ప్యాడ్స్ ఉంటే మహా గొప్ప. బ్యాటింగ్ చేసేటప్పుడైతే ఇద్దరు బ్యాట్స్‌మెన్ చెరో ప్యాడ్ కట్టుకునేవాళ్లు. ఫీల్డింగ్ చేసేప్పుడు వాటినే వికెట్ కీపర్ ఉరఫ్ విక్కీ ధరించేవాడు. ఇంతమంది కాళ్ల మీద నలిగి అవి నానాజాతిసమితిలా కనిపిస్తుండేవి – స్ట్రాప్స్ ఊడిపోయి, మరకలూ చిరుగులూ పడి. జేబు రుమాళ్లతో ప్యాడ్స్ బిగించి కట్టుకోవటం ఆటగాళ్లందరికీ అలవాటైన కూసువిద్యగా ఉండేది. అయితే ఇది అంతో ఇంతో ‘ధనిక జట్ల’ కథ. నేను క్రికెటర్ అవతారమెత్తేనాటికి మా జట్టు పరిస్థితి ఆ రెండు ప్యాడ్లకి కూడా గతిలేకుండా ఉండేది. ఉత్తి కాళ్లతోనే అలాగే ఎలాగో బ్యాటింగ్ చేసినా, వికెట్ కీపింగ్ దగ్గరికొచ్చేసరికి ఎవరికి వాళ్లు ఏదో వంకతో తప్పుకునేవాళ్లు. ఇంకేముంది, జట్టులో కొత్తవాడిని కావటంతో ఆ బాధ్యత నా నెత్తిన పడేది. కొత్తలో స్థానం కాపాడుకోటానికి ఇచ్చిన పనల్లా చెయ్యాలి కాబట్టి ఇష్టమున్నా లేకున్నా ఉత్తుత్తి కీపింగ్ గ్లవ్స్ (విత్ ఇమాజినరీ ఇన్నర్స్) తొడుక్కుని విక్కీ అవతారమెత్తేవాణ్ని. జట్టు ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగు పడి ప్యాడ్లూ గట్రా క్రికెట్ గేర్ సమకూర్చుకోగలిగేనాటికి నేను శాశ్వత విక్కీగా సెటిలైపోయాను. అలా సెటిలయ్యే సమయానికి మా జట్టులో వచ్చి చేరాడు కపిల్‌దేవ్.

కపిల్‌దేవ్ అసలు పేరు రత్నసాగర్ రెడ్డి. మాకన్నా నాలుగైదేళ్లు పెద్దవాడు, మంచి బ్యాట్స్‌మన్. భారత జట్టులో కపిల్‌దేవ్ ప్రభ ధగ ధగా వెలిగిపోతున్న రోజులవి. రత్నసాగర్ రెడ్డికి కపిల్‌దేవ్‌తో కొట్టొచ్చిన పోలికలుండేవి .. రూపు రేఖలు, ఎత్తు, వంకీల జుత్తు, వగైరా. ఇహ చూస్కోండి. మావాడు కపిల్ లాగా నడవటం, నవ్వటం ఇత్యాదివి తెగ ప్రాక్టీస్ చేసేసి మ్యాచ్‌ల సందర్భంగా మైదానంలో తన హావభావాలు, కదలికలతో చింపేస్తుండేవాడు. వాటికి తోడు అచ్చు కపిల్ లాగే మోచేతుల్దాకా స్లీవ్స్ ఉండే చొక్కా ధరించి కుడి చేతికో స్టీల్ కడియం కూడా తొడిగేవాడు. స్థానిక క్రికెట్ మతస్థులందరికీ వీడో లోకల్ డెయిటీ. సిసలు కపిల్‌ని ప్రత్యక్షంగా తిలకించి పులకించే అదృష్టానికి నోచుకోని నిర్భాగ్యాభిమానులు మా ఆట జరిగే ప్రాంతానికి తండోపతండాలుగా తరలొచ్చి ఈ నకిలీ కపిల్ దేవుణ్ని చూసి తరించిపోయేవారు. మొత్తమ్మీద, రత్నసాగర్ రాకతో మా జట్టు ఆడే సమయంలో ప్రేక్షకుల తాకిడి తట్టుకోలేనివిధంగా ఉండేది. ఆ ప్రేక్షకుల జిహ్వచాపల్యం తీర్చటానికి సోడాలూ, బఠానీలూ, ఇతరత్రా చిరుతిళ్ల తోపుడుబళ్లతో విచ్చేసిన వ్యాపారులతో, ఈ హంగామా అంతా చూసి అక్కడేదో జరిగిపోతుందనుకుంటూ ఆగి అర్ధమైనా కాకపోయినా విడ్డూరం చూసే డి.బి.దానయ్యలతో క్రీడాంగణం పరిసరాలు జాతరని తలపిస్తుండేవి. అంతవరకూ బాగానే ఉంది.

బాగా లేనిది, వికెట్ల వెనక నా పరిస్థితి. ముందే చెప్పినట్లు రత్నసాగర్ మంచి బ్యాట్స్‌మన్. అంతకు మించిన అరివీర భయంకర బౌలర్ కూడా. పాతిక గజాల దూరం నుండి పరుగు తీస్తూ వచ్చి మరీ ప్రచండ వేగంతో బంతులు విసురుతూ వికెట్ కీపర్ల గుండెల్లో నిదురపోయేవాడు. వాటిలో ఒక్కటీ లక్ష్యానికి కూతవేటు దూరంలోకి రాదు గనక ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్ మాత్రం ధైర్యంగా, దర్జాగా ఆ బంతులొదిలేస్తూ ‘వెల్ లెఫ్ట్’ పోజులొలకబోస్తుండేవాళ్లు. ఏం చేస్తాం మరి – ప్రాక్టీస్ ఎంత చేసినా, కపిల్ కదలికలు కావలసిన్ని అబ్బాయే తప్ప మావాడికి పెద్దాయన బౌలింగ్‌లో వందోవంతు కూడా వంటబట్టలేదు. కానీ సాక్షాత్తూ కపిల్ అవతారంగా స్థానికుల గుండెల్లో గుడి కట్టుకున్నవాడు, ఎవరి పేరు చెబితే పల్నాడు ప్రేక్షకులు విరగబడతారో, ఎవరి పేరు చెబితే చిరుతిళ్ల వ్యాపారులు పరుగెత్తుకొస్తారో, ఆ రత్నసాగర్  బౌలింగ్‌కి దిగకపోతే ఎలా? ఎలా? ప్రేక్షకులొప్పుకోరు మరి. వాళ్ల కోసమన్నా వీడికి ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్ ఇవ్వాల్సొచ్చేది. కపిల్ చేస్తే గీస్తే ఓపెనింగ్ బౌలింగే చెయ్యాలి కాబట్టి వీడి చేతికి కొత్త బంతినిచ్చి మా జట్టు బిక్కు బిక్కుమంటూ ఊపిరిబిగబట్టి బెదురుచూపులు చూస్తుండేది – మొదటి ఓవర్ ఎప్పుడైపోతుందా అని. సాధారణంగా పది లేదా పన్నెండు బంతుల తర్వాత మొదటి ఓవర్‌కి తెరపడేది. మావాడు భీకరమైన ఫామ్‌లో ఉంటే అంతకన్నా ఎక్కువ బంతులూ పట్టేవి. ఈ లోపు వికెట్ల వెనక నా వళ్లు హూనమైపోయేది. ‘అటు దూకు, ఇటు దూకు, [బంతి] ఎటు పడితే అటు ఎగిరెగిరి దూకు’ అని నన్ను నేనే ఉద్రేకపరుచుకుంటూ వికెట్లకి యోజనాల దూరంలో దూసుకుపోతున్న బంతుల్ని ఒడిసి పట్టుకోటానికి కుడిఎడమలకి ఎడా పెడా డైవ్‌ల మీద డైవ్‌లు కొట్టి, ఆ క్రమంలో మట్టికొట్టుకు పోయేవాణ్ని – లిటరల్లీ. ఆ తర్వాత, రత్నసాగర్ వేసిన పటిష్టమైన పునాదిని (మాక్కాదు, ప్రత్యర్ధి జట్టుకి) పెళ్లగించటానికి మిగతా బౌలర్లూ తమవంతు చెమటలు కక్కేవాళ్లు. ఏమాటకామాటే, బౌలింగ్‌తో చేసిపెట్టిన డామేజ్‌ని తన బ్యాటింగ్‌తో చాలావరకూ పూడ్చేవాడులెండి. అయితే ఆ విషయం ప్రస్తుతం అప్రస్తుతం.

అసలు సంగతేంటంటే, ఆ సాయంత్రం ఇంటికొచ్చాక నా ఎక్‌స్ట్రా క్లాస్ గుట్టు ఇంట్లో ఇట్టే రట్టైపోయేది! అదెలాగో వెలిగిందా?

(పదో ప్రపంచ కప్ సందర్భంగా – గతేడాది సంక్రాంతి నాటి నా ఈ పోస్ట్ యధాతథ పునఃప్రచురణ)

38 స్పందనలు to “ఎక్‌స్ట్రా క్లాస్”


 1. 1 Vinay Chaganti 9:11 సా. వద్ద జనవరి 13, 2010

  matti kottukupovatamena andi.

  Your story writing is so simple. I am a fan now. I will continue reading your blog Sir.

  — Vinay Chaganti

 2. 2 కొత్తపాళీ 9:17 సా. వద్ద జనవరి 13, 2010

  హ హహ్హ .. అది నా వికటాట్టహాసము. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజి క్రికెట్ పిచ్చిని (pun intended) దద్దరిల్ల జేసిన రోజులు గుర్తొచ్చాయి. నా అనుభవాలు కూడా రాస్తాను.

 3. 3 చదువరి 10:39 సా. వద్ద జనవరి 13, 2010

  మీ కపిల్‌దేవు గురించి చదూతూంటే నాకు మన బ్లాగరి ఒకాయన గుర్తొస్తున్నాడు. “..ప్రచండ వేగంతో బంతులు విసురుతూ వికెట్ కీపర్ల గుండెల్లో నిదురపోయేవాడు” – మీ రాతకు నా ఊహ తోడై యమా నవ్వొస్తోంది. పండగపూట మాంఛి సరదా టపా!!

 4. 4 SRRao 11:34 సా. వద్ద జనవరి 13, 2010

  ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
  అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
  *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
  SRRao
  శిరాకదంబం
  http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

 5. 5 nestam 12:36 ఉద. వద్ద జనవరి 14, 2010

  అయ్య బాబోయ్ కళ్ళముందు సీన్లు కదిలి భలే భయం వేసింది.అన్ని దెబ్బలు తగిలించుకుని కూడా ఎలా ఆడేవారండి బాబు..కానీ మీకు క్రికెట్ అంటే మాంచి ఇష్టం( పిచ్చి ) అని నాకెప్పుడో మీ క్రికెట్ బాంబ్ చదవక ముందే తెలిసిపోయింది.కూడలి లో మీరు మాములు పోస్ట్లకు అంతగా కామెంటేవారు కాదు గాని ఎక్కడన్నా క్రికెట్ అనే పదం మీద పోస్ట్ ఉంటే చాలు మీ కామెంట్ కంపల్సరీ ఉండటం గమనించాను … 🙂

 6. 6 వేణూ శ్రీకాంత్ 1:20 ఉద. వద్ద జనవరి 14, 2010

  హ హ మీకపిల్ దేవ్ ప్రహసనం బాగుంది 🙂
  “క్రికెట్ చూడను ఆడతాను” పోన్లెండి గుడ్డిలో మెల్ల 🙂

 7. 7 nomi 3:23 ఉద. వద్ద జనవరి 14, 2010

  “సాధారణంగా పది లేదా పన్నెండు బంతుల తర్వాత మొదటి ఓవర్‌కి తెరపడేది. మావాడు భీకరమైన ఫామ్‌లో ఉంటే అంతకన్నా ఎక్కువ బంతులూ పట్టేవి”–
  కెవ్వు కేక. నాకు చిన్నప్పటి బౌలింగ్ గుర్తుకొచ్చింది

 8. 8 బ్లాగాగ్ని 3:53 ఉద. వద్ద జనవరి 14, 2010

  హ హ హ!
  అప్పట్లో సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలింకా మొదలవ్వలేదనుకుంటా(మరక మంచిదే బ్రాండు) . లేకుంటే మీ కపిల్ దేవ్ వచ్చాక కూడా దర్జాగా బండి లాగించేసుండేవాళ్ళు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

 9. 9 వేణు 6:29 ఉద. వద్ద జనవరి 14, 2010

  భలే ఉంది మీ పోస్టు! విషయం కంటే అది చెప్పిన తీరు ఇంకా సరదాగా ఉంది.
  > కదలికల మీద కర్ ఫ్యూ విధించేశారు.

  > సిసలు కపిల్‌ని ప్రత్యక్షంగా తిలకించే అదృష్టానికి నోచుకోని నిర్భాగ్యాభిమానులు మా ఆట జరిగే ప్రాంతానికి తండోపతండాలుగా తరలొచ్చి ఈ నకిలీ కపిల్ దేవుణ్ని చూసి తరించిపోయేవారు.

  ‘ఇప్పటికీ నాకు పొగడ్తలన్నా, పొగిడేవాళ్లన్నా భయం’ అన్నారు కదా, అందుకే ఊరుకుంటున్నాను. లేకపోతేనా… 🙂

 10. 10 సుజాత 6:39 ఉద. వద్ద జనవరి 14, 2010

  మీకు సకల కళా వల్లభ బిరుదివ్వక తప్పేట్లు లేదు!

 11. 11 సిరిసిరిమువ్వ 6:48 ఉద. వద్ద జనవరి 14, 2010

  సుజాతగారి మాటే నాదీనూ..కానీ ఒకటే నచ్చలేదు…”అజ్ఞానుల కోసం మళ్లీ రాస్తున్నా: ‘విక్కీ’ అంటే ‘వికెట్ కీపర్’”..
  మా మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి..నేస్తం గారు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలి!!

 12. 12 కన్నగాడు 10:18 ఉద. వద్ద జనవరి 14, 2010

  టైటిల్ చూసి అయిదో టపా ముందు ఎక్స్ట్రా క్లాసేమో అనుకున్నా, మీ క్రికెటిజం బాగుంది. 🙂

 13. 13 nelabaludu 10:47 ఉద. వద్ద జనవరి 14, 2010

  వెల్ ప్లేయ్డ్ ఇన్ యువర్ పోస్ట్ 😉

 14. 14 lakshmi naresh 2:57 సా. వద్ద జనవరి 14, 2010

  kummesaaru..chinchi aresaaru…pichekkinchaaru…guru gaaru iraga deeesarandi…mana matallo kathi turum anthe…..

 15. 15 KumarN 7:44 సా. వద్ద జనవరి 14, 2010

  హ్హ హ్హ. ఆ దెబ్బలు తగ్గాయా మీకింకా.
  1. నా కుడు చేయి చిటికెన వేలు ఇప్పటికీ 1/3 వ వంతు 90 డిగ్రీలోకి బెండ్ అయ్యి ఉంటుంది. స్లిప్స్ లో కాచ్ కోసం డైవ్ ఇచ్చిన గిఫ్టు.
  2. మొన్న మొన్నటి దాకా కుడి చేయి మధ్య వేలు, రెండు వేర్వేరు వేళ్ళ లాగా డిఫరెంట్ థిక్ నేస్ తో ఉండేది.
  3. పాయింట్ లో నెత్తికి చాలా పైగా వెల్తున్న బంతినందుకోవడానికి ఎగిరి వెనక్కి వాలిపడితే చేయి మీద లాండ్ అయితే మణికట్టు ఫ్రాక్చర్ అయ్యి, ఆ పెయిన్ కి తోడు, ఇంట్లో వాళ్ళ వీర వాయింపుడు బాధ, ఇంట్లోనే ఉండీ మరీ.
  4. ఆడుతున్న మొదటి రోజుల్లో, హై కాచ్ ఎలా పట్టు కోవాలో తెలీక, దాని కింద నిలపెడితే అది కంటి మీద పడి, అది ఓ బత్తాయి కాయంత వాచి, కన్ను పోతుందేమో నని అందరూ భయపడి, మా ఊరి నుంచి వరంగల్ కి అర్జంటుగా తీసికెళ్ళి తరవాత 2 వారాలు మా వాళ్ళు పడిన బాధ
  4. అన్నిటి కన్నా ఎక్కువ పాడ్స్ లేక, ఫ్రంట్ ఫూట్ కెళ్ళి ఆడిన గుర్తులు(చిన్న హిన్న సిస్ట్స్) ఇప్పటికీ నాకు మోకాళ్ళ కింద, పైనించి కింద దాకా ఉన్న బోన్ కి, చేతులు పెడితే ఆ వాపులు ఇప్పటికీ నొప్పి లేస్తాయి. గట్టిగా ఇప్పటికీ ప్రెస్ చేయలేను.

  ఒక్క దెబ్బతో ఇవన్నీ గొర్తొచ్చాయి.

  • 16 అబ్రకదబ్ర 8:03 సా. వద్ద జనవరి 14, 2010

   మీకు పెద్ద లిస్టే ఉంది 😀

   నేనలా కలకాలం నిలచి ఉండే దెబ్బలు తగిలించుకోలేదు లెండి. నావన్నీ నాలుగైదు రోజుల్లో తగ్గిపోయేవే .. దోక్కుపోవటం, బెణకటం, వగైరా. నాకు తగిలిన ఒకే పెద్ద దెబ్బ – బంతి పడి బొటన వేలి గోరు ఎగిరిపోవటం. రెండు నెలలు పట్టిందనుకుంటా అది తిరిగి పూర్తిగా పెరగటానికి. కాస్త స్థాయి పెరిగి మంచి ప్యాడ్లూ, హెల్మెట్లూ అందుబాట్లోకొచ్చాక దాదాపు దెబ్బల్లేవిక. అయితే కీపింగ్ చేసేటప్పుడు మాత్రం తరచూ గోర్లు చిట్లుతుండేవి – ఎంత మంచి గ్లవ్స్ వాడినా. ఏడెనిమిదేళ్లబట్టీ కీపింగ్‌కి రాంరాం కొట్టి పూర్తి స్థాయి బౌలర్‌గా సెటిలైపోయా. ఇప్పుడు గోళ్లతోనూ సమస్యల్లేవు 🙂

  • 17 సుజాత 8:17 సా. వద్ద జనవరి 14, 2010

   కుమార్,
   మీరు మరీ ఇంత “సీరియస్” గా ఆడేవారా క్రికెట్? మరీ, ఎప్పటికీ మర్చిపోలేనంతగానా? అమ్మో అమ్మో!

 16. 18 nestam 8:35 సా. వద్ద జనవరి 14, 2010

  వరూధిని గారు వచ్చేసా వచ్చేసా …నిన్న అసలు ఆ విక్కి పదం చదవగానే ఎవరో అబ్రకదబ్ర గారి ఫ్రెండ్ విక్రం అయి ఉంటారు విక్కి అని పిలుస్తారేమో అనుకుని నెక్స్ట్ వాక్యం చదివి అవాక్కయిపోయాను… అసలు ఆ వాక్యం మీదే వ్యాక్య రాసి ఖండఖండాలు గా ఖండిద్దాం అనుకున్నా కాని పోనిలే పాపం ఏదో గత ఙ్ఞాపకాలు, అందునా క్రికెట్ విషయాలు తలుచుకుని ముచ్చటపడుతున్నారు కదా అని వదిలేసా 😛

  కుమార్ గారు మళ్ళా నాకు బిపి తెప్పించేసారండి.మావారు కూడా అంతే .. మణికట్టు ఫ్రాక్చర్ ,ఉంగరం వేలు బోన్ ఇరిగి పోయి ప్రస్తుతానికి వెనుకకు వంగదు మా వారికి కూడా,దేవుడా ఇంతకు మించి ఈ క్రికెట్ పిచ్చి గురించి వింటే నేనేమయిపోతానో…

 17. 19 KumarN 8:43 సా. వద్ద జనవరి 14, 2010

  సుజాత గారు,
  ఇంజనీరింగ లో మా యూనివర్సిటీ తరపున ఆడానండి.
  అబ్రకదబ్ర గారు వీకెండ్స్ మాత్రమే…నేను ఇంటర్ లో ఒక మూడు నెలలు(లిటరల్లీ) చాలా పొద్దున్నే స్పెషల్ క్లాస్ అని వెళ్ళి, అక్కన్నుంచి కాలేజీ కెళ్తున్నాని చెప్పి, రోజంతా క్రికెట్ గ్రౌండ్ లోనే ఆడేవాణ్ణి. ఆ ఎండల్లో అబ్బో వద్దు లెండి. ఇంటి కొచ్చాక బాత్ రూం కెళ్తే కనపడే నరకం.

  మూడు నెలల తర్వాత మా అమ్మ, అర్జంటుగా అమ్మమ్మ ఊరి కెళ్ళాల్సి వచ్చి, ఊర్నించి వచ్చిన మామయ్యని కాలేజి కి పంపించింది, ఇంటి కీస్ ఇచ్చి రమ్మని. నేనెవరో తెలీదు అన్నాట్ట లెక్చరర్. చివరికెవరో ఒక అబ్బాయి బయట కొచ్చి, నాకు తెలుసు మీ అబ్బాయి, ఆయన చాలా నెలల నించి కాలేజికి రావట్లేదు అని చెప్పాడు. ఇహ తర్వాత చాలా భారతం నడిచింది లెండి. ఓ నవలవుద్ది. తర్వాత నేను ఊళ్ళో ఎక్కడికెళ్ళిన మా నాన్న నన్ను సైకిల్ మీద తీసుకెళ్ళి దింపడాలు, మా మామయ్య ఆకస్మిక తనిఖీలు, ఊరంతా మా నాన్న నా గురించి కనిపెట్టమని చెప్పటం…ఇంత చేసినా కూడా నేను వాళ్లని మాయ చేసి, గ్రౌండ్స్ వదిలేసి, గల్లీల్లో ఆట్టం మొదలెట్టా..

  ఎప్పుడో ఇంటర్ రెండో సంవత్సరం మధ్యలో బుద్దొచ్చింది. సడన్ గా డౌట్ వచ్చింది నేను మొట్ట మొదటి సారిగా పరీక్షల్లో ఫెయిల్ అవుతామోనని..అది మార్చింది నన్ను..తర్వాత ఎంసెట్, తర్వాత అంతా మామూలే ఇంక.

 18. 20 Chandu 10:56 సా. వద్ద జనవరి 14, 2010

  This post is so addictive – I generally read blog posts on seeing the length of post! This is a long post, but I could read because, it is about cricket! i am also from Palanadu! I used to play cricket in SS&N College Grounds!

  YOUR POST just got connected to my childhood! I read entire post! Good one! So many incidents are identical to my childhood and that too with cricket! 🙂 🙂 Nice buddy! Nice!

  Chandu

 19. 21 Murali 2:22 సా. వద్ద జనవరి 15, 2010

  అబ్రకదబ్ర గారు,

  నమస్కారం. నేను మీ సైలెంట్ అభిమానిని. మీ బ్లాగులు చాలా రోజులనుంచి చదువుతున్నాను. చాలా బాగా రాస్తారు మీరు. అలాగే మీ చిత్రాలు, కధలు కూడా చాలా బాగున్నాయి. మీ అభిప్రాయాలు కూడా చాల వరకూ నేను అలోచించినట్లే ఉంటాయి. ఇదంతా చాలా రోజులనుంచి రాయాలని వున్నా, రీడర్స్ బ్లాక్ 🙂 వలన రాయలేదు. కాని ఈరోజు SS & N కళాశాల పేరు కనపడే సరికి ఇక ఊరుకోలేక రాసేస్తున్నాను. నేను కూడా 1980 మరియు 81 ప్రాంతాలలో అదే గ్రౌండ్ మీద పిచ్చి పిచ్చి గా క్రికెట్, బాడ్మింటన్ ఆడిన రోజులు గుర్తుకు వచ్చాయి.
  ఇలా చాలా మందికి పాత విషయాలు గుర్తుకు తెచ్చి, పాత గాయాలు రేపుతున్నందుకు బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో మీ మీద కేసు పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.

  కీప్ అప్ యువర్ సెన్స్ అఫ్ హ్యూమర్.
  – మురళి

 20. 22 Kishore .K 5:45 ఉద. వద్ద జనవరి 16, 2010

  Chaala bavundi me story..ee roje first time me blog chustunnanu..chaala bavunnayi andi..i have become fan of u..:)

 21. 23 ఊకదంపుడు 7:17 ఉద. వద్ద జనవరి 16, 2010

  నేను ఇలా దెబ్బలు తగిలించుకోకూడదని – క్రికెట్టు జోలికి పోకుండ పేకాట చేపట్టానా – ఐనా తిట్టేవారండీ పెద్దోళ్లు 😦
  ఈ నాడు లో మీ బ్లాగ్గురించి వచ్చినందులకు అభినందనలు.
  జయోస్తు

 22. 24 Mahesh Kalaal 11:48 ఉద. వద్ద జనవరి 16, 2010

  hi…

  It is a pleasant read…..natural and casual……could tune myself as well coz of my instinctual attachment to cricket…..
  went nostalgic….
  the way you narrate the nuances is soothing…

  I have one query…

  Chandama ki macha annatu….ee post lo “…..మిగిలిన అజ్ఞానుల కోసం మళ్లీ రాస్తున్నా: ‘విక్కీ’ అంటే ‘వికెట్ కీపర్’…..” ane sentence lo….. “అజ్ఞానుల” ane padam enduko konchem extreme anipinchindi…..

  Inkedaina padam akkada vaadataaniki aaskaram unda??

  aa padam vaade kramamlo mee uddesham manchidaina(casual, lite etc) enduko aa padam motham post ki unna oka thematic flow ki hurdle la anipinchindi….

  aa place lo mee feeling ni convey chese inkemaina padaalu unnaya?

  • 25 అబ్రకదబ్ర 12:44 సా. వద్ద జనవరి 16, 2010

   @మహేష్:

   నిజానికి నేను వాడాలనుకున్న మాట ‘అగ్నాని’ (ఎన్టీవోడిని అనుకరిస్తూ). హడావిడిలో ‘అజ్ఞాని’ అంటూ అసలు పదమే వాడేశాను .. టైపో అన్నమాట 🙂 సాధారణంగా పబ్లిష్ చెయ్యబోయే ముందు రివ్యూలో ఇలాంటివి చూసుకుని దిద్దుతుంటాను. ఈ టపా మాత్రం రివ్యూ చెయ్యకుండా ప్రచురించేశాను. ఇప్పుడు దిద్దాను. ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు.

 23. 26 వాసు 5:56 సా. వద్ద జనవరి 16, 2010

  కళ్ళకి కట్టినట్టు సినిమా చూపించారు. భలే ఉంది. కానీ సినిమా ఇంటర్వెల్ లో ఆపేసినట్టుంది నాకైతే. తరువాత పేజీ వెతుకుతూ ఉన్నా ఎక్కడన్నా మిగతాది ఉందేమో అని. నేను మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యానేమో. నేనింకా కపిల్ దేవ్ ని తోట రాముడు లో దినకర్ లాగా ఆడుకుంటారెమో అని బోలెడు ఆశలు పెట్టుకున్నా.మీరిలా చేస్తారనుకోలేదు.

  ఇంకో విషయం. నాకు మీ టపా లో అక్షరాలూ మరీ చిన్నవి గా అనిపిస్తాయి. ఒక రిఫరెండం పెట్టి అందరి మనోభావాలు పరిగణన లోకి తీసుకుని, ఒక నిర్ణయం తీసుకోగలరు దీని మీద. 🙂

  • 27 అబ్రకదబ్ర 4:19 సా. వద్ద జనవరి 17, 2010

   @Vasu:

   >> “నేనింకా కపిల్ దేవ్ ని తోట రాముడు లో దినకర్ లాగా ఆడుకుంటారెమో అని బోలెడు ఆశలు పెట్టుకున్నా.మీరిలా చేస్తారనుకోలేదు”

   Well, this post is not about Kapil Dev. It’s about me, and my ‘extra classes’. That’s why, I only wrote what’s relevant and left all the other details aside. When the time comes, I might bring back Kapil in a later post 🙂

 24. 28 వాసు 6:12 సా. వద్ద జనవరి 16, 2010

  అన్నట్టు మర్చేపోయా.. ఈనాడు లో మీ బ్లాగ్ గురించి చూసా సుజాత గారి టపాలో.
  బోలెడు అభినందనలు.

 25. 29 వెంకటరమణ 6:31 ఉద. వద్ద జనవరి 18, 2010

  మంచి టపా. రాసింది మీరైనా ఈ క్రికెట్ బాధలు(ఆనందాలు) మాకు కూడా చెందుతాయి. మాది కూడా పేద జట్టే. విక్కీ బాధలు ఎన్నని చెప్పగలం. 🙂 :). బ్యాట్స్మెన్ కూడా ఈ గాయాలకు అతీతులు కాదు. అప్పుడప్పుడూ బలయ్యేవారు. బాల్ తగిలిన గాయాలను పక్కన పెడితే, ఎండాకాలంలో పల్లెటూరి పగుళ్ళిచ్చిన చేలల్లో ఆడి, కాళ్ళు, చేతులు దోక్కుపోయినా అప్పుడు పెద్ద లెక్క చేసేవారు కాదు. అవి తట్టుకోలేకేనేమో గత అయిదారు సంవత్సరాల నుండి ఎక్కడ చూసినా రబ్బరు, టెన్నిస్ బాల్ టోర్నమెంట్లు కనిపిస్తున్నాయి కానీ కార్క్, గ్రేస్ బాల్స్ బాగా తగ్గిపోయాయి. ఈ సంక్రాంతి కి ఇంటికి వెళ్ళినపుడు కూడా ఆడాను. ఎప్పుడు వెళ్ళినా ఆటలను వదిలే ప్రసక్తి లేదు. మీరు అందరి పాత గాయాలను తిరిగి రేపుతున్నారు. అన్యాయం. :).

 26. 30 zulu 12:12 ఉద. వద్ద జనవరి 19, 2010

  Even I started my career as a WICKY. But later as I am tall and bit powerful, I turned to fast bowler. Still I m playing for my company. You just remind my old days. God bless You. Keep posting.

 27. 31 Vj 1:23 ఉద. వద్ద జనవరి 19, 2010

  వికెట్ కీపర్ ఎమో గాని , ” విక్కీ” ప్రస్తావన వినే సరికి క్రికెట్ మతం స్వీకరించిన తొలి నాళ్ళలో మేము వాడిన కార్క్ బంతి గుర్తోస్తుంది … విక్కీ బ్రాండ్ కార్క్ బాల్ దొరికేంత వరకు పట్టు వదలని విక్రమార్కుల్ల స్పోర్ట్స్ షాపుల చుట్టూ తిరిగే వాళ్ళం … సొంతూర్లో దొరకక పొతే పక్కనున్న టౌన్‌కి వెళ్ళి మరి కొనుక్కొచ్చే వాళ్ళము … కార్క్ బంతిలో దొరికే గ్రిప్పు ముందర ఏ బంతైనా బలాదూరే … లెథర్ బంతిలా ఉమ్మి రాసి ప్యాంటు చిరిగేలా రుద్దుకునే అవసరము లేదు , రెండు వేళ్ళ మద్యన పెట్టి వదిలితే వార్న్ స్పిన్ కూడ చిన్న బోవాల్సిందే … ఏ మాటకామాట చెప్పుకొవాలి గాని , మ్యాట్ పై లెథర్ బంతితో ఆడితేనే క్రికెట్‌లో ఉన్న నిజమైన మజాని ఆస్వాదించొచ్చు … ఎమంటారు అబ్రకదబ్ర గారు ?

  నాదో వింత సమస్యండి …. క్రికెట్ ఆట ఆడటం మీదున్న పిచ్చి మూలముగ కాబోలు , క్రికెట్ ఆట ఇష్టం లేని వారన్న , ఆడలేని వారన్న నాకెందుకో చిన్న చూపు …. ఈ సమస్య మానసికమంటారా లెక సామజికమా ? తోటి మతస్థులు కనుక మీకెమన్న ఐడియా ఉందేమోనని అడిగా 😉

  బైదవే , పత్రికలకెక్కినందుకు అభినందనలు 🙂

 28. 32 rays 5:34 ఉద. వద్ద జనవరి 19, 2010

  మీ క్రికెట్ జ్నాపకాలు అత్యద్భుతమ్…

  • 33 Hemanth 8:13 ఉద. వద్ద జనవరి 20, 2010

   నాకు నా ఫస్ట్ experience with cricket గుర్తుకు వస్తోంది. నాకు పెద్దగ రాదు కాని ఆడాలి అన్న వుబలాటం ఎక్కువ అప్పట్లో. నా లాంటి ఇంకో rookie bowling చేస్తున్నాడు. ball face పైకి వస్తోంటే ఏం చెయ్యాలో అర్థం అవ్వక బాట్ అడ్డం గా పెట్టడానికి ట్రై చేసి ఫెయిల్ అయితే అది full toss నేరుగా ముక్కు మీద పది ముక్కు పగిలింది. ఇప్పటికి నా ముక్కు ఉబ్బి వుంటది దాని వాళ్ళ. Thanks for taking me to the sweet(read scary) memory.

   Nice blog. Thanks to some blogger who posted the eenadu paper article and pointed me in this direction.

   I wish there was a directory of telugu bloggers and based on the popularity something like a rank would help in finding good blogs like this. If theres something of this nature already please let me know.

 29. 35 Vizard 2:39 ఉద. వద్ద జనవరి 20, 2010

  being a football goalie..i was hardly into cricket. but this blog sure did entertained me from the audience perspective. will stay hooked.great guns bud.

 30. 36 KumarN 11:47 సా. వద్ద జనవరి 20, 2010

  అదేంటీ??!! ఇండియాలో కూడా టెన్నిస్ బాల్ తో ఆడుతున్నారా?!!. నేనిన్ని రోజులూ కేవలం అమెరికా లోనే అలా ఆడుతారు అనుకుంటున్నా. ఇక్కడంటే దెబ్బలకీ, మళ్ళీ హాస్పిటల్సుకీ, తర్వాత వచ్చే ఇన్సూరెన్సు బిల్లులకీ, తెల్లారి ఆఫీసులకీ వెళ్ళడానికి భయపడాలి కాని, ఇండియాలో టెన్నిస్ బాల్స్ తో ఆడ్డమేంటి..ఇంకెందుకూ క్రికెట్ ఆట్టం అంత మాత్రానికి?

  • 37 వెంకటరమణ 12:03 ఉద. వద్ద జనవరి 21, 2010

   అవునండీ కుమార్ గారు. ఈ రబ్బర్, టెన్నిస్ బాల్స్ తో ఆడటం నాకు అసలు నచ్చలా. మా ఊరి వాళ్ళు ఏదో ఒక పక్క ఊరి వాళ్ళతో మ్యాచ్లు పందేనికి వీటితోనే ఆడుతుంటారు. ఇష్టంలేక చాలా వాటికి వెళ్ళను. క్రికెట్ పై ఉన్న పాషన్ తో అందరితోపాటు టెన్నిస్ బాల్స్తో ఆడక తప్పటంలేదు. లెదర్ బాల్తో మాట్ మీద ఆడిన మజా ఉండటం లేదు.

 31. 38 Faustin Donnegal 9:43 ఉద. వద్ద ఫిబ్రవరి 26, 2010

  OMG u write cool have to read all. May be ur comment box will be blasted with my comments. So, no comments. Only reading 😀


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: