Posts Tagged 'బ్లాగర్లు'

కూడల్లో కిష్కింధకాండ

రెండువారాలుగా తెలుగు బ్లాగ్వనం రణనినాదాలతో మోత మోగిపోతుంది. ఒకరిపై ఒకరు తిట్లు, శాపనార్ధాలు, మూతబడుతున్న పాత బ్లాగులు, ప్రత్యేక అజెండాలతో వెలుస్తున్న కొత్త బ్లాగులు, సున్నితుల సూసైడ్ నోట్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లు .. మొత్తమ్మీద, దారిన పోతూ పోతూ ఇటుగా ఓ చూపేసిన వారికి ఎవరినెవరు ఎందుకు ఏమంటున్నారో అర్ధం కాని గందరగోళం. అంతటా అయోమయం. నవంబరు మొదట్లో టీకప్పులో తుఫానులా సమసిపోయిన కత్తి-సుత్తి సంవాదం దరిమిలా రెండున్నర నెలల ప్రశాంతత. ఇప్పుడా నిశ్చల తటాకంలోకి రాయి విసిరిందెవరనేది అప్రస్తుతం. చిన్న అపార్ధంతో రాజుకున్న నెగడు ఈ సారి బ్లాగ్వాతావరణాన్ని ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో కలుషితం చేసిందనేది నిజం.

ఇద్దరు బ్లాగర్ల మధ్య – కారణాలేవైనా – పొటమరించిన అపార్ధం నిజానికి ఆ ఇద్దరూ మాత్రమే తేల్చుకోవాల్సిన విషయం. అందులోకి ఇతరులు ప్రవేశించటం, ఎవరి ఉద్దేశాలతో వారు తలో చెయ్యి వెయ్యటంతో – పిట్టగోడ దగ్గర పుట్టిన ఇరుగు పొరుగుల కలహం వాడ మొత్తానికీ పాకినట్లు – అది కాస్తా అందరి సమస్యగా, అందరికీ సమస్యగా మారిపోయింది. సందట్లో సడేమియా అనుకుంటూ రాజకీయోద్యమాల్లో దూరి రాళ్లు విసిరే రౌడీ మూకలాంటిదొకటి సందు చూసుకుని ఇందులో చొరబడటంతో గొడవ ముదిరి పాకాన పడింది. వారం తిరిగేసరికి అసలు గొడవ మరుగున పడిపోయి పాత కక్షలు, కార్పణ్యాలు తెర పైకొచ్చి అనేక బ్లాగులు కురుక్షేత్రాలైపోయాయి. మొదట కొందరు మహిళా బ్లాగర్లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు మొదలై క్రమంగా – జాతి వివక్ష రహితంగా – ఇతరులపైకీ మళ్లాయి. తోలుమందపోళ్లు తూ నా బొడ్డని దులపరించేసుకు పోతుండగా, తట్టుకోలేని బేలలు మాత్రం బ్లాగింగుకి శాశ్వతంగా సెలవిచ్చేస్తున్నారు. దానికదే సద్దుమణుగుతుందిలే అనుకుంటూ ఇన్నాళ్లూ మౌనంగా చోద్యం చూస్తున్న నాలాంటోళ్లు ఇప్పటికైనా నోరు విప్పకపోతే పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం.

కలగజేసుకుంటున్నానని, ఇదేదో తప్పొప్పులు నిర్ణయించే పంచాయితీ అనుకునేరు. తీర్పులిచ్చేందుకు నే పెదరాయుడినీ కాను, తక్కిన బ్లాగర్లు నేనేలే ప్రజలూ కారు. ఇంత గొడవకీ కారణమైన ఒక చిన్న అపోహని దూరం చేసే ప్రయత్నం మాత్రమే నాది. బ్లాగర్లలో పాత కాపులు కొత్త తరాన్ని నొక్కేస్తున్నట్లు కొందరి వాదన. ఇది పూర్తిగా నిరాధారం, ఊహా జనితం. వర్గాలు, కూటములు ఉంటే ఉండొచ్చుగాక (నాకైతే కనపడలేదు), ఇక్కడ ఎవరూ ఎవరినీ ఎదగకుండా ఆపలేరు. ఎవరికుండే ఆదరణ వారికుంటుంది. నేనే ఉదాహరణ. తొమ్మిది నెలలుగా బ్లాగుతున్నా, నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిచయమున్న బ్లాగర్లు ఒకరిద్దరే (ఆ ఒకరిద్దరికీ ఈ గొడవతో సంబంధం లేదు కాబట్టి వాళ్లకి మద్దతుగా ఇది రాసే ప్రసక్తే లేదు). చాలామందివి కలం పేర్లే తప్ప నిజం పేర్లూ తెలీవు నాకు. నాకు ముందూ, నా తర్వాతా అనేక మంది వచ్చారు, వస్తున్నారు. వీళ్లలో నా రాతలు నచ్చే వాళ్లూ, నచ్చనోళ్లూ ఉన్నారే కానీ నన్ను పైకి ఎత్తేసిన వాళ్లూ లేరు, కిందకి తొక్కేసిన వాళ్లూ లేరు. ఎవరికన్నా లోలోపల అలాంటిదేదన్నా ఉన్నా, ఈ సైబర్ లోకంలో నా వాణి వినపడకుండా ఆపటం ఒకరిద్దరి తరం కాదు. ఇది నాకొక్కడికే కాదు, అందరికీ వర్తించే విషయం. కాబట్టి, ఎవరి గురించో ఎవరో ముఠాలు కట్టి ఏదేదో చేసేస్తున్నారని బాధ పడటం అనవసరం, అర్ధరహితం.

అపోహ వదిలించే ప్రయత్నం అయిపోయింది. అర్ధం చేసుకుంటారనే ఆశుంది. ఇక ముందేమిటి? ఎవరు మొదలు పెట్టారనే చర్చలోకి వెళ్లటం – మొదట్లోనే చెప్పినట్లు – రచ్చని కొనసాగించటమే కాబట్టి ఆ ప్రస్తావనొద్దు. ఇరు వర్గాలదీ ఎంతో కొంత తప్పుందనుకుందాం. ఎవరు చెప్పాల్సినవి వాళ్లు ఇప్పటికే చెప్పేశారు కాబట్టి ఇకనైనా దీన్ని ఆపేయటం ఉత్తమం. ఏ వారానికావారం వార్తాపత్రికల పుణ్యాన తెలుగు బ్లాగుల గురించి ఆసక్తితో వీటిలో అడుగు పెట్టే కొత్తవాళ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నారు. వచ్చీ రాగానే – కుళాయిల దగ్గర ఓటిబిందెల పోరాటాల్లా – ఇక్కడ జరుగుతున్న రభస వాళ్లకెదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పబ్లిక్ పాయిఖానాల్లో పిచ్చి రాతల్లాంటి కారు కూతలతో నిండిపోయిన టపాలు, వ్యాఖ్యలు చదివే వాళ్లకి బ్లాగింగంటే కోతి మూకల కంగాళీ గోల అనే దురభిప్రాయమేర్పడదా? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? కలహ భోజనమే ప్రియమైన వాళ్లని కడుపు మాడ్చుకోమని సలహా ఇవ్వటం లేదు. దానికీ పద్ధతైన పద్ధతులున్నాయి కదా. ఎదుటివారిలో నచ్చని విషయాలని నాటుగా కాకుండా సూటిగా, నీటుగా చెప్పటం ఏమంత కష్టం? ఇక్కడున్నోళ్లలో అధికులు విద్యాధికులే, నలుగురిలోకొచ్చినప్పుడు సంస్కారవంతంగా మెలిగే నాగరికులే. బ్లాగుల్లోకొచ్చేసరికి మనలోని మరో మనిషి బయటికి రావలసిన అవసరముందా? మన స్థాయి ఇదేనా? ఇంతకన్నా మెరుగ్గా ఉండలేమా? ఆలోచించండి.

 


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 304,034

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.