తెలుగోడు

తెలుగోడు జూలు విదిల్చాడు. ఐదేళ్లకోసారి మాత్రమే చేతికందే విచ్చుకత్తితో ఎన్నికల రణరంగాన వీరవిహారమే చేశాడు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో దశాబ్దంగా పబ్బం గడుపుకుంటున్న వేర్పాటువాదుల్ని పాతిక కిలోమీటర్ల లోతున బొందబెట్టి పాతరేశాడు. ఏ ఎండకా గొడుగు పట్టబోయిన ప్రతిపక్షానికి కొర్రు కాల్చి వాత పెట్టాడు. అభివృద్ధితోనే మళ్లీ అందలమెక్కామని అధికారపక్షం భుజాలు చరుచుకునే వీల్లేకుండా పద్నాలుగు మంది సచివులకి అధోగతి, సభాపతికి సైతం అదే గతి పట్టించాడు. అసెంబ్లీలో మందబలంతో పనులు చక్కబెట్టుకునే వెసులుబాటివ్వకుండా రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రధమంగా అత్తెసరు మెజారిటీతో పాలక పక్షాన్ని గట్టెక్కించాడు. వెండితెర వేల్పులు ఎక్కడుండాలో అక్కడుంటేనే ముద్దంటూ ముద్ద నోట్లోకొచ్చేలా నెత్తిమీద మొట్టి అక్షింతలేశాడు. రానున్నది హంగేనంటూ ఆవులించిన సర్వేరాయుళ్ల మెదళ్లు మొద్దుబారేలా నా రూటే సపరేటంటూ విలక్షణత ప్రదర్శించాడు.

(ఒడలు పులకరించేలా వార్తలు ప్రెజెంట్ చెయ్యటం మనకీ వచ్చని చాటేందుకే పై పేరా. ఇక మామూలుగా పోదాం)

ఎదురుచూసిన ఎన్నికల ఫలితాలొచ్చేశాయి. ఎవరికి తోచిన రీతిలో వారు భాష్యాలు చెప్పటాలు మొదలయ్యాయి. ఐదేళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధే గెలుపు మంత్రం అన్నోళ్లున్నారు. అవినీతి అసలు సమస్యే కాలేదన్నోళ్లున్నారు. ప్రతిపక్షానికి విశ్వసనీయత లేకనే ఈ వోటమి అన్నోళ్లున్నారు. దేవుడు చల్లగా చూసి ఐదేళ్లూ వర్షాలు పడటమే రాజశేఖరరెడ్డి చేసుకున్న పుణ్యమన్న భక్తులూ ఉన్నారు. ఇవన్నీ నిజాలే కావచ్చు. ఇవి మాత్రమే నిజాలు కాకనూ పోవచ్చు. ఆ మిగతావేంటో చూద్దాం.

చాలావరకూ చంద్రబాబు ఓటమి స్వయంకృతం. తెరాసతో పొత్తు పెట్టుకుని అన్ని స్థానాలొదులుకోకపోయుంటే తెదెపాకి మరో పాతిక స్థానాలన్నా అదనంగా వచ్చుండేవనటంలో సందేహం లేదు. గణాంకాలు చూడండి. తెలంగాణలో తెదెపా 59 చోట్ల పోటీ చేసి 39 గెలిచింది. భాగస్వాములకి 53 స్థానాలొదిలితే వాళ్లు గెలిచినవి పట్టుమని పదిహేను లేవు. వాటిలో తెదెపా తప్పకుండా గెలిచే స్థానాలూ ఉన్నాయన్నది గమనార్హం. 2004లో కేసీయార్‌తో గొడవ పెట్టుకుని, ఇప్పుడు పొత్తు పెట్టుకుని – రెండు సార్లూ బాబు చావుదెబ్బ తిన్నాడు. ఆ పాతిక సీట్ల తేడా అసెంబ్లీలో బలాబలాలని తారుమారు చేసేసింది. అదొక్కటే కాదు, తెదెపా వస్తే రాష్ట్రం చీలటం ఖాయం అన్న భయం రేకేత్తించి కోస్తా, రాయలసీమల్లో ఆ పార్టీ వోట్లకి భారీ గండి పెట్టేలా చేసింది కూడా ఈ అనవసర పొత్తులే. మహాకూటమి ఆర్భాటం, వై.ఎస్. జంకు గొంకు లేకుండా ‘హైదరాబాదులో విదేశీయులవుతారు’ అంటూ పేల్చిన తూటా కోస్తా, సీమల్లో చూపిన ప్రభావం తక్కువేమీ లేదు. బాబు మెడలు బలవంతంగా వంచి జై తెలంగాణ అనిపించిన తెదేపా థింక్‌ట్యాంక్ ఇప్పుడు ముఖమెక్కడ పెట్టుకుంటుందో?

ప్రరాపా, లోక్‌సత్తాలు తెదేపా వోట్లు చీల్చటం బాబుని దెబ్బమీద దెబ్బతీసిన మరో కారణం. ‘చిరంజీవి వల్ల కోస్తాలో ఓ వర్గం వోట్లు గంపగుత్తగా కాంగ్రెస్ నుండి ప్రరాపాకి బదిలీ అయ్యి ఆ వారా తెదేపాకి లాభం’ అంటూ అదే పనిగా ఊదరగొట్టిన పత్రికల ప్రచారంతో ఆ వర్గం ఆప్రమత్తమై తమ వోట్లని మరింత భద్రంగా కాంగ్రెస్‌కే వేసినట్లు కనిపిస్తుంది. దెబ్బతో – ప్రరాపా వల్ల కోస్తాలో చీలిందల్లా తెదేపా వోట్లే. తెదేపాని లోక్‌సత్తా తీసిన దెబ్బ కూడా కూడా తక్కువేమీ కాదు. లోక్‌సత్తా సానుభూతిపరుల్లో అత్యధికులు గతంలో తెదేపాకి ఓట్లేసినవాళ్లే. తక్కువ తేడాతో తెదేపా ఓడిన స్థానాల్లో లోక్‌సత్తా ప్రభావం తీసిపారేయలేం. ఒకటిన్నర శాతం కన్నా తక్కువ తేడాతో తెదేపా అనేక స్థానాల్లో ఓడటం, దాదాపు అదే శాతం వోట్లు లోక్‌సత్తా ఖాతాలో జమపడటం దేనికి సూచిక?

ఈ ఫలితాల వల్ల నాకు రెండు విషయాల్లో మాత్రం సంతోషంగా ఉంది. ఒకటి జేపీ విజయం. రాజకీయాలు అన్ని రకాలుగానూ  భ్రష్టుపట్టిన ఈ రోజుల్లోనూ మందు పొయ్యకుండా, వోట్లు కొనకుండా కూడా ఓ అభ్యర్ధి గెలవొచ్చని నిరూపించిన మొనగాడు జేపీ. ఈ ఒక్కడి విజయం మరెందరికో స్ఫూర్తి కావాలని ఆశిద్దాం. అసెంబ్లీలో కొలువుదీరనున్న వందలాది కలుపుమొక్కల నడుమ ఈ తులసి మొక్కెలా చిగుర్లేస్తుందో చూడాలి. ఆయన అడుగుపెట్టటంతో విధానసభ చర్చల్లో ఎంతో కొంత పరిణితొస్తుందనటంలో సందేహం లేదు.

నన్ను అమితంగా సంతోష పెట్టిన రెండో విషయం – దాదాపు దశాబ్దంగా తెలంగాణ పిడివాదులు ‘దోపిడీ దారులు’ అంటూ వేస్తున్న నిందల్ని మౌనంగా భరించిన కోస్తాంధ్ర, రాయలసీమ ఓటర్లు అదను చూసి ఒక్క ఓటు ముద్రతో ప్రత్యేకవాదానికి కట్టిన గోరీ, ఆంధ్ర సోదరుల బాధని అర్ధం చేసుకున్నట్లుగా తెలంగాణ వాసులూ వేర్పాటు వాదులకి బిగించి కట్టిన పాడె. ఈ దెబ్బతో ప్రత్యేకవాదం మంటలు చల్లారి అఖండాంధ్రప్రదేశ్ అవిభక్తంగా వెలుగొందే సూచనలు మొదలు. రోజుకో మాట చెప్పి, ఏరు దాటి తెప్పతగలేసి, ఎన్ని మాయవేషాలేసినా – చంద్రబాబు చేతగానితనంతో రాష్ట్రం నెత్తిన రాజేసిన కుంపటిని సమర్ధంగా అణచేసినందుకు రాజశేఖరరెడ్డి అభినందనీయుడు. ఆ ఒక్క కారణంగానే అతడు మరో ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగటానికి అర్హుడు. అవినీతి పంకిలంలో పీకల్దాకా కూరుకుపోయినా తిరిగి అందలం దక్కిందన్న అహంభావంతో మరింత విచ్చలవిడితనానికి తెగిస్తాడో, ఇకనైనా రాష్ట్రాభివృద్ధికి పాటుపడి చరిత్రకెక్కుతాడో ఇక ఆయన చేతిలోనే ఉంది.

కొసరు: ఇది కాన్‌స్పిరసీ థియరీల కాలం. ఎన్నికల ఫలితాలొచ్చిన రోజునే ఏంజెల్స్ & డీమన్స్ సినిమా కూడా విడుదలయింది. కాబట్టి మనమూ ఒకట్రెండు కాన్‌స్పిరసీ సిద్ధాంతాలు ప్రతిపాదించటం న్యాయం. ఇంతకీ – ప్రతిపక్షం ఓడిందా, లేక ఓడించబడిందా? ప్రతిపక్షానికి పట్టున్న ప్రాంతాల్లో ఓటర్ల పేర్లు గల్లంతవటం, ఈవీఎమ్‌లలో మీట నొక్కినా ప్రిసైడింగ్ ఆఫీసర్ల ‘చలవ’తో వోట్లు నమోదవకపోవటం, తొలినుండీ తెదేపా ఆధిక్యతలో కొనసాగిన యాభై దాకా స్థానాల్లో చివరి రౌండ్లలో అధికార పక్షానికి అనుకూలంగా ఫలితం తిరగబడటం కాకతాళీయమా? పత్తిపాడులో తొలుత తెదేపా గెలిచినట్లు ప్రకటించి తర్వాత కాంగ్రెస్ గెలిచినట్లుగా మార్చటం వెనక మతలబేంటి? దేశంలోని అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటి, రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదీ అయిన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్ధి వేణుగోపాలరెడ్డి విజయాన్ని ప్రకటించకుండా అర్ధరాత్రి దాకా హైడ్రామా నడపటం వెనక కమామీషేమిటి?

29 స్పందనలు to “తెలుగోడు”


 1. 1 కుమార్ 4:59 సా. వద్ద మే 18, 2009

  So this is how democracy and hope dies: With a thunderous applause….

  Popular rule is not democracy …. It gives the people what they want, not what they need…..

  Often road down the hill is very easy to follow…….

  Only silver lining is JP’s election.

  మీరన్నారు.

  “ఒకటి జేపీ విజయం. ఈ ఒక్కడి విజయం మరెందరికో స్ఫూర్తి కావాలని ఆశిద్దాం. అసెంబ్లీలో కొలువుదీరనున్న వందలాది కలుపుమొక్కల నడుమ ఈ తులసి మొక్కెలా చిగుర్లేస్తుందో చూడాలి. ఆయన అడుగుపెట్టటంతో విధానసభ చర్చల్లో ఎంతో కొంత పరిణితొస్తుందనటంలో సందేహం లేదు.”

  తొణికిసలాడుతు ఓ ఆశ…

  తధాస్తు…..

  • 2 అబ్రకదబ్ర 6:27 సా. వద్ద మే 19, 2009

   @కుమార్:

   >> “Popular rule is not democracy …. It gives the people what they want, not what they need…..”

   నిజానికి మన దేశంలో అమల్లో ఉన్న డెమోక్రసీకి ఆ మాత్రం కూడా చేవలేదు. దానికి ప్రజలు కోరుకున్నది ఇవ్వటం కూడా చేతకాదు, వాళ్లు వద్దన్నది ఇవ్వటమే చేతనవును. కాకతాళీయంగా, ఈ రోజే ఈనాడులో మాడభూషి శ్రీధర్ ఈ విషయమ్మీద చక్కటి వ్యాసం రాశారు. తప్పకుండా చదవండి:

   http://eenadu.net/opiniondisplay.asp?myqry=opini1%2Ehtm&opid=1&reccount=2

 2. 3 madhu 5:33 సా. వద్ద మే 18, 2009

  బాగా రాసారు.

  “ఒడలు పులకరించేలా”.. ఇది మాత్రం అర్థంకాలే.. 😦

 3. 4 Marthanda 6:03 సా. వద్ద మే 18, 2009

  రాజకీయ ప్రయోజనాల కోసం ఇరిగేషన్ ప్రోజెక్టులని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలుగు దేశం పారాసైట్స్ కి ఇలాంటి శాస్తే జరగాలి.

 4. 5 Bhaskara Rami Reddy 7:29 సా. వద్ద మే 18, 2009

  తెలుగోడు గారు మీరు చెప్పిన విశ్లేషణలు మన బ్లాగులో మేధావులకు, టి.వి. రూములలో కూర్చొని వార్తలు చదివేవారికి, ఎ.సి రూముల్లో పడుకుని వార్తలు రాసే వారికే గానీ క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ తిరిగినోళ్ళకి ఈ ఓట్లుచీలడాలు, మైండ్ బ్లాకులవ్వడాలు లాంటివేమీ లేవండి …వారనుకున్నదే జరిగింది.

 5. 6 Pratap 7:34 సా. వద్ద మే 18, 2009

  తెలంగాణా వాదం … కేవలం ఎత్తులతో జిత్తులతో జిమ్మిక్కులు చేసే కెసిఆర్ ఒక్కడిదే కాదనీ , కెసిఆర్ ఒంటెత్తు పోకడల్ని లక్షలాది తెలంగాణా ప్రజలు అసహ్యించు కుంటున్నారని ముందు ఆంధ్ర సోదరులు గ్రహించాలి.!

  తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని, తమ వేల సంవత్సరాల అస్తిత్వాన్ని తాము కాపాడు కోవాలని కోరుకోవడం పాపమేమీ కాదని కూడా అర్ధం చేసుకోవాలి. !!

  తెలంగాణా ఏర్పడటం అంటే దేశం నుంచి పాకిస్తాన్ లాగా విడిపోవాలని కాదు కాదాతెలంగాణా ఏర్పడితే ఇతర రాష్ట్రాల వాళ్ళంతా వెళ్లి పోవాల్సిన పరిస్థితి వస్తుందా? ఆంధ్రులు హైదరాబాద్ లో విదేశీయుల్లా బతకాల్సి వుంటుందా ? అట్లా ఎ కొత్త రాష్ట్రం లో అయినా జరిగిందా ? మంద్రాస్ నుంచి ఆంద్ర విడిపోయిన తరువాత అక్కడ ఆంధ్రులు విదేశీయుల్లాగే బతుకుతున్నారా???

  ఎందుకీ దుర్మార్గపు, అన్యాపు, అధర్మపు, వంచనాత్మక అవహేళనలు.??
  తెలంగాణా అంటే ఎందుకు మీకు ఇంత చులకన???

  2004 ఎన్నికలలో తెలుగు దేశం బాహాటంగా మేం సమైక్య వాదులమని ఎన్నికలల్లో పోటీ చేసింది కదా.
  అప్పుడు తెలుగు దేశం ఓడిపోతే సమైక్యవాదం ఓడిపోయినట్టు ఒప్పుకోరేం ?
  సరే..
  ఇప్పుడు ప్రత్యెక తెలంగాణాకు అనుకూలంగా తెలుగు దేశం బాహాటం గా తీర్మానం చేసింది. తెలంగాణాకు అనుకూలంగా నే ఎన్నికలకి వెళ్ళింది కాదా.
  2004 కంటే తెలంగాణా లోనే కాదు రాష్ట్ర మంతటా ఎక్కువ సీట్లు గెలుచుకుంది కాదా….
  మరి ఇది తెలంగాణా వాదం గెలిచినట్టు కాదా?

  ఎవరండీ సమైక్యవాదం నినాదం తో ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళింది ?
  మీ వాదం కూడా కెసిఆర్ జితులమారి కుప్పి గంతుల మాదిరిగానే లేదూ ?

  న్యాయం గా , నిజాయితీగా సాటి తెలంగాణా ప్రజలపట్ల గౌరవభావంతో ఆలోచించండి.
  లేదు మేము ఇట్లాగే చాల్బాజి తనంతోనే వాదిస్తామంటే మీ ఇష్టం
  ఏది న్యాయమో ఏది అన్యాయమో రేపటి చరిత్రే రుజువు చేస్తుంది !!

 6. 7 కె.మహేష్ కుమార్ 8:02 సా. వద్ద మే 18, 2009

  బాగుంది. జేపీ అసెంబ్లీలో ఉంటే కనీసం విషయాల మీద కొంత సమాచారంతో చర్చలు జరుగుతాయి. అది చాలా అభిలషణీయం.

 7. 8 అబ్రకదబ్ర 8:17 సా. వద్ద మే 18, 2009

  @ప్రతాప్:

  సమైక్యవాదం నినాదంతో ఎవరు ఎన్నికలకి వెళ్లారో నేను చెప్పలేదే! ప్రత్యేక వాదనకి వ్యతిరేకంగా తీర్పిచ్చారని మాత్రమే అన్నా. మళ్లీ చదువుకోండి.

  తెలంగాణవాసులపై నాకు మీరనుకున్నదానికన్నా ఎక్కువ మర్యాదే ఉంది. నేనెప్పుడూ వాళ్లపై నోరు జారలేదు. నేను అవహేళనగా, చులకనగా ఏమన్నానో ఎత్తి చూపగలరా? కేసీయార్ పదజాలాన్ని ఆయనమీదనే ప్రయోగిస్తే అవహేళనా? నేను సమైక్యవాదిని. ప్రతి వెనకబాటుదనానికీ వేర్పాటే పరిష్కారమనుకునే భావనకి వ్యతిరేకిని. మీకది నచ్చకపోతే మర్యాదగా చెప్పే పద్ధతొకటుంది – కుప్పిగంతులు, చాల్బాజితనం లాంటి పదాల్లేకుండా.

  @భారారె:

  మీరన్నది నిజమే. ఉదాహరణకి కోడెల శివప్రసాద్ సుమారుగా ఎంత తేడాతో ఓడిపోబోనున్నాడో నెల క్రితమే తెలుసు 😉 (జోక్ కాదు. నిజంగానే చెబుతున్నా. పల్నాడు తెదేపాలో ఆయన పెంచి పోషించిన వర్గాలు, సొంత పార్టీలో ప్రత్యర్ధులని ఓడించటానికి వేసిన ఎత్తులు ఎదురు తిరిగి ఇంత పని చేశాయి. ఆయనీ సారి ఓడతాడని ముందే తెలిసిపోయింది పార్టీవర్గాలకి)

 8. 9 Narendra Chennupati 9:20 సా. వద్ద మే 18, 2009

  తెలుగోడు గారు, మొదటి పేరా సూపరు.. total గా టపా కేక…చాలా బాగా రాసారు..

 9. 10 Pratap 9:42 సా. వద్ద మే 18, 2009

  >>>>>సమైక్యవాదం నినాదంతో ఎవరు ఎన్నికలకి వెళ్లారో నేను చెప్పలేదే! ప్రత్యేక వాదనకి వ్యతిరేకంగా తీర్పిచ్చారని మాత్రమే అన్నా. మళ్లీ చదువుకోండి.<<<<<

  ఈ వాదనను ఏమంటారు?
  ప్రత్యెక తెలంగాణా వాదానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారని మాత్రం ఎట్లా అనగలరు మీరు?

  వేర్పాటు వాదులను పాతిక కిలోమీటర్ల లోతున బొంద పెట్టారు అనడం తెలంగాణా పట్లా మీకున్న మర్యాదకు ప్రతీకా?

  నేను రాసింది మీరు కూడా మళ్ళీ ఒకసారి చదివి పాయింటు వైజ్ గా సమాధానం చెప్పండి .
  పిసిసి ప్రస్తుత అద్యక్షుడు, డి ఎస్ , మాజీ అద్యక్షుడు కేశవరావు , ఇంకా మధు యాష్కీ మొదలుకొని అందరు తెలంగాణా కాంగ్రెస్స్ నాయకులు తామంతా తెలంగాణా వాడులమే ననీ కాంగ్రెస్ తోనే తెలంగాణా వస్తుందని గొంతు విచ్చుకుని చెప్తున్నారు కదా
  మరి తెలంగాణా వాదాన్ని ఎవరు బొంద పెట్టారు ఆంధ్రా వాల్లనా మీ ఉద్దేశం ?
  జిత్తులమారితనం తో రాయలసీమ వాళ్ళు తెలంగాణా వాదాన్ని బొంద పెట్టారా ??
  ఎవరు బొంద పట్టారు అని మీరు సంతోషిస్తున్నారు????

 10. 11 కె.మహేష్ కుమార్ 11:06 సా. వద్ద మే 18, 2009

  తెలంగాణా వాదం విషయంలో కొంత విభేధించాలి. తెలంగాణా ప్రజలు రాజకయనాయకుల తలతిక్క ప్రవర్తనకు విసిగి ఎన్నికల్లో ఓడించినంత మాత్రానా తెలంగాణా వాదన లేదనటం అంత సమంజసం కాదేమో!

 11. 12 rayraj 1:40 ఉద. వద్ద మే 19, 2009

  నేనూ కొద్దో గొప్పో సమైక్యవాదినే! కానీ, ’ఈ ఓటు సమైక్యాంధ్రాకి పడింది’ అంటే నేను ఒప్పుకోను.తెలంగాణావాదం ఉంది; వేర్పాటు వాదాన్ని తుదముట్టించే విధానం ఇది కాదు;తెలంగాణ వెనుకబాటుతనాన్ని నిర్మూలించే ప్రణాలికలు ఏవి? ప్రత్యక్షంగా అభివృద్ధిని చూస్తే, ప్రజలు వేర్పాటువాదం మరచి పోవచ్చు; లేక మరింతగా వేరుపడిపోవడాన్ని కోరుకోవచ్చు. ప్రతాప్ గారన్నట్టు విడిపోతే విదేశియులా!తప్పు! అది ముమ్మాటికి తప్పు! కేవలం ఓట్లు దండుకోడానికి “ఒడలు జలదరించే” మాటలవి అంతే! ఆ రకమైన మాటలు ఖచ్చితంగా మరింత వేర్పాటువాదాన్ని తెస్తాయి తప్ప,ఐకమత్యాన్ని పెంచవు.గట్టిగా మాట్లాడితే, డామినంట్ పారడైమ్ లో ఏ తెలంగాణ విషయాలకి గౌరవం ఉంది!? అన్నీ చులకన భావనలు తప్ప! కేసీర్ మామూలు వాడు కాదు. తెలంగాణ “తల్లి” అన్నాడు. తెలంగాణ “వంటలు” అన్నాడు!తెలంగాణ “సంస్కృతి” అని తయారు చేసే ప్రయత్నం చేసాడు.కానీ, ఓ పక్క ఇప్పటివరకు ఉన్న డామినంట్ పారడైమ్ కే దిక్కు లేకపోతే, ఇలా విడదీసి సంస్కృతిని తయారు చేయడం అంత సులువు గాదు; అంత మంచిదీ కాదు.వెనకబాటు దనాన్ని, ఆత్మగౌరవ సమస్యలని – వేర్పాటువాదంగా తయారు కాకుండానే పరిష్కరించుకోవాలి;ఇప్పుడు బహుశా ప్రజలు ఛీ కొట్టింది కేవలం అవకాశవాదులకి మాత్రమే అని నాకు అనిపిస్తుంది, ’తెలంగాణవాదానికి కాదు’ అని నా అభిమతం.ఎవరూ సమిక్యాంధ్రా ప్లాంక్ మీద లేక పోతే, ఓటు సమైంక్యాంధ్రాకి ఎలా ఔతుంది!వేర్పాటు వాదానికే ఔతుంది.

  ఇంకో మాట: కాంస్పరసీ థియరిస్ట్; ఔను;అదీ మాట! నా నెక్స్ట్ పోస్టులో దీన్ని చెబ్దామని అనుకున్నాను;మీరు ముందు చెప్పి ధన్యలైయ్యారు. ఒకరి ఆలోచన నచ్చకపోతే ఎద్దేవా కాదండి మనం చేయాల్సింది; దానికీ ఓ పేరిచ్చి ప్రొమోట్ చేయడం. మీరన్నట్టు కుట్రలు గురించి ఆంగ్లంలో బ్లాగులూ, పుస్తకాలు రాస్తే, వాళ్ళని కాంస్పరసీ థియరిస్టులంటారు;
  అందుకే :
  “The First Conspiracy theorist in Telugu is Mrs.Yadla Adi Lakshmi – and a lady writer at that! ”

  తెలుగులోని ప్రప్రధమ కణికనీత తత్త్వవేత్త ఒక మహిళ కావటం తెలుగు వారు మరింత గర్వపడాల్సిన విషయం.”ఆలోచన”తో విభేదించ వచ్చు;హాస్యమాడచ్చు; కానీ ప్రతి “ఆలోచన”కీ దాని విలువ దానిదే!నిజానికి “డామినంట్ పారడైమ్” అని శాస్త్రబద్ధంగా చూస్తున్న విషయం, ఆవిడ “కణికనీతి”గా చుస్తున్న విషయం – ఒకే విషయం యొక్క వివిధ పార్శ్వాలు!అలాగే,నిలబడి ఉన్న పొజిషన్స్ కూడా వేరు.అందుకనే వర్ణనలో మార్పు.అయా అనుభవాలు వేరు;వారు కోరుకున్న మార్పులు వేరు.

  కొణతం దిలీప్ గారు “దళారి పశ్చాత్తాపం” కూడా కుట్ర గురించే చెబ్తుందే! దాన్ని నేను చాలా బావుంది అని కూడా అనుకున్నానే!కానీ, మన తెలుగువాళ్ళు స్వంతగా అనుభవించి,ఆలోచించి చెబితే,దానికెందుకు విలువలేదు! – అది తెలుగువారిది కాబట్టి; అనువాదం కాదు కాబట్టి.మొట్టమొదటి అనువాదమే ఐతే, కొణతం దిలీప్ రచనకూడా ఇదే కణికనీతి సంబంధించిన పుస్తకమే నండి.అదీ మంచి పుస్తకమే!

  అందుకనే “ఆలోచనలు” ముఖ్యం; మరింత భిన్నమైన “ఆలోచనలు” తెలుగులో , బ్లాగ్లోకంలో రావాలి..రావాలి..రావాలి..అని తపిస్తున్నాను.అనువాదాలవల్ల ఆలోచన నశించి పోతోందేమోనని భయపడుతున్నాను.

 12. 13 సుజాత 1:52 ఉద. వద్ద మే 19, 2009

  తెరాస మట్టిగొట్టుకుపోయిందని వినగానే నాకు మీరే గుర్తొచ్చారండీ! ఆ రోజు నుంచీ చూస్తున్నా, మీరెప్పుడు పోస్టు రాస్తారా అని!మీ వార్తల ప్రెజెంటేషన్ నిజంగానే పులకరింపజేసేలా ఉంది సుమా!

  నరసరావు పేటలో ఇలా ఎన్నికల ఫలితాలను నిలిపి వేయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందొకసారి కూడా డాక్టరు ముండ్లమూరి రాధాకృష్ణ మూర్తి కాంగ్రెస్ అభ్యర్థి గా గెలిచేసినంత పని చేశాక, ఫలితాన్ని మూడు రోజులు ఆపి కోడెల గెలిచాడని ప్రకటించారు.

  చిరంజీవికి సామాజిక న్యాయమేమిటో ఇప్పుడు బాగా అర్థమైంది. పరకాల పార్టీ చేసుకుంటున్నాడు.

  వద్దులెండి, ఆపేస్తా, ఇదొక టపాలాగ తయారయ్యేట్టు ఉంది!

 13. 14 బ్లాగాగ్ని 4:52 ఉద. వద్ద మే 19, 2009

  మహేష్ గారూ, ఇదే విషయమ్మీద తాడేపల్లి గారు చాన్నాళ్ళ క్రితం వ్రాసిన టపాలో నా కామెంటుకు మీ (దీనికి పూర్తి విరుధ్ధమైన)ప్రతిస్పందన చూడొచ్చు ఈ క్రింది లింకులో.

  http://www.tadepally.com/2008/06/blog-post_01.html

  మరి అప్పటి మీ అభిప్రాయం మారిందనుకోవాలా?

  -ఫణి

 14. 15 కన్నగాడు 8:14 ఉద. వద్ద మే 19, 2009

  బాగుంది, సింహబాగం MPలు(33) జేబులో ఉన్నప్పటికీ కేంద్రం దగ్గర రావాల్సనన్ని నిధులను(కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్) పొందగలరన్న నమ్మకం లేదు.

 15. 16 nelabaludu 9:18 ఉద. వద్ద మే 19, 2009

  “ఒకటి జేపీ విజయం. ఈ ఒక్కడి విజయం మరెందరికో స్ఫూర్తి కావాలని ఆశిద్దాం. అసెంబ్లీలో కొలువుదీరనున్న వందలాది కలుపుమొక్కల నడుమ ఈ తులసి మొక్కెలా చిగుర్లేస్తుందో చూడాలి” – I am also happy on that.. Lets see.. !!!

 16. 17 అబ్రకదబ్ర 10:00 ఉద. వద్ద మే 19, 2009

  @ప్రతాప్:

  ‘మళ్లీ చదువుకోండి’ అని నేనన్నది నా ఈ కింది వాక్యాల గురించి:

  1. >> “ప్రత్యేక రాష్ట్రం పేరుతో దశాబ్దంగా పబ్బం గడుపుకుంటున్న వేర్పాటువాదుల్ని పాతిక కిలోమీటర్ల లోతున బొందబెట్టి పాతరేశాడు”
  2. >> “దాదాపు దశాబ్దంగా తెలంగాణ పిడివాదులు ‘దోపిడీ దారులు’ అంటూ వేస్తున్న నిందల్ని మౌనంగా భరించిన కోస్తాంధ్ర, రాయలసీమ ఓటర్లు అదను చూసి ఒక్క ఓటు ముద్రతో ప్రత్యేకవాదానికి కట్టిన గోరీ, ఆంధ్ర సోదరుల బాధని అర్ధం చేసుకున్నట్లుగా తెలంగాణ వాసులూ వేర్పాటు వాదులకి బిగించి కట్టిన పాడె”
  3. >> “ఈ దెబ్బతో ప్రత్యేకవాదం మంటలు చల్లారి అఖండాంధ్రప్రదేశ్ అవిభక్తంగా వెలుగొందే సూచనలు మొదలు”

  ఇందులో ఎక్కడా నేను ‘తెలంగాణవాదం’ ఓడిపోయిందనలేదు, దాన్ని అవహేళన చెయ్యలేదు. నా దృష్టిలో తెలంగాణవాదం, పిడివాదం/ప్రత్యేకవాదం/వేర్పాటువాదం వేర్వేరు. వాటికి నా నిర్వచనాలివి:

  తెలంగాణవాదం: తెలంగాణ వెనుకబాటుదనంపై గొంతెత్తటం.
  ప్రత్యేకవాదం/పిడివాదం/వేర్పాటువాదం: రాష్ట్రం చీలిపోవటమే తెలంగాణ వెనుకబాటుదనానికి పరిష్కారమనటం.

  తెలంగాణకి అన్యాయం జరిగిందనేది ఎంతో కొంత నిజం. ప్రత్యేకవాదులు ఆరోపించే స్థాయిలో జరిగిందన్నది అబద్ధం. అసలు అన్యాయమే జరగలేదనేదీ అబద్ధమే. ఇటువంటి అన్ని సంవాదాల్లోనూ జరిగినట్లే, truth lies somewhere in between – నిజం మధ్యలో ఎక్కడో ఉంటుంది. అది వేరే పెద్ద చర్చ. తెలంగాణకి మాత్రమే అన్యాయం జరిగిందా, రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతాలకీ జరగలేదా అన్నది కూడా వేరే చర్చ. ఆ వివరాల్లోకి మనం వెళ్లొద్దు. మీరు తెలంగాణవాది మాత్రమేనయితే తెలంగాణ అభివృద్ధి కోసం మీతో గళం కలుపుతా. వేర్పాటువాదయితే మాత్రం వ్యతిరేకిస్తా. ఇది నా వాదం, సమైక్యవాదం. సమైక్యవాదికి కావలసింది రాష్ట్రమంతా అభివృద్ధి చెందటం. ఏ ఒక్క ప్రాంతమో కాదు.

  >> “వేర్పాటు వాదులను పాతిక కిలోమీటర్ల లోతున బొంద పెట్టారు అనడం తెలంగాణా పట్లా మీకున్న మర్యాదకు ప్రతీకా?”

  తెలంగాణా పట్ల నాకున్న మర్యాదకు ప్రతీక ఏ మాత్రం కాదది. ఇంతకు ముందే చెప్పాను – అవి కేసీయార్‌ని ఉద్దేశించినవి. అనేక సందర్భాల్లో ఆయనే ఆంధ్రులపై, సమైక్యవాదులపై వాడినవి. ఆయన మాటలు ఆయనకి అప్పజెబితే తప్పేముంది?

  మీ మిగతా ప్రశ్నలు రేరాజ్ కూడా సంధించారు. ఆయనకి నేనివ్వబోయే సమాధానం చదవండి.

 17. 18 కె.మహేష్ కుమార్ 10:28 ఉద. వద్ద మే 19, 2009

  @బ్లాగాగ్ని: నేను అప్పుడూ ఇప్పుడూ చెప్పేది ఒక్కటే. తెలంగాణా రాజకీయ సమస్యకాదు. అభివృద్ధి, identity సమస్య. ఈ సమస్యను తన పిచ్చి రాజకీయ ఆశయాలకు వాడుకుని నవ్వులపాలు చేసిన కే.సీ.ఆర్ ను బొందపెట్టడానికి నేనూ చెయ్యేస్తా. కానీ, తెలంగాణా ప్రజల sense of victimhood కు సహానుభూతి తెలుపుతాను.I am with the people of Telangana, not with politicians of Telangana. Especially TRS.

 18. 19 అబ్రకదబ్ర 10:34 ఉద. వద్ద మే 19, 2009

  @రేరాజ్:

  మొదటగా – ప్రతాప్‌కి నా సమాధానం చదవండి. మీ కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకొచ్చు.

  >> “ఎవరూ సమిక్యాంధ్రా ప్లాంక్ మీద లేక పోతే, ఓటు సమైంక్యాంధ్రాకి ఎలా ఔతుంది!”

  సమైక్యవాదం నినాదంతో ఎన్నికలకి ఎవరూ వెళ్లలేదు నిజమే. అయితే రాష్ట్రంలో – ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ – వోటర్లు రాజశేఖరరెడ్డిలో రాష్ట్ర విభజన ఆపగలిగే నాయకుడిని చూశారు. నిజానికి చంద్రబాబూ కరడుగట్టిన సమైక్యవాదే. కానీ పరిస్థితులు అడ్డం తిరిగినా మొండిగా నిలబడగలిగే మొనగాడు రాజశేఖరరెడ్డిలోనే వాళ్లకి కనబడ్డాడు. అందుకే, రెడ్డి ప్రత్యేకించి ‘నాది సమైక్యవాద అజెండా’ అని చెప్పకపోయినా ఆయనే చీలిక అడ్డుకోగలడని నమ్మారు, ఓట్లేశారు.

  ఇక తెలంగాణలో తెరాస చావుదెబ్బ తినటానికి కేసీయార్ వ్యవహార సరళి కారణం కావచ్చు, నిజమే. ఏదైనా, రాష్ట్ర విభజన కన్నా ముఖ్యమైన విషయాలున్నాయని ఆ ప్రాంత వోటర్లు గ్రహించారన్నది నా నమ్మకం. ఆ రకంగా ప్రత్యేకవాదానికి అక్కడా నూకలు చెల్లినట్లే – కనీసం, ప్రస్తుతానికి.

  2004లో సమైక్యవాదం పేరుతో వెళ్లిన తెదేపా దెబ్బ తినలేదా అన్నారు ప్రతాప్. అప్పట్లో ప్రత్యేక తెలంగాణ అంశం ఇంకా మొదట్లోనే ఉంది. కనీసం – కోస్తాంధ్ర, రాయలసీమల్లో అధికశాతం వోటర్లు సమైక్యతకి ముప్పేమీ ముంచుకురాలేదనుకున్నారు, అందుకే ఆ విషయమ్మీద దృష్టి పెట్టలేదు. అప్పుడంతా పాలక తెదెపాపై వ్యతిరేకతే పని చేసింది. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇంకా ఉపేక్షిస్తే రాష్ట్రం చీలే పరిస్థితులున్నాయని గ్రహించారు. ఈ తీర్పిచ్చారు.

  తెలంగాణపై ఇతర ప్రాంతాల్లో చులకన భావం సంగతి. ఎక్కడిగురించి మాట్లాడుతున్నారు మీరు? గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్లు మాత్రమే రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాలనీ సమాన దృష్టితో ‘చులకనగా’ చూస్తారు. తతిమ్మా ప్రాంతాలు – తెలంగాణతో సహా – ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్లు మిగిలినోళ్లని ఎగతాళి చెయ్యటం, ఎకసెక్కాలాడటం చేస్తారు. ఆ మాటకొస్తే – అందర్లాగానే తెలంగాణవాసులూ సర్దార్జీలపై జోకులెయ్యరా? తెలుగోళ్లంతా తమిళులని సాంబారుగాళ్లని, వాళ్లు మనని గొల్టీలనీ ఏడిపించరా? పెళ్లికొచ్చిన బంధువులు ఒకరితో ఒకరు గిల్లికజ్జాలు పెట్టుకోటం లాంటి సిల్లీ విషయాలివి. వేర్పాటుకి కారణాలు కావల్సినంత పెద్దవి కావు.

  ఆత్మగౌరవం, వెనుకబాటుతనం వగైరా విషయాలు వేర్పాటు ప్రస్తావన లేకుండానే పరిష్కరించుకోవాలన్నారు మీరు. ఇది నిజం. అదే నా అభిప్రాయం కూడా.

 19. 20 a2zdreams 2:11 సా. వద్ద మే 19, 2009

  @>>లోక్‌సత్తా సానుభూతిపరుల్లో అత్యధికులు గతంలో తెదేపాకి ఓట్లేసినవాళ్లే. తక్కువ తేడాతో తెదేపా ఓడిన స్థానాల్లో లోక్‌సత్తా ప్రభావం తీసిపారేయలేం. ఒకటిన్నర శాతం కన్నా తక్కువ తేడాతో తెదేపా అనేక స్థానాల్లో ఓడటం, దాదాపు అదే శాతం వోట్లు లోక్‌సత్తా ఖాతాలో జమపడటం దేనికి సూచిక? <<

  లోక్ సత్తా ఓటర్లపై ఎంత అభాండం వేసారు సార్ ? in my blog, I was always talking about internet loksatta supporters. మీరు మొత్తం లోక్ సత్తా ఓటర్లకే బొంద పెట్టారు. please take back those words. చాలా బాదగా వుంది ఆ sentence చదువుతుంటే.

 20. 21 అబ్రకదబ్ర 2:24 సా. వద్ద మే 19, 2009

  @a2z:

  అభాండమేముంది ఇందులో? ఒకప్పుడు తెదెపాకి ఓట్లేసినోళ్లు ఇప్పుడు లోక్‌సత్తాకి వేస్తే లోక్‌సత్తా పలుచనైపోయినట్లు కాదు. లోక్‌సత్తా సానుభూతిపరులు ఇంతకు ముందు ఎవరికీ వోట్లేసి ఉండరని మీ ఉద్దేశమా? ఎవరో ఒకరికి వేసే ఉంటారు కదా. నా పరిధిలో తెదెపానుండి లోక్‌సత్తావైపు మొగ్గు చూపినవాళ్లే ఎక్కువమందున్నారు. ఆంధ్రాలో నేనెరిగిన ఎమ్మెల్యేల, ఇతర నాయకుల నుండి ఎన్నికలకి ముందే నాకందిన ఫీడ్‌బ్యాక్ కూడా అదే.

  కాబట్టి వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు 🙂

 21. 22 a2zdreams 2:35 సా. వద్ద మే 19, 2009

  లోక్ సత్తా కు ఓటిసిన ప్రతి ఒక్కరూ, నా దృష్టిలో నిజమైన ఓటర్లు. అటువంటి వారికి నేను శత్రువుగా వుండకూడదనే, వారికి మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పాను.

  మీ పరిధి అంటే other than కుకటపల్లి ?

 22. 23 జీడిపప్పు 7:22 సా. వద్ద మే 19, 2009

  good analysis and wonderful answers అబ్రకదబ్ర గారు.

  తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణా రానివ్వకుండా, అడుగడుగునా ప్రత్యేక తెలంగాణా వాదాన్ని అణిచివేసే అతి గొప్ప సమైక్యవాది పేరు – కేసీయార్ 🙂

 23. 24 Pratap 8:09 సా. వద్ద మే 19, 2009

  >>>>> కోస్తాంధ్ర, రాయలసీమ – వోటర్లు రాజశేఖరరెడ్డిలో రాష్ట్ర విభజన ఆపగలిగే నాయకుడిని చూశారు. <<<>>అందుకే, రెడ్డి ప్రత్యేకించి ‘నాది సమైక్యవాద అజెండా’ అని చెప్పకపోయినా ఆయనే చీలిక అడ్డుకోగలడని నమ్మారు, ఓట్లేశారు. <<<<
  ఒక దుర్మార్గాన్ని ఇంత అందంగా చెప్పడం మీకే సాధ్యం !

  "తెలంగాణా ఏర్పడితే హైదరాబాద్ లో మీరు విదేశీయుల్లా బతకాల్సి వస్తుంది.! చిన్న వ్యాపారం కూడా అక్కడ మీరు చేసుకోలేరు. ! పోతిరెడ్డి పాడు ఆగి పోతుంది, ! పులిచింతల ఆగి పోతుంది,! పోలవరం ఆగి పోతుంది, ! ప్రాజెక్టులన్నీ ఆగి పోతాయి,!! మీ పొలాలకు చుక్క నీళ్ళు రాకుండా పోతాయి,!! మీ బతుకులు ఎండిపోతాయి, !! తస్మాత్ జాగ్రత్త !!!జాగ్రత్తా … !!! " అన్న దుర్మార్గపు ఎత్తుగడ మీకు హీరాయిక్ గా కనపడడం చాలా బాధాకరం.
  అందుకే మన రాజకీయాలు ఇట్లా తగలబడ్డాయి.

  ఇంతా బెదిరిస్తే ….
  కాంగ్రెస్స్ కు మహాకూటమి కన్నా ఎక్కువ వచ్చిన వోట్లు కేవలం ఏడున్నర లక్షలు … !
  అంటే 1.8 శాతం మాత్రమె ఎక్కువ. !!
  ప్రజా రాజ్యానికి వచ్చిన 68 లక్షల వోట్లను ప్రత్యెక తెలంగాణ కు అనుకూలమైన వాటిగా పరిగనిస్తారా లేక మీ ఇష్టాను సారం క్రిష్ణలోనో గోదావరి లోనో కలుపుతారా? ప్రజా రాజ్యం కూడా మొదటి నుంచి డొంకతిరుగుడు లేకుండా తెలంగాణాకు అనుకూలమనే ప్రకటించుకుంది మరి
  ధర్మ ప్రభువులు మీరే తేల్చి చెప్పాలి. !!

  తెలంగాణా వస్తే ఆంధ్రా కు రాయలసీమకు ఏదో అన్యాయం జరిగి పోతుందన్న మీ భయమే …
  తెలంగాణ కు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో చాటి చెబుతోంది.
  తెలంగాణ అనేది ఇక్కడి ప్రజల అస్తిత్వ సమస్య.
  తెలంగాణ వస్తే తప్ప ఇక్కడి వనరులు, నీళ్ళు , ఉద్యోగాలు, భూములు దోపిడీకి గురికాకుండా ఆగదు…. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణాకు రావలసిన న్యాయమైన వాటా రాదు… అని తేలిపోయింది. .!

  బతుకమ్మ పండుగ పాటలు ముంబై, దుబాయ్, భిమాండి , అహ్మదాబాద్, డెట్రాయిట్, హూస్టన్, న్యూజెర్సీ , చికాగో, న్యూయార్క్, లండన్ ల లో ప్రతిధ్వనిస్తాయి కాని ఒక్క ఆంధ్రా పట్టణంలో నైనా మచ్చుకు కూడా వినిపించదు.

  తెలంగాణా వాళ్లకు ఎక్కడైనా బతుకు తెరువు వుంటుంది కాని ఆంధ్రా పట్టణాల్లో మాత్రం చస్తే వుండదు. అదే తెలంగాణలో ఒక్క హైదరాబాదేం ఖర్మ ప్రతీ పట్టణంలో ప్రతీ మండలం లో ఆంధ్ర వాళ్ళ కాలనీలకు కాలనీలు వూళ్ళకు వూళ్ళు గుంటూరు పల్లెలు అనేకం కనిపిస్తాయి.
  అనకాపల్లి కి చెందిన వ్యక్తి ఆదిలాబాద్ లో లోకల్ కాండిడేట్ గా చలామణి అవుతూ ఆర్టీసీ కండక్టర్గా దర్జాగా ఉద్యోగం చేయగలడు . తన యాసను ధైర్యంగా మాట్లాడ గలడు. ఇదీ సమైక్యత వల్ల తెలంగాణాకు వచ్చిన లాభం !!
  ఇంత అప్పనం గా వచ్చిన అమాయక తెలంగాణాను వదులుకోవాలంటే మీకు బాధగానే వుంటుంది మరి.
  మా బాధలు, మా అస్తిత్వ ఘోష మీకు కనిపించవు, వినిపించవు. మా తెలంగాణా మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, నదీ జలాల్లో న్యాయంగా రావలసిన వాటా మాకు దక్కాలి అని కోరుకోవడం కూడా మీకు వేర్పాటు వాదం గా, దుర్మార్గం గా కనిపిస్తుంది. !

  సరే ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలిచి తీరుతాయన్నదే మా ఆశ.
  చెన్నారెడ్డి, చిన్నారెడ్డి, వంటి అమ్ముడుపోయే నాయకులు, కెసిఆర్ వంటి బొంతపురుగులను, కుష్టు రోగులను నమ్ముకునే నాయకులు పోయి పొట్టి శ్రీరాములు వంటి త్యాగ సీలురు మా నేలలో కూడా ఉద్భావించక పోతారా ?
  చూద్దాం !
  ఈలోగా మీరు కూడా కొంచం న్యాయంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని కోరుతున్నాను.
  సెలవు

  • 25 బ్లాగాగ్ని 3:35 ఉద. వద్ద మే 20, 2009

   ప్రతాప్ గారూ,

   మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ మీ అభిప్రాయాల్లో ఆంధ్రా వారిపట్ల చాలా అపోహలు కనిపిస్తున్నాయి. పుట్టింది ఆంధ్రాలో అయినా తెలంగాణాలో పెరిగి, పన్నెండేళ్ళు చదువుకున్నవాడిగా, రెండు ప్రాంతాలూ బాగా తెలిసినవాడిగా చెపుతున్నాను. మీరనుకుంటున్న వివక్షేమీ ఆంధ్రాలో తెలంగాణా వారిపట్ల లేదు. ఇవన్నీ ప్రత్యేకవాదాన్ని పెంచి పోషించటానికి కే.సీ.ఆర్ వంటి దరిద్రులు పన్నిన మిత్ర భేదం.

 24. 26 అబ్రకదబ్ర 2:57 సా. వద్ద మే 20, 2009

  @ప్రతాప్:

  పొరబడ్డారు. రెడ్డి వాచాలత్వం నాకు హీరోయిక్‌గా కనపడటం ఏమిటి! నా పాత టపాలొకసారి చదవండి – రాజశేఖరరెడ్డికి నేను అభిమానిని కాదని తెలుస్తుంది. ఈ టపాలో కూడా ఆ సంగతి చూచాయగా ఎత్తి చూపాను (‘రోజుకో మాట చెప్పి, ఏరు దాటి తెప్పతగలేసి, ఎన్ని మాయవేషాలేసినా’ అన్నది ఆయన్ని గురించే). రెడ్డి మాటలు ప్రజలపై ప్రభావం చూపించాయన్న విషయమే నేను ప్రముఖంగా ప్రస్తావించదలకుంది.

  ‘బతుకమ్మ పాటలు ఆంధ్రాలో వినపడలేదు, తెలంగాణ భోజన హోటళ్లు రాయలసీమలో కనపడలేదు’ లాంటి చిన్నపిల్లల తరహా ఆరోపణలు చెయ్యకండి. ‘ఉడుపి హోటళ్లు నెల్లూరులో ఉన్నాయి కానీ నెల్లూరు మిలటరీ భోజన హోటళ్లు ఉడుపిలో లేవేంటి’ అంటే సిల్లీగా ఉండదూ?

  మీ ఇతర ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలను కానీ ఇది తెగేది కాదు. ముందే చెప్పాను – వేర్పాటువాదానికి నేను వ్యతిరేకిని. తెలంగాణవాదులకి నా పూర్తి మద్దతు. తెలుగువాళ్లంతా ఓ పెద్ద రాష్ట్రంగా ఉంటే బాగుంటున్న భావనే నేను సమైక్యవాదం వైపు మొగ్గేలా చేసింది కానీ రాష్ట్రం విడిపోయినా, కలిసున్నా వ్యక్తిగతంగా నాకు వచ్చేదీ పోయేదే ఏదీ లేదు. బ్లాగాగ్ని చెప్పినట్లు కేసీయార్ లాంటివారి దొంగ మాటల ప్రభావం తెలంగాణలో చాలా ఉన్నట్లుంది.

  అదీ సంగతి. ఇక గొడవాపేసి మామూలుగా ఐపోదాం 🙂

 25. 27 Raaga 3:48 సా. వద్ద మే 22, 2009

  Pratap,

  మీ తెలుగు చూస్తే మీకు తెలుగు మీద బాగానే పట్టు ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ మీకు అబ్రకదబ్ర గారి విశ్లేషన ఎందుకు అర్థం కాలేదు. లేదా మీరు కావాలనే తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? చూస్తుంటే మీరు ప్రత్యేక తెలంగాణ వచ్చిన మొదటి రోజే వేరే ప్రదేశాల వారినందరిని (non Telangana) అమెరికా లాగా వీసాలు పెట్టి విసిగించేలా ఉన్నారు.

  ఎవ్వరు మిమల్ని చులకన చెయ్యటం లేదు, మిమల్ని మీరే చేసుకుంటున్నారు. మీకు inferiority complex కొంచెం ఎక్కువ అయిందేమో గమనించుకోండి.

  Finally,

  ఎదుటి వారి మీద దాడి చేసేటప్పుడు ముందు వాల్లు ఏమి చెపుతున్నారో అర్థం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి.

 26. 28 vamshi 7:16 ఉద. వద్ద జూన్ 1, 2009

  KCR donga matala prabhavam telanganalo chaala unte ippudu TRS pai chyeiga undedhi. andhukani indhulo prajala Gnanni sankinchanavasaram ledhu. Vyakthigathanga naaku vachedhi anadam lo mee badhyatha rahithyam thelusthundhi.
  Telangana vadham, rajakiya vadham (rajakiya vakasha vadham) okati kaadhu. meeru elangana poratanni enimidhi savncharala poratanga choodakudadhu.

  Prapancha charithralone ekkuva kalam poratam chesina prantham telangana ani charithra karulu cheputharau. 13 va shthabdham lo modhalyina poratam (bharatha swathathanthra poratala dheetuga)chaala rojulu konasagindhi. sayudha poratam telangana lo 1950 varaku undhanadam lo athishayokthi ledhu. adhi samasi Akhilandra erpaddaka, 60 lo jarigina vimukthi udyamam 100 la pranalanu baligondhi.

  Nizam state lo undipovadam valana, ikkadi prajala bhadalu, poratalau, rajakar udhyamalu, acharalau, basha evi charithra lo cheraledhu. Gandhiji warangal lo aginappudu (1940s lo)congress gurunchi, fressdom fight gurunchi matladalekha poyadante ikkadi prajal nissahaya sthithi ardham chesukovachu. aqlanti stage nundi andhra kalisina tharuvatha conflict erpadadam sahajam. Gentle men agreement, 610 GO lantivi parishkaralu kakapoga , rajakiya vadhula chethilo asthralu ga marithe samasya ila jatilamavuthune untundhi.

  kaabatti nenu cheppadhaluchukundhi, prathi porataniki savallaksha karanalu untayi. avi sahethukamu kooda kavachu. KCR valla gani, chenna reddy valla gaani ee poratam lo nastapoyindhi, pranalu arpichindhi telangana valle kaani marevaru kaadhu. kabatti vaari abhiprayanni amodhinchina lekunna telangan prajala poratanni kachithanga abinandhichaali. mee chivari (last but one)pera maroka sari chadhuvukondi. sunnitha vishyalani ila pulla virupga muginchadam manchidhi kaadgu.

 27. 29 vinay chakravarthi 5:46 ఉద. వద్ద ఆగస్ట్ 24, 2009

  @abrakadabra…………

  today no work so i have gone through ur blog………

  tdp vallu vesi vundochhemo jp ki…naku daanimeeda no questions…
  but
  tanu dabbulu panchaledu ani meeru akkadinundi ela cheppagalaru…..

  rattayya aa night money panchadani..kookatpallilovunna evarini adigina chebutaaru………ma friends live choosaru anta….

  rattayya panchutunte j.p ki teleedu anukolemu kada…..

  alane nenu j.p manchivaadu ane nammutaanu gaani but over confidence and complaint box laaga anipistaadu.

  tanu solutions choopinchadu…….

  for example sez vishayam lo dry fields teesukovaddani antaadu ok..adi chinnapillalaku kooda telusubut….
  but tanu eme chesinatlu kanipinchadu asalu protest chesinatle anipinchadu govt ni…….maatladatam veru poraadatam veru maaku maatlade vaaru vaddu…………


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: