బోఫా

అవకాశం కోసం ఆశగా ఎదురు చూసేవాళ్లే అందరూ. అందొచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకునేవాళ్లు కొందరే. అంతులేని విషాదంలోంచీ అవకాశం సృష్టించుకునేవాళ్లు, అగాధపు లోతుల్లోంచీ అమృతం పుట్టించేవాళ్లు మాత్రం – నూటికో కోటికో ఒక్కరు.

* * * *

1906 ఏప్రిల్ 18, ఉదయం 5:12 గంటలు: నాలుగు లక్షల మంది శాన్ ఫ్రాన్సిస్కో నగరవాసులింకా నిద్రలేవలేదు. అప్పుడు – ముందస్తు సూచనల్లేకుండా విరుచుకుపడిందా మహోత్పాతం. 7.8 పాయింట్ల భారీ భూకంపం. నిమిషాల్లో కూలిపోయిన బహుళంతస్తుల భవనాలు, పగిలిన గ్యాస్ లైన్లు పేలి ఊరంతా అంటుకున్న మంటలు. ఒకటొకటిగా ఒరిగిపోతున్న మేడలు, ఆర్తిగా వాటిని కబళిస్తున్న అగ్ని కీలలు. అంతటా హాహాకారాలు. వీటికి తోడు, ఒకదాని వెనుక ఒకటిగా ఆఫ్టర్ షాక్స్. అప్పట్నుండి వరసగా నాలుగు పగళ్లూ నాలుగు రాత్రులూ ఎడతెరిపి లేకుండా స్వైరవిహారం చేసిన అగ్నిదేవుడు. కుప్పకూలిన పాతికవేల పైచిలుకు భవనాలు. నిరాశ్రయులైన మూడు లక్షలమంది జనం. మూడు వేల మంది అభాగ్యుల మృత్యువాత.

ప్రకృతి కళ్లెర్రజేస్తే ఎంతటి మహానగరాన్నైనా చిటికెలో నేలమట్టం చెయ్యగలదనేదానికి దృష్టాంతంగా మిగిలిన ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్ల మహా విషాదం అది.

ప్రతిభావంతుడు పెను విపత్తులనీ అవకాశాలుగా మార్చుకోగలడు, భావి విజయాలకి పునాదిరాళ్లుగా మలచుకోగలడని నిరూపించిన విశిష్ట సందర్భమూ అదే.

* * * *

1906 ఏప్రిల్ 18, మధ్యాహ్నం 12:30 గంటలు: భూకంపం వచ్చిన ఏడు గంటల తర్వాత. శాన్ ఫ్రాన్సిస్కో నగరమధ్యంలో వాణిజ్య భవనాలు, బ్యాంకులు కొలువుదీరి ఉండే వీధి. అవన్నీ మంటలకాహుతవుతున్నాయి. ఆ మంటల మధ్యగా, వీధిలో చెల్లాచెదురుగా పడున్న భవన శకలాలు, శిధిలాలని తప్పించుకుంటూ దూసుకుపోతుందా గుర్రబ్బండి – నారిజ పండ్లు కుప్పగా పోసిన బగ్గీనొకదాన్ని లాక్కుంటూ. ఆ పండ్ల కింద బంగారమూ, డబ్బు కట్టలూ దాగున్నాయని తెలిసినవాడొక్కడే. అతడు – ఆ బండి నడుపుతున్న ముప్పై నాలుగేళ్ల అమెడియో జియానిని. రెండేళ్ల క్రితమే శాన్ ఫ్రాన్సిస్కోలో బడుగు ఇటాలియన్ వలసదారులకు రుణాలివ్వటంకోసం ఏర్పాటు చెయ్యబడ్డ బ్యాంక్ ఆఫ్ ఇటలీ అనబడే బుల్లి బ్యాంక్ యజమాని అతను. అగ్ని కీలల ధాటికి మిగతా బ్యాంకులన్నీ మూసేయగా అతడు మాత్రం ప్రాణాలకు తెగించి తన బ్యాంకులోని సొమ్మంతా గుర్రబ్బండిలో నగరం వెలుపలున్న తన ఇంటికి తరలిస్తున్నాడు. 

* * * *

1906 ఏప్రిల్ 27: ఘోర కలి జరిగిన ఏడు రోజుల తర్వాత. అప్పుడప్పుడే మంటలు  అదుపులోకొస్తున్నాయి. ఎక్కడ చూసినా శిధిల భవనాలు, చితికిన బతుకులు. మూత పడ్డ మహా మహా బ్యాంకులు. ఎవరిదగ్గరా డబ్బు లేక స్థంభించిన వ్యాపారాలు. వీటన్నిటి మధ్యా వినవచ్చిన ఓ వార్త – ఆశావహుల్ని అటువైపుకి పరుగులు పెట్టించింది. అక్కడ – రెండు సారా పీపాలపై అడ్డంగా పేర్చిన చెక్కముక్కలు, వాటిపై కుప్పగా పోసిన నగదు, బంగారం. దాని వెనక – చేతిలో చిన్న పద్దు పుస్తకంతో అమెడియో జియానిని. రహదారి మీదనే అతనేర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇటలీ తాత్కాలిక కార్యాలయం అది. అడిగిన వారికి లేదనకుండా అప్పులిస్తున్నాడతను. వాళ్లలో అతనెప్పుడూ చూసి ఎరగని వారే అధికం. అయినా ఆలోచించకుండా ఇచ్చేస్తున్నాడు. తిరిగి ఇస్తారా లేదా అని చూడటం లేదు. ఎక్కువ మందికి అవసరమయింది చిన్న మొత్తాలే. అప్పు తీసుకున్న అందరికీ కరచాలనం చేసి ఒకే మాట చెబుతున్నాడు, ‘మనం మళ్లీ నిర్మించగలం’. ఆ చిన్న మాటతో, ఓ చిన్నపాటి సాయంతో, కొండంత నమ్మకంతో – శిధిల శాన్ ఫ్రాన్సిస్కోని పునర్‌నిర్మించే మహాయజ్ఞంలో చిరు సమిధవ్వటమే కాకుండా – ఏకంగా ఓ బ్యాంకింగ్ సామ్రాజ్యాన్నే నిర్మించాడతను.

* * * *

1906 నాటి భూకంపంలో శిధిలమైపోయిన శాన్ ఫ్రాన్సిస్కో అనతి కాలంలోనే ఫీనిక్స్ పక్షిలా చితినుండి లేచి తిరిగి అమెరికా వాణిజ్యాన్ని శాసించే నగరాల జాబితాలో చేరింది. అదే సమయంలో ఆనోటా ఈనోటా పడి, ముక్కూ మొహం తెలీనివారికి సైతం అవసరంలో అప్పులిచ్చి ఆదుకున్న అమెడియో జియానిని పేరు క్యాలిఫోర్నియా అంతటా మార్మోగిపోయింది. మదుపుదారుల్లోనూ పెట్టుబడిదారుల్లోనూ అతని బ్యాంక్ ఆఫ్ ఇటలీ పై నమ్మకం, గౌరవం ఆ ఒక్క సంఘటనతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. దాంతో జియానినీకి వద్దన్నా వ్యాపారం. బ్యాంక్ ఆఫ్ ఇటలీ ముందు క్యూ కట్టిన కస్టమర్లు. కొన్నేళ్లలోనే – శాన్ ఫ్రాన్సిస్కోకి పరిమితమైన ఈ చిన్న బ్యాంక్ ఇంతింతై క్యాలిఫోర్నియా అంతటా విస్తరించింది. ముందు చూపు, సాహసోపేతమైన నిర్ణయాలు, వ్యక్తులపై నమ్మకం పెట్టుబడిగా జియానినీ ఇతర చిన్నా పెద్దా బ్యాంకులని కొనుగోలు చేస్తూ అమెరికా అంతటా తన బ్యాంక్ కార్యకలాపాలు విస్తరించుకుంటూపోయాడు. ఆ క్రమంలో, 1928లో న్యూయార్క్ స్థానిక బ్యాంక్ ఆఫ్ అమెరికాని కొనుగోలు చేసి తన బ్యాంకులన్నిట్నీ ఆ పేరు ఛత్రం కిందికి తీసుకురావటంతో బ్యాంకింగ్ రంగంలో ఓ దిగ్గజం ఉద్భవించింది. జియానినీ నేతృత్వంలో కొద్ది కాలంలోనే బ్యాంక్ ఆఫ్ అమెరికా దేశంలో అతి పెద్ద బ్యాంకుగా అవతరించింది. తర్వాత కాలంలో జియానినీ బీమా సేవల రంగంలోకీ ప్రవేశించి ట్రాన్స్అమెరికా కార్పొరేషన్ నెలకొల్పాడు.

బ్యాంకింగ్ పద్ధతుల్లో జియానినీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక మార్పులెన్నో. ‘డబ్బు అవసరంలేని వాడికే అప్పివ్వు’ అన్నది అప్పట్లో బ్యాంకింగ్ మూలసూత్రం. అలా చేస్తేనే అప్పులు భద్రంగా వసూలౌతాయన్న గుడ్డి నమ్మకం దానిక్కారణం. జియానినీ దాన్ని సమూలంగా మార్చేశాడు. అవసరంలో ఉన్న మధ్య, దిగువ తరగతి వారికి అప్పులివ్వటం ద్వారా అప్పటిదాకా పెద్ద బ్యాంకులు నిర్లక్ష్యం చేసిన అతి పెద్ద వర్గాన్ని తన కస్టమర్లుగా మార్చుకోటం అతని వ్యాపార దక్షతకి నిదర్శనం. ఎక్కడికక్కడ కమ్యూనిటీ కార్యక్రమాలపై దృష్టి సారించి దేశాభివృద్ధికి తోడ్పడే పనులెన్నిటికో తోడ్పాటందించటం, తద్వారా తన బ్యాంక్ బ్రాండ్ విలువ పెంచుకోటమూ అతని తెలివికి తార్కాణమే. క్యాలిఫోర్నియాలో సినీ పరిశ్రమ, ద్రాక్ష తోటల అభివృద్ధి నుండి శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నిర్మాణం దాకా ఓ దశలో అమెరికాని రూపుదిద్దిన మహా ప్రాజెక్టులన్నీ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఊతంతోనే సాగాయి. పందొమ్మిది వందల ముప్పయిల్లో అమెరికాని మహామాంద్యం ఆవరించినప్పుడు, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధానంతరం ఆర్ధిక రంగాన్ని గాడిన పడేయటానికి ఈ బ్యాంక్ చేసిన సేవలు అపారం.

మధ్యతరగతివారికి వాయిదాలవారీగా చెల్లించేలా ఇళ్ల రుణాలివ్వటం జియానినీ ప్రవేశ పెట్టిన పద్ధతే. ఇప్పుడు మోర్ట్‌గేజ్ లోన్లివ్వని బ్యాంకు ప్రపంచంలో లేదు, కానీ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆ తరహా అప్పులివ్వటం మొదలెట్టిన కొత్తలో నోళ్లు తెరిచిన వాణిజ్య ఘనాపాటీలు, ఆర్ధిక నిపుణులు ఎందరో.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ‘వీసా’ క్రెడిట్ కార్డ్ సర్వీస్ కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికా సృష్టే. 1958లో కేవలం తమ కస్టమర్లకోసం బ్యాంక్ అమెరికార్డ్ పేరుతో మొదలు పెట్టిన ఈ సేవ విజయవంతమై, క్రమంగా దేశ విదేశాల్లో ఇతర బ్యాంకుల కస్టమర్లకీ ఇదే సేవని విస్తరించటానికి దారితీసింది. 1975లో ఆ తరహా సేవని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన VISA (Visa International Service Association) కంపెనీకి బదిలీ చెయ్యటం జరిగింది.

వందేళ్ల క్రితం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే సత్సంకల్పంతో ఒక వ్యక్తి చేసిన సాహసం నేడు ప్రపంచంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా మన కళ్లముందు నిలిచింది. నమ్మకాన్ని పునాదుల్లో కలుపుకున్న ఏ వ్యాపారానికీ తిరుగుండదనేదానికి సజీవ సాక్ష్యం – బ్యాంక్ ఆఫ్ అమెరికా, a.k.a. BofA.

* * * *

2009 శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచంలో తరచూ భూకంపాలు సంభవించే కొద్ది ప్రదేశాల్లో ఈ నగరం ఒకటి. నూట మూడేళ్ల నాటి భూకంప శిధిలాల మీదనే మరింత ఎత్తుగా లేచిన నలభై, యాభై అంతస్తుల ఆకాశ హర్మ్యాలతో సగర్వంగా నిలబడి ఉందీ మహానగరమిప్పుడు. వాటి మధ్యగా శిఖరాల్లా కొట్టొచ్చినట్లు కనబడే రెండు ఎత్తైన భవనాలు – ట్రాన్స్అమెరికా పిరమిడ్, మరియు బ్యాంక్ ఆఫ్ అమెరికా బిల్డింగ్ – జియానినీ సృష్టించిన రెండు వ్యాపార సామ్రాజ్యాల కొండ గుర్తులు. ‘నేలమట్టం చెయ్యటానికి నీకు క్షణ కాలమే పట్టొచ్చుగాక. అయినా శక్తినంతా కూడదీసుకుని తిరిగి పైకి లేస్తాం, ఠీవిగా ఇక్కడే నిలబడతాం’ – ఇది, సవాలు విసిరే ప్రకృతికి మనిషి తరపున అవి మౌనంగా ఇస్తున్న బదులు.

7 స్పందనలు to “బోఫా”


 1. 1 Phani 3:03 సా. వద్ద మే 29, 2009

  బాగా చెప్పారు, కానీ బాంక్ ఆఫ్ ఆమెరికా పరిస్థితి సరిగా లేదు ఇప్పుడు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం ?

 2. 2 అబ్రకదబ్ర 3:09 సా. వద్ద మే 29, 2009

  మొన్నటి క్రెడిట్ క్రైసిస్ నుండి నిక్షేపంగా బయట పడ్డ పెద్ద బ్యాంక్ ఇదొక్కటే. కాకపోతే మెరిల్ లించ్ కొనుగోలు కొంత కుంగదీసిన మాట నిజం. ఇప్పటికైతే, సిటీ బ్యాంక్ కన్నా బ్యాంక్ ఆఫ్ అమెరికా పరిస్థితి మెరుగ్గా ఉంది. వెల్స్ ఫార్గో కూడా బాగానే ఉంది.

 3. 3 cbrao 8:36 సా. వద్ద మే 29, 2009

  బ్యాంక్ ఆఫ్ అమెరికా చరిత్రను ఒక చక్కని కథగా చెప్పిన తీరు బాగుంది. ట్రాన్స్అమెరికా పిరమిడ్ ను , 1999 లో డచ్ భీమా సంస్థ ఐన AEGON, బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి కొన్నది. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో తలమానికమైన ఈ అందమైన భవంతి ఇప్పుడు ఒక Insurance company అధీనంలో ఉంది.

 4. 4 శివ బండారు 2:57 ఉద. వద్ద మే 30, 2009

  BOA విజయగాధ బాగా వర్ణించారు . ఇండియన్ బాంకులు ఇప్పటికీ అప్పు వసర్మ్ లేనివారికే అప్పు ఇచ్చే సూత్రాన్ని బాగా అనుచరిస్తున్నాయి.

 5. 5 a2zdreams 10:00 సా. వద్ద మే 30, 2009

  “అవకాశం” గురించి మీరు చెప్పిన మొదటి పేరా చాలా బాగుంది.

 6. 6 కె.మహేష్ కుమార్ 10:37 సా. వద్ద మే 30, 2009

  బాగుంది. మీరు చెప్పిన తీరు బహుబాగుంది.

 7. 7 rayraj 1:54 ఉద. వద్ద జూన్ 3, 2009

  నాకు ఈ పోస్టు చాలా చాలా నచ్చింది.బాగా రాశారు.

  ఇంతే నమ్మకంతో అప్పులివ్వమని చెప్పిన మరో ఘనుడు :
  http://en.wikipedia.org/wiki/Muhammad_Yunus

  బ్యాంకులు రుణాలివ్వటానికే జంకుతుంటే,చాలా కృషి చేసి ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. దాన్నే ఈ రోజు మైక్రో ఫైనాన్స్ అంటున్నారు.

  తేడా అల్ల – బహుశా – అప్పడు ఆలోచన చేసింది: “అవకాశంగా పరిస్థితిని మార్చుకున్న ఓ ఎంటర్ ప్రెన్యూర్”; రెండో సందర్భంలో -“కటిక దరిద్ర్యాన్ని అనుభవిస్తున్న పేదజనాలకి ఓ పరిష్కార మార్గం వెదికిన ఓ ఫ్రొపెసర్”


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: