ఇట్నుండి నరుక్కొద్దాం

‘మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి?’. నూటికి తొంభై మంది దీనికిచ్చే సమాధానం: అవినీతి. ఆ మాట వినగానే గంగవెర్రులెత్తి  రాజకీయ నాయకులని, ప్రభుత్వ ఉద్యోగులని కలిపి శాపనార్ధాలు పెట్టటం ఆదర్శ భావాలు గల ప్రతి భారతీయుడి లక్షణం. చివర్లో ‘ఈ దేశమింతే, మారదు’ అని ముక్తాయించటమూ వీళ్లకలవాటే. అయితే ఇది ఆ రెండు వర్గాలకి మాత్రమే పరిమితమైన సమస్యా? కానే కాదు. అసలు అవినీతనేది మన రక్తంలోనే ఉంది. అది భారతీయ సమాజం పునాదుల్లో అతి జాగ్రత్తగా కలపబడ్డ ముడిపదార్ధం.

వెంకటేశ్వర్రావు నిప్పులాంటి ప్రభుత్వోద్యోగి. ముప్పయ్యేళ్ల సర్వీసులో ఏనాడూ బల్లకింద చెయ్యి పెట్టి ఎరగడు. అలాంటివాడు, కొన్నాళ్లలో రిటైర్ అవుతాడనగా యాభై వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అన్నేళ్లపాటు శ్రమించి నిఖార్సైన మనిషిగా తెచ్చుకున్న పేరు కాస్తా ఒక్క సంఘటనతో కొట్టుకుపోయింది. ఇంతకీ ఆయన లంచం తీసుకోబోయిన కారణం? ఏకైక కుమార్తె పెళ్లికి కట్నం డబ్బుల కోసం!

వెంకటేశ్వర్రావు లాంటి వాళ్లు కోకొల్లలు. మన సమాజంలో అవినీతి జాడ్యం ప్రబలటానికి కట్నం ఒక్కటే కాదు, ఇటువంటి సంఘరీతులు మరెన్నో కారణం. మనవాళ్లలో బలంగా ఉన్న కుటుంబ విలువలూ దీనికో కారణమే. ‘నా పిల్లలు బాగుండాలి’ అనుకునేవరకూ సరే. వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లల పిల్లలు .. దీనికి అంతెక్కడ? స్థూలంగా చూస్తే ఇది ఇతర సమాజాల్లో కనిపించని కుటుంబ విలువలకి దర్పణం. సూక్ష్మంగా – ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదపై మోజుకి బీజాంకురం. ఇదే అవినీతికి మొదటి మెట్టు.

‘నేను, నా పిల్లలు, నా కుటుంబం’ దాటితే వచ్చేది ‘నా వాళ్లు’. ఎవరీ నా వాళ్లు? వీళ్లు సాధారణంగా సాటి కులస్థులు. మన దేశంలో ఎన్నికల్లో అధిక శాతం అభ్యర్ధుల గెలుపోటములు శాసించేది అతడి కులమతాలే! వాటి లెక్కల్లేకుండా టికెట్ల పంపకం చేసే పార్టీలెన్ని? అభ్యర్ధి ‘మనోడైతే’ అతడి చరిత్రని గాలికొదిలేసి ఓటేసే మారాజులెందర్లేరు?

భావావేశం – ప్రతి భారతీయుడికీ పుట్టుకతోనే అబ్బే గుణం. అనురాగం, ఆప్యాయత, కోపం, ద్వేషం .. అన్నీ ఎక్కువే మనకి. విచక్షణతో కన్నా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం మన నైజం. నిరక్షరాస్యుల్లో ఇది మరింత ప్రస్ఫుటం. నలభై శాతం జనాభా నిరక్షరాస్యులుగా ఉన్న దేశంలో విచక్షణతో ఓట్లేయటం ఏ రకంగా సాధ్యం? ఎంతో కొంత జాగృతమైన ఓటర్ల దృష్టిలోనూ పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం వంటి వాటి తర్వాతి స్థానమే అవినీతిది. చివరిదే లేకుంటే మొదటివి కూడా సమస్యలు కావనే తెలివిడి వీరిలోనూ నాస్తి.

మనవాళ్లకి టన్నుల కొద్దీ ఉన్న మరో గుణం: క్షమ. ఎంత ఘోరం చేసినోడైనా మొసలి కన్నీళ్లు కారిస్తే చాలు,  ‘పోన్లెద్దూ, వాడి పాపాన వాడే పోతాడ్లే’ అంటూ ఉదారంగా క్షమించేసే విశాల హృదయాలు మనవి. హైందవ ధర్మం బోధించే సహనం, క్షమ లాంటి సద్గుణాలని మితిమీరి ఆచరించటమూ అవినీతికి అంటుకట్టిన కారణాల్లో ఒకటి. ఎంతటి పాపాత్ముడైనా చివరి క్షణాల్లో ‘నారాయణ’ అంటే చాలు నేరుగా స్వర్గానికే పోతాడనే పురాణ ప్రబోధాలూ అవినీతికి మరో కారణం. ‘అందిందంతా దోచెయ్, అందులో కొంత శ్రీవారి హుండీలో వేసెయ్’ అనుకునే చేతివాటం సర్కారోద్యోగుల తారక మంత్రం ఇదే.

చెప్పుకుంటూ పోతే ఇలాంటివి బోలెడు. విషయమేమిటంటే – అసలు సమస్య మనమే. అది తిరుపతిలో రికమెండేషన్‌తో క్యూ ఎగ్గొట్టి దర్శనం కానిచ్చుకోవటం కావచ్చు, కాపీ కొట్టి పరీక్ష పాసవటం కావచ్చు, సైకిల్ తొక్కటమే రాకపోయినా లంచం ముట్టజెప్పి టు-వీలర్ లైసెన్స్ సంపాదించటం కావచ్చు, అభిమాన హీరో సినిమాని బ్లాకులో టికెట్లు కొని చూడటం కావచ్చు, నాలుగు రూపాయలు మిగుల్తాయంటే రసీదు లేకుండానే కొనుగోళ్లు చేసేయటం కావచ్చు .. అవకాశమున్నప్పుడు అడ్డదారి తొక్కని వాళ్లెందరు మనలో? ‘చిన్నవేగా’ అనుకునే ఇలాంటి వాటన్నిట్లోనూ దాగుంది మనలో జీర్ణించుకుపోయిన స్వార్ధం. ప్రభుత్వోద్యోగులైనా, రాజకీయ నాయకులైనా మనలోనుండి వచ్చిన వాళ్లేగా. వాళ్లు మనకన్నా భిన్నంగా ఉండే అవకాశమేది? అందుకే, ముందు మనం మారదాం. అట్నుండి కాదు, ఇట్నుండే నరుక్కొద్దాం.

17 స్పందనలు to “ఇట్నుండి నరుక్కొద్దాం”


  1. 1 laxmi 8:45 సా. వద్ద సెప్టెంబర్ 15, 2008

    క్షమా గుణం అంటారా, చేతకాని తనం అంటారా?? 40% చదువుకోని వాళ్ళు వోట్లు వేసి ఈ వెధవ పార్టీ ల ని నెగ్గిస్తున్నారు బాగానె ఉంది కాని చదువుకున్న గొర్రెల సంగతి ఎంటి?? మాకు ఈ తుప్పు పట్టి పోయిన ముసలి నక్కలు వద్దు అని గొంతెత్తి నిరసన ఎందుకు తెలపరు? ఎవరో మోడల్ ని ఎవడో చంపితే కొవ్వొత్తులు వెలిగించి న్యాయం కొసం ఊరీగిన జనం మనల్ని ప్రతి క్షనం నిలువున కాల్చేస్తున్న ఈ రాజకీయ నాయకుల పీడ మాకు వద్దు, పొండి అవతలకి అని ఎందుకు ధర్నాలు, ప్రదర్సనలు చెయ్యరు… ఎంతో మంది ఆత్మ త్యాగ ఫలం ఈనాటి మన స్వతంత్రం కాని దాన్ని నిలబెట్టుకోవతానికి ఎంత మంది ప్రాణ త్యగనికి సిధం గ ఉన్నరు? నేను నా వళ్ళు బాగుంటె చాలు ఎవడెట్లా పొతే మనకి ఎందుకు లె అనుకునె గొర్రెల్లాంటి మన లాంటి జనం ఉన్నంత కాలం ప్రధన మంత్రి ని వెధవ ని చెసి ఆడించె విధవలు పుట్టుకుని వస్తునే ఉంటారు… ఏమంటారు?

  2. 2 chaitanya 11:43 సా. వద్ద సెప్టెంబర్ 15, 2008

    బాగా చెప్పారు అబ్రకదబ్ర గారు. లక్ష్మి గారు చాలా ఆవేశంగా రాసినట్టు ఉన్నారు. కాని మీరు చెప్పింది నిజమే. ఆడేవాళ్ళు ఉన్నంత వరకు ఆడించే వాళ్ళు ఉంటారు.

  3. 3 కె.మహేష్ కుమార్ 1:43 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2008

    మీరు ఆఖరిపేరాలో చెప్పిన చిన్నచిన్న స్వార్థాలే మనదేశాన్ని మొత్తంగా శాసిస్తున్నాయి. ఏచెట్టుకి అంతగాలి అన్నట్టు,ఎంత మనిషికి అంతస్వార్థం అదే మన జీవితలక్ష్యం.అదే మన స్థితికి మూలకారణం.

    ఈ ఆలోచన మూలంగానే నాకు ఈ మధ్య అమెరికా తెగ నచ్చేస్తోంది. ఆదేశంలో ప్రజలతోపాటూ దేశానికీ స్వార్థం మెండు.

  4. 4 కొత్తపాళీ 4:27 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2008

    మీరు ఏవో చాలా కారణాలు చెప్పబోయి ఏదీ సమగ్రంగా చెప్పకుండా ఒదిలేశారు.
    ఎన్నికల రాజకీయాల్ని ఏమాత్రం ఫాలో అయిన వాళ్ళయినా చెబుతారు .. అభ్యర్ధుల ఎంపికకి ముఖ్యమైన అర్హత గెలవ గలిగే అవకాశం .. 2002 – 2004 కాలంలో ఆంధ్ర రాజకీయాల్ని దగ్గర్నించి చూశాను. అప్పట్లో బరిలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీల్లో ఎవరూ కేవలం కులాల్ని బట్టి సీట్లిచ్చనది లేదు. నాయుడైతే పార్టీ లీడర్లను కాదని ఇద్దరు ముగ్గురు అనామకులకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక అభ్యర్ధి ఖరారైన తరవాత ఆ అభ్యర్ధిని గెలిపించడానికి కుల మత రాజకీయ .. ఇలా ఏ అస్త్రం చాతనైతే ఆ అస్త్రం ఉపయోగిస్తారు, అది వేరే విషయం.
    నిరక్షురాస్యులైన ప్రజలకి ఎలా ఎన్నుకోవాలో తెలియదు అనేది చదువుకున్న వాళ్ళకున్న పేద్ద అపోహ. ఈ విషయంలో మాత్రం చదువుకున్నోడికంటే చాకలోడు మేలని నేను కచ్చితంగా నమ్ముతాను. తెలంగాణాలో అతి వెనుకబడి ఉన్న కొన్ని గ్రామాల్లో నిరుపేద ప్రజలకి ఉన్న రాజకీయ అవగాహన నగరాల్లో పట్టభద్రులకి లేదు. వాళ్ళకి కనీసం తమకి ఏం కావాలో తెలుసు. అది ఇస్తానని వాగ్దానం చేసే అభ్యర్ధికి వాళ్ళు వోట్లు వేస్తారు. చదువుకున్న వారికి తమకి ఏమి కావాలో తెలియదు, సమాజానికి ఏంమి కావాలో అసలే తెలియదు. మీరు ఆంధ్రాలో ఏ ఒక్క నగరంలోనైనా ఒక సాధారణ పౌరుణ్ణి పట్టుకుని అడగండి, ఆ నియోజక వర్గపు ఎంపీ లేక ఎమ్మెల్లే గురించి అతనికి ఎంత తెలుసునో.
    వచ్చిన గొడవ ఏంటంటే మన ఎన్నికల వ్యవస్థా, మన ప్రభుత్వ వ్యవస్థా ప్రజల బాగోగులు పట్టించుకునే విధంగా లేవు. పరిస్థితుల్ని మెరుగు పరిచే విధంగా లేవు. ఇక ప్రభుత్వ యంత్రాంగంలో వివిధ ప్రాజెక్టుల పేరిట – అవినీతి ప్రసక్తి లేకుండానే – ఎంత ధనం వృధా అవుతుందో తెలిసుకోవడానికి ప్రముఖ పాత్రికేయులు సాయినాథ్ రచించిన Everybody Loves a GOod Draught చదవండి.

  5. 5 అబ్రకదబ్ర 9:47 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2008

    @లక్ష్మి:

    మీ ఆవేశం అర్ధమైంది. అయితే మనం త్యాగం చెయ్యవలసినంది చిన్న చిన్న స్వార్ధాలనే కానీ ప్రాణాన్ని కాదండీ 🙂 ఉదాహరణకి, రోడ్డుమీద వెళుతుంటే ప్రతి వాహనదారుడూ నేనే ముందు వెళ్లాలి అన్న ఆత్రంతో నియమాలతిక్రమించి బండి నడపటం.. తద్వారా యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జాములు, వగైరా. ఎవరికి వారు పద్ధతిగా బండి నడిపితే అందరికీ మంచే కదా. అదో పెద్ద త్యాగం కూడా కాదు. ఇలాంటివే మరెన్నో. దాన్ని సివిక్ సెన్స్ అనండి, మరోటనండి. భారతీయుల్లో ముందు ఇది పెంపొందాలి.

    @చైతన్య:

    ధన్యవాదాలు.

    @మహేష్:

    అయితే స్వార్ధమున్నా అది ‘మనందరికీ’ అనేటట్లుండాలంటారు. ఇదేదో బాగానే ఉంది. స్వార్ధాన్నెటూ తగ్గించుకోలేనప్పుడు దాన్ని ‘నా’ నుండి ‘మన’ కి విస్తరిస్తే కొంతలో కొంత మేలే.

    @కొత్తపాళీ:

    >>”మీరు ఏవో చాలా కారణాలు చెప్పబోయి ఏదీ సమగ్రంగా చెప్పకుండా ఒదిలేశారు”

    నిజమే. కట్నం వంటి ఆచారాలు, కుటుంబ విలువలు అని మనమనుకునే స్వార్ధపరత్వం, కులమతాలను పట్టుకుని వేలాడే సంకుచిత తత్వం, అతిగా క్షమించే గుణం, మితిమీరిన సహనం .. ఇలాంటివన్నీ కలిసి అవినీతికి ఎలా దోహదం చేస్తున్నాయో వివరించటానికే ఈ ప్రయత్నం. అన్నిటినీ మరింత వివరంగా రాయాలంటే ఓ ఉద్గ్రంధమే అవుతుంది కదండీ. అంత ఓపికగా ఎవరు చదువుతారు? అందుకే పైపైన స్పృశించి వదిలేశా.

    >> “అభ్యర్ధుల ఎంపికకి ముఖ్యమైన అర్హత గెలవ గలిగే అవకాశం”

    ఇదీ నిజమే. అయితే ఆ గెలవగలిగే అవకాశం కులం/మతం కల్పిస్తుందని చాలామంది నాయకుల నమ్మకం. నేను ‘అధిక శాతం అభ్యర్ధుల విషయంలో’ అన్నానే కానీ ‘అందరు అభ్యర్ధుల విషయంలో’ అనలేదు కదా. నాయుడైనా ఒకరిద్దరి విషయంలోనే ప్రయోగం చెయ్యగలిగాడు కానీ రాష్ట్రవ్యాప్తంగా అదే పని ఎందుకు చెయ్యలేకపోయాడో ఆలోచించండి. ఒక పార్టీ ఏ కులపోడికి సీటిస్తే, ప్రత్యర్ధి పార్టీ కూడా అదే కులపోడికి సీటివ్వటం సాధారణమైన విషయమే కదా. రాయలసీమలో రెడ్లు, విజయనగరంలో వెలమలు/రాజులు, గుంటూరు, కృష్ణాల్లో కమ్మ/కాపు .. ఇలా ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు, ఎంపీల్లో స్థానికంగా ప్రబలమైన వర్గమే ఉంటే మీరు కులంతో పనిలేకుండా ఎన్నికల్లో టికెట్ల పంపకం జరుగుతుందని ఎలా చెప్పగలరు?

    నిజానికి నేను పార్టీలని విమర్శించే ఉద్దేశంతో కులమతాల ప్రస్తావన తీసుకురాలేదు. మనలో ఉన్న ‘మనవాళ్లు’ అన్న భావన విచక్షణారహితంగా అవినీతిపరులకి, అసమర్ధులకి ఓట్లేయటానికి ఎలా దోహదం చేస్తుందో వివరించటమే నా ఉద్దేశం.

    >> “నిరక్షురాస్యులైన ప్రజలకి ఎలా ఎన్నుకోవాలో తెలియదు అనేది చదువుకున్న వాళ్ళకున్న పేద్ద అపోహ”

    అక్షరాస్యులు తెలివిగా ఎన్నుకుంటున్నారని నేననటంలేదు కదండీ. అయితే వాళ్లు నిరక్షరాస్యులకన్నా ఎంతో కొంత మేలు. రుజువులు కావాలంటే ఇస్తాను.

    సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదికల ప్రకారం దేశంలో అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రధమ స్థానం కేరళది, రెండవ స్థానం తమిళనాడుది. దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న ప్రధమ, ద్వీతీయ రాష్ట్రాలు కూడా ఇవి రెండే కావటం కాకతాళీయం అంటారా? బీహారు అక్షరాస్యత పరంగా చిట్టచివరి స్థానంలోనూ, అవినీతి పరంగా మొట్టమొదటి స్థానంలోనూ ఉన్నాయి.

    మీరు ప్రస్తావించిన ఇతర విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే నా వ్యాసం ప్రధానోద్దేశం, శీర్షికలోనే చెప్పినట్లు, అట్నుండి నరుక్కురావటం కాదు – ముందు సాధారణ పౌరులు మారితే సమాజంలో మంచి మార్పు దానంతటదే వస్తుందని.

  6. 6 radhika 2:58 సా. వద్ద సెప్టెంబర్ 16, 2008

    చాలా మంచి విషయాలు చెప్పారు.

  7. 7 సుజాత 11:08 సా. వద్ద సెప్టెంబర్ 16, 2008

    మీరు చెప్పిన ప్రతి విషయమూ కరెక్టే అని అంగీకరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మీరన్నట్టు ప్రతి విషయాన్నీ వివరించుకుంటూ పోవాలంటే అదొక ఉద్గ్రంధం అవుతుంది. కానీ ‘నాది ‘ అని చిన్న స్వార్థం నుంచే అవినీతి ప్రారంభమవుతుందని బాగా చెప్పారు. అందులోనే చిన్నా పెద్దా స్థాయిలు! అంతే!

    ఉద్గ్రంధం కాకపోయినా ఇంకొంచెం విస్తరించి, రెండు మూడు టపాలుగా రాయొచ్చేమో అనిపించింది.

  8. 8 gaddeswarup 3:03 సా. వద్ద సెప్టెంబర్ 17, 2008

    నేను మూడేళ్ళనుంచి ఈ సమస్యలను అర్ధము చేసుకోటానికి ప్రయత్నిస్తూను కాని అర్ఢం కావటము లెదు. పుస్తకాలూ, వ్యసాలూ చదివాను. కొంచెం కొంచెం అవగాహన అవుతన్నట్లు అనిపిస్తుంది గాని ఇంకా అయొమయము గానే ఉంది. శాయినాథ్ గారి వ్యాసాలు, వర్ల్దు బాంకు రిపొర్టులు, పుస్తకాలు చదువుతూ ఉంటాను. వీటిల్లొ నాకు నచ్చినవి కొన్ని:
    Partha Chatterjee: “The Politics of the Governed”
    Lance Pritchett: Is India a Flailing State? Detours on the Four Lane Highway to Modernization. (May 2008)
    Fromhttp://ksghome.harvard.edu/~lpritch/
    This is a paper arguing that India, while it is making great strides economically and has maintained a vibrant democracy is “flailing” in that the head no longer effectively controls the limbs of the state(s) and hence its ability to act effectively to deliver services of any kind–from policing to education to social safety nets–is weak and weakening.
    Lot of articles in EPW like the recent article “Why do some countries win more Olympic medals?” by Anirudh Krishna and Eric Haglund.
    ఇవి ఏమైనా పనికి వస్తయ్యేమో చూడండి.

  9. 9 వేణూ శ్రీకాంత్ 8:54 సా. వద్ద సెప్టెంబర్ 18, 2008

    చాలా బాగుందండి.. మీరు చెప్పిన కొన్ని విషయాలు ఎంతగా అలవాటు అయిపోయాయంటే అసలు అది తప్పు అన్న స్పృహ కూడా కలగదు కాస్త ఆలోచించి చూస్తే తప్ప అంతగా అలవాటు పడిపోయాం.

  10. 10 అసంఖ్య 7:58 సా. వద్ద ఏప్రిల్ 16, 2009

    వీటి ( అవినీతి, మార్పు, రాజకీయాలు) వెనకున్న కారణాలని ప్రస్తావించారు. నేను వాటి గురించి అసలు ఆలోచించలేదు/ప్రస్తావించలేదు నా టపాలో. మీ టపా ముందు చూడవలసింది.

  11. 11 వెంకటరమణ 12:33 ఉద. వద్ద సెప్టెంబర్ 2, 2009

    చాలా బాగుంది. ఇంకొకరికి చెప్పేముందు మనం మారాలి. అప్పుడు కనీసం ఆత్మ తృప్తి అయినా మిగులుతుంది.

  12. 12 చదువరి 2:32 ఉద. వద్ద సెప్టెంబర్ 2, 2009

    జాబు శీర్షికతో సహా కొన్ని మౌలికమైన విభేదాలున్నాయి నాకు 🙂

    శీర్షిక: “ఇట్నుండే నరుక్కెళ్దాం” అనుండాలనుకుంటా,చూడండి

    మీరు చివరిపేరాలో చెప్పినవి డబ్బులను కాస్త ఆదా చేసుకుందామనో, లేక కాస్త మన పనిని సులువుగా చేసేసుకుందామనో, మరోటో స్వార్థం ఉంది. అవతలాడికి లంచమిచ్చి పని చేయించుకునే స్వార్థమది. తప్పే, కాదన్ను. కానీ, దీన్ని వ్యవస్థీకృత స్వార్థంతో ముడిపెట్టడం మాత్రం ఒప్పుకోలేకున్నాను. వెంకటేశ్వర్రావు సంగతే చూడండి.. కూతురు పెళ్ళి కదాని, తను చేసేపని లంచం తీసుకున్నాడు. పెళ్ళి అయ్యాక, అల్లుడు ‘కారొకటి పంపు మామా’ అంటాడు.. ఇంకో ఐదు కోసం బల్ల కింద చెయ్యి! ఆ మరుసటి రోజు అవసరమేమీ లేకపోయినా పెడతాడు. ‘చివరిపేరాలోని వాళ్ళు ఇస్తేనే కదా రెండో పేరాలో వ్యక్తి తీసుకుంటున్నాడు’, అని అనకండి. ఇచ్చేవాడిది నిస్సహాయత అయితే తీసుకునేవాడిది చెలగాటం. రెండూ ఒకటెలా అవుతాయి?

    ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి -కేవలం మానవ సహజమైన వ్యక్తిగత స్వార్థాన్నో, నిస్సహాయతనో ఒక వ్యవస్థీకృత అవినీతికి ముడేసి, ‘మనలో ఈ స్వార్థాలున్నాయి, వాళ్ళలో ఇవే కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ప్రభుత్వోద్యోగులైనా, రాజకీయ నాయకులైనా మనలోనుండి వచ్చిన వాళ్లేగా. వాళ్లు మనకన్నా భిన్నంగా ఉండే అవకాశమేది? అందుకే, ముందు మనం మారదాం.’ అంటూ మాట్టాడితే అది వ్యవస్థీకృత అవినీతికి నైతిక బలాన్నిచ్చినట్టే!

    ‘అందరం ఒకటే, మీరూ అవినీతిపరులే మేమూ అవినీతిపరులమే, అందరం ఒకటే, మీరు చేసేవి మీరు చెయ్యండి మేం చేసేవి మేం చేస్తాం’, ఇలా అనే పనే అయితే మనమిక ఇలాంటి టపాలు రాయాల్సిన వసరం ఏముంది? రేప్పొద్దున ఏ మంత్రో పది కోట్లు తిన్నాడని బయటపడితే – పడితే – మనవొక ముక్క అంటానిక్కూడా పనికిరామనేగా ఈ టపా అర్థం! ఎందుకంటే, మొన్నామధ్య నేను ఓ కిలో కందిపప్పును 90 రూపాయలకు కొన్నపుడు రసీదు తీసుకోలేదు. ఇహ నా బతుక్కు, టన్నులకొద్దీ కందిపప్పును దాచిపెట్టేసి దాని ధరను 35 నుండి 90 చేసిన ఎదవని, ఆడికి సాయం చేసిన మంత్రినీ ఏమీ అనే అవకాశం లేనట్టేగా?

  13. 14 చదువరి 2:34 ఉద. వద్ద సెప్టెంబర్ 2, 2009

    శీర్షిక: “ఇట్నుండి నరుక్కెళ్దాం” అప్‌తచ్!

  14. 15 Praveen 3:07 ఉద. వద్ద సెప్టెంబర్ 2, 2009

    టైటిల్ చూసి ఇది కూడా మత రిజర్వేషన్ల గొడవలకి సంబంధించినదే అనుకున్నాను.

  15. 16 Praveen 5:59 ఉద. వద్ద సెప్టెంబర్ 2, 2009

    మీరు ఆర్ఖివ్స్ కూడా తెరిచి చూస్తుంటారన్న మాట. మధ్యాహ్నం నా కొత్త బిజినెస్ కి అడ్వర్టైజింగ్ ఫ్లెక్స్ బానర్లు చెయ్యించడానికి వెళ్ళాను. ఇంటికి తిరిగి వచ్చి బ్లాగులు ఓపెన్ చేసి చూస్తే ఈ వ్యాఖ్యలు కనిపించాయి. జనం కొత్త టపాలు మాత్రమే చదువుతారనుకున్నాను. ఏడాది క్రిందటి ఆర్ఖివ్స్ కూడా తెరిచి చూసే వాళ్ళు ఉంటారన్నమాట.


Leave a reply to కె.మహేష్ కుమార్ స్పందనను రద్దుచేయి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 304,018

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.