అభి-మతం

పది రోజులుగా తెలుగు బ్లాగ్ప్రపంచంలో మతమార్పిడుల గురించి రసవత్తరమైన చర్చలు నడుస్తున్నాయి. హైందవానికి ముంచుకొస్తున్న ముప్పు గురించి ఆవేశపడ్డవారు, వాళ్లనుకునేంత ఘోరంగా మతమార్పిడులేమీ జరగటం లేదని గణాంకాల ఊతంతో వివరించిన వారు, మన దేశంలో హిందువులు మాత్రమే దేశభక్తులని టోకున తీర్మానించేసినవారు, భారతీయులంతా హిందూ మతాన్నే ఆచరించితీరాలని నొక్కి వక్కాణించినవారు, మతం మారితే అమాంతం దేశమ్మీద ద్వేషం పొంగిపొర్లుతుందని వితండవాదాలు చేసినవారు, ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరించుకునే హక్కు దేశంలో అందరికీ ఉండి తీరాలని వాదించినవారు, ప్రభుత్వం మతమార్పిడులని నిషేధించాలని అభిప్రాయపడ్డవారు, మతమార్పిడి మూలాల్లోకి వెళ్లకుండా ఈ వృధా చర్చలేమిటని చిరాకుపడ్డవారు .. ఇలా రకరకాల అభిప్రాయాలు. ఎక్కువమంది వాదనల్లో ఎంతో కొంత నిజముంది. అయితే ఇస్లామిక్ తీవ్రవాదం, క్రైస్తవ మత మార్పిడులకి హిందూ అతివాదమే సరైన మందని కొందరు అభిప్రాయపడటం ఆశ్చర్యకరమైన విషయం. ఆ మాత్రం దూకుడు లేకపోతే దేశంలో హైందవం మనుగడే గల్లంతైపోతుందన్న నమ్మకం వీరిది.

‘వాళ్లు మా మతాన్ని ఎద్దేవా చేస్తుంటే ఊరుకోవాలా’ అన్న అమాయకులు కొందరున్నారు. ఎందుకు ఊరుకోవాలి? వారికి అర్ధమయ్యేలా హిందూత్వ గొప్పదనాన్ని వివరించాలి. వారి దేవుడినీ ఎద్దేవా చెయ్యటమా సరైన సమాధానం? అప్పుడు ఇద్దరికీ తేడా ఏముంది? ‘పరమత సహనం అంటూ ఊరికే చేతులు ముడుచుకుని కూర్చుంటే చివరికి హిందువనేవాడు మిగలడు’ అనే వాళ్లు మరికొందరున్నారు. పిడికిళ్లు బిగించి యుద్ధంలోకి దిగాలనేది వీరి ఉద్దేశం. కంటికి కన్ను, పంటికి పన్ను అనకపోతే హిందూత్వం మనలేదని వీళ్ల స్థిరాభిప్రాయం.

రెండువేల ఏళ్లుగా హైందవమ్మీద లెక్కకు మిక్కిలి సాంస్కృతిక దాడులు జరిగాయి. ఉవ్వెత్తున ఎగసిన జైన, బౌద్ధ భావజాలాలు అంతే వేగంతో చల్లారిపోయాయి. నూట యాభయ్యేళ్ల కుషాణుల పాలన, శతాబ్దాల పాటు ఇస్లామిక్ పాలనలో ఉన్నా దాని పునాదులు చెక్కు చెదరలేదు. రెండొందల యాభయ్యేళ్ల పాటు దేశాన్నేలిన తెల్లదొరలు క్రిస్టియన్ల సంఖ్యని రెండు శాతం దాటించలేకపోయారు (నిజానికి భారతదేశంలో క్రైస్తవం క్రీస్తు మరణించిన పాతికేళ్లలోపే అడుగుపెట్టింది. అది వేరే కధ). ఎలా సాధ్యమైందిది? కారణాలెన్నున్నా, వాటిలో హిందూ అతివాదం మాత్రం ఉండదు.

అతివాదం సరైనదనే వాదనలోని డొల్లతనం చూద్దాం. క్రైస్తవ మతమార్పిడులకి అదే సమాధానమట! క్రైస్తవం చరిత్ర తెలిసినవారు అదెంత పిచ్చిపనో తేలికగా చెప్పగలుగుతారు. ఆ మతంలోని మంచిచెడ్డల సంగతి కాసేపు అవతల పెడదాం. క్రైస్తవం పుట్టిందే అణచివేతకి వ్యతిరేకంగా. మొదటి ఐదువందల సంవత్సరాల పాటూ విపరీతమైన అణచివేతని తట్టుకుని నేడున్న స్థాయికి విస్తరించిందది. ప్రతిఘటనకి దీటుగా పైకెదగటం దాని సహజ లక్షణం. చర్చ్‌లు, మత ప్రచారకుల మీద దాడులు మనదేశంలో క్రైస్తవం వ్యాప్తిని ఎలా అడ్డుకోగలుగుతాయి? ఇక, స్వయంగా ఖడ్గం చేబూని యుద్ధాలు చేసిన మహమ్మదు ప్రవక్త వారసులమీద హిందూ అతివాదమనే మంత్రం ఎంతవరకూ పనిచేస్తుంది? అది అగ్నికి ఆజ్యం పోయటమే.

మతం మనుగడకి అతివాదమే గతనే పిడివాదులు మర్చిపోతున్న విషయం – హైందవం అన్ని మతాల్లాంటిదీ కాదన్న సంగతి. ఆ మాటకొస్తే, అదో మతమే కాదు. అసలు ‘హిందూ’ అనే మాటే ఇటీవలిది. ఆ పదం పుట్టకముందు తరాలుగా భరతఖండంలో ప్రజలు ఎరిగిందీ, ఆచరించిందీ సనాతన ధర్మం. దానికి మూలమైన రుగ్వేదం చెప్పేది, పేరేదైనా దేవుడొకడేనని; ఏ పేరిట పిలిచినా, ఏ రూపాన్ని తలచినా వేడుకోళ్లు చేరేదొక్కచోటికేనని. ఆ నమ్మకమే హిందూత్వానికి పునాది. ఆ పునాదే అది అమేయంగా విరాజిల్లటానికి ముఖ్య కారణం. ముక్కోటి దేవతలున్న హైందవానికి మరో నలుగురు ఎక్కువేమీ కాదు. అల్లాని, బుద్ధుడిని, క్రీస్తుని ఆదరించటం అంటే హిందూత్వాన్ని వదులుకోవటం కాదు. ఆ సంగతి గుర్తించలేని మేధావులు హైందవాన్ని కాపాడే నెపంతో దానికి చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. 

శతాబ్దాల క్రితమే ఇటువంటి ధోరణులు పుట్టుంటే ఈ దేశం ప్రపంచానికి ఓ మహావీరుడినీ, ఓ బుద్ధుడినీ అందించుండేదా? కొడిగట్టే దశలో ఇక్కడ చేరిన జొరాస్ట్రియనిజం మళ్లీ చిగురు తొడిగేదా? ఒక సిక్కు మతం ఉద్భవించేదా? అప్పుడెప్పుడూ పరాయి మతాలనుండి ముంచుకురాని ముప్పు ఈ నాడు హిందూత్వానికి ఎక్కడనుండి వచ్చింది? క్రైస్తవం, ఇస్లాం ధాటికి పురాతన మతాలెన్నో మట్టిలో కలిసిపోయినా హిందూత్వం సజీవంగా నిలబడగలగటానికి కారణం – అది ఏ ఒక్క వ్యక్తి పేరిటో వెలసింది కాదు, ఏ ఒక్క సంస్థ కనుసన్నల్లోనో మెలిగేదీ కాదు. యుగాలుగా ధర్మ పరిరక్షణ సంస్థలు తల్వార్లూ, త్రిశూలాలూ పట్టుకుని కాపాడితే బ్రతికింది కాదు హిందూత్వం. దాన్ని పెంచి పోషించే ప్రదేశాలు ఇళ్లే కానీ గుళ్ళూ, బళ్లూ, మతవాదపు సంస్థలూ కాదు. మతమార్పిడిని అడ్డుకోటానికి హిందూ సేనలూ, దళాలూ, పరిషత్తులూ చెయ్యాల్సింది దాని మూల కారణాల్లోకి వెళ్లటం, రొట్టె ముక్కల కోసం మతం మారేవారికి చేతనైతే సహాయ పడటం, హిందూత్వ భావనని మతాతీతంగా అందరి మనసుల్లోనూ నాటే దిశగా కృషి చెయ్యటం. అది, హైందవానికి వాళ్లు చేయగలిగే నిజమైన మేలు. అతివాద పోకడలతో వాళ్లు సాధించేది వినాశనమే.

13 స్పందనలు to “అభి-మతం”


  1. 1 కె.మహేష్ కుమార్ 5:06 ఉద. వద్ద అక్టోబర్ 11, 2008

    మీతో నేను వందశాతం ఏకీభవిస్తాను. గత 15 సంవత్సరాలుగా హిందువులలో భాయాందోళనలు రెచ్చగొట్టి తమ రాజకీయపబ్బం గడుపుకునే హిందుత్వ పార్టీలు వచ్చినతరువాత,కొందరి హిందువుల్లో హేతువుపోయి ఇతర మతాలపట్ల hatred మిగిలింది. హిందూమతంలోని assimilative capacity మర్చిపోయి, అన్యాయమైపోతున్నామనే భ్రమ మాత్రం మిగిలింది. బహుశా వీళ్ళు హిందూమతమనే జీవన విధానం నశింపజేసి, కేవలం ఒక మతంలా మిగిలే దశకు మనల్ని చేరుస్తారేమో!

  2. 2 కొత్తపాళీ 6:52 ఉద. వద్ద అక్టోబర్ 11, 2008

    చాలా బాగా రాశారు, మంచి మాటలు చెప్పారు

  3. 3 చదువరి 8:36 ఉద. వద్ద అక్టోబర్ 11, 2008

    అతివాద పోకడలతో ప్రయోజనమేమీ లేకపోవచ్చు. కానీ లౌకికవాదం ముసుగులో హిందువులను ఎక్కడికక్కడ అణగదొక్కుతూ, ఇతర మతాలను వెనకేసుకొచ్చేవారి కారణంగా మాత్రం హిందువులు సర్వనాశనం కావడం ఖాయం!

    మన దేశంలో, మన సమాజంలో దొంగ లౌకికవాదులు ఇదివరలో లేరు. ఒకవేళ ఉండేగనక ఉంటే.., ఖచ్చితంగా మధ్యయుగంలోనే హైందవం అంతరించిపోయి ఉండేది. హైందవం తనకున్న అంతర్గత శక్తితో తన్ను తాను కాపాడుకుంది. పరాయి మతాల దాడులను స్థైర్యంతో ఎదుర్కొంది. అప్పటి స్థైర్యం ఇప్పుడూ హిందువులకు ఉంది కాకపోతే.., అప్పుడు దొంగ లౌకిక వాదులు, పిడి లౌకికవాదులు, నిర్హేతుకంగా హైందవాన్ని విమర్శించే, దాష్టీకం చెలాయించే, హైందవాన్ని కుంగదీసే ఇంటిదొంగలు లేరు. అది ఆ కాలంనాటి ప్రజల అదృష్టం. మన ఖర్మకొద్దీ ఇప్పుడు మనకా అదృష్టం లేదు.. మేకవన్నె పులుల లాంటి దొంగ లౌకికవాదుల వల్ల హైందవం దెబ్బతింటున్నది. అందుకు అత్యుత్తమ ఉదాహరణ – కాశ్మీరు.

    కాశ్మీరులో ముస్లిములు అడుగుపెట్టిన తరవాత అక్కడి హిందువులను అన్ని రకాలుగా అణచాలో అన్ని రకాలుగానూ అణచారు, ఘోరాతిఘోరంగా అణచారు. చంపారు, బలవంతంగా మతం మార్చారు, దేశం నుండి వెళ్ళగొట్టారు. వీటన్నిటినీ అప్పటి హిందువులు సహించారు, ధైర్యంగా ఎదుర్కొన్నారు. కత్తి మెడమీద పెట్టినపుడు తప్పనిసరై మతం మార్చుకున్నా.., మనసులో శివుణ్ణే నిలుపుకున్నారు. తమ సంతానానికి తమ వారసత్వాన్ని అందించారు. అంచేతే స్వాతంత్ర్యం వచ్చేనాటికి కాశ్మీరులో హిందువులు ఉన్నారు. స్వాతంత్ర్యం తరవాత హైందవ ద్రోహులు, హైందవ ద్వేషులు సమాజంలో పెరిగిపోయారు. ఈ ద్రోహులు హైందవుల అణచివేతను సమర్ధించారు. ఒక పద్ధతి ప్రకారం కాశ్మీరు నుండి హిందువులను తొలగించారు, హైందవాన్ని తుడిచేసారు. కేవలం రెండు దశాబ్దాల కిందట… కాశ్మీరు నుండి 5 లక్షల పైచిలుకు హిందువులను తరిమికొట్టినపుడు, వాళ్ళు అక్కడి నుండి పారిపోయి, ఢిల్లీ, హర్యానా, ఉ.ప్ర. లాంటి చోట్ల, రోడ్ల పక్కన, గుడారాల్లో, స్వదేశంలోనే కాందిశీకులుగా బ్రతకాల్సి వస్తే లౌకికవాదులమంటూ ప్రకటించుకునే ఈ దొంగలు ఏం మాట్టాడలేదు. ఇదేమని అడిగలేదు. ఆ అభాగ్య జీవులు తమ జన్మభూమిలో ఉండే హక్కును ముస్లిములు ఊడపెరుక్కుంటూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు. ఇప్పుడేమో నిజమైన హిందువు ఎలా ఉండాలో నీతులు చెబుతున్నారు. ఎంత సిగ్గుచేటు! మరో గొప్ప విషయం ఏంటంటే.. “కాశ్మీరులోని ముస్లిములు శాంతికాముకులు, సూఫీలు” అంటూ వాళ్ళను వెనకేసుకొస్తారు.

    ఈ హిందూ శత్రువులకు నాయకురాలనదగిన ఒక రాయి (ఏ రాయయితేనేం లెండి హిందువుల పళ్ళూడగొట్టేందుకు) ఇటీవలి అమరనాథ దేవాలయ వివాదం గురించి ఓ వ్యాసం రాసింది. తనకు అలవాటైన ధోరణిలోనే ఆ వ్యాసంలోనూ హిందువులపై విషాన్ని చిమ్మింది. అది ఆవిడకి అలవాటే! అందులో ఇలా రాసుకొచ్చింది.. అమరనాథ యాత్రికులకు భూమి కేటాయింపును రద్దు చెయ్యాలంటూ కాశ్మీరులో చేసిన ఆందోళనను కాశ్మీరీలు చేసారట.. అక్కడి ముష్టి ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసినపుడు జమ్మూ ప్రజలు చేసిన ఆందోళనను హిందువుల హర్తాళ్‌గా అభివర్ణించింది. ఇదీ.. లౌకికవాదులమని చెప్పుకునే ఈ దొంగల కూటనీతి. ఈ దేశానికి మొదటి శత్రువు ఈ బాపతు లౌకికవాదే! హిందువులను అణగదొక్కి ఇతర మతస్తులను నెత్తినపెట్టుకునే ఇలాంటి దొంగ లౌకికవాదులే!

  4. 4 కామేశ్వర రావు 9:05 ఉద. వద్ద అక్టోబర్ 11, 2008

    “వారికి అర్ధమయ్యేలా హిందూత్వ గొప్పదనాన్ని వివరించాలి”
    ఎంత సులువుగా చెప్పేసారు!
    అలా “అర్థమయ్యేలా” ఎలా చెప్పాలో కాస్త వివరణలోకి వెళితే అదెంత కష్టమో తెలుస్తుంది.
    వాళ్ళు అర్థం చేసుకొనే ఉద్దేశంలో లేకపోతే, అప్పుడెలా?
    “రెండువేల ఏళ్లుగా హైందవమ్మీద లెక్కకు మిక్కిలి సాంస్కృతిక దాడులు జరిగాయి. ఉవ్వెత్తున ఎగసిన జైన, బౌద్ధ భావజాలాలు అంతే వేగంతో చల్లారిపోయాయి. నూట యాభయ్యేళ్ల కుషాణుల పాలన, శతాబ్దాల పాటు ఇస్లామిక్ పాలనలో ఉన్నా దాని పునాదులు చెక్కు చెదరలేదు.”

    నిజంగానే పునాదులు చెక్కుచెదరలేదంటారా?

    “ఎలా సాధ్యమైందిది? కారణాలెన్నున్నా, వాటిలో హిందూ అతివాదం మాత్రం ఉండదు”
    అవునా? మరేవిటి కారణాలు? మీరు హిందూ సంస్కృతిని idealistic దృష్టిలోంచి కాక, చరిత్రని వాస్తవిక దృష్టితో ఒక సారి చూడండి. అప్పుడు అసలు కారణాలు బయటపడతాయి.

    ” ఆ మాటకొస్తే, అదో మతమే కాదు. అసలు ‘హిందూ’ అనే మాటే ఇటీవలిది. ఆ పదం పుట్టకముందు తరాలుగా భరతఖండంలో ప్రజలు ఎరిగిందీ, ఆచరించిందీ సనాతన ధర్మం. దానికి మూలమైన రుగ్వేదం చెప్పేది, పేరేదైనా దేవుడొకడేనని;”

    మొత్తం భరత ఖండమంతటా ఆచరించింది సనాతన ధర్మమేనా? అసలు వేదాలని కాదన్న మతాలు కూడా ఉన్నాయని మీకు తెలీదా? ప్రస్తుతం చెలామణీలో ఉన్న “హిందూ” మతంలో ఇవి అంతర్భాగం అని కూడా తెలిస్తే ఆశ్చర్యపడతారేమో.
    మీరే అన్నట్టు “హిందూ మతం” అసలు మతమే కానప్పుడు దాన్ని మతంగా ఎందుకు ప్రభుత్వం గుర్తిస్తోంది?
    ఇటీవలి కాలంలోనే “హిందూ మతం” అనే భావన రావడానికి నేపథ్యం ఏవిటి? ఆ నేపథ్యం ప్రస్తుత సమాజంలో ఇంకా ఉందా?

  5. 5 సత్యసాయి కొవ్వలి 10:11 ఉద. వద్ద అక్టోబర్ 11, 2008

    మీరు చెప్పేదేమిటంటే (1) ఎవరేం చేసినా, ఏదెలా పోయినా హిందూమతం చెక్కు చెదరదు (2) హిందువులు ఏమైనా ప్రతిచర్యకి పాల్పడితే క్రైస్తవులు ఇంకా రెచ్చిపోతారు, ముస్లింలు కత్తి పుచ్చుకు నరుకుతారు – వాళ్ళ చరిత్ర ప్రకారం చూస్తే – కాబట్టి హిందువులు ప్రతిచర్యకి పూనుకోకుండా సహనం చూపిస్తే వాళ్ళకే బెటరు.
    దేశంలోని రాజులందరూ బౌధ్ధం అవలంబించినప్పుడు రామానుజుడు పూనుకుని భౌధ్ధాన్ని తరిమాడని చదివాం. మీరనుకుంటున్నట్లు ఎవరూ పూనుకోకుండానే బౌద్ధం దేశంలోంచి ఐచ్ఛికంగా వెళ్ళిపోయిందని నమ్మడం కష్టం. మీ కన్ ష్ట్రక్ట్ లో లోపం కనిపిస్తోంది.
    ఇక్కడ వివిధ మతాల మనుషుల మధ్య అంతరాలు ఒక్క రోజులో వచ్చినవి కాదు. అందులోనూ అన్నిపక్కలా రెచ్చకొట్టే వాళ్ళు దండిగా ఉన్నప్పడు ఎవరు సంయమనం చూపిస్తారనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏదో ఒక వర్గం సంయమనం పాటిస్తే అది తీరిపోతుందని ఆశించడం కొంచెం గతితప్పిన ఆశావాదమే అనిపిస్తోంది.

  6. 6 kumar 1:05 సా. వద్ద అక్టోబర్ 11, 2008

    గుడ్ ఒన్ అబ్రకదబ్ర.మతానికి సంబంధించిన అన్ని బ్లాగులు చదవకపోయినా, చాలా చదివా.

    హిందూ మతానికి basic existential threat ఉందని నేను నమ్మట్లేదు. హిందూ మతం ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందీ అనే ఆర్గ్యుమెంట్, కొంచెం కాదు..It’s a far stretch.

    “సైలెంట్ మెజారిటీ”(courtesy of the word:Nixon) అయిన హిందూ మతస్థుల్లో, రెండు దశాబ్ధాల క్రితం క్రిటికల్ మాస్ రీచ్ అవ్వడం ప్ర్రారంభమయ్యింది. అద్వానీ రథయాత్ర, దేశరాజకీయాల్లో విపరీతమయిన మార్పు తీసుకొచ్చింది. BJP రెండు లోక్ సభ మెంబర్ల(1. వాజ్ పేయి, 2. జంగారెడ్డి ఈయన ఏకంగా పివి నే ఓడించారు, హనంకొండలో, ఇదే ఎలక్షన్లో కాంగ్రెస్ కి 400+ సీట్లు వచ్చాయి) దగ్గర్నుంచి, ఒకేబిగిన 80+ కి వెళ్ళిపోగలిగింది.

    హిందూ మతాన్ని, మేమిక Abuse చేయనీయబోము అన్న basic defending thoughts లోంచి ప్రారంభమయిన మూమెంట్, గత ఇరవై సంవత్సరాల్లో different facets తీసుకొని ఇంకొంచెం గట్టిపడి, కొన్నిసార్లు అవ్వాల్సిన దానికన్నా harden అయిపోయి, మరికొన్ని సార్లు కంప్లీట్ గా ఓ different tangential direction లో వెళ్ళిపోయి, చివరికి కొన్ని సందర్భాల్లో equilibrium లో ఉండాల్సిన balance కాస్తా హేవీగా ఓ వైపే tilt అవ్వడం ప్రారంభమయ్యింది. ఇది చాలా విచారకరమయిన విషయం. కొన్ని మనం(హిందువులు) చేసిన పనులు తలెత్తుకోకుండా చేసాయి మనల్ని.

    అయితే నాణేనికి మరోవైపు కూడా చూస్తే, ఏ దేశంలో అయినా, సంఘంలో అయినా “సైలెంట్ మెజారిటీ” అంత తొందరగా తిరగబడదు. హిందూ మతంలో అతివాదులు మొదటినుంచీ ఉన్నారు. వీరి ప్రభావం పెరగడానికీ, సైలెంట్ మెజారిటీ వీళ్ళ పట్ల సింపతిటిక్ గా ఉండడానికీ బీజాలు పడింది, ఇస్లాం అతివాదుల ధోరణుల వల్లే అని చెప్పక తప్పదు.

    Hatred breeds hatred. వాతావరణం పొల్యూట్ అవ్వడం ప్రారంభం అయ్యింది ఇస్లాం ఫండమెంటలిస్టుల ప్రభావం పెరిగినప్పట్నుంచే. This environment gave a huge opening for the extreme right of BJP. Better angels of human nature is now suppressed and taken a back seat. The fundamentalists of Hinduism started appealing/appeasing the darker side of the human nature.

    ఇంకేముంది..now the environment is ripe enough to flare the flames. Both sides exactly did that.

    అతివాదం, అతివాదం తో మితమైయిపోదు. ఇది కామన్ సెన్స్. కాని కామన్ సెన్స్, కామన్ ప్రాక్టీస్ అవని సందర్భాలు చరిత్రలో కోకొల్లలు.

    ఒకటి మాత్రం నేను బలంగా నమ్ముతాను. హిందూ మతం లో పై పైన ఉన్న చెత్త తీసేస్తే, ఇంటలెక్చువల్ డెప్త్ చాలా ఎక్కువ. థాట్ ప్రాసెస్ ని, చాలా డెప్త్ లోకి తీసుకెళ్ళి, సంభ్రమాశ్చర్యాలనే కాదు, సత్యానికి దగ్గరగా తీసుకెళ్ళి, కనీసం ‘what is all this’ అన్న ప్రశ్నకి సమాధానం స్వంతగా వెతుక్కోవడానికి కావల్సిన tools ని ప్రొవైడ్ చేస్తుంది. హిందూ మతం లో ఆచార సంప్రదాయాలని పక్కన పెట్టి దాంట్లో ఉన్న core కి వెళ్తే, అసలదొక “The God” నే కాదు, “A God” ని కూడా నమ్మమని చెప్పినట్లుగా నాకెప్పుడూ అనిపించలేదు. అబ్రకదబ్ర చెప్పినట్లుగా మనకు hardcore dos and donts లేవు, Ten Commandments లాగా. నాకది హిందూ ఫిలాసొఫీ లో ఉన్న బ్యూటీ అనిపిస్తూంది. Rights and wrongs are always relative. I don’t mean to take away anything from Christianity. I go to church quite a few times.

    ఇంకో ముఖ్యమయిన విషయం క్లుప్తంగా చెప్పి ఈ చాంతాడుని కట్ చేస్తాను (వివరంగా మరెప్పుడైనా). తేటగీతి మురళి గారు చెప్పినట్లుగా మైనారిటీలనీ, మైనారిటీల కల్చర్ నీ, సమానంగా చూడకుండా, ఈక్వేషన్ ని ఒకవైపు పుష్ చేయటం అనేది చాలా తప్పు. అలాంటి perceptions ఎక్కువనప్పుడే క్రిటికల్ మాస్ తొందరగా రీచ్ అయ్యి, సైలెంట్ మెజారిటీ కి కడుపులో కాల్తుంది. ముఖ్యంగా ఇలాంటి పనులు ఒక రాజకీయ పార్టీ మైనారిటీలని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశం కన్నా, ఓట్ బ్యాంక్ ని దృష్టి లో పెట్టుకొని చేస్తున్నట్లుగా కనపడితే, ప్రజలకి నిజంగానే మండుద్ది. అలా మండడం సబబనే అనుకుంటాను నేను.

    అది ఇండియాకే కాదు, ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ఉన్న సమస్యే. ఉదాహరణకి, అమెరికాలో డెమొక్రటిక్ పార్టీకి స్ట్రాంగ్ బేస్ నల్ల వాళ్ళు, ఇతర మైనారిటీస్ అన్న సంగతి తెలిసిందే. వీళ్ళ 90% ఓటింగ్ శాతం, ఒక్క ఇరవై శాతం పడిపోయినా, వీళ్ళు ఒక్క ప్రసిడెన్షియల్ ఎలక్షన్ కూడా గెలవలేరు. అందుకని వీళ్ళు చాలా “ఫ్రీ లంచ్” ప్లాన్స్, ‘ఫ్రీ’ హెల్త్ కెర్, ‘బిగ్గర్ గవర్న్మెంట్ స్పెండింగ్” లాంటి పాపులిస్ట్ పథకాలు ప్రపోజ్ చేస్తుంటారు. నల్ల వాళ్ళ కమ్యునిటీ స్టాటిస్టిక్స్ చూస్తే, 70% of black kids are born out of wedlock, more than 50% of them don’t complete high-school, One in three black men between the ages of 20 and 29 was either in jail or prison, or on parole or probation in 1995. Staggering stats….ఇందులో చాలా ప్రాబ్లంస్ బ్లాక్స్ స్వంత రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల వచ్చేవే కాని, తెల్ల వాళ్ళ వల్ల కాదు. అయినా ఈ దేశంలో నల్ల లీడర్లు చాలా మంది, ఈ సమస్య లకి మూల కారణం మనం కాదు, తెల్ల వాళ్ళ ఆధిపత్యమే అన్న అసత్యాలని ఈ రోజుకీ చాపక్రింద నీరు లాగ చేస్తారు. ఎవరో కొంతమంది bill cosby, larry elder, michael steel లాంటి వాళ్ళు తప్పితే.
    చాలా మంది వైట్ లీడర్స్ in democratic party కూడా గమ్మున ఉండి, కొండొకచో ఇంకొంచెం ఆ ఫీలింగ్స్ రెచ్చగొట్టి( మైఖేల్ ఫ్లేగెర్ etc), ఓట్లు పిండుకుంటారే తప్పితే, వీళ్ళు బ్లాక్స్ ని confront చేయ్యరు, the problem today is not the white man, but the lack of A FATHER at home and a strong family structure in your community ani. Instead they flare the flames. ఇది తప్పు అని ఈ దేశంలో ఉన్న కసర్వేటివ్స్ కాని, ట్రెడిషనిలిస్ట్స్ కాని ఎవరైనా స్ట్రాంగ్ గా వాయిస్ రేయిజ్ చేస్తే, వాళ్ళని Racists అనే ముద్ర వేసేసి, గోబెల్స్ ప్రచారం మొదలెడతారు. Firing a black employee is so much more difficult in America than a white employee. HR department makes double sure that there are more than enough causes and evidences before they even consider that proposal, because institutes like ACLU and others jump in and make a big ruccus. They go silent if an unjust thing happens for a white guy. Today questioning a black leader has become synonomous with ‘racism’.

    పైన చెప్పిన దాంట్లోకి, మన దేశంలో ఉన్న పరిస్థితులకి similarities కనబడుతున్నాయా :-). I can offer much more, but I am sure I am taking undue real estate in Abrakadabra’s blog.

    కాని ఇక్కడే ప్రమాదం దాగుంది. మైనారిటీ లకీ, వాళ్ళ కల్చర్ కీ, వాళ్ళ ఫీలింగ్స్ కీ undue importance ఇవ్వడం సరికాదు అన్న వాదన సబబే..కాని దాన్ని అంతకన్నా ముందుకి అతివాదపు అంచుల దాక తీసుకెళ్తే, మళ్ళి మనం ఈ “సైలెంట్ మెజారిటీ” ని వెనక్కి తెచ్చు కోలేము సరికదా, ఈ అతివాద ధోరణి అనేది.. It feeds into the extremism of others. The cycle begins again..”Hatred breeds Hatred”.

    Anger is a powerful weapon, as long as it doesn’t evolve into hatred.

  7. 7 చైతన్య క్రిష్ణ పాటూరు 1:45 సా. వద్ద అక్టోబర్ 11, 2008

    “ముక్కోటి దేవతలున్న హైందవానికి మరో నలుగురు ఎక్కువేమీ కాదు.” – అవును ఎక్కువేమి కాదు. వారిని ఈ పాటికే హిందువులు దేవతలుగానూ, మహనుభావులుగాను భావిస్తున్నారు. హిందూ అతివాదులు సైతం వారిని దూషించటానికి సాహసిస్తారని నేను అనుకోను. మీ ప్రవక్తని మేము గుర్తిస్తున్నాం, మా కృష్ణుడ్ని మీ ప్రవక్తల్లో ఒకడిగా గుర్తించినా సగం సమస్యలు తీరుతాయని అద్వానీనే చెప్పినట్టు గుర్తు. పక్కవారి విశ్వాసాలను గౌరవించే అలవాటు మనకుంటే సరిపోదు, అవతలి వారికి కూడా ఉండాలిగా.

    “ఏకం సత్ విప్రా బహుదా వదంతి (ఒకే సత్యాన్ని విప్రులు బహు విధాలుగా చెబుతారు)” అనే వేద వాక్యం ప్రాచీనమైనదే అయినా, దాని విలువని గ్రహించింది మాత్రం ఈ మధ్యనే అనిపిస్తుంది. హిందువుల్లో అన్ని శాఖలు ఓపికున్నంత వరకు కొట్టుకుని, చివరకి రాజీకొచ్చాయి. బయటి నుంచి జరిగిన దండయాత్రలు, లోపల వచ్చిన తిరుగుపాట్లు, ఈ వివిధ మతాల్ని ఒక్క చోటికి చేర్చాయి. ఇప్పట్లో అటు వంటి అవకాశం కనపడట్లేదు. అప్పట్లో వైష్ణవం, శైవం, శాక్తేయం మొదలైన మతాలకన్నిటికీ సమానంగా ప్రమాదం ఏర్పడింది కాబట్టి అవి తిట్టుకోవటం మాని రాజీకొచ్చాయి. It’s a fair deal. ఇప్పుడారకమైన assimilation కుదరదు. ఇప్పుడు తలపడుతోంది భారతదేశంలో మాత్రమే మిగిలిన హిందూమతం, ప్రపంచం అంతా వ్యాపించిన క్రైస్తవం, మరియు ఇస్లాం. మనం తగ్గినా అవి తగ్గవు. జీసస్ చెప్పిందీ సత్యానికి ఒక మార్గమే, మహమ్మద్ చెప్పిందీ ఒక మార్గమే, అనీ కరక్టే అని మనం ఒప్పుకున్నా, అవి మాత్రం తమ మతం దారి తప్ప, తక్కిన దారులన్నీ నరకద్వారాలని ఎలుగెత్తి ఘోషిస్తూనే ఉంటాయి. పాత ప్రయోగం ఫలించదు, అలాగని హింసకు దిగటమూ సరైన Strategy కాదు. అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.

    ఈ విషయంలో నా అభిప్రాయాలు మరింత వివరంగా కొన్ని రోజుల క్రిందట ఇక్కడ రాసాను.
    http://chaitanyapaturu.blogspot.com/2008/10/blog-post.html

  8. 8 gaddeswarup 4:36 సా. వద్ద అక్టోబర్ 11, 2008

    Are there any surveys of dalits’ opinion about Hinduism and conversions?

  9. 9 నాగన్న 10:36 సా. వద్ద అక్టోబర్ 11, 2008

    “ఉవ్వెత్తున ఎగసిన జైన, బౌద్ధ భావజాలాలు అంతే వేగంతో చల్లారిపోయాయి.”

    అంత వేగంతో ఏమీ పోలేదు, మారణహోమం వల్ల రక్తంతో భూమి తడిచింది. అడవిలో ధ్యానం చేసుకునే భిక్షువుల ఒక్కొక్కడి తలకు బంగారు నాణాలతో వెల కట్టబడింది. నేటి హిందూ దేవాలయాలు గతంలో కొన్ని బౌద్ధ, జైన మతాలకు సంబంధించినవి.

    సామాజికంగా, సాంస్కృతి పరంగా మతానికి కొంత విలువను ఆపాదించవొచ్చు. మిగతా మతాలకూ, హిందూ మతానికి విపరీతమైన తేడాలు ఏమీ లేవు. మర్మం ఎఱుగలేక మతములు పుట్టించి… అన్నారు వేమన. మతానికి మౌళికమైనది నమ్మకం కాని సత్యం/దేవుడి/వగైరా కావు.

    ఇవన్నీ పక్కన పెడితే నేటి హిందూ మతంలో ఫలానా పుస్తకమే చదవాలి, ఫలానా పని ఇలాగే చెయ్యాలి, ఇదే నమ్మాలి అనే వెర్రి పోకడలు తక్కువగా ఉన్నాయి. ఇందువల్ల చాలా లాభాలు ఉంటున్నాయి. స్వేచ్చ ఎక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం, భవిష్యత్తులో మరెన్నో లాభాలను ఉంటాయి అని నా నమ్మకం.

  10. 10 సూర్యుడు 11:55 ఉద. వద్ద మే 28, 2009

    @నాగన్న:

    (ముందస్తు సూచన: నేను ఈ టపా చదవలేదు, ఒక్క నాగన్నగారి వ్యాఖ్య తప్ప)

    “మతానికి మౌళికమైనది నమ్మకం కాని సత్యం/దేవుడి/వగైరా కావు”

    ఏంచెప్పారు సార్, అందుకే దొరలు దీన్ని ఫెయిత్ అంటారనుకుంటా. ఏదో పుస్తకంలో చదివాను గుర్తులేదు, అందులో ఇదే చెప్తారు:

    హిందువు హిందూ దేవుళ్లని పూజించి / ప్రార్ధించి అతని కోర్కెలు నెరవేర్చుకుంటున్నాడు
    క్రిస్టియన్లు క్రీస్తుని ప్రార్ధించి వాళ్ల కోర్కెలు నెరవేర్చుకుంటున్నారు
    అలాగే ముస్లిమ్లు అల్లా ని ప్రార్ధించి మిగతావారు వారి వారి దేవుళ్లని ప్రార్ధించి … 🙂

    కాని దీనికంతటికి అసలు శక్తి మన మెదడులోనే ఉందని (అహం బ్రహ్మాస్మి) ఆ పుస్తక రచయిత ఉవాచ కాకపోతే అసలు రహశ్యం నమ్మకంలోనే ఉందని.

    భలే ఉంది కదా సిద్దాంతం 🙂

  11. 11 కె.మహేష్ కుమార్ 8:12 సా. వద్ద మే 28, 2009

    @గద్దేస్వరూప్: మతమారిడుల గురించి దళితుల అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి కొన్ని స్వచ్చంద సంస్థలు చిన్నచిన్న సర్వేలు జరిపాయి. కానీ వేటినీ పూర్తిస్థాయి దళిత ధృక్పధానికి సంకేతంగా రూఢిగా చెప్పలేము. అవి కేవలం కొన్ని సంకేతాలుగా మాత్రం మిగిలాయి.

    దళితోద్యమ పరంగా చూసుకుంటే మతమార్పిడి పెద్ద సమస్య కాదు. దళితుల సమస్య అసలు కాదు. హిందూమతం వలన సామాజిక “అవమానం” తప్ప మరేదీ లభించని దళితులకు ఆర్థికపరమైన, సామాజికపరమైన వెసులుబాటు కల్పించే ఏ మతమైనా సమ్మతమే.

    కాకపోతే, మతమార్పిడి తరువాత కూడా క్రైస్తవంలో ఈ కులం రంగులు కమ్ముకుని దళితుల్ని బైర్లుగమ్మిస్తున్నాయి. అగ్రకులాల నుంచీ క్రైస్తవానికొచ్చిన హిందువులు ఇక్కడా కులం పైత్యాన్ని విస్తరించారు. దళితుల్లోకూడా క్రైస్తవానికెళ్ళినా కులాల మూలాలను విసర్జించలేక పెళ్ళిళ్ళు అదేకులాల్లో జరుపుకోవడం అనవాయితీగా మారింది. ఈ విధంగా సామాజిక తిరస్కృతి నేపధ్యంలో తలెత్తిన మతమార్పిడి ఇప్పుడొక “ఆర్థిక ఆదర్శంగా” మిగిలింది. అందుకే ఒకసారి ఈ మతమార్పిడిని “ఉద్యోగం మారిందంతే” అన్నాను.

  12. 12 amruthabhandam 12:28 సా. వద్ద మే 11, 2012

    నా అభిప్రాయంలో(నేనేం మీలాగా మేథావిని కాదానికొండి) పర మత వ్యాప్తికి కారణం వర్ణ వివక్ష మరియు అంటారని తనం. మీరు మాకు అవసరం లేదు, నేను చదివిన దాని ప్రకారం, శూద్రులకి గుడి ప్రవేశం లేదు. అంటే, హిందూ దేవుళ్ళు వారికి కాదు కానీ అగ్రవర్ణాలకి మాత్రమే. ఐతే ఈ వెనకబడిన జాతి ఎం చెయ్యాలి? గుడి ముందు బిచ్చగాల్లలాగా ఎప్పుడు మమ్మల్ని కూడా హిందువులలో కలుపుకుంటారో అని ఎదురు చూస్తూ పడుకొని ఉండాలా?

    సరే! మనది నానా జాతి సమితి కాదు అనుకోని ముల్లర్ చెప్పింది తప్పు అనుకుంటే, ఈ ఆర్య వైశులు, ఆర్య బ్రాహ్మణులు ఎవరు? ఇది కూడా ముల్లర్ మాయెనా? సరే నువ్వు నీ పిల్లలకి ఎరుకల, లంబాడీ పిల్లని ఇచ్చి పెళ్లి చేయగలవా?
    నాకున్న చిన్న జ్ఞానంతో(తలా తోక ఉందో లేదో తెలియదు) ఇలా మాట్లాడాను.
    http://amruthabhandam.wordpress.com/


  1. 1 పొద్దు » Blog Archive » అక్టోబరు బ్లాగుల విశేషాలు 11:58 సా. వద్ద నవంబర్ 3, 2008 పై ట్రాక్ బ్యాకు

వ్యాఖ్యానించండి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 304,006

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.