మేకింగ్ ఆఫ్ సున్నం

“నమస్తే ప్రొడ్యూసర్ గారూ”

“అలో, అలో.. రావయ్యా రైట్రూ. చాన్నాళ్లయింది కలవక. ఏంది కత?”

“ఆ మధ్య కలిసినప్పుడు నెక్స్‌ట్ పిక్చర్ జి.టోపీచంద్‌తో తీస్తున్నా, మంచి కథ కావాలన్నారు కదా. మీకోసం సూపర్ కథొండే పన్లో బిజీగా ఉన్నా సార్. పూర్తవగానే తీసుకుని ఇటే వస్తూంట”

“ఐతే రా. కూర్సో, వినిపించు.. ఆఁ .. ఆఁ.. ఆడ కాదు, ఈడ కూర్సో. ఈ కుర్సీలో కూర్సుని చెప్పిన కతలన్నీ హిట్లే”

ఇంక నేనెందుకు మరి? కుర్చీతోనే కథ చెప్పించుకో. పల్నాడు ఫ్యాక్షన్ కథ సార్. ఇప్ప..”

“ఆగాగు. రాయల్సీమ కతలు రొటీనైపొయ్యినై నిజఁవేననుకో. కానీ పల్నాడు కతల్తో కూడా కొన్ని సినిమాలొచ్చి పొయ్యినైగా. గోలయ్యబాబు ఆ మద్దెనో ఫ్లాపిచ్చిండు కదా”

లాభం లేదు. వీడ్ని సెంటిమెంటుతోనే కొట్టాలి. అదెప్పటి మాటో కద సార్. నిన్నగాక మొన్న గుభేల్ స్టార్ ప్రభాత్‌కి సూపర్ డూపర్ హిట్టిచ్చింది పల్నాడు కథేగా.  పల్నాడు కథలకి సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువని ఫీల్డులో సెంటిమెంటు, మీకు తెలీనిదేముంది. అంతేగాక ఇది కొత్త పాయింటు సార్. ఇంతవరకూ ఎవరూ టచ్ చెయ్యని పాయింటు”

“నిజఁవే, నిజఁవే. సెంటిమెంటుని గౌరవించాల్సిందే. అట్నే గానీ మరి. ఏందా కొత్త పాయింటు?”

“ఫస్టాఫంతా పిడుగురాళ్ల బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది సార్. హీరో సున్నం బట్టీ ఓనర్ అన్నమాట”

“అద్దిరబన్నా! సున్నం బట్టీ. వెరైటీ పాయింటే. సారా బట్టీ కతలొచ్చినైగానీ సున్నం బట్టీ కతల్రాలా. చెప్పు, చెప్పు. తర్వాతేంది?”

“హీరో బట్టీకి ఎదురుగా హీరోయిన్ మరో సున్నం బట్టీ నడుపుతుంది. వీళ్లిద్దరి కాంపిటీషన్‌తో ఫస్టాఫంతా ఫుల్లు కామెడీయే కామెడీ. ఫస్టాఫ్‌లోనే ‘సున్నబ్బట్టీ సుబ్బమ్మో’ పల్లవితో సాగే టీజింగ్ సాంగ్ కూడా వెయ్యొచ్చు. మన మ్యూజిక్ డైరక్టర్ ధమని తో బీట్స్ కుమ్మించేస్తే చాలు”

“బాగుందోయ్, చాలా బాగుంది. మరి హీరోయిన్‌గా ఎవుర్నెడదాం?”

“అనూహ్యని పెడదాం సార్. టోపీచంద్‌తో ఆ అమ్మాయిది లక్కీ పెయిర్ అని ఆల్రెడీ పేరొచ్చింది కదా. ఆ సెంటిమెంటు మన సినిమాకి పనికొస్తుంది”

“ఆ దెయ్యాల సినిమా హిట్టైన కాడ్నించీ అనూహ్య కొండెక్కి కూర్సుందయ్యా. రేటు తెగ పెంచేసింది. పైగా ఈ మద్దెన భుజబలి, దేవీ రౌద్రమ్మ లాంటి కత్తి యుద్ధాల బొమ్మలే తప్ప మనసుంటి తుపాకులు, బాంబుల సినిమాలొప్పొకోటంలా. అంచాత వేరే ఎవుర్నన్నా ఎడదాం. బాలీవుడ్ హీరోయినైతే బాగుంటదేఁవో? ఆ మద్దెన హ్రీం క్రాంతి హ్రీంలో చేసిందే పొడుక్కాళ్ల పిల్ల. పేరేంది?”

ఆ ఎట్టుకో ఎట్టుకో. బాలీవుడ్డోళ్లైతేగానీ నీ మాడు పగలగొట్టరు. గోపికా బబ్బొనే?”

“ఆఁ. బబ్బొనే. ఆ పిల్లైతే టోపీచంద్ పక్కన పొడుగ్గా సరిపోద్ది. సినిమా హిందీ డబ్బింగ్‌కీ గిరాకీ ఉంటది”

“నిజమే సార్. గోపికా బబ్బొనే గుడ్ ఛాయిస్. ఆమెనే పెడదాం. అనూహ్య లాగే బబ్బొనే కూడా కన్నడమ్మాయే. సెంటిమెంటల్‌గా వర్కౌటవుద్ది”

“ఇంతకీ సినిమా పేరేంది? పేర్ల విషయంలో హీరోగారి సెంటిమెంట్ తెల్సుగా? తేడా వస్తే టోపీబాబొప్పుకోడు”

“అయ్యో అది తెలీకపోటమేంటి సార్. అన్నీ ఆలోచించే పేరు పెట్టా. టోపీబాబుకి నచ్చకపోయే ఛాన్సే లేదు”

“ఏందది?”

“సున్నం”

“ఓర్నీ పాసు గూల! బలే పేరెట్టావ్. కతకి సూటయ్యే పేరు. చివరాకర్లో సున్న కూడా వచ్చింది. సెంటిమెంటుగా టోపీబాబు కాతాలో ఇంకో హిట్టు పడాల. కాయంగా వంద రోజుల పిక్చర్”

“పేరు చివర్లోనే కాదు, మొదట్లో కూడా సున్న వచ్చింది సార్. డబుల్ సెంటిమెంట్. వెరీ పవర్‌ఫుల్ అండ్ యాప్ట్ టైటిల్ కూడా”

“అవునయ్యోయ్. నే గమనించలా. వంద కాదు, రెండొందల్రోజులేస్కో”

నాలుగొందలేస్కో. నాదేం పోయింది. అవున్సార్. సూపర్ డూపర్ హిట్ ఖాయం. మిగతా కథ చెప్పమంటారా?”

“పేరు చెప్పావ్, కడుపు నిండిపోయింది. కత అదిరిపోద్దని నమ్మకముందిలే. ఇదే కాయం జేద్దాం”

“థ్యాంక్యూ సార్. రైటర్ మీద అంత నమ్మకముండే నిర్మాత దొరక్…”

“ఆపవయ్యా. సొల్లు కబుర్లెందుగ్గానీ, టోపీబాబుకీ మద్దెన గ్రాఫిక్స్ మీద గాలి మళ్లింది. మన సినిమాలో మంచి గ్రాఫిక్స్ ఛేజింగ్ సీనో మరోటో పెట్టాల. దాన్సంగతాలోచించు కాస్త”

“ఆల్రెడీ ఆలోచించా సార్. సున్నం బట్టీలు సెట్టేపించే బదులు గ్రాఫిక్స్‌లో చేస్తే లావిష్‌గా ఉంటుంది సార్. తెలుగు సినిమాల్లోనే కాదు, ఇండియన్ సినిమాల్లోనే ఇప్పటిదాకా ఎవరూ చూపించని రేంజిలో చూపించాలి సున్నం బట్టీల్ని. క్లైమాక్స్‌లో హీరో ఒక్కో బట్టీనీ పేల్చెయ్యటం కూడా గ్రాఫిక్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్రేక్ తర్వాతొచ్చే ఎడ్లబండ్ల ఛేజ్ కూడా గ్రాఫిక్స్ చేద్దాం సార్”

“తప్పకండా చేద్దాం. రస్సెల్ స్పారో సినిమా ‘రేడియేటర్‌’లో కొలీజియం రేంజిలో ఉండాల మన హీరో సున్నం బట్టీ. గుర్తెట్టుకో”

హుఁ. కొలీజియం అంత పెద్ద సున్నం బట్టీనా! చూసినోళ్లు నోటితో నవ్వరు. అలాగలాగే సార్. గుర్తుంచుకుంటా. కొలీజియానికి డబుల్ సైజులో చేయిద్దాం హీరో బట్టీని”

“అట్టాగే, 800 లోనించి కొన్ని సీన్లెత్తి పెట్టాల. టోపీబాబు ఎనిమిదొందల మంది ఫ్యాక్సనిస్టుల్ని ఒక్కడే ఇరగదీసినట్టు తియ్యాల. ఇదీ మర్సిపోమాక”

తొక్కలో సెంటిమెంట్లకి తోడు హాలీవుడ్ నాలెడ్జొకటి. ఐడియా బాగుంది కానీ సార్, ఈ సీన్ ఆల్రెడీ మృగవీరలో వాడేసుకున్నారు”

“అట్టనా! ఐతే దానికి బదులు .. 800లో హీరో రౌడీల్ని నూతిలోకి నెట్టే సీనుంది. మన హీరో రౌడీల్ని సున్నం బట్టీలోకి నెట్టినట్టు ఎడదాం”

“సూపర్ ఐడియా సార్. అసలు మన సినిమా ప్రమోషన్‌లో కూడా ఈ సీన్ గురించే అదరగొడదాం. ‘మేకింగ్ ఆఫ్ సున్నం’ అని రిలీజుకి రెండు నెలల ముందు నుండే అన్ని ఛానళ్లలో వాయిద్దాం”

“ఏందేందీ! సున్నం ఎట్టా తయారు చేస్తారనేదాని మీద అడ్వర్టయిజుమెంటా!?!”

నీ మొహం. నో, నో. అది కాదు. కొత్తగా, సినిమా షూటింగ్‌ ఎలా చేస్తారనేదాని గురించి ప్రమోషన్ వీడియోలు తీసే సెంటిమెంటొచ్చింది కదా. మనమూ ఆ పని చేద్దామంటున్నా”

“సరే సరే. అట్టనే కానిద్దాంలే. చెప్పటం మర్సిపోయా. హీరో డైలాగులు మాత్రం పవర్‌ఫుల్‌గా ఉండాల. గుర్తుందిగా?”

“గుర్తు లేకేం సార్. అలాంటిలాంటి పవర్ కాదు. సూపర్ పవర్ డైలాగుల్రాశా హీరోగారి కోసం. హీరో పదే పదే వాడే పంచ్ డైలాక్కి థియేటర్లో చప్పట్లూ, ఈలలూ మోగాల్సిందే”

“ముందదేందో చెప్పవో. మోగేదీ లేందీ నే చెప్తా”

“అన్న ప్రాసన్నాడే సున్నం తిన్నోడ్నిబే. నాతో పెట్టుకోక. ఎత్తి కొట్టానంటే బట్టీ బద్దలౌద్ది నా కొ**”

“వార్నీ! అదిరింది రైట్రూ. ప్రాస మోత మోగింది. చప్పట్లూ మోగుతై. మిగతా డైలాగులూ ఇంత పవర్‌ఫుల్లుగా ఉండాల. టోపీబాబెంత కసిగా పళ్లు పటా పటా కొరకతా డైలాగులు చెబుతాడో తెల్సుగా. దానికి తగ్గట్టుండాల”

“అయ్యో ఆ సంగతెలా మర్చిపోతా సార్? టోపీబాబు డైలాగులెలా ఉండాలో నాకు తెలీదా? అసలు టోపీబాబు ఇంట్రడక్షన్ డైలాగు వింటే మీరు అదిరిపోతారు”

“చెప్పు మరి”

“తన సున్నం బట్టీలో పనిచేసే కూలమ్మాయి చెయ్యి పట్టుకు లాగిన ఆకు రౌడీతో హీరో ఆవేశంగా చెప్పే డైలాగ్ సార్ ఇది”

“ఏది?”

“రేయ్ నా కొ**, ఆగరా నా కొ**, చెయ్యి తియ్‌రా నా కొ**, ఆమెకెవరూ లేరనుకున్నావా నా కొ**? నేనున్నాన్రా నా కొ**. పిడికిలి బిగించి నా కొ**. ఒక్కటిచ్చానంటే నా కొ** .. యాక్, థూ. నాకే డోకొచ్చేట్లుంది. వీడికి మాత్రం నచ్చుతుంది. నో డౌట్

“సూపర్ రైట్రూ. ‘కక్కు’లో కవితేజ రెండొందల నాలుగు సార్లు దొ**ది, నూట పదహారు సార్లు నా కొ** అంటే ఆ సినిమా సూపర్ హిట్టయింది. ఆ లెక్కన సెంటిమెంటుగా మన సినిమా కూడా అంత పెద్ద హిట్టవ్వాల”

“అంతకన్నా పెద్ద హిట్టే అవుతుంది సార్. ఇందులో నాలుగొందల ఇరవై మూడు నా కొ**లున్నాయి. కావాలంటే ఇంకో పాతిక కలుపుతా”

“కలిపేస్కో. అదే చేత్తో హీరోయిన్‌కి కూడా మాంఛి మాస్ డైలాగులేస్కో. హీరోయిన్లు హీరోల్ని బండ బూతులు తిడతంటే ప్రేక్షకులు పడీ పడీ నవ్వుతా చూస్తన్నారీ మద్దెన. ఆడియెన్సుకేం నచ్చుతదో అదే ఇవ్వాల మనం. ఆ సెంటిమెంట్ మర్సిపోమాక”

“అలాగే సార్. తప్పకుండా. సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు స్లమ్ముల్లో ఓ రౌండేసి కొత్త తిట్లు నేర్చుకెళతా. మన సినిమాలో హీరోయిన్‌ది సున్నం బట్టీ ఓనర్ పాత్ర కాబట్టి వీర మాస్ బూతులు తిట్టించే స్కోపుంది. సెన్సారు అడ్డు పెట్టినా సహజత్వం పేరు చెప్పి ఒప్పించొచ్చు”

“అద్దీ. రైట్రంటే అట్టాగుండాల. ఇంకోటీ గుర్తుంచుకో. సెంటిమెంటుగా టోపీబాబు సినిమాకి వందమందినన్నా నరక్కపోతే ఆ సినిమా ఆడదు. మొన్న ‘శంభం’లో ఒకడ్ని తక్కువ నరికాడు, ఆ సినిమా జంపు. ఈ సారా పొరపాటు జరక్కూడదు. ఏం?”

“తప్పకుండా సార్. ఈ సారా పొరపాటు జరగదు”

“ఓకే మరి. వెళ్లి స్క్రిప్టు రాసి పట్రాపో. వచ్చే వారానికల్లా రడీ కావాల. టకటకలాడించు”

టకటకలాడించటానికి నేను టైపు రైటర్ని కాదురా, స్టోరీ రైటర్ని. వచ్చే వారమే అంటే కష్టం సార్. టూ ఎర్లీ ..”

“అట్టా కాదుకానీ, ఎట్టాగోలా కష్టపడు. పై వారం మా కుక్క పిల్ల పుట్టిన్రోజు. సెంటిమెంటుగా కొత్త సినిమాలన్నిటికీ ఆ రోజే కొబ్బరికాయ కొడతా”

“ఐతే సరే సార్. తప్పకుండా.. వెళ్లొస్తా సార్, ఉంటానిక…. మళ్లీ కలుస్తా సార్.. వచ్చే వారం కలుద్దాం సార్….. ఉంటా సార్”

“అలాగలాగే. వెళ్లవయ్యా మరి”

“మరి.. నా రెమ్యునరేషన్ .. అడ్వాన్స్ ఎంతో కొంత కొట్టిస్తే ..”

“బలేవోడివే. నా సంగత్తెలుసుగా. సినిమా రిలీజైనాకే టోటల్ అమౌంటిచ్చేది. ఏం చేస్తాం, సెంటిమెంటూ ..”

@#%$ # #@&^**#$

 

 

21 స్పందనలు to “మేకింగ్ ఆఫ్ సున్నం”


 1. 1 Malakpet Rowdy 3:06 సా. వద్ద అక్టోబర్ 1, 2009

  LOL .. hehehhehehe …. “Annaprasnanaade sunnam tinnonniraa” :))

  and also MRUGAVEERA :))

  కవితేజ రెండొందల నాలుగు సార్లు దొ**ది
  ____________________________

  Are you from Krishna district by any chance? Thats a casual word in a district like, say Vizag but a very offensive word in Krishna

 2. 2 kiran 4:27 సా. వద్ద అక్టోబర్ 1, 2009

  your satire is too good. you have really great sense of humor. kudos to you 🙂 🙂

 3. 3 నేస్తం 10:09 సా. వద్ద అక్టోబర్ 1, 2009

  నన్నోసారి శ్రీ ఏసుక్రీస్తుడు రోజులకి తీసుకు వెళ్ళిపోయారు ..మొన్నామద్య ఖాళీ దొరికి మీ పాత పోస్ట్లన్నీ ఒక 2 గంటలు చదివాను..నాతో వచ్చిన చిక్కేంటంటే నేను చదివిన మంచి పోస్ట్ లు ఇంకో 10 మందికి చెప్తే కాని పూర్తిగా ఆనందపడలేను. ఇప్పుడందరూ బిజీ గానే ఉన్నారు (మా ఆయనతో సహా) మీరింత మంచి మంచి పోస్ట్ లు వేస్తుంటే ఎలా అండి బాబు నా ఆనందం షేర్ చేసుకోవడం . బాగా రాసారు 🙂

 4. 4 Sri Krishna 10:30 సా. వద్ద అక్టోబర్ 1, 2009

  గోపికా బబ్బొనే… 😀 😀 😀

 5. 5 Sri Krishna 10:31 సా. వద్ద అక్టోబర్ 1, 2009

  జనానికి ’టోపీ’చంద్

  గీతాచార్య.

 6. 7 వేణూ శ్రీకాంత్ 12:22 ఉద. వద్ద అక్టోబర్ 2, 2009

  హ హ సున్నం సంగతేమో కానీ… మేకింగ్ ఆఫ్ సున్నం మాత్రం సూపర్ హిట్ మూడొందల అరవైఐదురోజులు 🙂

 7. 8 చదువరి 1:29 ఉద. వద్ద అక్టోబర్ 2, 2009

  పాపం, టోపీచందు కొత్త సినిమా చూసినట్టున్నారు. పోన్లెండి, చూస్తే చూసార్లే.. మాంఛి సర్దాటపా ఒకటొచ్చింది.

 8. 9 Sujata 1:40 ఉద. వద్ద అక్టోబర్ 2, 2009

  మృగవీర హిట్ కావడానికి సినిమా హాల్లో చచ్చిపోయిన అభిమానులు కారణం. ఆ తరవాత టీ.వీ. లో చర్చలూ, నిషేధాలూ – హైపులూ – అవన్నీ ! బాబ్బాబూ – ఈ సారి టోపీచంద్, బబ్బోనే ల తో పాటూ టీవీ తెరల్ని చించేస్తున్న స్టారు డైరెక్టర్లనూ, స్టారు డైరెక్టరు గారి స్టారు టైలరమ్మలను గురించి కూడా రాయండి. అదేంటో, దివి నుంచీ భువి కి దిగొచ్చీసినట్టు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. చాలా బావుంది మీ సున్నం సినిమా టపా !

 9. 11 Sharma (maverick6chandu.wordpress.com) 2:51 ఉద. వద్ద అక్టోబర్ 2, 2009

  Too hilarious. Nice one.

  It reminds me of scene in Neninthe movie… Venumadhav narrating story to the hero.

  Enaange… enaange… 😀 😀 Ha ha ha…

  Thanks for posting good post.

  Sharma

 10. 12 సుజాత 3:59 ఉద. వద్ద అక్టోబర్ 2, 2009

  రస్సెల్ స్పారో సినిమా ’రేడియేటర్‌’లో కొలీజియం రేంజిలో …….:-)

  ఇంతకీ బానర్ పేరేంటి? ది పల్వరైజింగ్ మూవీ మేకర్స్…ఎలా వుంది?

 11. 13 కన్నగాడు 5:07 ఉద. వద్ద అక్టోబర్ 2, 2009

  శంఖం బాగా ఇబ్బంది పెట్టినట్టుంది, పర్లేదు మాకో మంచి టపా వచ్చింది….
  రచయిత మాటలు గ్రే కలర్లో రాయడం బాగుంది.

 12. 14 Sri Krishna 6:51 ఉద. వద్ద అక్టోబర్ 2, 2009

  We are anticipating a post on భీమ్ భరణ్ కూజా! Fans waiting అండీ…

  గీతాచార్య

 13. 15 a2zdreams 7:28 ఉద. వద్ద అక్టోబర్ 2, 2009

  సరదాగా ఒక కామెంట్: ఎవరైనా హార్ట్ అయితే డిలిట్ చేసేయండి.
  —————————————————————————
  ఘంఖం మాస్ కు నచ్చే సినిమా. నా సినిమాలను గ్లాస్ నా కొ** లంతా ఎలాను థియేటర్ కు వచ్చి చూసేది లేదు అని మాస్ ను ఎంచుకొని వుంటాడు టోపీచంద్.

 14. 16 అబ్రకదబ్ర 9:38 ఉద. వద్ద అక్టోబర్ 2, 2009

  @మలక్:

  కృష్ణకి అటు కాదు, ఇటే నాది. చెన్నకేశవుడి తాలూకా, బ్రహ్మనాయుడి ఇలాకా.

  @కిరణ్,నేస్తం,గీతాచార్య,చైతన్య,వేణూశ్రీకాంత్,sujata,బృహస్పతి,శర్మ:

  ధన్యవాదాలు.

  @సుజాత:

  బ్యానర్ బాగుంది. డవిరెక్టర్ ఎవరో కూడా చెప్పండి.

  @చదువరి,కన్నగాడు:

  నేనింకా శంఖం చూడలేదు 🙂

  @a2z:

  నిజానికి, గోపీచంద్ నా అభిమాన నటుడు. నవతరం తెలుగు హీరోల్లో నటనా ప్రతిభ ఉన్న నలుగురిలో అతనొకడని నా అభిప్రాయం (మిగతా ముగ్గురు: శర్వానంద్, జూ. ఎన్టీయార్, అల్లు అర్జున్). సిద్దార్ధ కూడా ఉన్నాడు కానీ, అతను తమిళుడు కాబట్టి ఈ లిస్టులోకి రాడు. గోపీచంద్ సినిమాల్లో రక్తపాతం, ఆ పిచ్చి డైలాగులు మాత్రం నచ్చవు. అతని సినిమాలు సాధారణంగా నాకు నచ్చుతాయి. అయితే – అభిమానం అభిమానమే, సెటైర్ సెటైరే. దేన్దోవ దాన్దే 🙂

 15. 17 nelabaludu 9:54 ఉద. వద్ద అక్టోబర్ 3, 2009

  మేకింగ్ ఒఫ్ సున్నం కలెక్షన్స్ సౄష్టించడం ఖాయం 😉 అదరగొట్టారు.. 😉 😉

 16. 18 కన్నగాడు 1:33 సా. వద్ద అక్టోబర్ 3, 2009

  అల్లు అర్జునా? నాకంతగా నచ్చడు కాని మిగతా ముగ్గురు మాత్రం బాగా నటిస్తారు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: