క్షుర ఖర్మ

‘ఎవరికీ తలవంచకు’ అన్న పల్నాటి పౌరుషం ఉగ్గుపాలతోనే విపరీతంగా వంటబట్టింది నాకు. చిన్ననాడే మొదలైన ఇగో ఇంతింతై వటుడింతై అన్నట్లు నాతోపాటే ఎదిగింది. అయితే, ఎంత జాగ్రత్తగా కాచికాపాడుతున్నా ఆ అహానికి నెలకోసారి చావుదెబ్బ తగులుతూనే ఉంటుంది. ఇష్టం లేకున్నా ఎందరు బార్బర్ల ముందు తలొంచుంటానో! అందుకే క్షవరం అంటే భలే చిరాకు నాకు. మంగలి వాళ్లంటే తగని కోపం కూడా.

నా చిన్నప్పుడు మంగలాయన ఇంటికే వచ్చి గెడ్డాలూ, క్షవరాలూ చేసెళ్లే పద్ధతి అమల్లో ఉండేది. మా ఆస్థాన క్షురకుడి పేరు రామకోటి. ప్రతి నెలా రెండో ఆదివారం ఉదయం పది గంటలకి గంట కొట్టినట్లు ఠంచనుగా దిగిపోయేవాడు – చేతిలో ఆయుధాల పెట్టెతో సహా. ఇంట్లోనుండి మావాళ్లు బలవంతంగా నన్ను వసారాలోకి గెంటేవాళ్లు. అక్కడ, రామకోటి కత్తులు నూరుతూ నాకేసి చూసి అదోలా నవ్వేవాడు. చంద్రబాబుని చూసి వైఎస్ నవ్వే నాగభూషణం నవ్వులా ఉండేదది. నన్నో కుర్చీలో కూలేసి కత్తి మెడమీదపెట్టి పని మొదలెట్టేవాడు. నేనేమో తల పైకెత్తి నిటారుగా ఉంచటానికి విశ్వ ప్రయత్నం చేస్తుండేవాడిని. వెంటనే ఠపీమని నా నెత్తినోటి పీకి తలకాయని కిందకొంచేసేవాడు రామకోటి – తల కొట్టేయటం అంటే ఇదే. నాకు చాలా బోలెడు అవమానంగా అనిపించేది. ఎలాగో రోషం దిగమింగుతుంటే మరో సమస్య – రామకోటి చేతులు మెడమీద తగిలి ఎక్కడలేని చక్కిలిగింతలూ పుట్టుకొచ్చేవి. ఓ వంక తల వంచాల్సి వచ్చిందన్న కోపం, మరోవంక చక్కిలిగింతలు తెచ్చే నవ్వు, ఇంకోవంక ఇదంతా ఎవరన్నా చూస్తున్నారేమోనన్న పెనుభూతం – వెరసి నా పరిస్థితి హృదయవిదారకం. ఆ కితకితలకి నేనుగానీ కదిలానంటే ‘కదలకండి బాబూ. మెడ తెగుద్ది’ అని హెచ్చరికో, బెదిరింపో అర్ధం కాని స్వరంతో అదిలించేవాడు. పుండుమీద కారం అద్దినట్లు, ‘నాకు ఫలానా రకం క్రాపు కావాలీ’ అనడిగితే రామకోటి కచ్చితంగా దానికి వ్యతిరేకంగా చేసేవాడు. ఏళ్లుగా ఎరిగినవాడు కావటంవల్ల ఇంట్లో ఓటర్ల మద్దతూ అతనికే. చేసేది లేక, తలొంచుకుని గింగరాలు తిరుగుతూ నేలకొరిగిపోతున్న నా ఉంగరాల జుత్తుకేసి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేవాడిని.

కాస్త పెద్దయ్యాక రామకోటిదగ్గర క్షవరం చేయించుకోనని మొండికేసి బార్బరు షాపుకెళ్లటం మొదలెట్టాను. వీళ్లయితే కొత్తవాడినని కాస్త గౌరవం ఇస్తారని చిన్న ఆశ. ఇక్కడ పరిస్థితి చాలావరకూ మెరుగ్గానే ఉండేది. రామకోటికున్నంత చనువు లేకపోవటంతో ఈ బార్బర్లు మరీ బార్బేరియన్లలా మీదపడి గొరిగేయకుండా కాస్త నా ఇష్టాఇష్టాలు కనుక్కుని క్రాపు చేసేవాళ్లు. అయితే వీళ్లూ తల నిటారుగా పెట్టనిచ్చేవాళ్లు కాదు.

మద్రాసులో పైచదువులకెళ్లాక నా క్షవర కష్టాలు మరో రూపం దాల్చాయి. తమళ మంగలులు నేనోటి చెబితే మరో రకంగా అర్ధం చేసుకుని ఏదేదో చేసేసేవాళ్లు. ఆరు నెలలపాటు వాళ్లతో వేగాక ఎలాగో ఒక తెలుగు తెలిసిన క్షురకుడిని వెదికి పట్టుకున్నాను. ఈయనతో ఇంకో రకం కష్టాలు. తమిళమో తెలుగో అర్ధం కాని భాష ఈయనది. ‘సారు వాడికి ఎంద మాదిరి కావాలీ దినం’ అని మొదలు పెట్టేవాడు. నెలకో రకం క్రాపు చేయించుకునే అల్ట్రా మోడర్న్ కుర్రాడ్ని కాదు నేను. ‘పోయిన సారి చేసినట్లే చెయ్యి’ అంటే అదెలాగో అతనికి గుర్తుండేది కాదు. అతనికర్ధమయ్యే తెలుగులో నానా తిప్పలు పడి అదెలాగో వివరించేసరికి తాతలు దిగొచ్చేవాళ్లు. మొత్తానికెలాగో పని మొదలు పెట్టేవాడు. తర్వాత గంటపాటు నా బుర్ర తినేవాడు – తన తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ. ‘మొన్న మాంబళం పూడ్చినాను సార్. అంగె, ఒరు షాప్పులో గుస్పూని (ఖుష్బూ) సూస్తిని.. అంద పొణ్ణు నాకు నిండా పట్టును…’ ఇలా ఉంటుంది అతని గోల. ఆ గోలకి, నెల గడిచి మళ్లీ క్రాపుకెళ్లే రోజు దగ్గరపడేకొద్దీ నాకు గంగవెర్రులెత్తినట్లుండేది. కొన్నాళ్లకి – ఎప్పుడూ వెళుతుండటంతో ఇతనికీ చనువెక్కువైపోయి నా జుట్టుతో ప్రయోగాలు మొదలెట్టాడు. ‘మిలటరీ కటింగ్ సేస్తుమా? రజనీ మాదిరి సేస్తుమా?’ అనడిగి నే చెప్పేది వినకుండా అతనికి తోచిందే చేసేసేవాడు. అయినా వేరే దారిలేక మద్రాసులో ఉన్నన్నాళ్లూ ఇతనికే తలొంచాను.

అమెరికా వచ్చాక క్రాపు కష్టాలు మరింత పెరిగాయి. ఇక్కడ ఎక్కడ చూసినా చైనీస్ క్షురకులే. అందునా ఆడవాళ్లే ఎక్కువ. వాళ్లు మామూలుగానే మనమొకటి చెబితే మరోటి అర్ధం చేసుకునే రకాలు. ఇక క్షవరం విషయంలో ఎక్కువ తక్కువలు మాట్లాడితే ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. ఆ మధ్యోసారి ఓ క్షురకమ్మ నా మెడ మీద కత్తి పెట్టి సెల్ ఫోన్లో వాళ్లాయనతో తగువేసుకుంది. ఆ చైనీస్ గోలలో నాకర్ధమయిందల్లా ‘ఐ కిల్ యు’ అనే మాట మాత్రమే. దెబ్బకి, క్షురకదుర్గ ఫోన్ పెట్టేసేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గజగజ వణుకుతూ కూర్చున్నాను.  మరోసారి How’d you like? అన్న ప్రశ్నకి మీడియం అని చెబితే ఆవిడ గుండు గీసినంతపని చేసేసింది. ‘మీడియం’ అనేది absolute value కాకపోవటం సమస్యైపోయిందన్నమాట. ఏదైతేనేం, వీళ్లు కూడా తాము ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారమే మనకి కత్తిరించేస్తారు కానీ, మన ఇష్టాఇష్టాలని పట్టించుకోరని నా నమ్మకం. వీళ్ల ధాటికి నా హెయిర్ స్టయిల్ నెలకోరకంగా మారిపోతుంటుంది. నచ్చినా నచ్చకపోయినా తల వంచటం మాత్రం తప్పటం లేదు. కొంతకాలంగా ఆడాళ్లని, బట్టతల బాబుల్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, ‘ఆహా. ఎంత అదృష్టవంతులు? ఎవరికీ తల వంచే అవసరం లేదు కదా వీళ్లకి’ అని. అంతకన్నా ఏం చేస్తాం? ఈ జన్మకింతే.

24 స్పందనలు to “క్షుర ఖర్మ”


  1. 1 Kranthi 7:02 సా. వద్ద జూలై 15, 2008

    ఎన్ని బాధల౦డి మీకు.మొన్నేమో క్రికెట్ బాధ,నిన్నేమో చ౦ధస్సు బాధ,నేడెమో క్షవరం బాధ మరి రేపే౦టో?కానీ ఇన్ని బాధలు చెప్పినా వి౦తేట౦టే ఎక్కడా బాధ కనపడలేదు హస్య౦ తప్ప.ఇది కూడా ఒక అద్బుతమైన కళే.Keep witing nice post.

  2. 2 teresa 7:15 సా. వద్ద జూలై 15, 2008

    పేద్ద పొరబాటు మీ last sentence లో- ఆడవాళ్ళకీ ఈ క్షురకర్మ బాధలు తప్పవండీ, కుర్చీలో కూర్చున్నాక లేచే వరకూ కళ్ళు మూసుకుని దేవుణ్ణి తల్చుకోడమే!! cindy crawford లాగా ఊహించుకుంటే ellen degeneres లాగా తిరి్గొచ్చిన సన్నివేశాలు చాలానే ఉంటాయి!
    బట్టతల బాబులకి ఉన్న నాలుగు వెంట్రుకల్నీ అతిజాగ్రత్తగా కాపాడుకునే anxiety కి తోడు వెంట్రుక్కి డాలర్ చొప్పున సమర్పించుకునే pain మాత్రం ఏం తక్కువ చెప్పండి!

  3. 4 వేణూ శ్రీకాంత్ 8:07 సా. వద్ద జూలై 15, 2008

    హ హ బావున్నాయండీ మీ క్రాఫింగ్ కష్టాలు… తమిళ బార్బరుడి తెలుగు భలే గా వ్రాసారు నేనూ చచ్చే వాడ్ని వాళ్ళ తెలుగు భరించ లేక…

  4. 5 teja 8:46 సా. వద్ద జూలై 15, 2008

    man your work is superb. had you been into script writing , you have terrific writing skillls… The way you xpressed was truly superb…
    ok yaar keep writing this kind of posts …..

  5. 7 అశ్విన్ 10:08 సా. వద్ద జూలై 15, 2008

    తమిళ వాడి తెలుగు బావుంది. తరువాత కధ ఏమిటీ ??

  6. 8 చదువరి 10:26 సా. వద్ద జూలై 15, 2008

    క్షవరకల్యాణమ్మీద ఇప్పటికి రెండు గొప్ప జాబులు చదివాను. రెండురెళ్ళ ఆరులో ఒకటి (http://thotaramudu.blogspot.com/2008/01/blog-post.html), ఊకదంపుడులో ఒకటి (http://vookadampudu.wordpress.com/2007/10/01/%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-%E0%B0%85%E0%B0%97%E0%B0%9A%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81/). ఈ మూడో జాబు కూడా వాటి స్థాయిలో ఉంది, అలరించింది. అభినందనలు.

  7. 9 జ్యోతి 1:22 ఉద. వద్ద జూలై 16, 2008

    ప్చ్.. ఎన్ని కష్టాలో. దీనికి పరిష్కారమే లేదా??

    మీరేమో మీ బాధలు చెప్పుకుంటున్నారు. మరి మాకేమొ చదువుతుంటే నవ్వొస్తుంది. ఏమ్ చేయమంటారు??

  8. 10 జగదీష్ 2:06 ఉద. వద్ద జూలై 16, 2008

    నవ్వలేక పోతున్నామండి బాబు… ఎప్పుడూ చేయించుకునే క్షవరం వెనుక ఇన్ని బాధలున్నాయని, మీ టపా చదివాకే గుర్తుకొస్తున్నాయి.

  9. 11 కల 2:10 ఉద. వద్ద జూలై 16, 2008

    ఛీ ఇంత జుట్టుని ఎలా మోసేదిరా దేవుడా? దీనికి తలంటుకోలేక, చిక్కుతీసుకోలేక, దువ్వుకోలేక చస్తున్నాను. అబ్బాయిలకి ఈ problems ఏమీ ఉండవు కదా? హాయిగా వారికీ ఇష్టం వచ్చిన స్టైల్ లో క్రాఫ్ కొట్టించుకొంటారు. స్టైల్ గా చేత్తో పైకి అలా దువ్వుకొంటూ ఫోజులు కొడతారు అని అనుకోనేదాన్ని. మీకు కూడా కష్టాలుంటాయని ఇదిగో ఈ post చదివిన తర్వాతే నాక్కూడా తెలిసింది.
    anyway good one.

  10. 12 Krishna 2:25 ఉద. వద్ద జూలై 16, 2008

    Very funny.

    Americalo chinese kshurakuraalu lawnmowing chesinnattu chesedi.
    bhale navvukunedanni maavaari fashion hairstyles chusi.

  11. 13 సుధాకర బాబు 3:45 ఉద. వద్ద జూలై 16, 2008

    నా రెండు కామెంటులు:

    (1) చదువరి గారి వ్యాఖ్య గురించి – అవును. తోటరాముడు, ఊకదంపుడు, తెలుగోడు – ముగ్గురివీ అదిరేటి కట్టింగులే. ఇంకా ఇలాంటివి కొన్ని వస్తే “క్షురకర్మ విలాస ప్రహసనం” అనే సంకలనంగా ముద్రించనగును.

    (2) సరదాకి మన బ్లాగర్లు అలా వ్రాస్తుంటారు గానీ క్షవరం చేసేవారి నైపుణ్యం చూస్తే నాకు ఆశర్యం వేస్తుంది. అది చాలా కష్టమైన విద్య అని, ఒకసారి కుంచెం ప్రయత్నం చేసిన తరువాత, నాకు తెలిసింది. క్షవర కార్మికులకు అందరికీ నా వందనాలు. హాస్యం సరదాకే గనుక ఎవరూ నొచ్చుకోవద్దండి.

  12. 14 కొత్తపాళీ 3:53 ఉద. వద్ద జూలై 16, 2008

    నేనూ రెండు రెళ్ళ ఆరునీ ఊకదంపుడునీ తలుచుకోబోయా. చదువరి ఆల్రెడీ చెప్పేశారు.

    బావుంది మీ క్షురక ప్రహసనం. కొన్ని ప్రయోగాలు గిలిగింతలు పెట్టాయి.
    ఉగ్గుపాళ్ళు కాదు, ఉగ్గుపాలు. బహుశా అచ్చుతప్పు అయుండచ్చు.

    @ teresa – Cindy and Ellen .. ha ha ha

  13. 17 meenakshi 7:03 ఉద. వద్ద జూలై 16, 2008

    అయ్యో అయ్యో ఎన్ని కష్టాలండి మీకు..:)

  14. 18 అబ్రకదబ్ర 11:23 ఉద. వద్ద జూలై 16, 2008

    @క్రాంతి, జ్యోతి, జగదీష్, మీనాక్షి
    నా బాధని ప్రపంచం బాధగా మార్చటం ఇష్టం లేకే ఈ హాస్యం అద్దకం. బాధే సౌఖ్యమనే భావన రానీమన్నాడుగదా సినీ కవి.

    @తెరెసా,
    మూడు పొరపాట్లు కావాలనే పెట్టాను. రెండింటిని మీరు పట్టేశారు. మూడోది ఇంకా ఎవరూ పట్టుకోలేదు. చూద్దాం, ఎవరు పడతారో 🙂

    @మహేష్, శంకర్రెడ్డి, కల
    ధన్యవాదాలు.

    @వేణు శ్రీకాంత్,
    ఒక్కోసారి అతనికోసం ‘తెమిళం’ నేర్చుకునేకన్నా అసలు తమిళమే నేర్చేసుకుని శుభ్రంగా సెంతామిళ బార్బరుల దగ్గరికే వెళితే బాగుండేదనిపించేది.

    @తేజ,
    ఏదో మీ అభిమానం. స్క్రిప్టులు రాసేంత కళ నాదగ్గర లేదేమో.

    @అశ్విన్,
    తర్వాతిదేంటో అప్పుడే చెప్పేస్తే ఎలా? (అసలు నాకు తెలుస్తే కదా. నిన్న నా చీనీ సహోద్యోగి ఫ్రెష్ గా అంట కత్తెరేయించుకునొచ్చాడు. అందరూ ‘So, you had a hair cut?’ అనడుగుతున్నారతన్ని. దాంతో ఈ క్షుర ఖర్మ మీద రాయాలనిపించింది. ఈ రోజేం తడుతుందో మరి).

    @చదువరి,
    ఇప్పుడే తోటరాముడు, ఊదం గార్ల క్షవర పురాణాలు చదివాను. రెండూ కడుపుబ్బ నవ్వించాయి. ముఖ్యంగా తోటరాముడి స్నేహితుడు దివాకరుని వివరాలు రహస్యంగా ఉంచిన పద్ధతి 🙂 Hair Salon Diaries Trilogy లో మూడో భాగాన్ని నేను పూర్తి చేశానన్నమాట. తోటరాముడు గారి మొదటి భాగం పేరే కాకతాళీయంగా నేనూ పెట్టేశాను.

    @కృష్ణ,
    ‘lawn mowing’ ఉపమానం బ్రహ్మాండం 🙂

    @సుధాకర బాబు,
    మీరన్నది నిజం. అదొక కళ. అంత తేలికగా అందరికీ ఒంటబట్టదు.

    @కొత్తపాళీ,
    అప్పుతచ్చు కాదు. నిజం తప్పే. సరి దిద్దాను. తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    @రవి,
    :):)

    @బాబాజీ,
    మీ మూడెందుకు పాడయిందో అసలు!! ఏదైతేనేం, మళ్లీ మంచి మూడ్ లోకి తేగలిగానంటే ఆనందంగా ఉంది.

  15. 19 శంకర్ 11:42 ఉద. వద్ద జూలై 16, 2008

    మీ కష్టాలు చదువుతుంటే నా కష్టాలు ఇలా కళ్ళ ముందు కనిపించాయి. నన్ను కూడా ఎప్పుడూ మా నాన్నగారు తన ప్రియతమ బార్బర్ దగ్గరకే పంపేవారు. ఆ షాపులో గోడమీద హలీవుడ్,బాలీవుడ్ మోడల్స్(అమ్మాయిలు) స్టిల్స్ ఉండేవి. వీడేంట్రాబాబు కటింగ్ చేసేప్పుడు బుర్ర వంచేస్తున్నాడు ఆ బొమ్మలు కనపడనీకుండా అని తెగ బాధ పడిపోయి త్వరగా గడ్డాలూ,మీసాలూ వచ్చేస్తే బావున్ను అప్పుడు తల పైకెత్తి చేస్తాడు కాబట్టి ఆ బొమ్మల్ని చూడొచ్చనుకునేవాన్ని. కానీ ఏం లాభం నేను ఆ రేంజికి ఎదగకుండానే మేము ఆ ఊరి నుండి మారిపోయాం. ప్చ్ కొత్త ఊరిలో బార్బర్ షాపోళ్ళు అంత అభివృద్ది చెందలేదు. అక్కడంతా హీరోలూ , క్రికెట్ స్టార్ల ఫోటోలే ( వాళ్ళు మోడల్సన్నమాట).. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఉన్నా షాపే అందరికీ దిక్కు. నా దురదృష్టం ఏంటో కాని నే వెళ్ళినప్పుడల్లా అక్కడ పనిచేసే పాత కుర్రాడు మానేయడంతో కొత్తగా పెట్టుకున్న కుర్రాడికి ట్రైనింగు ఇవ్వడానికి కస్టమర్ల కోసం ఎదురుచూస్తుండేవాడు ఆ షాపు వాడు. నా మీద ప్రయోగాలు చేసి రమారమీ ఐదుగురు పట్టభద్రులయ్యారు.

  16. 20 అబ్రకదబ్ర 8:33 సా. వద్ద జూలై 16, 2008

    @శంకర్,
    ఐతే మీ తలో పెద్ద ల్యాబొరేటరీ అన్నమాట 🙂

  17. 21 Naga Muralidhar Namala 12:50 సా. వద్ద ఆగస్ట్ 1, 2008

    చాలా బాగుందండి. నాకు ఈ కష్టాలు షరా మాములే గానీ ఇప్పుడు జుత్తు రాలిపోతుందని కొత్త భాధ.

  18. 22 radhika 9:45 సా. వద్ద ఆగస్ట్ 7, 2008

    ఎవరు ఎవరు ఎవరు మీకు చెప్పి0ది మేము తల వ0చక్కరలెద్దని.
    సూపరు…..తెగ నవ్వి0చేసారు.
    నిజమే కటి0గు చెయ్యడ0 అదొక కళ.మనకి రాదని మా అబ్బాయి జుట్టు పై మూడు సార్లు ప్రయోగ0 చేసి వాడి తలపై గుడి మెట్లని ప్రతిష్టి0చాకా గానీ నాకు తెలియలేదు.

  19. 23 vbsowmya 8:12 ఉద. వద్ద ఆగస్ట్ 17, 2008

    :)) బాగుందండీ…అంటే..ఓ పక్క జాలేస్తోంది కానీ, మీరు చెప్పిన విధానానికి నవ్వాగట్లేదు. క్షురకమ్మ అన్న పదం భలే ఉంది.


వ్యాఖ్యానించండి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,992

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.