నన్ను దోచుకోని తాజ్ మహల్ – 1/3

చాణక్యపురిలో పనుండి ఆరు నెలల క్రితం న్యూఢిల్లీ వెళ్లాను. అదే మొదటి సారి రాజధాని నగరం చూడటం. మూడు రోజుల పాటు అక్కడే ఉన్నాను. ఈ మూడు రోజుల్లో జామా మసీద్, ఎర్ర కోట, ఇండియా గేట్, పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ వగైరా చూశాను. లోటస్ టెంపుల్ అనబడే బహా-యి ప్రార్ధనా మందిరాన్ని కూడా చూశాను. బాగుంది కానీ, మరీ నేననుకున్నంత గొప్పగా ఏమీ అనిపించలేదు. చివరి రోజు అక్షర్ ధాం కి వెళ్లాను. అత్యద్భుతంగా అనిపించిందది. నా వరకూ తాజ్ మహల్ కన్నా అక్షర్ ధామే బాగుందనిపించింది. అన్యాయమయిన పోలికే – అయితే నేనలా అనటానికి పరిస్థితుల ప్రభావం చాలా ఉంది.

తాజ్ మహల్ కూడా ఆ మూడు రోజుల్లోనే చూశాను. అదే మొదటి, ఇప్పటిదాకా చివరి సారి తాజ్ చూడటం. ఢిల్లీ నుండి ఆగ్రా ప్రయాణం ఓ వింత అనుభవం నాకు. ఆ ప్రయాణంలో ఎంతగా విసిగిపోయానంటే, ఎట్టకేలకు ఆగ్రా చేరి తాజ్ చూసిన తొలి క్షణంలో నాకే అనుభూతీ కలగలేదు!

ఆగ్రా వెళ్లటానికి ఢిల్లీ పర్యాటక విభాగం వాళ్లు కారు అద్దెకిస్తారని నా స్నేహితుడు చెప్పాడు కానీ నేను బస్సులో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. రైళ్లు, బస్సులు ఎక్కక పదేళ్లవుతుంది. రక రకాల మనుషులతో కలిసి ప్రయాణించటానికి వచ్చిన ఒక అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ఎ.పి.భవన్ దగ్గర నుండి ఎవరో తెలుగువాళ్లు ఆగ్రాకి టూరిస్ట్ బస్ సర్వీసులు నడుపుతారని తెలిస్తే ముందు రాత్రే వెళ్లి సీట్ రిజర్వ్ చేసుకున్నాను. ‘ఎక్కడుంటారు సార్’ అనడిగితే ‘ఎం.పీ. క్వార్టర్స్ లో’ అన్నా నేను. ‘రేపు ఉదయం ఐదు గంటలకు అక్కడ ఉంటుంది బస్సు. వచ్చేయండి’ అన్నాడు టికెట్టిచ్చినతను.

తరువాతి రోజు నాలుగ్గంటలకే లేచి తయారై ఐదుకల్లా బయటికొచ్చి బస్సుకోసం నిరీక్షణ మొదలెట్టాను. జనవరిలో ఢిల్లీలో ఎముకలు కొరికే చలి ఉంటుందంటే ఏమోననుకున్నా కానీ ఆ రోజు అనుభవంలోకొచ్చిందది. కనుచూపుమేరలో మరో జంతువేదీ లేదు. అప్పుడో ఆటో, ఇప్పుడో కారు తప్ప రోడ్డు మీద వాహనాల సందడీ లేదు. చలికి వణుకుతూ ఆ పొగమంచులో బిక్కుబిక్కుమంటూ నేనొక్కడినే.

ఐదు దాటిపోయింది కానీ బస్సు రాలేదు. ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తరు. ఆరయ్యింది. వీధుల్లో వాహనాల సంచారం ఎక్కువయింది. సైడ్ వాక్ మీద జాగర్ల హడావిడి మొదలయింది. అయినా బస్సు జాడ లేదు. పదే పదే ఫోన్ చేస్తే చివరికెవరో ఎత్తి హిందీలో ఏదో మాట్లాడారు. నాకు హిందీ బాగానే అర్ధమవుతుంది కానీ మాట్లాడటం సరిగా రాదు. వాడికేమో తెలుగు, ఇంగ్లీషు రెండూ రానట్లున్నాయి. వచ్చీ రాని హిందీలో తిప్పలు పడి నా సంగతి చెబితే ‘బస్సు బయల్దేరింది. కాసేపట్లో వస్తుంది. వెయిట్ చేయండి’ అని ఠపీమని ఫోన్ పెట్టేశాడతను. మన దేశంలో రైళ్లూ బస్సులూ ఎప్పుడూ లేటే కదా, ఇంకాసేపట్లో వస్తుందేమో చూద్దామనుకుని మళ్లీ నిరీక్షణ మొదలెట్టా.

పొగ మంచు కరిగిపోయింది. జాగర్లు పోయి, స్కూలు పిల్లలు బ్యాగులతో రావటం మొదలెట్టారు. నేనున్న చోటు పక్కనే స్కూల్ బస్ స్టాప్ ఉన్నట్లుంది. ఆ పిల్లలంతా నాకేసి వింతగా చూస్తున్నారని అనుమానం. ఎందుకలా చూస్తున్నారో తర్వాత తెలిసింది. చలిలో అంతసేపు నిలబడేసరికి నా నెత్తిమీది జుట్టు అట్టకట్టినట్లయిపోయింది. పెద్ద బరువైన జాకెట్ తొడుక్కున్నా కానీ దానికి తలని మూసే హుడ్ లేదు. వీపునో బ్యాక్ పాక్, చేతిలో ఎస్.ఎల్.ఆర్. మరియు దాని తాలూకు అరడజను లావుపాటి కటకాలని భారంగా మోస్తూ ఓ కెమెరా బ్యాగ్. ఇవి చాలనట్లు రెండో చేతిలో ట్రైపాడ్. సోంపాపిడీ అమ్ముకునేవాడిలా కనిపించుంటా ఆ పిల్లలకి.

ఏడున్నరప్పుడు నాలుగయిదు సార్లు మళ్లీ ఫోన్ చేస్తే ముందు రాత్రి టికెట్టిచ్చిన తెలుగాయన దొరికాడు. ‘బస్సెప్పుడో ఆగ్రా వెళ్లిపోయిందండీ. మీ సంగతి మర్చిపోయినట్లున్నాడు డ్రైవర్’ అన్నాడతను తాపీగా. వళ్లు మండిపోయింది నాకు. అంత సేపు నన్ను చలిలో నిలబెట్టినందుకు ఫీలవుతున్నట్లుగా కూడా లేడు. ఇదంతా మామూలే అన్నట్లుంది అతని వ్యవహారం. పైగా ‘రేపు తీసుకెళతాం తప్పకుండా’ అన్నాడు ఏదో ఉపకారం చేస్తున్నట్లు. ఇంకా మండింది నాకు. కాస్త గట్టిగా అరిచాను. ‘సరే. వచ్చి మీ టికెట్ డబ్బు వాపసు తీసుకోండి. అరుస్తారెందుకు?’ అన్నాడు విసుగ్గా. గట్టిగా నిలదీస్తే ప్రత్యామ్నాయమేదన్నా చూపిస్తాడేమోనని నా ఉద్దేశం. అది కుదిరేపని కాదని అర్ధమయిపోయింది. ‘టికెట్ డబ్బులు మీరే ఉంచుకోండి’ అని కోపంగా ఫోన్ పెట్టేశాను.

ఆ రోజు వెళ్లకపోతే ఆగ్రా వెళ్లటం ఇక కుదరదు. తర్వాతి రోజు సాయంత్రం నేను ఢిల్లీనుండి వెళ్లిపోవాలి. ఎలాగైనా ఆ రోజే ఆగ్రా వెళ్లాలని నిర్ణయించుకున్నా. దారినపోయే ఓ ఇంగ్లీషు తెలిసిన పెద్దాయన్ని ఆపి ఆరా తీస్తే దగ్గర్లో ఢిల్లీ టూరిజం వాళ్ల ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్లండి వాళ్లేదన్నా కారు సమకూరుస్తారు మీకు అన్నాడాయన. ఆయనే ఓ ఆటో ఆపి నన్నెక్కించి పంపించాడు. టూరిజం ఆఫీసుకెళ్లేసరికి ఎనిమిదిన్నరయింది. ఢిల్లీ టూరిజం ఆఫీసంటే పెద్దగా ఉంటుందని ఊహించుకున్న నాకు దాన్ని చూశాక ఆటోవాలా ఏమన్నా మోసం చేశాడా అని అనుమానమొచ్చింది. బయట ఏదో ప్రైవేట్ ట్రావెల్స్ బోర్డు తగిలించుంది మరి. అయితే ఆటోవాలాతో వాదించే ఓపికా, హిందీ పటిమా రెండూ లేకపోవటంతో నోరు మూసుకుని ఏదో ఒకటి అనుకుంటూ అందులోకే అడుగు పెట్టాను.

చిన్న ఆఫీసే కానీ లోపలంతా గందరగోళంగా ఉంది. ఉన్న రెండు గదుల్లోనే పదిమందిదాకా హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్లలో ఉద్యోగులెవరో, నాలాంటి కస్టమర్లెవరో అర్ధం కాలేదు. ఎవరితో మాట్లాడాలో అర్ధం కాక అయోమయంగా చూస్తుంటే ఒకతను వచ్చి పలకరించాడు తమిళ యాస కలిసిన ఆంగ్లంలో. అతనికేసి చూశా. తమిళాయన లాగానే ఉన్నాడు. ‘ఫర్వాలేదు మనోడే’ అనుకున్నా, హిందీ వాళ్లేదో నాకు శత్రువులైనట్లు. ఆఫీసు మేనేజరట అతను. నిమిషం గడిచేలోపు నేను తెలుగువాడినని కనిపెట్టేశాడు. ‘నానూ తెలుంగే సార్. మా వాళ్లు ఆంధ్రానుండొచ్చి కోయంబత్తూర్లో సెటిలై పూడిస్తిరి’ అన్నాడతను. ఇతనేమో కోయంబత్తూర్నుండి చెన్నై దాన్, అందనిండీ ఢిల్లీకీ వచ్చి పూడ్చాడట. ‘నానూ తెలుంగే’ అన్న మాట చెవినబడగానే ప్రాంతీయ భావావేశం మరింత పొంగి పొర్లింది నాలో. అతనూ అలాగే అనుకున్నాడో, లేక చాలా మంచి వాడో కానీ మొత్తానికి నేను వారిస్తున్నా వినకుండా ముందొచ్చిన కస్టమర్లని పక్కనబెట్టి నాకు అప్పటికప్పుడే కారు ఏర్పాటు చేశాడు. ‘మీకు మంచి డ్రైవర్నిస్తుండా సార్. రొంబ నమ్మకస్తుడు’ అన్నాడు అభిమానంగా. పైగా నేనడక్కపోయినా డిస్కౌంటు కూడా ఇచ్చేశాడు. ఇంతకీ, అతనిది ప్రైవేట్ ట్రావెల్సే కానీ అది ఢిల్లీ టూరిజం వాళ్ల అధికారిక సర్వీసు కూడానట – ఆటోవాలా నన్ను మోసం చేయలేదు.

కారు డ్రైవర్ పేరు రాజు. పాతికేళ్లలోపుంటాయతనికి. బీహార్ నుండొచ్చాడట. మిగతా రోజంతా వచ్చీ రాని ఇంగ్లీషులో అతను, అతని ఇంగ్లీషుకన్నా ఘోరమైన హిందీలో నేను తెగ మాట్లాడేసుకున్నాము. నా ఆగ్రా ప్రయాణంలో నాకెదురైన రెండవ మరియు చివరి స్నేహశీలి ఇతను.

నాలుగ్గంటలకే లేచి ఏమీ తినకుండా బయల్దేరటంతో కడుపులో మూషికరాజాలు పరుగెడుతున్నాయి. ఉత్తరాది తిండి దెబ్బకి రెండు రోజులకే నా నాలుక చప్పబడిపోయింది. దాంతో ఎంత ఆలస్యమయినా సరే దోసెలో, ఇడ్లీలో కడుపులో పడితే కానీ ఆగ్రాకి బయల్దేరకూడాదని నిర్ణయించేసుకుని ఆ మాటే రాజుకి చెప్పాను. ‘ఫికర్ మత్ కరో సాబ్’ అంటూ ఐదు నిమిషాల్లో పది గొందులు తిప్పేసి శరవణ భవన్ ముందాపాడు కారుని. ఇద్దరం బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి ఆగ్రాకేసి బయల్దేరాం. పదకొండు గంటలు కావస్తుందప్పటికే. ఢిల్లీ నుండి ఆగ్రాకి 250 కిమీ దూరం. రోడ్లెలా ఉంటాయో, ఆగ్రా వెళ్లేసరికి నా ఒళ్లు హూనమయిపోతుందేమో అనుకుని ఆ మాటే అడిగాను రాజుని. ‘జబర్దస్త్ హైవే సాబ్. ఐదారు గంటల్లో వెళ్లిపోతాం’ అన్నాడతను కులాసాగా. అతని మొదటి వాక్యానికి ఉప్పొంగిన ఉత్సాహం రెండో వాక్యానికి చప్పున చల్లారింది. జబర్దస్త్ హైవే అయితే నూటా యాభై మైళ్లకి ఐదారు గంటలు పట్టటమేంటో అర్ధం కాక ఓసారి తలగోక్కున్నాను.

అయితే కాసేపటికే దానికి సమాధానం దొరికింది. ఢిల్లీ ట్రాఫిక్ లో ఈదుకుంటూ ఊర్ళోనుండి బయటపడేసరికే ఒంటిగంటయింది. అప్పటికి మేమొచ్చింది పాతికో ముప్పయ్యో కిలోమీటర్లు మాత్రమే! ఢిల్లీ దాటి కాస్త ట్రాఫిక్ తగ్గగానే రాజు తూనీగలాగా దూసుకుపోయాడు. దారి పొడుగునా పచ్చటి పంటపొలాలు. హైవే నిజంగానే జబర్దస్త్ గా ఉంది. మధుర సమీపంలో హైవే పక్కన కనపడిన మెక్ డొనాల్డ్స్ లో లంచ్ చేయటానికి కాసేపాగాము. నాలుగున్నర ప్రాంతంలో కారు ఆగ్రా కోట దగ్గర ఆపాడు.

(సశేషం)

ఫొటోలు (కనిపించే క్రమంలో)
1. ఇండియా గేట్ వద్ద ఓ బాల వ్యాపారి
2. ఇండియా గేట్ వద్దే మరో వీధి వర్తకుడు
3. రాజధానిలో ఓ మంచు కురిసే ఉదయం
4. సంధ్యా సమయంలో జామా మసీదు
5. ఆగ్రా ఎర్ర కోట

6 స్పందనలు to “నన్ను దోచుకోని తాజ్ మహల్ – 1/3”


 1. 1 చక్రవర్తి 10:41 సా. వద్ద జూన్ 15, 2008

  ఆర్నెల్ల క్రిందటి సంగతి ఆలస్యంగా నైనా సెలవిచ్చారు. తాజ్ మహాల్ చూడడానికి వెళ్ళేటప్పుడు,వెంట చికాకుల్ని తీసుకెళితే ఇంతే.. ఇలాగే ఉంటుంది. ఈ సారి వెళ్ళేటప్పుడు నాకు ఒక తంతి వెయ్యండి, నేను మీ మార్గాన్ని సుగమం చేస్తా.. అలా అని చెప్పి ఆకాశయానాన్ని మాత్రం సూచించను.

 2. 2 kranti 10:51 సా. వద్ద జూన్ 15, 2008

  🙂 “సోంపాపిడీ అమ్ముకునేవాడిలా కనిపించుంటా ఆ పిల్లలకి.” కేక పెట్టించారు.రెండోభాగంలో ఫోటోలేమయినా ఉంటే పోస్ట్ చెయ్యండి.

 3. 3 కొత్తపాళీ 4:47 ఉద. వద్ద జూన్ 16, 2008

  బస్సెప్పుడో ఆగ్రా వెళ్లిపోయిందండీ. మీ సంగతి మర్చిపోయినట్లున్నాడు డ్రైవర్’ అన్నాడతను తాపీగా. – LOL
  ఇల్లాంటిదే హైదరాబాదులో నాకో అనుభవం అయింది. బ్లాగుతా ఎప్పుడో

 4. 4 కె.మహేష్ కుమార్ 6:20 ఉద. వద్ద జూన్ 16, 2008

  చాలా బాగుంది మీ తాజ్ దర్శన ప్రయత్నం. అసలు తాజ్ ను చూసారో లేదో తరువాత టపాలో చెప్తారన్నమాట. ఇంకెవరో కామెంటినట్టి కాస్త చాయాచిత్రాలుంటే పెట్టి బ్లాగు శోభని పెంచండి.
  http://www.parnashaala.blogspot.com

 5. 5 అబ్రకదబ్ర 12:57 సా. వద్ద జూన్ 16, 2008

  క్రాంతి/మహేష్,

  మంచి సలహా. Thank you. వచ్చేభాగాలకు తప్పకుండా ఫొటోలు జత చేస్తాను. ఈ భాగానికి కూడా జత చేశాను – చూడండి.


 1. 1 పొద్దు » Blog Archive » జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం 10:57 సా. వద్ద జూలై 1, 2008 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: