నైరుక్ ఖాన్

‘బాలీవుడ్ బాద్షాకి అవమానం’ – పంద్రాగస్టున భారతదేశాన్ని భూకంపంలా కుదిపేసిన వార్త. స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకోటానికి అమెరికా వచ్చిన షారుఖ్ ఖాన్‌ని నెవార్క్ విమానాశ్రయంలో తనిఖీ కోసం రెండు గంటలకి పైగా ఆపేశారంటూ – అది భరత జాతి మొత్తానికీ జరిగిన ఘోరావమానంగా చిత్రీకరిస్తూ (సల్మాన్ ఖాన్ వంటి ద్రోహి మినహా) బాలీవుడ్ చిత్రరంగం యావత్తూ అగ్గి మీద గుగ్గిలమైతే, కేంద్ర మంత్రిణి అంబికా సోనీ మరో అడుగు ముందుకేసి ఇకనుండీ మనదేశమొచ్చే హాలీవుడ్ ప్రముఖులని మనమూ అంతకన్నా మిన్నగా అవమానించి తీరాలని తీర్మానించారు.

జాతి గౌరవానికి సంబంధించిన ఇటువంటి విషయాలపై ఏ మాత్రం రాజీపడని, ఇంత వేగంగా, తీవ్రంగా స్పందించే ప్రభుత్వం ఉండటం భారతీయులుగా మనమందరం గర్వించాల్సిన విషయం. రంధ్రాన్వేషులు వీటిని తాటాకు శబ్దాలుగా కొట్టిపారేయొచ్చు. వాటిని పట్టించుకోనవసరం లేదు. రేపో మాపో పార్లమెంటులో సైతం ఈ విషయం ప్రస్తావనకి రావచ్చు. ఈ అతి ముఖ్యమైన విషయం గురించి సభ్యులంతా పార్టీలకతీతంగా, మిగతా చిల్లర విషయాలని – అంటే స్వైన్ ఫ్లూ మహమ్మారి, పప్పు దినుసుల ధరవరలు, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, మహిళా బిల్లు, మొదలగునవి – తాత్కాలికంగా పక్కనబెట్టి కొన్ని గంటలపాటు చర్చించి ప్రజాధనాన్ని సద్వినియోగం చెయ్యొచ్చు.

ఈ సందర్భంగా, దేశభక్తి నరనరానా నింపుకున్న ఓ సగటు భారతీయుడిగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉడతా భక్తిగా నావి కొన్ని సూచనలు. హాలీవుడ్ ప్రముఖ నటీనటుల పేర్లతో హిట్‌లిస్ట్ ఒకటి తయారు చేయించి దాన్ని – వారి ఫొటోల సహితంగా – దేశంలోని విమానాశ్రయాలన్నిట్లోనూ పంపిణీ చేయించాలి. బస్టాండులు, రైల్వే స్టేషన్లలో జేబుదొంగల ఫోటోలు అంటించినట్లు – విమానాశ్రయాల్లో వీటిని అంటించాలి. విమానాశ్రయాల సిబ్బందికి ఆయా నటీనటులను – వాళ్లు మారువేషాల్లో వచ్చినా సరే – గుర్తుపట్టగలిగే విధంగా తర్ఫీదునివ్వాలి. ఆ నటీనటుల పేరు ప్రఖ్యాతులని బట్టి, వారి ఇంటి పేర్లు, చివరి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పెంపుడు కుక్కల పేర్లు, ఇత్యాది వివరాల ఆధారంగా వారికి ర్యాంకింగ్స్ ఇవ్వాలి. ఆ ర్యాంకింగ్స్ ఆధారంగా ఎవరిని ఎలా అవమానించాలి అనే విషయంలో తనిఖీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. దీని కోసం అత్యున్నత బోధనా విలువలతో, ఆధునాతన వసతులతో ఒక శిక్షణాకేంద్రాన్ని నెలకొల్పాలి. యూజీసీ సారధ్యంలో బోధనాంశాలు రూపొందించాలి. వీటన్నిటికీ అవసరమయ్యే నిధులను ప్రత్యేక విద్యా సెస్సు విధించటం ద్వారా ప్రజల నుండి వసూలు చేయవచ్చు. దేశ ప్రతిష్టకి సంబంధించిన విషయం కాబట్టి ఈ పన్నుని ప్రజలు ఆనందంగా చెల్లిస్తారనటంలో అనుమానం లేదు. అప్పటికీ తప్పకపోతే – ఈ పన్ను ఆవశ్యకత గురించి ప్రజలకు విశదపరిచేందుకు దేశవ్యాప్త ప్రచారం చేపట్టాలి. బాలీవుడ్ నటీనటులు, క్రికెట్ స్టార్లతో వివిధ భాషల్లో ఒక నిమిషం నిడివిగల ప్రచారచిత్రాలు రూపొందించాలి. వాటి కోసం ఏటా నూరు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లోనుండి కేటాయించాలి. వీటన్నిటి నిర్వహణ కోసం కేంద్ర స్థాయిలో టిఎఫ్‌టి (టిట్ ఫర్ టాట్) శాఖని నెలకొల్పి దానికో సమర్ధులైన మంత్రివర్యుని నియమించాలి. హాలీవుడ్ తారలని అత్యుత్తమంగా అవమానించిన ప్రతిభావంతులకు ఏటేటా ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వాలి. వారి పేర్లను భారతరత్న, పద్మ అవార్డుల కోసం పరిగణించాలి.

చివరగా ఒక అతి ముఖ్యమైన విషయం. స్థాయిని బట్టి వేధనా పద్ధతుల్లో తేడాలున్నా, వారిని వదిలిపెట్టే విషయంలో మాత్రం ఒకటే మార్గదర్శక నిమయం ఉండాలి. అమెరికా అధ్యక్షుడు మన ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఫోన్ చేసి సదరు డిటైనీ తరపున క్షమాపణ వేడుకుంటే మాత్రమే ఆ తారని వదిలి పెట్టాలి.

దేశీయంగా పై చర్యలు చేపడుతూనే, ‘ఖాన్’ చివరి పేరుగాగల భారతీయులని ఎటువంటి తనిఖీ లేకుండా తమదేశంలోకి అనుమతించేలా అంతర్జాతీయ స్థాయిలో అమెరికాపై ఒత్తిడి తేవాలి. అమెరికా మెడలు వంచటానికి అవసరమైతే ‘అణు ఒప్పందం నుండి వైదొలగుతాం’, ‘మీ ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్‌ని నిషేధిస్తాం’ తరహా బెదిరింపులకీ వెనుకాడకూడదు.

పై చర్యలు తీసుకుంటే అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట ఇనుమడించటం తధ్యం.

* * * * * * * *

షారుఖ్‌ని ఆపింది అక్షరాలా అరవై ఆరు నిమిషాలు – అది కూడా అతని లగేజ్ ఆలస్యంగా రావటం వల్ల. అతనేమో రెండు గంటలకి పైగా ఆపారంటున్నాడు. పోనీ రెండుగంటలు ఆపారనే అనుకుందాం. ఆ మాత్రానికే రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరమేముంది? ఈ గొడవ గురించి అమెరికన్ మీడియాలో వచ్చిన వార్తలు మన మీడియా వార్తలకి భిన్నంగా ఉండటం ఆసక్తికరం.

అమెరికన్ మీడియా కథనం ప్రకారం – మన ‘బాద్షా’ అమెరికా వచ్చిన అసలు కారణం త్వరలో విడుదలవనున్న అతని ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా ప్రమోషన్ నిమిత్తం. ఈ ‘స్వతంత్ర సంబరాలు జరుపుకోవటం’ అనేది కొసరు పని మాత్రమే. ఆ కొసరు పనీ అతను ఉచితంగా ఏమీ చెయ్యడనేది బహిరంగ రహస్యం. అతని ఆదాయం, అతనిష్టం కాబట్టి ఆవిషయం మనకి అంత ముఖ్యం కాదు. ముఖ్యమైనది వేరేదుంది. అది – ‘మైన్ నేమ్ ఈజ్ ఖాన్’ చిత్ర కథ. సెప్టెంబరు పదకొండు దాడుల అనంతరం అమెరికాలో ఒక భారతీయ ముస్లిం తన పేరు చివర ‘ఖాన్’ ఉండటమ్మూలాన ఎదుర్కొనే జాతి వివక్ష అందులో ప్రధానాంశం.

అమెరికా విమానాశ్రయంలో తన పేరు వెనక ‘ఖాన్’ ఉందన్న కారణంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు రాచిరంపాన పెట్టారని షారుఖ్ గగ్గోలు పెట్టటానికీ, అతని సినిమా కథకీ, అతను అమెరికా వచ్చిన అసలు కారణానికీ లంకె పెట్టుకోండి. ఇదంతా కాకతాళీయమా లేక ప్రచారపుటెత్తుగడా?

11 స్పందనలు to “నైరుక్ ఖాన్”


  1. 1 a2zdreams 1:28 సా. వద్ద ఆగస్ట్ 17, 2009

    సెక్యురిటి చెక్ మీద చేస్తున్న ఈ రాద్దాంతం చూస్తుంటే మాములుగానే చిరాకు అనిపిస్తుంది. మీరన్నట్టు మూవీ పబ్లిసిటి కోసం అయితే తిట్టడానికి నో వర్డ్స్.(^&*&*%^!&@*#*)

  2. 3 చిలమకూరు విజయమోహన్ 6:40 సా. వద్ద ఆగస్ట్ 17, 2009

    Wonderful

  3. 4 వికటకవి 7:29 సా. వద్ద ఆగస్ట్ 17, 2009

    🙂 ఏదో ఇప్పుడిలా ఇక్కడ విరివిగా మన దేశీయులుండటం మూలాన అసలు నిజాలు ఇలా తెలుస్తున్నాయి గానీ, ఓ పదేళ్ళ కిందటే ఇలా జరిగితే, మన ఖాన్ చెప్పిందే వేదం అయ్యుండేదేమో.

  4. 5 సాయికిరణ్ కుమార్ కొండముది 8:46 సా. వద్ద ఆగస్ట్ 17, 2009

    కరెక్టుగా చెప్పారు. రాబోయే సినిమాకి పబ్లిసిటీ స్టంటు తప్ప మరేమీ కాదు.

  5. 6 mohanrazz 11:46 సా. వద్ద ఆగస్ట్ 17, 2009

    excellent points..each and every point is true. స్వతంత్ర సంబరాల్లో పాల్గొనాలన్నా – తన సినిమాకి ప్రమోషన్ కలిసిరావాలి, పాల్గొన్నందుకు తృణమూ, పణమూ దక్కాలి అని అన్నీ బేరీజు వేసుకుని మరీ ప్లాన్ చేసుకునే పక్కా బిజినెస్ మ్యాన్ షారుఖ్..surely this is a ploy..

  6. 7 లలిత 12:06 ఉద. వద్ద ఆగస్ట్ 18, 2009

    ఇదంతా” మై నేం ఇస్ ఖాన్ ” సినిమా పబ్లిసిటీ కోసం అనీ పొద్దున్నే ఈనాడులో చదివాన్లెండి. అయినా ఏం ఐడియా అండీ? అనుకోకుండా వచ్చిన అవకాసాన్ని ఇలా వాడుకున్నాడన్నమాట. ” వాట్ ఏన్ ఐడియా ఖాన్ జీ “(దిక్కుమాలిన ఐడియా )

    విజయ మోహన్ గారూ , మీ బ్లాగ్ లో కామెంట్ చెయ్యటానికి శెతవిధాలా ప్రయత్నించానండీ. ఎందుకో కుదరలేదు.
    ఇక్కడపెడుతున్నాను . స్వీకరించండి.

    ” బాగుంది” దీనికి పర్యాయ పదాలు వెతుక్కోవాలండీ. ఎందుకంటే మీ బ్లాగుకొచ్చి ఒకే మాట అస్తమానూ చెప్పాల్సొస్తుంది.

  7. 9 bonagiri 4:54 ఉద. వద్ద ఆగస్ట్ 18, 2009

    రుఖ్. రుఖ్.. రుఖ్…

    షారుఖ్ రుఖ్..

  8. 10 రవి చంద్ర 6:46 ఉద. వద్ద ఆగస్ట్ 18, 2009

    ఒక సామాన్యుణ్ణి కూడా షారుక్ ఖాన్ లాగా ఆపి సోదా చేస్తే అతనికి చెప్పుకోవడానికి ఎవరుంటారు? Let’s stop it here. we are discussing too much on this 🙂

  9. 11 saipraveen 6:19 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2009

    అసలు జరిగినది ఒకటైతే! దాన్ని వివరించే వారు ఆవేశంలో వేరుగా వర్ణిస్తే. ఆ మార్చిన విషయాన్ని మన మీడియా మనకు మసాలా అద్ది అందిస్తుంది. ఇలా తనిఖి చేయడం మన భరతీయ ప్రముఖులకు కొత్తేమి కాదు.


వ్యాఖ్యానించండి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 304,035

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.