అవతారం

పుష్కరం కిందటి మాటిది. 1997 డిసెంబర్ 19న అమెరికాలో ‘టైటానిక్’ విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సినప్పట్నుండీ అది ఇండియాలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూట్టం మొదలెట్టాను నేను. ఆలిండియా జేమ్స్ కామరాన్ అభిమాన సంఘానికి అప్పట్లో నేను ప్రెసిడెంటుని. ఆ సంఘంలో ఏకైక మెంబర్ని కూడా బహుశా నేనే. ఆ రోజుల్లో మన్దేశంలో జిమ్ కామరాన్ పేరు పెద్దగా ఎవరికీ తెలీదు. నా వరకూ – చిన్నప్పుడెప్పుడో, ఆంగ్ల సినిమాలు అర్ధమయ్యీ కాని రోజుల్లో ‘టెర్మినేటర్’ చూసినప్పట్నుండీ కామరాన్ ఓ గొప్ప దర్శకుడు అనే అభిప్రాయం  ఏర్పడిపోయింది. ఆ తర్వాత ‘ది అబీస్’, ‘టెర్మినేటర్-2’ చూశాక అది బిర్రబిగిసిపోయింది. (పిడకల వేట: నా నాగరికథలో ప్రస్తావించిన కాజాలిటీ తిరకాసు టెర్మినేటర్, టెర్మినేటర్-2 రెండిట్లోనూ రెండు రకాలుగా దర్శనమిస్తుంది. అవేమిటో చెప్పుకోండి చూద్దాం). టైటానిక్‌కి ముందు అతను తీసిన సినిమాలు ఆరే ఆరు. వాటిలో చివరి ఐదూ బాక్సాఫీసు దుమ్ము దులిపేశాయి. ఐనా కూడా ‘కొందరు ప్రముఖ హాలీవుడ్ దర్శకుల పేర్లు చెప్పుము’ అంటే అందరి లిస్టులోనూ స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఎంత ఖాయంగా కనిపించేవాడో, కామరాన్ అంత ఖాయంగానూ లోపించేవాడు. ఆ విషయం నాకు చాలా వింతగా తోచేది. విజయాల శాతమే ప్రతిభకి కొలమానమైన వినోద పరిశ్రమలో తీసిన ఆరింటిలోనూ ఐదు రికార్డులు బద్దలు కొట్టినా అతనంత ప్రసిద్ధి చెందకపోవటం బోలెడంత హాశ్చెర్యమనిపించేది. అందుకు నాకు తోచిన కారణం – కామరాన్ ఇతర దర్శకుల్లా వరస వెంబడి సినిమాలు తీసుకు పోకుండా, తాపీగా ఆర్చుకునీ తీర్చుకునీ రెండు మూడేళ్లకు ఒకటి మాత్రమే తీయటం. 

మొత్తమ్మీద, ‘ట్రూ-లైస్’ తర్వాత మూడున్నరేళ్లకి వస్తున్న సినిమా కావటంతో, టైటానిక్ ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఆవురావురుమంటూ ఎదురుచూడసాగాను. దానికి తోడు, టైటానిక్ నిర్మాణంలో ఉండగా దాని గురించి వచ్చిన విశేషాలు నా ఆసక్తిని మరిన్ని రెట్లు పెంచాయి. అప్పటిదాకా ఏ హాలీవుడ్ సినిమాకీ పెట్టనంత భారీ బడ్జెట్‌తో (200 మిలియన్ డాలర్లు) రూపొందుతుందనీ, నిర్మాణానికి రెండున్నరేళ్లు పట్టిందనీ, అంతకంతకూ పెరిగిపోతున్న బడ్జెట్ తట్టుకోలేక ట్వెంటీయత్ సెంచరీ ఫాక్స్ మధ్యలో చేతులెత్తేస్తే, పారామౌంట్ పిక్చర్స్ సంస్థ ఓ చెయ్యేసి సినిమాని ఒడ్డుకు చేర్చిందనీ, ఈ సినిమా గనక ఫెయిలైతే ఆ రెండు సంస్థలూ మునగటం ఖాయమనీ .. ఇలాంటి వార్తలు ఆ సినిమా పట్ల ఎక్కడ లేని హైప్‌నీ సృష్టించాయి. అంత హైప్‌తో వచ్చిన సినిమాలు సాధారణంగా బోల్తా కొడతాయి. పైగా, అందులో నటించిన నటీనటులకే ఆ సినిమా విజయంపై నమ్మకం లేదనీ, మూడున్నర గంటలకి పైగా సా….గే సినిమా కావటంతో జనాలకు బోర్ కొట్టటం ఖాయమనీ, అంత పెద్ద సినిమా కావటం వల్ల రోజుకి ఎక్కువ ఆటలు ప్రదర్శించే అవకాశం ఉండకపోవటం మరో దెబ్బ అనీ .. ఇలా ఎన్నెన్నో అనుమానాల మధ్య విడుదలైంది టైటానిక్. ఆ తర్వాతి చరిత్ర అందరికీ తెలిసిందే. టైటానిక్ నిజంగానే మునిగింది – లాభాల సముద్రంలో. ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పన్నెండేళ్ల కిందట టైటానిక్ సృష్టించిన రికార్డు ఇప్పటికీ భద్రంగానే ఉంది. ముప్పై ఎనిమిదేళ్ల పాటు ‘బెన్-హర్’ పేరుతో భద్రంగా ఉన్న అత్యధిక ఆస్కార్ల రికార్డుని కూడా టైటానిక్ అలవోకగా సమం చేసింది (2003లో ఈ రికార్డుని ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్ – రిటన్ ఆఫ్ ది కింగ్’ మరో సారి సమం చేసింది)

ఈ రికార్డుల కబుర్లు చదువుకుంటూ కాలం గడుపుతున్న నా నిరీక్షణకి తెరదించుతూ ఎట్టకేలకి 1998 మార్చి నెలలో టైటానిక్ ఇండియాలో విడుదలయింది. విడుదల రోజునే నేను చూసిన మొదటి సినిమా అది. ప్రేమ కథా చిత్రాలంటే అంతగా ఇష్టపడని నాకు బాగా నచ్చిన ప్రేమ కథా చిత్రం కూడా అదే. వాస్తవ సంఘటనలకు కాస్త కల్పన జోడించి కామరాన్ స్క్రీన్-ప్లే రూపొందించిన విధం నాకు అమితంగా నచ్చేసింది. (తరచి చూస్తే, టైటానిక్ స్క్రీన్-ప్లేలో ఉన్నన్ని లోపాలు క్లాసిక్‌గా పేరొందిన మరే సినిమాలోనూ కనిపించకపోవచ్చు. అయినా మూడున్నర గంటల పాటు కట్టిపడేసేలా కథ రూపొందించటం, దాన్ని భారీ హంగులతో తెరకెక్కించటం, గ్రాఫిక్స్ మాయాజాలాన్ని మనం పసిగట్టని రీతిలో వాడుకోవటం .. నాకు అప్పటికీ ఇప్పటికీ అద్భుతంగానే అనిపిస్తుంది)

టైటానిక్ వేడి క్రమంగా చల్లారింది. మళ్లీ ఎదురుచూపులు మొదలయ్యాయి – కామరాన్ మరుసటి చిత్రం కోసం. ఈ సారి పన్నెండేళ్లు పట్టింది దానికి. ఈ మధ్యలో అతని దృష్టి డాక్యుమెంటరీల మీదకీ (ఘోస్ట్స్ ఆఫ్ ది అబీస్, ఏలియన్స్ ఆఫ్ ది డీప్, ఎక్స్‌పెడిషన్:బిస్మార్క్), టెలివిజన్ సీరియళ్ల మీదకీ (డార్క్ ఏంజెల్) మళ్లింది. నిర్మాతగా ‘సొలారిస్’ వంటి పూర్తి నిడివి చిత్రాలూ రూపొందించినా, దర్శకత్వానికి మాత్రం దూరంగానే ఉండిపోయాడు. ఎట్టకేలకి నాలుగేళ్ల క్రితం దర్శక నిర్మాతగా ‘అవతార్’ ప్రారంభించాడని విన్న నాటి నుండీ నాలో ఎప్పుడెప్పుడా అన్న ఎదురుచూపులు మొదలయ్యాయి. నిరీక్షణ అంతమై సినిమా రేపు విడుదలవుతుంది. కామరాన్ గత చిత్రాలన్నిట్లాగానే ఇదీ ఇప్పటిదాకా మరే ఇతర సినిమాకీ లేనంత భారీ బడ్జెట్‌తో (నిర్మాణానికి 300 మిలియన్ డాలర్లు + ప్రపంచవ్యాప్త మార్కెటింగ్‌కి 150 మిలియన్ డాలర్లు) తెరకెక్కినట్లు వార్తలు. ‘టెర్మినేటర్-2’, ‘టైటానిక్’ అనుభవాల దృష్ట్యా, ఇంత భారీ పెట్టుబడిని అవతార్ తేలిగ్గానే రాబట్టేసుకుంటుందనే విషయంలో ఈ సారి సినీ పండితులెవరికీ అనుమానాలున్నట్లు లేదు. ఎంతగా లాభాలు గడిస్తుందన్నదే అసలు ప్రశ్న. టైటానిక్‌ని మించుతుందా అన్నది కొసరు ప్రశ్న.

ఆ ప్రశ్నలు అటుంచితే, నా ప్రశ్న నాకొకటుంది. కామరాన్ సినిమాలన్నిట్లోనూ కొన్ని సన్నివేశాలు పునరావృతమవుతుంటాయి. నీలి వర్ణం ఎక్కువగా కనిపించటం, ఎలివేటర్‌లో ఓ ప్రధాన సంఘటన జరగటం, స్వప్న సన్నివేశాలు, (యండమూరి నవలల్లోలా) శక్తివంతమైన మహిళ పాత్రొకటి, వీడియో కెమెరా దృక్కోణంలోంచి కనిపించే షాట్స్, కథకి ఏదో రకంగా నీటితో సంబంధం ఉండటం .. ఇలాంటివి. ట్రైలర్స్ చూస్తుంటే వీటిలో కొన్ని అవతార్‌లోనూ ఉన్నట్లు తెలిసిపోయింది. మిగిలినవీ ఉన్నాయా? తెలిసేది రేపే.

 

12 స్పందనలు to “అవతారం”


 1. 1 రవి చంద్ర 10:18 సా. వద్ద డిసెంబర్ 17, 2009

  మీలాగే నేను కూడా జేమ్స్ కేమరాన్ అభిమానినే. అతనిలో నాకు నచ్చే గుణం ఏమిటంటే ఓపిగ్గా కథ తయారు చేసుకుని సినిమా చెయ్యడం.అలా తయారు చేస్తే అన్ని రంగాల్లో నాణ్యత ఉంటుందని నా నమ్మకం.

 2. 2 zulu 10:42 సా. వద్ద డిసెంబర్ 17, 2009

  One more member into Camaroone’s fans club. I Simply love watching his movies. Even I am eager to watch this movie. I didnt get 3D tickets for this movie but I got normal screen tickets here in Bangalore INOX. Hope will get 3D tickets soon.
  And also eagerly waiting for the records breakage. 🙂

 3. 6 కత్తి మహేష్ కుమార్ 12:50 ఉద. వద్ద డిసెంబర్ 18, 2009

  నేనీ సినిమా చూసేశానోచ్!!!
  నాకు ఈ సినిమా నచ్చడానికిగల కారణాలు కొంచెం వేరు.
  http://navatarangam.com/2009/12/avatar_review/

 4. 7 అబ్రకదబ్ర 12:05 సా. వద్ద డిసెంబర్ 18, 2009

  టైటానిక్ టైములోనేమో నేనక్కడుంటే సినిమా ఇక్కడ మొదట రిలీజైంది. ఇప్పుడు ఇక్కడుంటే అక్కడ మొదట రిలీజైంది. మోసం, దగా 😐

 5. 8 కన్నగాడు 4:13 ఉద. వద్ద డిసెంబర్ 26, 2009

  ిఈ మధ్య ఊపిరి తీసుకోలేనంతగా పని ఉండి మీ ప్రశ్నకు జవాబు చెప్పలేదు, ఈ పాటికి ఎవరో ఒకరు చెబుతారనే నమ్మకంతో ఇటు వైపుగా వస్తే జవాబు ఊసే లేదు.

  టర్మినేటరు మొదటి భాగంలోని టర్మినేటరుని రివర్సు ఇంజనీరింగు చేసే రెండవ భాగంలో కృత్రిమ చేయిని తయారు చేస్తారు తరువాత అదే ప్రక్రియను అభివృద్ది చేసి కృత్రిమ తెలివి విభాగంలో ముందుకెలుతారు.

  అంతే కదా!
  ఇక పోతే మా చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లోకి కొత్తగా ఐమాక్సు మా ఊళ్లో వేసాడు, అవతారం తోనే ప్రారంభం, ఈ రోజే(ఇంకో మూడు గంటల్లో సినిమా) చూడటానికి వెలుతున్నా.

  • 9 అబ్రకదబ్ర 1:50 సా. వద్ద డిసెంబర్ 30, 2009

   @కన్నగాడు:

   సరైన సమాధానం. వేసుకోండి వీరతాడు 🙂

   అయితే సగం సమాధానమే చెప్పారు కాబట్టి సగం వీరతాడే. రెండో ఉదాహరణ మీరు మర్చిపోయారు – సారా కానర్‌ని, ఆమెకి పుట్టబోయే బిడ్డనీ కాపాట్టానికి జాన్ కానర్ భవిష్యత్తు నుండి పంపిన తన స్నేహితుడే అతని అతని తండ్రవటం.

   అవతారం నచ్చిందా? నేనాల్రెడీ రెండు చూపులు చూసేశా.

 6. 10 సుజాత 11:13 సా. వద్ద డిసెంబర్ 30, 2009

  నేను మాత్రం మొదటి సారే ఐమాక్స్ లో చూసేశా! ముందునుంచే ప్లానింగ్ ఉండాలి మరి! అప్పటికప్పుడు “బుక్ మై షో” అంటే “ఎల్లెల్లెహె” అంటాది వెబ్ సైటు!

 7. 11 గీతాచార్య 4:21 ఉద. వద్ద డిసెంబర్ 31, 2009

  అన్నయ్యా! కామెరాన్ అభిమాన సంఘమొకటుంటే నాకందులో తప్పక స్థానముంటుంది. టెర్మినేటర్జూశాక టైటానిక్కోసం ఎన్ని ఎదురు చూపులో. అయ్యాక అవతార్ ముందు టూడీ ఆపైన త్రీడీ కొట్టాను ఒకేరోజు 😀

 8. 12 గీతాచార్య 3:21 ఉద. వద్ద జనవరి 1, 2010

  తీరికా పాడా… ఎప్పుడైనా కాస్త సందు దొరికితే ఓపెన్ చేసిన బ్లాగులో కామెంట్లు పెట్టాలనిపిస్తే పెట్టేస్తాను. ఓ నాలుగో ఐదో


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: